Click Here for Photos
టాంటెక్స్ “సుస్వర ఝరి-స్వరమంజరి”: స్థానిక గాయనీ గాయకులకు వినూత్న అవకాశం
సంచలనం సృష్టించిన రెండవ ఆవృత్తం
డాలస్/ఫోర్ట్ వర్త్, ఆగస్ట్ 22, 2015
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) స్థానిక గాయనీగాయకులకు ‘స్వరమంజరి’ అనే పాటల పొటీల కార్యక్రమం గత నెల జూలై 26వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ‘స్వరమంజరి- రెండవ ఆవృత్తం’ డాల్లస్ మహానగర ప్రాంతంలోని సెయింట్ మేరిస్ చర్చ్ లో ఈ నెల ఆగస్టు 22వ తేదీన ఘనంగా నిర్వహించారు. “ఫ్రగతి పథంలో పది సూత్రాలు” అంటూ ఈ సంవత్సరం విభిన్నరీతిలో సరికొత్త కార్యక్రమాలను మన తెలుగువారికి అందించాలనే తపనతో ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టి పదునెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి ఇటువంటి వినూత్న పాటల పోటీలు నిర్వహిస్తూ స్థానిక కళాకారులకు మరింత ప్రోత్సాహం కలిగించారు సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి. స్వరమంజరి కార్యక్రమంలో మొత్తం ఐదు ఆవృత్తాలు ఉంటాయని, మిగతావి సెప్టెంబరు 26, అక్టోబరు 31, డిసెంబరు 05 తేదీలలో నిర్వహించనున్నారని తెలియజేసారు.
ముఖ్య అతిధి మరియు ప్రధాన న్యాయనిర్ణేత శ్రీ రాజా గారుస్థానిక న్యాయనిర్ణేతలు శ్రీ రాజశేఖర్ సూరిభోట్ల, శ్రీ శ్రీనివాస్ ప్రభల జ్యొతీ ప్రజ్వలనతో ప్రారంభించిన ఈ పాటల పోటీలకు ప్రధాన సంధానకర్తగా శ్రీ.అశ్విన్ కౌత వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి టాంటెక్స్ కార్యదర్శి శ్రీ.మహేష్ ఆదిభట్ల వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆద్యంతం గాయనీ గాయకులను పరిచయం చేయటంతో పాటు, వారు పాడిన పాట యొక్క సినిమా పేరు, విడుదలైన సంవత్సరం, పాడిన వారు, దర్శకుల వివరాలను ప్రేక్షకులకు తెలియజేయటమే కాకుండా వారి చమత్కారికలతో కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు.
భారతీయ సంగీతంలోలేని అంశాలు ప్రపంచంలో ఏ సంగీతంలోనూ కానరావు. యావద్భారతావనిలో ఒక్కటిగా ఉన్న సంగీతం సారంగదేవుని కాలానికి ఉత్తరాది సంగీతం హిందుస్థానీ గానూ, దక్షిణాది సంగీతం కర్ణాటకంగానూ ఏర్పడ్డాయి. అయితే సినివినీలాకాశంలో ఇటు దక్షిణ భారత సంగీతాన్ని, ఉత్తర భారత సంగీతాన్ని సంగీత దర్శకులు తమదైన శైలిని ప్రయోగించి పూర్తి స్థాయిలో చిత్ర గీతాలకు బాణీలను కట్టారు. సంగీతానికి కొలబద్ద తాళం. పురాణ ఇతిహాసాల ప్రకారం శివుని నాట్యాన్ని తాండవం అనీ, పార్వతి నాట్యాన్ని లాస్యం అనీ అంటారు.ఈ తాండవ లాస్యాల్లోని మొదటి అక్షరాలను గ్రహించి ‘తాలం’ అనే ప్రక్రియ ఏర్పడింది. కాలక్రమేణా తాలం-తాళంగా మారింది. ఈ తాళం తెలియనివాడు గాయకుడు కానీ వాదకుడుకానీ కాలేడు. అందు చేత ఏ పాటకైన శృతి, తాళం, లయ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. చిత్ర గీతాలు, జానపద గీతాలు, శ్రామిక గేయాలు, జాతీయ గీతాలు ఇలా ఏ కోవకు చెందిన గీతాలయినా వీటికి మాతృక శాస్త్రీయ సంగీతమే.
