This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
                                  వెన్నెల’కంటి వెలుగులు'
నవంబర్ 30. సినీ గీత రచయత వెన్నెలకంటి పుట్టిన రోజు. ఆయన నాకు సినీ గీత రచయిత కాక ముందు నుంచీ పరిచయం. అదీ బాలు గారి పుణ్యమే. ఓ సారి నేను మద్రాసు వెళ్ళినప్పుడు రూమ్ దొరక్క బాధ పడుతూ బాలు గారికి ఫోన్ చేస్తే - ఓ హోటల్ పేరు చెప్పి ’ఫలానా రూమ్ లో వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ అని ఒకాయన వుంటాడు. మనవాడే. నేను ఫోన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయి రండి. ఈలోగా మరో రూమ్ చూద్దాం.’ అన్నారాయన. అలాగేనని వెళ్ళాను. ’మాది నెల్లూరండీ ... సినిమాల్లో పాటలు రాయడానికి వచ్చాను’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు వెన్నెలకంటి. ఆరోజు నుంచి ఈ రోజు వరకూ మా స్నేహం నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. 
 

 

సినీ రచయితగా ఆయన ఎదుగుదల ప్రతి మెట్టూ చూస్తూ ఆనందిస్తూ వున్న ఆయన స్నేహ బృందంలో నేను  వున్నందుకు కించిత్ గర్వంగా కూడా వుంటుంది నాకు. వారబ్బాయి శశాంక్ వెన్నెలకంటి పెళ్ళికి చెన్నై వెళ్ళాను నేను. ఆ పెళ్ళి రిసెప్షన్ లో సాయికుమార్ తమ్ముడు రవి (బొమ్మాళీ ఫేమ్) బాలు గారి పాటలు పాడడం ఓ ప్రత్యేకత. రవి అంత బాగా పాడతాడని చాలా మందికి తెలియదు. సూపర్ సింగర్స్ లో ఈ రవిని యాంకర్ గా పెట్టి ఎన్నో మంచి మంచి పాటలు పాడిద్దామని ప్రపోజల్ పెట్టాను. ’సమకాలీనులు మెచ్చరధిప’ అనే పద్యంలోని వాక్యం చాలాసార్లలాగే మరోసారి ఋజువయ్యింది. ఆ తర్వాత  వెన్నెలకంటి గారితో ఘంటసాల అవధానం చేయించాను. ఈ కాన్సెప్ట్ ’ఆ సమకాలీనులకి’ అర్ధం అయ్యింది.  పరుచూరి గోపాలకృష్ణ, ఆర్పీ పట్నాయిక్, భాస్కరభట్ల రవికుమార్, హేమచంద్ర, మాళవిక పృచ్చకులు. చాలా బాగా వచ్చిందా ఎపిసోడ్. 
వెన్నెలకంటి సహృదయుడు, రస హృదయుడు. ఓ సారి ఓ బుక్ నాకు పంపిస్తూ నన్ను ’గడ్డం లేని ఋషి’ అని సంబోధించారు. ’అదేంటలా అన్నారు ? ’ అని నేనడిగితే ’పాటల కోసం మీరు చేస్తున్న కృషి  తపస్సు లాంటిదే’ అని అభినందించారు.
తనే ప్రయోగం చేసినా నాతో పంచుకుంటారు. ’తేనెటీగ’ అనే సినిమాలో ’కలలో తెర తీయాలా’ అనే తమాషా ప్రయోగం ఒకటి చేశారాయన. ఇటువంటి ప్రయోగం అంతకుముందు ఎవ్వరూ చెయ్యలేదు. ఈ పాట పల్లవి లో ’కలలో తెర తీయాలా’ అని వుంది కదా ... ఆ ’తీయాల’ లో ’తీయ’ అనే పదాన్ని తీసుకుని ’తీయగ ఎద వేగాల’ అని ఆ తర్వాత వుంటుంది. ఆ ’ వేగాల’ తో ’వేగాలలో వేడి’ అని ఆ తర్వాత వుంటుంది. మొదటి లైన్ చివర వున్న ’తీయాల’ కి తర్వాత లైన్ లో వున్న ’తీయగ’ లో వున్న ’తీయ’ కి అర్ధాలు వేరు. ఇలా పాట మొత్తం వుంటుంది.   
’దీన్నేం అలంకారం అంటారో తెలియడం లేదు’ అని అన్నారు వెన్నెలకంటి పాటని వినిపించిన తర్వాత. రెండు రకాల అర్ధాలతో ఒకే పదాన్ని వాడితే ’యమకం’ అంటారు. (అచ్చెరువున - అచ్చెరువున - వేటూరి - సప్తపది - రేపల్లియ ఎద ఝల్లన / చుక్కానవ్వవే - నావకు చుక్కానవ్వవే - వేటూరి - సీతాకోక చిలుక -  మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా)  మొదటి పాదంలో విడిచిన పదాన్ని రెండో పాదం లో స్వీకరించి కొనసాగించడాన్ని ’ముక్తపదగ్రస్తం’ అంటారు. (గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది - దాశరథి - మూగ మనసులు) "ఈ రెండు లక్షణాలూ ఈ పాటలో వున్నాయి కనుక ’యమక ముక్తపదం’ అని అనొచ్చేమో” అని అన్నాన్నేను. "బావుంది. అనుకోవచ్చు" అని అన్నారాయన. 

