This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Meena
Song » Sree Rama Naamaalu / శ్రీరామ నమాలు శతకోటి
Click To Rate
* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - Telugu

 రామాయణం అంటే ఏమిటి?

రామాయణం - రామ అయనం - రాముడి ప్రయాణం.

సామాన్య మానవుడిగా జన్మించి సకల జన సమ్మితంగా ఆదర్శాలు వెలయించి లోకాభిరాముడు అయిన రాముడి కథ.....రామాయణం.

రామాయణం కథని  క్లుప్తంగా చెప్పమంటే ఏముందీ...కట్టె ..కొట్టె...తెచ్చె అన్నాడట ఒకడు.
అదేమిటీ అంటే సీత మెడలో తాళి కట్టె,  ఆమెని  లంకకి ఎత్తుకొని పోయిన రావణాసురుని పదితలలను కొట్టె,
సీతని తిరిగి తెచ్చె - అని వివరణ ఇచ్చాడుట.
 
రామాయణంలో రాముడి గొప్పతనాన్నంతా ఒక మూడు చరణాల పాటలో ఇమిడ్చి చెప్పిన అద్భుతమైన పాట గా
మీనా సినిమా కోసం ఆరుద్ర రాసిన   శ్రీరామ నామాలు శతకోటి  పాట అనిపిస్తుంది నాకు.
 
ఆరుద్ర నిజానికి వామపక్ష భావాలు కలిగి, అభ్యుదయ సాహిత్యయుగంలో అభ్యుదయ సాహిత్యధోరణులలో రచనలు చేసిన కవి.  కారణాలు ఏవైనా కానీ సినిమాలలో  ఆయన రాసిన భక్తి పాటలు  సినిమాకథలకు సంబంధించి అవి ఎంతగానో సందర్భోచితంగా ఇమిడిపోయి, తెలుగువారి అధరాలపై చిరకాలం పాడుకునే పాటలు గానే  కాక కలకాలం నిలిచిపోయేలా  తెలుగు హృదయాలలో చెరగని ముద్ర వేసాయి.
 
అంత్యప్రాసలు ఆరుద్ర ప్రత్యేకత. దానికోసం ఆయన ప్రత్యేకమైన ప్రయత్నం చేయకుండానే కవిత్వంలో అత్యంత  సహజంగా వచ్చి ఆయన కవితలో ఇమిడిపోతాయి అనిపిస్తుంది. తేట గా ఉండే తెలుగు పదాలు, సామాన్యులకు సైతం అర్థమయే భాష , అర్ధవంతమైన పదాలతో తెలుగు సినిమా పాటకు పట్టం కట్టారు ఆరుద్ర.
 
'మీనా ' సినిమా కోసం ఆయన రాసిన పాట చూడండి.
 
శ్రీరామ నామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహు తీపి....బహుతీపి...
 
అనే పల్లవితో మొదలవుతుంది. శ్రీరాముడికి ఎన్నో పేర్లు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవంగా కొలవబడే వాడు.
ఆరాముడికి ఆ పేర్లు ఎలా వచ్చాయో , ఎందుకు వచ్చాయో వాటి సార్థక్యం ఏమిటో చరణాలలో వివరిస్తారు ఆరుద్ర.
 
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరథ రామయ్య స్తవనీయుడు
 
రాముడిని దశరథరాముడు  అని ఎందుకంటాం. దశరథుడి కొడుకు కనుక అని చెప్పుకునే అర్థం.
కానీ తండ్రి మాటని మనస్ఫూర్తిగా పాటించి, పితృవాక్యపాలనను కర్తవ్యంగా స్వీకరించాడు కనుక
కొడుకు అంటే రాముడిలా ఉండాలి అని తెలుగు  ప్రజలు కోరుకునేవాడు కనుక - దశరథ రాముడు. 
పితృవాక్య పరిపాలన చేయడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రాముడు స్తవనీయుడు...
పొగడదగిన వాడు. 
 
