ఆరుద్ర ప్రవృత్తి రీత్యా కమ్యూన్-ఇష్టు.
అయినా సినీకవిత్వం వృత్తీ ప్రవృత్తీ కూడా అయిన వేళ ఎన్నో భక్తి పాటలు రాసారు. వాటిలో ఎన్నో పాటలు సూపర్ హిట్లు అయ్యాయి. చాలా పాటలలో రాముడే ప్రధానంగా కనిపిస్తాడు. రామాయణాన్ని ఔపోసన పడితే తప్ప తెలియని రామాయణ లోని రహస్యాలు ఆరుద్రకెరుక. ఈవిషయం ఆయన సాహిత్యమే నిరూపిస్తుంది. రామాయణానికి సంబంధించి సినిమాలలో ఏ ఘట్టానికి రాయవలసి వచ్చినా, ఏ పాత్రని తీర్చవలసి వచ్చినా ఆ సాహిత్యం ఆరుద్ర పాండిత్యానికి నిలువెత్తు అద్దం పడుతుంది. సినిమా పాటలో పల్లవి, రెండు చరణాలు వెరసి మూడు నిముషాల్లో విషయాన్ని కుదించి రాయాలి. అందుకు ఎంతో సమర్థత కావాలి. ఆరుద్రకి అది మెండుగా ఉందని ఆయన పాటలే నిరూపిస్తాయి.
వాటిలో ఒకటి -
"అందాల రాముడు ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ధి సోముడు, ఎందువలన దేవుడు?"
తరతరాలుగా భారతజాతి శ్రీరాముడిని ఆదర్శ దైవంగా కొలుస్తోంది. భూమిపైన స్వర్గాన్ని తలపించే రామరాజ్యాన్ని స్థాపించిన వాడిగా, ఎన్నో ఆదర్శాలను ఆచరించి ఆదర్శ ప్రాయుడుగా నిలిచిన గొప్ప రాజు శ్రీరాముడు. మరి ఆ రాముడినే ఎందుకు దేవుడిగా కొలవాలి అనే ప్రశ్న ఎవరికైనా వస్తే , వేస్తే దానికి జవాబు ఇదిగో ఇలా చెప్పొచ్చని చెప్పారన్నమాట ఆరుద్ర. రామాయణం మొత్తం సారాంశంగా రాముడి జీవితాన్ని రెండు చిన్న చరణాలలో చెప్తూ చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా సాగుతుంది ఈ పాట.
రాముడు అందమైనవాడు. నల్లకలువ వంటి మేని రంగు ఉన్నవాడు. సూర్య వంశస్థుడు. సూర్యవంశం అనే గొప్ప సాగరంలో ఉదయించిన చంద్రుడిలాంటి చూడచక్కనివాడు. ఈ విషయాలను చెపుతుంది పల్లవి. అటువంటి అందాలున్నవాడు, గొప్ప వంశంవాడు – రాముడు. అయితే సరే... కానీ ఎందువలన దేవుడు అయ్యాడు అనే ప్రశ్న వేసారు పల్లవి చివర.
ఇక ఆ ప్రశ్నకి జవాబు తొలి చరణం.
“తండ్రిమాటకై పదవుల త్యాగమే జేసెనూ,
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెనూ” ...
దశరథుడు కైకకి ఇచ్చిన వరాలవల్ల మర్నాడు పట్టాభిషేకం పొంది చక్రవర్తిగా పదవి పొందవలసినవాడు, తండ్రిమాట నిలబెట్టడానికి తన పదవికి త్యాగం చేయడానికి సంతోషంగా సిద్ధపడ్డాడు. తండ్రి మాటకై - అనే మాటను గమనించాలి. తాను తండ్రికి మాట ఇవ్వడం కాదు. తండ్రి తన ముద్దులభార్య కైకాదేవికి వరంగా ఇచ్చిన మాట అది. దాన్ని నిలబెట్టడం కొడుకుగా తన ధర్మం అనుకున్నాడు. అందుకే సంతోషంగానే అడవికి వెళ్ళాడు.తను తప్పుకుంటే తమ్ముడు భరతుడు సింహాసనం ఎక్కి ఉన్నత స్థానం పొందుతాడు. అందుకే వనవాసం అనేది ఎంత బాధ కలిగించేదో తెలిసినా ఆ బాధని అనుభవించడానికే సిద్ధ పడ్డాడు. ‘అందాల రాముడు అందువలన దేవుడు” అంటూ ఆ చరణం ముగుస్తుంది.
