Actor : N/A / వర్తించదు ,
Actress : N/A / వర్తించదు ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Gurram Jashuva / గుర్రం జాషువా ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Children Songs
Song- Ragam :
సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన విషయం. మహాకవి గుర్రం జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగులో మరింక లేవేమో!
పాపాయి పద్యాలు
ఘంటసాల
మొదటి పద్యం: నవమాసములు
రాగం: హిందూస్తానీ సంగీతంలో దుర్గా (కర్నాటక సంగీతంలో శుద్ధ సావేరి)
శుద్ధ సావేరీ కర్నాటక సంగీతంలో 29వ మేళకర్త అయిన ధీరశంకరాభరణం నుంచి జనించిన రాగం. రక్తి రస ప్రధానమైనది.స్వరాలు: స, రి2, మ1, ప, ధ2. చాలా ప్రాచుర్యమున్న ఈ రాగంలో రిషభం, నిషాదం లేవు. త్యాగరాజ రచనలు ‘దారి నే తెలుసుకొంటి..’, ‘కాలహరణ మేలరా..’ ఈ రాగంలో ప్రాచుర్యమైనవి. ఈ పేరుతో హిందూస్తానీ సంగీతంలో ఏ రాగం లేదు. అయితే, హిందూస్తానీ సంగీతంలోని ‘దుర్గా’ రాగం శుద్ధ సావేరికి దగ్గరగా ఉన్న రాగం.
రెండవ పద్యం: బొటవ్రేల ముల్లోకములు జూచి
రాగం: హిందూస్తానీ సంగీతంలో శుద్ధ సారంగ్
శుద్ధ సారంగ్ హిందూస్తానీ సంగీతంలో కాఫీ ఠఠ్‌కి చెందింది. స్వరాలు: స, రి2, మ1, మ2, ప, ద2, ని2. ఆరోహణలో గాంధారం, నిషాదం వాడరు. అవరోహణలో గాంధారం వాడరు. ఈ రాగంలో ఒక ముఖ్య ప్రయోగం రెండు మధ్యమాలని (మ1, మ2) పక్క పక్కనే ఉపయోగించటం. స్వర సంచారంలో రిషభం, నిషాదం పై ఆగటం ఒక వింతైన అందాన్నిస్తుంది. ‘సారంగ్’ కుటుంబంలోని రాగాలన్నిటిలో శుద్ధ సారంగ్ అత్యంత ప్రముఖమైనది. ఈ రాగచ్ఛాయలను జాగ్రత్తగా గమనించటానికి ఈ పద్యం ఎక్కువ సార్లు వినాలి. 'మాయాబజార్' లోని 'చూపులు కలసిన శుభవేళా' పాట ఈ రాగం పై ఆధారపడినదే.
మూడవ పద్యం: గానమాలింపక
రాగం: ఆభేరి (హిందూస్తానీ సంగీతంలో భీంపలాస్)
కరుణ రసప్రధానమైన ఈ ఆభేరి రాగాన్ని ఎన్నుకోవటంలో ఘంటసాల ప్రతిభ కనపడుతుంది. ఒక లాలిపద్యంలా మొదలయ్యే ఈ పద్యం, ముందు - చివర ఒకే విధంగా ఆలాపనలో ఉంటుంది. హిందూస్తానీ సంగీతంలో భీంపలాస్ రాగం ఆభేరి రాగానికి దగ్గర. స్వరాలు: స, రి2, గ1, మ1, ప, ధ2, ని1. ఆరోహణలో రిషభం, ధైవతం నిషిద్దం. ఎన్నో సినిమా పాటలు, పద్యాలు, ప్రైవేట్ గీతాలు ఈ రాగంలో ఉన్నాయి. ‘పసిడి పొలాల్లో పల్లెపడుచు తన మావ కోసం కలవర పడుతూ ఇలా పిలుస్తోంది’ అంటూ మొదలయ్యే పాట ‘రావోయి బంగారి మావా..‘ ఈ రాగంలో ఘంటసాల బాణీ కట్టి పాడినదే.
నాలుగవ పద్యం: ఊయేల తొట్టి
రాగం: భాగేశ్వరి లేదా భాగేశ్రీ (కర్నాటక సంగీతంలో ఇందుకు పోలిన రాగం లేదు)
ఇది ఒక ముఖ్యమైన అతి పాతదైన హిందూస్తానీ రాగం. అనేక సినిమా పాటల్లో విరివిగా ఈ రాగాన్ని వాడారు. తెలుగు, హిందీ సినిమా పాటల్లో ఈ రాగంలో బాణీలు కట్టిన పాటలు చాలా ప్రజాదరణ పొందాయి.
స్వరాలు; స, రి2, గ1, మ1, ధ2, ని1 (పంచమం ఈ రాగంలో నిషిద్ధం. రిషిభం అవరోహణలో మాత్రమే వాడతారు). కొన్ని ఘరానాలలో రిషభాన్ని కూడా ఆరోహణలో ఉపయోగిస్తారు. మరికొన్ని ఘరానాల్లో పంచమం వాడటం రివాజు! కొంత విషాదం, వియోగమున్న భావాలను తెలియపరచటానికి ఈ రాగం వాడతారు. ఈ క్రింది పద్యం వింటే, “మూన్నాళ్ళలోన ఏప్పుడు నేర్చుకొనియెనో, పొమ్మన్నచో….” అన్నప్పుడు “పొమ్మన్నచో”లో బాగేశ్వరి రాగచ్ఛాయని పూర్తిగా వినిపిస్తాడు ఘంటసాల.
ఇప్పటికీ గొప్పగా చెప్పుకొనే పాత సినిమా మాయాబజార్ లో ఉన్న యుగళ గీతం ‘నీ కోసమె నే జీవించునది…’ ఘంటసాల, లీల పాడగా ఈ రాగంలోనే బాణీ కట్టారు. పాట మొదలవుతూనే వచ్చే సంగీతం షడ్జమంతో మొదలయి ‘సామధ, గమధ, సనిధమగరిసా…’ తో సాగుతుంది. అలాగే రాము సినిమాలో ‘మంటలు రేపే నెల రాజా ఈ తుంటరి తనము..’ అన్న పాట కూడా ఇదే రాగంలో బాణీ కట్టిందే. ఇక హిందీ సినిమాల్లో ఈ రాగాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. ఆజాద్ సినిమాలో ‘నా బోలే నా బోలే..‘ అన్న లత పాడిన పాట, ప్రైవేట్ సెక్రెటరి సినిమాలో ‘జా రే బైయిమాన్’ అన్న మన్నాడే పాడిన పాట, అనార్కలి (హిందీ) సినిమాలో ‘జాగ్ దర్ద్’ అన్న హేమంత్ కుమార్, లత పాడిన పాటలు బాగేశ్వరి రాగానికి కొన్ని మంచి ఉదాహరణలు.