కీరవాణి ’ఆర్’ సెంటిమెంట్
కీరవాణి కెరీర్ అంతా ‘రా’ అనే అక్షరంతో ముడిపడి ఉన్నట్టు అనిపిస్తోంది. మొదటి ‘రా’.. రామోజీరావుగారు. ‘మనసు మమత’తో తొలి అవకాశం ఇచ్చారాయన. ఆయన పనితనం నచ్చి‘ఇక మీదట ఉషాకిరణ్ మూవీస్ చిత్రాలన్నింటికీ మీరే పని చేయాలి’ అని బాగా ప్రోత్సహించారు. ఆయన అన్నట్టే ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’, ‘అమ్మ’, ‘అశ్విని’ .. ఇలా వరుసగా సినిమాలు చేశారు . ఆ తరవాతి ‘రా’.. రాంగోపాల్ వర్మ. ఆయన ‘క్షణం క్షణం’తో బ్రేక్ ఇవ్వబట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోగలిగారు. ‘శివ’లాంటి గొప్ప సినిమా తరవాత వర్మ క్రేజ్ హిమాలయాల్ని తాకింది. ఇళయరాజా అంతటివాడిని కాదని అవకాశం ఇవ్వడంతో పరిశ్రమ అంతా ‘ఈ కీరవాణి ఎవరు’ అని ఆరా తీశారు. ‘క్షణం క్షణం’ విడుదల కావడానికి యేడాదిన్నర పట్టింది. ఈలోగా ఆయనకి చాలా అవకాశాలొచ్చాయి.. కేవలం వర్మ సినిమాకి సంగీతం అందించేరనే కారణంతో. ఆ సినిమా కీరవాణి గారికో బూస్ట్ తీసుకొచ్చింది. మూడో ‘రా’.. రాఘవేంద్రరావు గారు. ఆయనతో వరుసగా 27 సినిమాలు చేశారు కీరవాణి. అందులో అన్నీ మ్యూజికల్ హిట్లే. ఇరవై సినిమాలు బాక్సాఫీసు దగ్గర బాగా ఆడాయి. ఆయన తరవాత ‘రా’జమౌళి శకం ప్రారంభమైంది. ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘బాహుబలి’ వరకూ వారి ప్రయాణం కొనసాగుతోంది.
(కీరవాణి ఈనాడు జరిపిన ఇంటర్వ్యూ నుంచి)
(From 11th March 2018 Eenadu daily)