రెండవ చరణంలో మళ్ళీ ఎందువలన దేవుడో మరోసారి చెప్పారు.
“అనుభవించదగిన వయసు అడవిపాలు చేసెను,
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను -
అందాల రాముడు అందువలన దేవుడు”.
సన్యాసం తీసుకునే వయసులో అడవికి పొమ్మంటే పోవడం గొప్పేం కాదు కదా...మంచి వయసులో ఉండి రాజ్యం, పదవి, భోగభాగ్యాలు అనుభవించవలసిన వయసులో అడవికి పోవలసి వచ్చినా సంతోషంగా వెళ్ళాడు రాముడు. ఊరికే వనవాసం చేయడం కాదు, తాను అడుగుపెట్టినంత మేరా - ఎక్కడా అసురులవల్ల మంచివారికి, పుణ్యమూర్తులకి ఇబ్బంది కలగకుండా ఆ భూమినంతా ఆర్యభూమిగా మార్చేసాడు తన రామబాణంతో. అందువలన రాముడే గొప్ప దేవుడు మరి.
“అందాల రాముడు అందువలన దేవుడు” అంటూ ముగుస్తుంది ఈ చరణం.
మూడో చరణంలో-
“ధర్మపత్ని చెరమాపగ దనుజుని దునుమాడెను,
ధర్మము కాపాడుటకాసతినే విడనాడెనూ...
అందాల రాముడు అందువలన దేవుడు”!!
అదే ....అదే రాముడి గొప్పదనం. ధర్మపత్ని అయిన సీతను కాపాడడం పతిగా తన ధర్మం.
తన భార్యను తననుండి దూరం చేసి చెరపట్టినందుకు ఆమెను కాపాడడం కోసం దనుజుడైన
రావణాసురుడిని దునిమాడు (చంపాడు). కానీ తను భర్తమాత్రమే కాక రాజ్యానికి భర్తగా ధర్మ రక్షణ కోసం
ఆ సతిని విడనాడాడు. సీతా పరిత్యాగం చేసాడు. రెండే రెండు వాక్యాలలో రామ ధర్మాన్ని వివరించారు ఆరుద్ర.
అందుకే
“అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాబ్ది సోముడు -ఇలలో మన దేవుడు”
అంటూ పాట ముగుస్తుంది.
పదే పదే రాముడిని అందాల రాముడు అంటూ ఈ పాటలో సంబోధించడంలో రాముడి బాహ్య సౌందర్యం మాత్రమే కాక అతను పాటించిన గొప్ప మానవ ధర్మాల వల్ల అతనిలోని అంతఃసౌందర్యాన్ని కవి గుర్తించారనిపిస్తుంది. అందానికి, సుగుణ శీలానికి రాజు మన రాముడు. రాముడి గురించి అతి చక్కని పాటని ఆరుద్రనుంచి అందుకున్న మనం ధన్యులం. ఆరుద్ర ఈపాటలో ఎన్నో సంస్కృత సమాసాలు, తెలుగు పదాలు కలగలిసిపోయి ఉంటాయి. అన్నిటికీ అర్థాలు తెలుసుకుంటే మనకి బోల్డు తెలుగు కూడా వస్తుంది.
ఇందీవరము అంటే నల్లకలువ పూవు. శ్యాముడు అంటే అటువంటి శరీరం రంగు
ఇనకులము అంటే సూర్య వంశం.అబ్ధి అంటే సముద్రం. సోముడు అంటే చంద్రుడు.
వెరసి ఇనకులాబ్దిసోముడు అనే సమాసరూపంలో సూర్యవంశం అనే సముద్రంలో
ఉదయించిన చందమామ – అంతటి అందమైనవాడు శ్రీరాముడు.
అడవిపాలు చేయడం, చెరబాపడం, దునుమాడడం వంటివి చక్కని తెలుగు పదాలు.
ఈ విశ్లేషణను రాసింది
శ్రీమతి సుధారాణి పంతుల