‘అనగననగ రాగమతిశయిల్లుచునుండ తినగ తినగ వేము తియ్యనుండ’ అన్న నానుడికి సార్ధకత చేకూరుస్తూ స్థానిక గాయనీ గాయకులు పాటల పోటీలో మరింత సాధన చేసి ముందుకు వచ్చారు. వీరిలో ఇల్లెందుల సమీర పాడిన ‘వటపత్ర సాయికి’ పాటతో పోటీ ప్రారంభమైంది. ఇందులో కోట ప్రభాకర్ - ఫీల్ మై లవ్, మార్పాక పరిమళ - నెమలికి నేర్పిన, కమ్మంకర్ సంతోష్ - ఏ చిలిపి కళ్ళలో, గుడిమెళ్ళ స్వప్న - తొలిమంచు కురిసింది, పూనూరు కమలాకర్ - కుర్రాళ్ళొయ్ కుర్రాళ్ళు, కడిమిసెట్టి పూజిత - ఏ తీగ పువ్వునో, చెరుకు గోపాల్ - మరిసే తారలదే రూపం, ధర్మపురి ఆషాకీర్తి - నువ్వెం మాయ చేసావొ, కస్తూరి గౌతం - జాబిల్లి కోసం, వడ్లమణి నాగి - పూవై విరిసిన, మారిగంటి సంగీత - దోబూచులాటేలర, ఏలేశ్వరపు శ్రీని - రవి వర్మకే, పెళ్ళూరి చైతన్య - నిన్నుకోరీ, మహాభాష్యం సాయి రాజేష్ - రేగుతున్నదో రాగం, శంకర్ జానకి - కొండా కోనల్లో, కుందేటి చక్రపాణి - జామురాతిరి, నారని రమేష్ - ఎవరివో నీ వెవరివో, నూతి శాంతి - మనోహర, అనే పాటలని పాత- కొత్తల సంగమంలా ఎంతో ఔత్సుకతతో తమదైన శైలిలో ఆలపించారు. సుమారు ఐదు గంటలపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పాటల పోటీలకు శ్రీ గణపవరపు బాల ఆడియో, శ్రీ జొన్నాడ వెంకట్ వీడియో,శ్రీ భాస్కర్ ఫొటోగ్రఫీ అందించారు.
ఈ పాటల పోటీలో సంగీత దర్శకులు శ్రీ రాజాగారు, శాస్త్రీయ సంగీత గాయకులు శ్రీ ప్రభల శ్రీనివాస్, సంగీత దర్శకులు శ్రీ సూరిభొట్ల రాజశేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, సంగీతానికి సంబంధించి ఎన్నో మళకువలు, సాహిత్యంలో సవరణలు, అలాగే వారి వారి స్వీయ అనుభవాలను తెలియజేయటమే కాకుండా ఇపుడిప్పుడే ఒక రూపాన్ని సంతరించుకుంటున్న గాయనీ గాయకులకు చలన చిత్ర పరిశ్రమలో కావలసిన క్రమశిక్షణను కూడా తెలియజేసి, ప్రేక్షకులకు కూడా ఒక అవగాహన కలిగే విధంగా చక్కగా వివరించారు.
స్వరమంజరి వంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు న్యాయనిర్ణేతల ద్వారా మరియు తమ తోటి కళాకారుల ద్వారా ఎన్నో మెళకువలు నేర్చుకోగలిగామనీ, ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా నిర్వహిస్తే బాగుంటుందనీ, ఎప్పుడో మర్చిపోయిన పాటలను గుర్తుకు తెచ్చిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారికి వారు ఎంతో ఋణపడి ఉంటాం అని పలువురు గాయనీ గాయకులు వారి స్పందనను తెలియజేసారు. కార్యక్రమంలో విరామ సమయంలో భారత దేశం నుండి విచ్చేసిన ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్రీ ఫణి మాధవ్ తమ మిమిక్రీ ప్రదర్శనతో ఆహుతులను హాస్య డోలికల్లో ముంచెత్తారు.
టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణ, కార్యదర్శి ఆదిభట్ల మహేష్, సంయుక్త కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి శీలం కృష్ణవేణి, సంయుక్త కోశాధికారి పావులూరి వేణు మరియు కార్యవర్గ సభ్యులు గజ్జెల రఘు, పాలేటి లక్ష్మీ, వనం జ్యోతి, రొడ్డా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శారద సింగిరెడ్డి, ప్రత్యేక కార్యక్రమాల జట్టు సభ్యులు పంచార్పుల ఇందు, కోడూరి వెంకట్ చురుకుగా పాల్గొన్నారు.
చివరగా వందన సమర్పణలో సింగిరెడ్డి శారద స్వరమంజరి కార్యక్రమానికి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీలకు, స్వరమంజరి పాటల పొటీ విజేతకు బంగారు పతకాన్ని అందజేయనున్న తన్మయీ జ్యువెల్లర్స్ కు, కార్యక్రమ పోషక దాతలకు ఆడిటోరియం యాజమాన్యానికి, ఈ కార్యక్రమానికి స్వల్పాహారం అందించిన కేఫ్ బహార్ కు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.
కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.