 
 
మరోసారి వారిద్దరి అబ్బాయిల పేర్ల మీద మా సంభాషణ మళ్ళీంది. పెద్దబ్బాయి పేరు శశాంక మౌళి . రెండో అబ్బాయి పేరు రాకేందు మౌళి. ఇద్దరూ సినీ పరిశ్రమలో
మంచి పేరు సంపాదించుకున్నారు. " శశాంక మౌళి అని వుంది . అనొచ్చు. కానీ రాకేందు మౌళి అని అనకూడదు కదా. అలా ఇప్పటి వరకూ ఎవ్వరూ అనలేదు కదా ? " అని అడిగాను. దానికాయన నొచ్చుకోలేదు. "నిజమే .. బాలేందు మౌళి అని వుంటే అది కరెక్ట్ గా వుండేది. కానీ ఏదో ఫ్లో లో అలా వచ్చేసింది" అని జవాబిచ్చారు మనస్ఫూర్తిగా. ఇదీ ఏ భేషజం లేని వెన్నెలకంటి మనస్తత్వం, వ్యక్తిత్వం ...  
ఇలా జరిగిపోతూ, సాగిపోతోంది మా స్నేహం.  ఈ బంధం ఇలాగే జీవితాంతం వుండాలని ఆయన పుట్టిన రోజు పూటా కోరుకుంటూ, శుభాకాంక్షలతో ...
డాక్టర్ రాజా (మ్యూజికాలజిస్ట్)    

’తేనెటీగ’ చిత్రం లో వెన్నెల కంటి రాసిన ప్రయోగాత్మక ప్రేమ గీతం

కలలో తెర ... తీయాలా
తీయగ ఎద ... వేగాలా
వేగాలలో వేడి
వేడింది వెన్నంటి
వెన్నంటి నా సోకు
సోకింది నిన్నంటి     // కలలో తెర //
అంటుకున్న తీయని పగలుగ
పగలు రేయి కానీ చల్లగ
చల్లుతుంటె వలపుల జల్లుగ
ఝల్లుమంది హృదయం, అదరగ
అదరాల మధుకీల సిగ్గిల్లగా
గిల్లింది గిలిగింత తాపాలుగా 
పాలించగా నీ వీక్షణం 
క్షణమాగునా నా పయ్యెదా   // కలలో తెర //
ఎదల సొదల కథలాపొద్దిక
పొద్దుపొడుపు అసలే ఒద్దిక
ఒద్దికైన ముద్దే వాడక
వాడుకైన వరసే తోడిక
తోడాలి నయనాలు సిరివెన్నెలా 
నెలకొంది నెలవంక ఎద కోవెలా
వెల లేనిదీ విలువైనది
నది చేరిన కడలే ఇది    // కలలో // 
చిత్రం : తేనెటీగ
రచన : వెన్నెలకంటి
గానం : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
అభినయం : రాజేంద్రప్రసాద్, సుమప్రియ 
 
(courtesy of Indiaglitz) (here is the link for the same)