ఈ పాటను ఘంటసాల పాడగా అక్కినేని నాగేశ్వరరావు అభినయించారు. కల్యాణి రాగంలో గల అందాలన్నిటినీ పొందుపరచుకున్న మంచి పాటలలో ఖచ్చితంగా పేర్కొని తీరవలసిన పాట ఇది. ముఖ్యంగా 'సుడిలో దూకి ఎదురీదకా' తరువాత వచ్చే అలాపనలో గల ఎగుడు దిగుడులు - తారాస్ధాయిలోను, మంద్రస్ధాయిలోను గాయకుని గళాన్ని రసవత్తరంగా ఆవిష్కరించే చరణాలు, రాగపరంగా పాటకు అమరిన ఆభరణాలు. అందుకే మంచి పాటకు చెవియొగ్గి వినేవారి హృదయాలలో నేటికీ సజీవంగాఉందీ పాట.
భావ సౌందర్యాన్ని, భాషా సౌందర్యాన్ని గుంభనగా అందించిన సాహితీ ప్రక్రియ రచనాపరంగా కనిపిస్తుందీ పాటలో. ఉదాహరణకి తొలి చరణంలో గల 'మేడలోనే అల పైడి బొమ్మ ' అనే వాక్యంలో 'పైడి బొమ్మ ' అంటే బంగారపు బొమ్మ అని, బంగారానికి పర్యాయపదంగా హేమము అని తీసుకుంటే హేమ అనే పదానికి పార్వతి అనే ఇంకో అర్ధం కూడా ఉంది కాబట్టి పాత్రపరంగా సరిపోతుందని, అలాగే తర్వాత వచ్చే 'నీడలో చిలకమ్మా' అనే వాక్యంలో 'చిలకమ్మ' అనే పద ప్రయోగం చంద్రముఖికి సరిగ్గా సరిపోతుందని (ఎందుకంటే చిలుక ముక్కు అర్ధ ’చంద్రుడి’ ఆకారంలో వుంటుంది కనుక) సాహితీ పరిశోధకుడు ఆరుద్ర విశ్లేషిస్తే "భలేగా పట్టేవే....?" అంటూ ఆయన గురువు మల్లది రామకృష్ణ శాస్త్రి మెచ్చుకున్నారట.
'సుడిలో దూకీ ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్', 'లాయిరి నడి సంద్రములో లంగరుతో పనిలేదోయ్' లాంటి వాక్యాలు అటు తాగుబోతు నిస్సహాయ మనస్ధితికి ఎంతగా అద్దంపట్టేయో, అటు వేదాంతపరంగా - అంతుపట్టని లోతులతో మనలోని అధ్యాత్మిక భావాలుగానీ సహేతుకమైన సంఘర్షణలుగానీ చెలిమి చేసే విధంగా అర్ధాన్ని సూచ్య ప్రాయంగా ధ్వనిస్తాయి.
ఇక ఇతర విలువల గురించి చెప్పాలంటే 'చందమామ మసకేసి పోయే ముందుగా కబురేలోయ్' దగ్గర అక్కినేని చూపిన అభినయం, మొత్తం పాటలోనూ.... ముఖ్యంగా 'కొండలే రగిలే వడగాలీ' దగ్గర చాయాగ్రాహకుడు బి.ఎస్.రంగా (తర్వాత రోజుల్లో 'విక్రం ప్రొడక్షన్శ్ పతాకంపై నిర్మాత - దర్శకుడుగా 'అమరశిల్పి జక్కన ' వంటి కళాఖండాలని తీశాడీయన) చూపిన లైట్ అండ్ షేడ్స్...ఈ పాట ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కళ్ళ ముందు కదలాడే విధంగా జీవం పోశాయి.
ఇవన్నీ ఇలా వుండగా ఈ పాటపై సముద్రాల(జూనియర్) ఒక సందర్భంలో వెల్లడించిన అభిప్రాయాన్ని ఆయన మాటల్లోనే చూడండి.
"దేవదాసులోని పాటలన్నీ మేలిమి బంగారు తునకలు. ఈ పాటలే పిక్చరుకు ప్రాణం. నాగేశ్వరరావు గారి నటనకు ఘంటసాల తన గొంతుతో ఊపిరి పోశాడు. ఈ పాటలన్నీ ఘంటసాల ఎంతో తాదాత్మ్యంతో పాడాడు. అందులో నాకు అతి ప్రియమైన పాట ’కుడి ఎడమైతే’ ! ఈ పాటకి అర్ధమేమిటని నాన్న (సముద్రాల సీనియర్) ని అడిగితే కొందరికి ఆయన ఇలా చెప్పారట.
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అది జీవితంలో సహజం. అంత మాత్రాన ఓడిపోయాననుకోకు. పార్వతి తనదే అనుకున్నాడు దేవదాసు. కానీ ఆమె అతనికి దక్కలేదు. ఆ బాధని మర్చిపోవాలని త్రాగుడు ప్రారంభించాడు. అది ఒక సుడిగుండం. అలవాటు పడితే బయట పడటం కష్టమని తెలిసి కూడా ఈ సుడిగుండంలోకి దూకాడు. అప్పుడు ఎదురీత తెలివి తక్కువ. మునిగిపోవడమే సుఖం. సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయి - ఇలా తప్ప తాగుగూ జీవితం ముగించుకో ! పార్వతి మేడమీద వున్న బంగారు బొమ్మ. చేతికి చిక్కదు. నీవు పిలిస్తే పలికే చంద్రముఖి నీ నీడలోనే వుంది. 'మేడలోనే అలపైడి బొమ్మ నీడలోనె చిలకమ్మా!' కానీ నీ పరిస్ధితి ఏమిటి? కొండలే రగిలె వడగాలి నీ సిగలోనే పూలేనోయి ఎందుకీ ప్రాణాలు? తప్ప తాగి జీవితం చాలించు. చావటానికే నిర్ణయించుకున్న తర్వాత ఎవరికీ చెప్పవలసిన పనిలేదు. చందమామ మసకేసి పోయేముందు కబురేలోయి. నీ బ్రతుకు నడి సముద్రపు నావలాగున్నది. మునిగి పోవడానికి సిద్ధంగా ఊండు. ఒడ్డున ఉండే నావకు లంగరు కానీ నడి సముద్రంలో మునిగిపోయే నావకు లంగరు ఎందుకు? లాయిరి నడి సముద్రంలో మునిగిపోయే నావకు లంగరు ఎందుకు? లాయిరి నడి సముద్రంలో లంగరుతో పనిలేదోయి ఇది దేవదాసు మానసిక పరిస్ధితి. మా నాన్నగారు ఇంతటి సింబాలిజంతో పాట రాసారు. సుబ్బరామన్ అంత అవేశంతో స్వరపరిచారు. కవితా హృదయాన్ని అందిపుచ్చుకుని అంత ఆర్తితో అనుభవించి పాడుతూ ఆ అనుభూతి శ్రోతలలో కలిగించే నేర్పరి ఘంటసాల".
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