Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,
Actress : Bhanusri Mehta / భానుశ్రీ మెహతా ,
Music Director : Mani sharma / మణిశర్మ ,
Lyrics Writer : Veturi / వేటూరి ,
Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ , Sonu Nigam / సోను నిగమ్ ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
కర్ణాటక సంప్రదాయంలో పహడీ కి దీటైన రాగం: లేదు
పహడీ రాగం ఆధారంగా గల సినీ గీతాలు:
గాలికి కులమేదీ (కర్ణ)
మౌనమేలనోయి (సాగర సంగమం)
చాహుంగ మై తుఝె సాంజ్ సవేరే (దోస్తీ)
శరణు శరణయా జానకి రామా (రామాంజనేయ యుద్ధం)
సంగీతం, సాహిత్యం, గానం మూడు సమ తూకంలో పడిన, పండిన పాటలలో ఇదొకటి. సంగీత పరంగా చూసే్త - పాట ఓపెనింగ్ లో ఒక నిమిఉషం ముప్ఫయి ఐదు సెకెండ్ల పాటు ఓ మ్యూజిక్ వస్తుంది. ఈ మ్యూజిక్ ఓ మంచి పాటకి కావలసిన మంచి మూడ్ ని క్రియేట్ చేసేస్తుంది. నిజానికి ఈ లెంగ్త్ కి పూర్వం రోజుల్తో పోలిస్తే సగం పాట అయిపోతుంది. ఆ పద్ధతిలో లెక్కేసుకుంటే ఇంత లెంగ్తీ ఓపెనింగ్- కాస్ట్ లీ ఎఫేర్.
"జీవిత భాగస్వామిని తొలిసారి చూడగానే - ఇతను నా కోసమే పుట్టాడు. ఈమె నా కోసమే పుట్టింది అనే భావన ఇద్దరిలోనూ కలిగాలి. అందుకే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు పెళ్లి చూపులు, ముందుగా చూడడం వంటి తతంగాలకు ఇష్టపడరు పెళ్లిలోనే ఒకరినొకరు మొదటిసారి చూసుకుంటారు. అప్పుడు వాళ్ళ చూపుల్లో జన్మ జన్మ బంధం ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగాలి. ఇదంతా పాటకు ముందే కన్వే కావాలి.'' అనా్నరు మణిశర్మ యు యస్.ఏ. నుంచి ఫోన్లో ఈ పాటకు సంబంధించిన అనుభవాల్ని పంచుకుంటూ - అంత లెంగ్తీ ఓపెనింగ్ ఎందుకన్న ప్రశ్నకు సమాధానంగా.
ఇక పల్లవిపూర్తయిన తర్వాత, మొదటి చరణం మొదలవడానికి ముందు - వచ్చే ఇంటర్లూడ్లో వినిపించే సరోద్ వాద్యం ఎంత హాయిగా వుందంటే - అసలీ ఇన్స్ట్రుంట్ని ఇక్కడ ఇలా ప్లే చెయ్యాలి. ప్లేస్ చెయ్యాలి అనే థాట్కి హాట్సాఫ్ చెప్పాలన్నంత గొప్పగా వుంది.
''గుణ శేఖర్ నాకు స్టోరీని, ఈ సీన్ని చెప్పగానే ఇమ్మీడియట్గా నా మనసులో మెదిలిన ట్యూన్ని రికార్డు చేసి పెట్టుకున్నాను 'బహుశా ఓ చంచలా' పాటకి వాడిన ట్యూన్ అదే. ఇంటర్లూడ్స్కి వచ్చే సరికి సరోద్ అయితే బావుంటుందనిపించింది. ఇప్పటి దాకా ఎవ్వరూ ఇవ్వని ప్లేస్మెంట్ ఇవ్వాలనిపించింది. అందుకుని సరోద్ని బాగా వాయించే బెస్ట్ ప్లేయర్ బాంబేలో వుంటే వెతికి మరీ పట్టుకున్నాను. ఆయన పేరు ప్రదీప్. నేనుకున్న ఎఫెక్ట్ ఆయన అద్భుతంగా అందించారు.'' అన్నారు మణిశర్మ సరోద్ గురించి చెబుతూ.
