This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 

 
'సంగీతానికి గుడి కడితే సింగీతం' అని చమత్కరించారు పి.బి.శ్రీనివాస్- దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గురించి.... 
లలిత, శాస్త్రీయ, సినీ సంగీతాలపై తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. సంగీత దర్శకుడిగా ఆయన స్వరాలను సమకూర్చిన 'భాగ్యలక్ష్మీ బారమ్మా' అనే కన్నడ చిత్రాన్ని చూసిన వారికి తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో కొంతమందికి మాత్రం తెలుసు. జంధ్యాల వంటి దర్శకులు సైతం  సింగీతం శ్రీనివాసరావు గారిని సంగీత దర్శకుడిగా పెట్టుకుని ఓ చిత్రం తీయాలని ఉబలాటపడేవారు కూడా! ఆ తర్వాత శ్రీ సంగీతం 'పెళ్ళి పందిరి' అనే ఓ టీవీ సీరియల్ లోని పాటలకు బాణీలు కట్టారు.  ఈ విషయాలు కూడా మళ్లీ కొంతమందికే తెలుసు. కానీ తనలోని సంగీతాభిరుచిని తట్టి మేల్కొలిపి, ఆ సంగీతంలోని ఆత్మని, హృదయాన్ని - అనుభూతి లోనికి తెచ్చుకునే మార్గాన్ని చూపిన గురువు శ్రీ యస్. రాజేశ్వరరావుగారికి నివాళిగా ప్రత్యేకమైన రీతిలో ఓ మ్యూజిక్ ఆల్బమ్ ని సమర్పించుకోవాలన్న కోరిక సంగీతం వారి హృదయాంతరాలలో 1993 నుంచి రూపుదిద్దుకుంటోందన్న విషయం ఆయన సన్నిహితులకు తప్ప వేరెవరికీ తెలియదు. 'రాజహంస' చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్  లో ఆయన వున్నప్పుడు  వేరే పని మీద వెళ్ళిన నాతో ఈ  ఆలోచనని పంచుకున్నారు.
 
ఏదైనా సరే 'రాజు' కుంటున్న కొద్దీ 'రాణి' స్తుంది. సినీ సంగీత సామ్రాజ్యానికి రాజువంటి రాజేశ్వరరావుగారిపై ఓ మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేయాలన్న ప్రయత్నం రాణింపులోకి రావడానికి సింగీతం గారు పడిన తపన ఎంత ఉన్నతమైనదో , ఎంత శాశ్వతమైనదో 'చల్లగాలిలో' అనే ఆల్బమ్ వింటే తెలుస్తుంది.
 
ఈ ఆల్బమ్ కి ఉన్న ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు. మొట్ట మొదటిది - అన్ని పాటలకు సంగీతం శ్రీనివాసరావుగారు బాణీలు కట్టడం, వాటిని ఎందరో మహానుభావులు సాహిత్యం సమకూర్చడం, మరెందరో మహానుభావులు పాడడం... ఈ వివరాల్లోకి తరువాత వెళదాం...
 
ఇక్కడ వినూత్నంగా కనిపించే ప్రక్రియ ఏమిటంటే ప్రతి పాటా రాజేశ్వరరావుగారి స్వర రచనా సామార్థ్యాన్ని, ఆయన అందించిన మాధుర్యాలని, ఆ పాత మధురాల వంటి ప్రయోగాల గురించి వర్ణిస్తూంటుంది. యస్.రాజేశ్వరరావుగారు పాడిన ప్రైవేట్ రికార్డులలోని పల్లవులు ప్రతీ పాటలోనూ మధ్య మధ్య సందర్భ శుద్ధితో ఆయన గొంతుతోనే వస్తాయి. ఇలా మ్యాచ్ చేయడం సామాన్యమైన విషయం కాదు. శ్రుతి సరిపోవాలి, తాళ గతిలో తేడా రాకుండా ఉండాలి. అలనాడు రాజేశ్వరరావుగారు పాడిన ఆయా ప్రైవేటు గీతాలు ఇప్పుడు సంగీతంవారు సమకూర్చిన బాణీలలో ఒక అంతర్భాగంగానే ఉండాలి. అలా అని ఆనాటి 'రాజేస్వరం' తనకున్న ప్రత్యేకతని కోల్పోకూడదు. ఊహించడానికి, చెప్పడానికి, వినడానికి, రాయడానికి బాగానే ఉంటుంది ఈ ప్రయోగం. కానీ పాటని పాడించుకుంటున్నప్పుడు, మిక్సింగ్ చేస్తున్నప్పుడు, బాలెన్స్ చేసుకోవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది - ఆ ఊహ వెనుకగల మేధస్సులోని ప్రతి కణం ఎంతో గొప్పదో, అది ప్రతిక్షణం ఎంతగా జ్వలించిపోయి ఉంటుందో!? అందుకే 'చల్లగాలిలో' మ్యూజిక్ ఆల్బంలోని ఒక్కొక్క పాటకీ రాజేశ్వరరావుగారి ఆత్మను సంగీతం వారి హృదయంతో మేళవించుకుంటూ వింటే - గుండె పొరలన్నీ అనుభూతి వర్షంతో తడిసి ముద్దయిపోతాయి. కళ్లు రసగంగలై పొంగిపోతాయి. 
ఇంతటి రసస్పందనను కలిగించే 'చల్లగాలిలో' మ్యూజిక్ ఆల్బమ్ లోని పాటల వివరాలలోకి వెళ్ళడానికి ముందు ఇంకో విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడంటే టెక్నాలజీ బాగా విస్తరించింది కానీ... 1993 నుంచి 2008 వరకూ ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి రాలేదు. కానీ సింగీతం వారి మేధస్సులో జరిగే విచిత్రాలు టెక్నిక్ ని ఆధారంగా చేసుకుని పెరిగినవే తప్ప పుట్టినవి మాత్రం కావు. ఈ ఆల్బమ్ ఆవిర్భావానికి తగిన ఆలోచన స్ఫురించగానే అలనాడు యస్. రాజేశ్వరరావుగారు స్వరపరచి, పాడి సుప్రసిద్ధ లలిత గీతాలను కీబోర్డ్ లో ఫీడ్ చేయించి, ఒక్కొక్క గీతానికి ఎన్నెన్ని 'బార్'లు ఉన్నాయో లెక్కచూసుకున్నారు సింగీతం. ఆ 'బార్'ల లెక్క ప్రకారమేయ తను అనకున్న ట్యూన్ ని వేటూరిగారితో రాయించి తానే ట్రాక్ పాడుకుని రికార్డ్ చేసి చూసుకున్నారు.
 
