Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Jamuna / జమున , Savithri / సావిత్రి ,
Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,
Lyrics Writer : Daasaradhi / దాశరధి ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category :
Song- Ragam :
' గోదారీ గట్టుందీ' పాట వెనుక కథ
దాదాపు ఓ ముప్ఫై ఏళ్ళ క్రితం దాశరథి గారిని ఇంటర్ వ్యూ చేస్తున్నప్పుడు ఈ పాట గురించే అడిగాను. ఆయన చెప్పిన వివరం ఇది. అప్పట్లో అందరూ చెన్నై లో వుండేవారు కనుక పాటల సిట్టింగ్ కి హైదరాబాద్ వచ్చిన సందర్భాలుండేవి. అలా 'మూగ మనసులు' పాటల సిట్టింగ్ కి దర్శకుడు ఆదుర్తి, సంగీత దర్శకుడు కె,వి. మహదేవన్, సహాయకుడు పుహళేంది, రచయితలు ఆత్రేయ, దాశరథి, కొసరాజు వచ్చి బస చేశారు. అప్పట్లో ఎం.జి.ఆర్., బి.సరోజాదేవి నటించిన 'తాయ్ తగ్గ తనయన్' సినిమాలో మహదేవన్ స్వరపరిచిన 'కావేరీ కర ఇరిక్కీ' పాట చాలా పాప్యులర్ అయింది.
ఆ పాటలో కణ్ణదాసన్ రాసిన పద్ధతిని గుర్తుచేశారు ఆదుర్తి. వాక్యంలో చివర్న విడిచిన పదంతో తరువాతి వాక్యం మొదలు పెట్టడం వారికి నచ్చింది. (మన వ్యాకరణంలో దీన్ని ముక్తపదగ్రస్తం అంటారు) తమిళ పల్లవిలో మొదటి వాక్యం 'కావేరీ కర ఇరిక్కీ' అని ఆదుర్తి అనగానే 'గోదారీ గట్టుందీ' అని అన్నారు దాశరథి. ఇక రెండో లైన్ 'కర మేరే పూవిరిక్కీ ...' అనగానే 'గట్టు మీదా చెట్టుందీ' అన్నారు దాశరథి ఆశువుగా. 'ఆతర్వాత చెప్పండి' అని అడిగితే 'గుర్తు లేదన్నా'రు ఆదుర్తి. 'సరే నేనే స్వతంత్రంగా చెప్తా 'అని 'చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది' అని అన్నారు దాశరథి. ఇక్కడ ఆ పిట్ట ఎవరో కాదు సినిమాలో జమున పాత్ర.. సినిమా కథంతా అక్కడున్న వారందరికీ తెలుసు కనుక 'అద్భుతంగా వచ్చింది' అని అన్నారు. ఆ ప్రకారం చరణాలు రాసుకుంటూ పోయారాయన.మహదేవన్ కూడా అందుకు తగ్గట్టుగా ట్యూన్ ని సమకూర్చారు. కానీ సినిమా నిడివి ఎక్కువైందని ఆఖరి చరణాన్ని రికార్డయిన తర్వాత తొలగించారు.
ఈ విషయాలన్నీ దాశరథి గారు నాకు చెబుతూ ''ఇది యధాతధంగా వస్తుందా'' అని అడిగారు. అప్పట్లో టేప్ రికార్డర్ నా వద్ద లేదు. అన్నీ గుర్తుపెట్టుకునే రాసేవాణ్ణి. అయినా నా మీద ఆయనకి నమ్మకం కలగలేదు. ''ఎందుకైనా మంచిది రాసిస్తానుండు'' అని ఆ పాట గురించి రాశారు. అలా ఈ ఒక్క 'గోదారీ గట్టుందీ' పాట గురించే కాదు సుమారు 30 పాటల గురించి స్వహస్తాలతో నాకు ఓ లేఖ లా రాసి ఇచ్చారు. పులకరించి పోయాను ఆయన నిజాయితీకి, నిబద్ధతకి.
ఆ మహానుభావుడి మధుర స్మృతులకు గుర్తుగా ఆయన రాసిచ్చిన ఆ పేపర్లన్నీ భద్రంగా దాచుకున్నాను. అందులోని కొంత భాగమే ఇది. ( తమిళ గీతంలో 'కర మేరే పూవిరిక్కీ' అనే వుంటుంది. దాశరథి గారికి సమయానికి స్ఫురించక 'కర మేలే మర మిరిక్కీ' అని రాశారు. మరొక్క విషయం ఏమిటంటే ఆ పాట సాహిత్యాన్ని ఆదుర్తి గారు గుర్తు చేసింది కేవలం ఇన్ స్పిరేషన్ కోసమే. ట్యూన్ విషయంలో ఆ పాట ట్యూన్ వేరు ... ఈ పాట ట్యూన్ వేరు. కావాలంటే యూ ట్యూబ్ లో చూడొచ్చు)