"కమల తో నా ప్రయాణం"
సినిమా చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు చర్చించుకుంటున్న పేరిది.
కారణం ప్రత్యేకంగా వుండడమే.
అలాగే సంగీత దర్శకుడి గురించి కూడా .
చాలా వెబ్ సైట్స్ లో కె.కె. అని ఉండడం తో సింగర్ కె.కె. అని పొరబడ్డవాళ్ళు ఉన్నారు.
ఎక్కడ చూశారో ఏమో - కౌశిక్ కళ్యాణ్ అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ, ఆ సంగీత దర్శకుడి పేరు కిషన్ ఖవాడియా .
పేరులో ఉత్తరాది వాసనలున్నా. కిషన్ ఖవాడియా పుట్టి, పెరిగింది మాత్రం బాపట్లలోనే .
చిన్నప్పుడే సంగీతం పట్ల ఆకర్షితుడై కర్ణాటక సంగీతాన్నినేర్చుకోవడమే కాకుందా ఓ
ఇన్స్టిట్యూట్ పెట్టి తబలా, వోకల్, కీ బోర్డ్ నేర్పేవాడు.
ఆ ఉత్సాహం చూసి అందరూ అతన్ని సినిమా పరిశ్రమలో రాణిస్తావని ప్రోత్సహించారు.
అలా - అవకాశాల కోసం 2008 లో హైదరాబాద్ లో అడుగు పెట్టాడు కిషన్ ఖవాడియా.
మొట్ట మొదట - నరసింహ నంది (కమల తో నా ఫ్రయాణం దర్శకుడు) ని కలిశాడు.
’అవకాశం ఇస్తాన'ని నరసింహ నంది అప్పుడు చేసిన ప్రామిస్ ’కమలతో నా ప్రయాణం’ కి
నెరవేరింది.
ఈలోగా అతను ఉత్తినే కూచోలేదు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గిర పనిచేశాడు.
చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తత్వం కాదు కనుక - తన టాలెంట్ మీద తనకు
నమ్మకం వుంది కనుక - ఆ సంగీత దర్శకుల పేర్లు చెప్పుకోడానికి ఇష్టపడలేదాయన.
ఇదిలా వుండగా ఎవ్వరూ చెయ్యని ఓ అద్భుత ప్రయోగం చేశాడు. గిన్నీస్ బుక్ వారు
గుర్తించదగ్గ ప్రయోగం అది.
అదే - ఏక స్వర గీతం.
ఇళయరాజా 3 స్వరాలతో ఓ పాట చేస్తే - కిషన్ ఖవాడియా ఒకే ఒక స్వరం తో పాటను
చేశాడు. (యూ ట్యూబ్ లో దొరుకుతుంది, చూడొచ్చు) .అసలా ఆ అలోచన వచ్చినందుకు,
అది చెయ్యగలిగినందుకు కిషన్ ఖవాడియా ని అభినందించి తీరాలి ఎవరైనా .
" కమల తో నా ప్రయాణం సినిమాలో ఏయే పాటలు నచ్చాయి మీకు ? " అని అడిగితే
" శ్రీ సౌమ్య పాడిన ’అలాపనే’ అన్న పాట, పవన్ పాడిన ’నీతోనే' అనే పాటలు నచ్చాయి " అని జవాబిచ్చారు కిషన్
" ఆలాపనే పాట పంతువరాళి రాగం కదూ ? "
" అవునండి "
" మరి శ్రీకృష్ణ , ప్రణవి పాడిన ’ చిట్టి పాపాయి’ పాట వినడానికి బావుంది కదా ?"
"అది కొంచెం కమర్షియల్ ఫార్మాట్ "
" ఆ పాట రిథమ్ ప్యాట్రన్ వింటుంటే కీరవాణి గారి స్టయిల్ గుర్తొస్తోంది "
" అవునండి ... అది కూడా కరక్టే .."
" ఈ సినిమా తర్వాత ఇంకేమైనా సినిమాలున్నాయా ?"
"అదే ప్రేమ అనే సినిమా ఒకటి రిలీజ్ కావలిసింది వుంది. అందులో పాటలు ఇంకా బావుంటాయి "
ఇదీ కిషన్ ఖవాడియా తో జరిపిన షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్ వ్యూ ...