ఇలవేలుపు’(1956) సినిమాలోని ’చల్లని రాజా ఓ చందమామ’ పాటని ఈ రోజుకీ మర్చిపోని సంగీతాభిమానులున్నారు. విజయనగరం కి చెందిన వడ్డాది1950 ప్రాంతాలలో సినీ పరిశ్రమకు వచ్చారట. ’ఇలవేలుపు’ లో సుశీల, లీల, రఘునాథ పాణిగ్రాహి పాడిన ’చల్లని రాజా ఓ చందమామ’ పాట ద్వారా పాప్యులర్ అయ్యారు. తర్వాత చాలా డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాశారు. వాటిలో - కాలాంతకుడు (1960), బాగ్దాద్ గజదొంగ (1960), పాపాల భైరవుడు (1961), హంతకుడెవరు (1964), మారని మానసులు (1965), కత్తిపోటు (1966), మా అన్నయ్య (1966), అంతులేని హంతకుడు (1968), దెబ్బకు దెబ్బ (1968)), మేమే మొనగాళ్ళం (1971) వంటి చిత్రాలు కొన్ని. ఆ రోజుల్లో రిలీజైన డబ్బింగ్ చిత్రాలలో కొన్నిటికి ఆయన పేరు కె. వడ్డాది గా వుంది. ’కె’ అంటే కూర్మనాథం అనే అనుకోవాలి. అంతగా సక్సెస్ కి నోచుకోని వడ్డాది1971 తర్వాత రాసిన చిత్రాలేమిటి అనే వివరాలు అందుబాటులో లేవు. శ్రీకాకుళం కి చెందిన ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారికి, పాటల రచయిత వడ్డాదిగా సంగీతాభిమానులకు పరిచయమైన వడ్డాది బుచ్చి కూర్మనాథం గారికి - ఇంటి పేరు లోనే తప్ప ఇంకెక్కడా సామ్యం లేదు.