సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో టైటిల్ సాంగ్ మీకు గుర్తుంది కదూ ? ఆ పాటలో చిత్ర గారి వాయిస్ కి ముందు ’ఏకువలో గోదారి ఎరుపెక్కింది’ అనే మేల్ వాయిస్ వస్తుంది. ఆ లైన్స్ పాడింది ఎవరో ఇవాళ్టి మ్యూజిక్ ముచ్చట్లు లో తెలుసుకుందాం. అనిల్ కుమార్ అనే గాయకుడు ఆ లైన్స్ ని పాడేడు. ఈయన జానపద గీతాల్ని పాడడంలో ప్రసిద్ధుడు. అన్నిమల్లె అనిల్ కుమార్ అన్నది ఈయన పూర్తి పేరు. తెలంగాణా జానపద గీతాల్ని తన ఆల్బమ్స్ ద్వారా పాప్యులర్ చేసిన వడ్లకొండ అనిల్ కుమార్ కి ఈ అన్నిమల్లె అనిల్ కుమార్ కి పేరులో తప్ప ఇంకెక్కడా పోలిక లేదు.
’సీతమ్మ వాకిట్లో’ పాటని పాడిన ఈ అన్నిమల్లె అనిల్ కుమార్ పేరు ఆ సినిమా టైటిల్స్ లో గానీ, ఆడియో కవర్ మీద గానీ, వీకీ పీడియాలో గానీ కనిపించదు. ఈయన అంతకు ముందు కృష్ణవంశీ తీసిన ’మహాత్మ’ సినిమాలో ’నీలపురి గాజుల ఓ నీలవేణీ’ పాటను పాడేడు. ’సీతమ్మ వాకిట్లో’ సినిమా తరువాత ’చందమామ కథలు’ సినిమాలో”దేవుడా’ అనే హుక్ లైన్ తో సాగే ’నాకు ఆధార్ కార్డుంది ... ’ పాటని పాడేడు. అనిల్ కుమార్ ప్రస్థుతం తెలంగాణా సాంస్కృతిక సారథి సంస్థ లో గాయకుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన పాడిన మరికొన్ని సినీగీతాలు విడుదలకి సిద్ధంగా వున్నాయి.