తెలుగు సినిమాకి మలయాళీ సంగీత దర్శకులు రావడం ఇవాళ కొత్తేం కాదు. జెస్సీ గిఫ్ట్ అలా సంగీత దర్శకుడిగా (యువసేన కి) వచ్చి గాయకుడిగా స్థిరపడినవాడే. అంతెందుకు - కె.వి. మహదేవన్ మలయాళీ. అలా ఈ కోవలోకి మరో సంగీత దర్శకుడు వచ్చి చేరుతున్నాడు. అతని పేరు గోపి సుందర్. సంగీత దర్శకుడిగానే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఇటీవల కోలివుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. సింగర్ గా కూడా మంచి మార్కులే వున్నాయి ఇతని అక్కౌంట్ లో.
అంతే కాకుండా - చాలా తక్కువ మందికి తెలిసిన మరో విషయం ఏమిటంటే - బాలీవుడ్ లో బంపర్ హిట్ గా నిలిచిన షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలోని 'బన్ కే తితిలీ దిల్ ఉడా ఉడా ఉడా కహీ దూర్' పాటను చిన్మయి తో కలిసి పాడింది - ఈ గోపి సుందరే . ఉత్తరాదిన పాపులర్ గా నిలిచిన జంట సంగీత దర్శకులు విశాల్- శేఖర్ కి ఈ గోపి సుందరే మ్యూజిక్ అరేంజర్. ఆ పరిచయంతో ఆ పాటను అతనే పాడాడు.
'ఓనమాలు' చిత్రం ద్వారా అభిరుచి, కమిట్ మెంట్ వున్న దర్శకుడిగా మొదటి ప్రయత్నం లోనే అందర్నీ తన వైపు తిరిగేలా చేసుకున్న క్రాంతి మాధవ్ దృష్టిలో ఇతను పడ్డాడు. అంతే ... క్రియేటివ్ కమర్షియల్స్ కె.యస్. రామారావు నిర్మిస్తున్న కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రాంతి మాధవ్ - గోపి సుందర్ ని కావాలని తెచ్చుకున్నాడు.
"అంత పర్టిక్యులర్ గా అయనే ఎందుకు ఎంచుకున్నారు ?" అని అడిగితే - " ఆయన మ్యూజిక్ ఇచ్చిన అన్వర్, ఉస్తాద్ హోటల్ సినిమాల్లో మ్యూజిక్ విన్నాను. నాకెంతో నచ్చింది. అసలు కారణం అదే" అన్నారు క్రాంతి మాధవ్.
ప్రస్తుతం కొచ్చిన్ లో నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంకి శర్వానంద్, నిత్యా మీనన్ హీరో, హీరోయిన్లు.