ఓపెనింగ్, ఫస్ట్ చరణం ఇంటర్లూడ్ ఒక ఎత్తయితే - రెండో చరణం మొదలవడానికి ముందు కోరస్లో వినిపించే - నాదిరిదిరి దిరి దిరి దిరితోం దిరి దిరి దిరి దిరి - ఒక్కటీ ఒక ఎత్తు. చివర్న 'తనదిరినా' అంటూ కోరస్లో కాకుండా సోలోగా క్లోజ్ చెయ్యడం ఈ తిల్లానాకు అమరిన అందమైన ముగింపు. ఇంటర్లూడ్కు బదులు ఈ తిల్లానాను ఉంచడం వల్ల రెండో చరణాన్ని ఎత్తుకోవడానికి తగిన ఊపు లభించడమే కాకుండా పాటకు కూడా లాభించింది.
"ఈ కోరస్ని కల్పన, రీటా, సైంధవి, జనని పాడేరు. ఇందులో కల్పన, రీటాలకు సోలో సింగర్స్గా గుర్తింపు వుంది. అయినా నేను పిలిస్తే నా మాటకి విలువిచ్చి వచ్చి మరీ పాడారు. చివర్న వచ్చే 'తనదిరినా'ని కల్పన పాడింది. '' అంటూ ఎంతో ఆనందంగా చెప్పారు మణిశర్మ కోరస్ పార్టిసిపేషన్ గురించి
ఇక గానం విషయానికొస్తే - డ్యూయెట్ అయినా సోలో అయినా ప్రథమ స్థానం ఎప్పుడూ శ్రేయా గోషల్దే. అది ఈ పాటలో కూడా కంటిన్యూ అయింది. ఆ విషయం పాట మొత్తం లోనే కాకుండా చివర్న వచ్చే పల్లవిలో 'లా ల లా' అంటూ ఆమె తన స్వరాన్ని కలపడంలో కూడా తెలుస్తూ వుంటుంది మనకి. 'మన ప్రాణాలే శతమానాలై జత కానీ'లో 'జత' అనే పదాన్ని పెక్యూలియర్గా పలకడంలో తప్ప మిగిలిన పాటంతా తెలుగు భాషకి ట్యూన్తో పాటు న్యాయం చేస్తూనే పాడాడు సోనూ నిగమ్.
సాహిత్యం గురించి చివర్న ప్రస్థావించడానికి కారణం గత ముప్పయి మూడేళ్ళుగా శ్రీ వేటూరితో నాకున్న అనుబంధం. శనివారం (మే 22, 2010) రాత్రి శ్రీ వేటూరి మరణ వార్త వినడానికి రెండ్రోజుల ముందు... అంటే గురవారం (మే 20 2010) పొద్దున్న ఆయనతో ఈ పాట గురించి చర్చించాను. అలా అనడం కన్నా వాదించాను అనడం సబబు. సాధారణంగా ఇలాటివి శ్రీ వేటూరితో నాకు చాలా రెగ్యులర్గా వుంటూ వుంటాయి. ఆ పద్ధతిలోనే ఫోన్ చేసి మొదలు పెట్టాను. ఆయన గొంతులో తేడా కనిపించింది. అదే మాటన్నాను ఆయనతో. హాస్పటల్లో ఉన్నట్టు తెలీదు.
"ఫర్వాలేదు...మాట్లాడండి... ఇదింతే" అన్నారు వేటూరి.
"పల్లవిలో క్రియ ఎక్కడుంది?"
"తగిలే లే మంచులా తగిలే క్రియ కాదా?" అన్నారు వేటూరి
"తగిలే లే మంచులా అన్నది తగులుతున్నటువంటి లే మంచులా అనే అర్థం వచ్చేట్టుగా వుంది. తగిలిన అనే అర్థం స్పురించేట్టుగా లేదు. పైగా దాన్ని మీరేమో మూడో లైన్లో పెట్టారు. దానికి తోడు ట్యూన్ ఆరోహణ క్రమంలో వుంది. ట్యూన్కి ప్రాధాన్యం ఇవ్వాలన్నా, మూడో లైన్లోనే వుండి తీరాలని మీరనుకున్నా - తగిలెను లే మంచులా అనుంటే ఇలాంటి సందేహాలు వచ్చే అవకాశమే వుండి వుండేది కాదు కదా?"
