రాముడు సీత జడ ని ఎత్తలేకపోవడం ఏమిటి !?
వేటూరి అలా ఎందుకు రాశారు ?
స్వర్ణ అట్లూరి (డల్లాస్ - యూ.ఎస్.ఏ)
'గోదావరి' సినిమాలోని 'రామ చక్కని సీతకి ' పాటలో .. "ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే... ఎత్తగలడా(?) సీత జడను తాళి కట్టే వేళలో".. అని ప్రశ్నార్ధకంగా ఎందుకు పాడారు అని ఓ చిన్న సందేహం నా స్నేహితురాలికి వచ్చి, ఇద్దరం ఒకటికి రెండుసార్లు విని, అబ్బే ఇక్కడ రచయిత వేటూరివారు కనుక అయన వ్రాసినదానిని అయితే పాడినవారో, స్వరపరచడం లో తప్పనిసరి అయో "ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే (he only can) ఎత్తగలడు ఆ సీత జడను తాళి కట్టే వేళలో" అని పాడవలసింది అలా ప్రశ్నార్ధకం గా పాడేసారా అని తర్జన భర్జన పడుతూ.. అడిగిందే తడవుగా చెప్పగల "రాజా మాస్టారు" ఉండగా సందేహంతో ఉండటం ఎందుకు అని, ఇలా అడిగితే అలా జవాబు పంపించారు musicologist raja గారు.
"రాముని కన్నా సీతకు బలం ఎక్కువని చెప్పడమే ! శివ ధనుస్సు ని, దాన్ని ఉంచిన భోషాణం (?) తో సహా - సీత అతి చిన్న వయసులో ఎడం చేత్తో జరిపేసింది. (కష్టకాలం లో కూడా సీత చాలా నిబ్బరంగా నిలిచింది). అటువంటి సీత జడ ఇంకెంత బరువుంటుందో కదా అనే అతిశయోక్తి అలంకారాన్ని వాడేరు వేటూరి. 'గోదావరి' సినిమాలో కూడా కమలినీ ముఖర్జీ (పాత్ర పేరు సీత) తాను మానసికంగా బలవంతురాలినని అనుకుంటూ అతిశయాలు పోతూ ఉంటుంది. పాత్ర స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని వేటూరి వేసిన చమత్కారం అది. "