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు
కళ్యాణ రామయ్య కమనీయుడు
 
రాముడు  జనకుడి ఇంట జరిగిన స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టి విలువిరిచి
సీత ని గెలుచుకున్నాడు. సీత చేత వరమాల వేయించుకొని కళ్యాణ రాముడయ్యాడు.
సీతారామ కల్యాణం లోకులందరికీ ఆనందదాయకం. ఆ జంట చూపరులకు  కమనీయం.
రాముడు సీత  మెడలో మూడు ముళ్ళు వేసి తాళి కట్టి సీతారాముడయ్యాడు.
 
సుదతి జానకి తోడ శుభసరస మాడేటి
 సుందర రామయ్య  సుకుమారుడు 
 
సుందరి, సుకుమారి అయిన భార్య సీత తో సరసమాడే వేళ ఆ రాముడు బహు సుందరుడట.
 
కానీ అదే రాముడు -
కోతిమూకలతో లంకపై దండెత్తు 
కోదండ రామయ్య రణ ధీరుడు...రణధీరుడు.
 
తన సీతను పదితలల రావణాసురుడు తీసుకుపోయి బంధించిన వేళ అతని చెరనుండి విడిపించి
కోదండరాముడై (కోదండం అంటే విల్లును ధరించి)  రణ ధీరుడని పించాడు. 
 
ఇక్కడితో రావణాసురుని కొట్టడం అంటే రావణ సంహారం పూర్తయింది. 
 
సీతా లక్ష్మణ హనుమత్సమేతంగా
‌‌‌‌‌‌‌కోతిమూకతో పాటు అయోధ్య చేరుకున్న రాముడు పట్టాభిషేకం జరుపుకున్నాడు.
రారాజుగా, చక్రవర్తిగా ప్రజలమన్ననలందుకున్నాడు.
 
ఇక్కడ మనకి చిరపరిచితమైన  శ్రీరామ పట్టాభిషేకం పటం గుర్తొచ్చేలా
వర్ణన సాగుతుంది. 
 
పవమాన సుతుడు పాదాలు పట్టగా
పట్టాభి రామయ్య  పరంధాముడు
 
అక్కడ ఆంజనేయస్వామి శ్రీరాముడిని స్వామిగా నమ్మి ప్రభుభక్తితో వినమ్రంగా
శిరస్సు వంచి నమస్కరిస్తున్న దృశ్యం మనసులో నిలుస్తుంది.
 
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు
అచ్యుతరామయ్య అఖిలాత్ముడు...   అఖిలాత్ముడు....
 
ఆవిధంగా  ఈ అవనిపై శ్రీరామస్వామిని భక్తిగా పూజించి
సేవించే సకల జనులకు ముక్తి కలిగించే వాడు.
 
సకల భువనాంతరాళలో వ్యాపించి ఉన్న అఖిలాత్ముడు రాముడు. 
ఇక్కడ ఖిలం అంటే నాశనమే, అఖిలాత్ముడైన రాముడు అచ్యుతుడు .
అక్కడ కూడా చ్యుతి అంటే నాశనం ... 
కనుక అది లేని రాముడు....అచ్యుతరాముడు.
 
ఆహా....కట్టె...కొట్టె...తెచ్చె అన్నంత సులువుగా రామాయణాన్ని ఒక పామరుడు
ఎలా వ్యాఖ్యానం చేసాడో  అదే మార్గంలో తన పాండిత్యంతో 
శ్రీరాముడి జీవితంలోని ముఖ్య ఘట్టాలని అతని సార్థక నామధేయత్వాన్ని,
పండిత పామర జనకంగా చేసి పాటగా మార్చి
 శ్రీరాముని జీవిత వ్యాఖ్యానంగా
ఆరుద్ర గారు మనకిచ్చిన
ఓ బంగారు  కానుక - ఈ పాట.
 
ఈ విశ్లేషణను రాసింది
శ్రీమతి సుధారాణి పంతుల