"ఊం...ఇంకా?"
"మొదటి చరణంలో 'ఒకటైతే కమ్మనీ పల్లవే పాటగా' అన్నారు. ఆ 'కమ్మనీ' ట్యూన్ ప్రకారం అనుకుంటే - ఒకటి కమ్మని - అనుకోవాలి. సాహిత్యం ప్రకారం అనుకుంటే - ఒకటైతే, కమ్మని పల్లవి పాటగా - ఆమని పిలిచిందా - అనుకోవాలి. ఏది కరెక్టు?''
(కాస్సేపు నిశ్శబ్దం)
"పాట గురించి ఇంత పట్టించుకున్న వాళ్ళెవరున్నారు మీరు తప్ప? మీరడిగిన వాటన్నిటికీ సంక్షిప్తంగా చెప్పలేను. చాలా వివరణ వుంది. మీరు రండి. చెప్తాను" అన్నారాయన గొంతు కూడదీసుకుంటూనే.
"మీ గొంతు బాగు పడ్డాక వస్తాన్లెండి.... సోమవారం రానా?"
"సరే... రండి" అంటూ ఫోన్ పెట్టేశారు వేటూరి...
అంతే... అదే ఆఖరు... బహుశా ఆయనతో మాట్లాడిన చివరి జర్నలిస్ట్ని నేనేనేమో....
ఆయన గనుక బ్రతికి వుంటే - నా ప్రశ్నలకు సమాధానం గా ఇచ్చే వివరణ ఎంత ఉన్నంతగా, ఉంటుందో అంత లోతుగా ఉంటుందనడంలో సందేహం ఎంత మాతం లేదు... ఆయన రాసిన 'కొమ్మకొమ్మకో సన్నాయి' పుస్తకంలోని చాలా వ్యాసాలలో చాలావరకూ నా సందేహాలకు సమాధానంగా రాసినవే. అసలా 'కొమ్మకొమ్మకో సన్నాయి' శీర్షిక మొదలయ్యిందే - 'స్వర రాగ గంగా ప్రవాహమే' పాటలోని 'కుండల లోపల నిండిన నింగిని' అంటూ ఎందుకు రాశారన్న నా ప్రశ్నతో.
గుండెని బరువెక్కించే ఈ జ్ఞాపకాలను ఓ పక్కని పెట్టి మిగిలిన పాట వరకూ చూసుకుంటే...
'మధు మాసాలే మన కోసాలై' అన్నది వేటూరి మాత్రమే చేయగల ప్రయోగం... మన కోసం మధుమాసం అనేది పెద్దల సమ్మతించే ప్రయోగం (ప్రతిరాత్రి వసంతరాత్రి - దేవులపల్లి - ఏకవీర). మధుమాసం బహువచనం అయింది కాబట్టి మనకోసం ని కూడా బహువచనం చేయడం తర్వాతి తరం బహుమతులకి (కవులకి) వేటూరి ఇచ్చిన బహుమతి. 'మన ప్రాణాలే శతమానాలై' వంటి వాక్యాలు వేటూరి కలం నుండి అలవోకగా దొర్లిపోతాయి (శతమానం భవతి శత మర్కటాలకి - అనుమానం భవతి అది ఆగడాలకి - వన్నెలాడి పస్తాంది పాటలో - రాజ్కోటి మ్యూజిక్ - సినిమా (అత్తా కోడళ్ళు).
మణిశర్మ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్స్ గా - వేటూరి గారికి సంబంధించి ఓ చెరిగిపోని, మిగిలిపోయిన జ్ఞాపకంగా ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగివున్న 'బహుశా ఓ చంచలా' పాట బహుశా కాదు కచ్చితంగా ఎ సాంగ్ టు రిమెంబర్.