సామాన్యుల కన్నా కళాకారులకు సామాజిక బాధ్యత ఎక్కువగా వుండాలి. అది చాలా వరకు తగ్గిపోబట్టే సమాజం ఇవాళ అస్తవ్యస్తంగా వుంది. సినీ పరిశ్రమలో వుంటునే తమ కవితల ద్వారా, పాటల ద్వారా శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర, ఆత్రేయ వంటివారు సమాజంలో ఎంతో కొంత చైతన్యం తీసుకువచ్చారు. ’అదను చూసి చెప్పేదే అందమైన కవిత’ అన్నారు ఆత్రేయ. అలా అదను చూసి చెప్తే ఒక్కోసారి అది పదునుగా కూడా వుంటుంది . ఆత్రేయ అవార్డ్ ని ఇప్పటి వరకూ 3 సార్లు అందుకున్న చంద్రబోస్ కూడా ఓ కవిత రాశారు. అది ఒక కవిగా తన వంతు సామాజిక బాధ్యతను చెప్పేదిగా గానే కాకుండా పదునుగా - అదను చూసి చెప్పినట్టుగా కూడా వుంది. ఆ కవిత నెట్ లో బాగా సర్క్యులేట్ అవుతోంది. విదేశాల్లో అయితే మరీనూ. ఇదిలా వుండగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో సంచలనాన్నిరేపి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీ.బీ.ఐ.అధికారి జె.డి. లక్ష్మినారాయణ - చంద్రబోస్ రాసిన కవిత తన ఫేస్ బుక్ లో పెట్టి మరింత ప్రచారం కల్పించడం చెప్పుకోదగ్గ విషయమే కాదు గర్వించదగ్గ విశేషం కూడా.