ఇలా ఈ ఆల్బం రూపుదిద్దుకుంటున్న తరుణంలో తక్కిన సంగీత మిత్రుల ద్వారా విని, ముచ్చటపడి, తగిన ధన సహాయం చేస్తానని, ముందుకొచ్చారు - మల్లాది సచ్చిదానంద మూర్తి అనే పారిశ్రామిక వేత్త! సరస్వతి, లక్ష్మీ ఒకేచోట ఉండవన్న ఆర్యోక్తి విని సరస్వతీ పుత్రులందరూ పనులు మానేసుకుని -పైకి రావటాన్ని వాయిదా వేసేసుకుంటారన్న - నిరాశావాదానికి ఆ దేవుడు సృష్టించిన నిలువెత్తు జవాబులా ఉంటారీ సచ్చిదానంద మూర్తి. ఈయన ఇచ్చిన ప్రోత్సాహంతో మరో ఏడు బాణీలను కంపోజ్ చేసి, అందులో ఒక బాణీని తనే సాహిత్యాన్ని సమకూర్చేసుకుని, ఇంకో అయిదు వరసలకు సిరివెన్నెల, భువనచంద్ర, వెన్నెలకంటి, సాయికృష్ణ యాచేంద్ర, గొల్లపూడి మారుతీరావు వంటి ప్రసిద్ధుల చేత తనలోని భావాలకు అనుగుణంగా పాటలను రాయించుకున్నారు సింగీతం. ఈ ప్రాజెక్ట్ కి తగిన ధనసహాయం చేసి ఊరుకోకుండా మిగిలిన లబ్దప్రతిష్టుల స్థాయికి తగ్గకుండా తనుకూడా ఓ పాట రాసి రాజేశ్వరరావుగారి పట్ల తనకు గల గౌరవాభిమానాలను చాటుకున్నారు మల్లాది సచ్చిదానంద మూర్తి.
అలా ఎనిమిది పాటల తయారీ పూర్తయింది. ఇక రికార్డింగ్ జరగాలి. రాజేశ్వరరావుగారి తనయుడిగానే కాకుండా మంచి సంగీత దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్న సాలూరి వాసూరావు రంగ్రప్రవేశం ఇప్పుడు జరిగింది. సింగీతం గారి భావాలకు అనుగుణంగా పాటలను మిక్సింగ్ చేయడంలో తనవంతు కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాడాయన. అంతేకాదు, రాజేశ్వరరావుగారి ప్రసిద్ధ సినీగీతాల పల్లవుల్ని ఇంటర్ లూడ్స్ గా కూడా వాడుకుని ఆర్క్రెష్ట్రయిజేషన్ కి మరింత శోభను సమకూర్చిపెట్టాడు.
 
ఇక ప్రయోగాత్మకంగా రూపుదిద్దుకున్న ఆ ఎనిమిది పాటల వివరాల్లోకి వెళితే...
(1)  పల్లవి. నాటి గీతాల పారిజాతాల మౌన సంగీతమో
రచన: వేటూరి
గానం: ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
 
ఈ పాటలో ' వినిపించని రాగాలే' , 'మదిలో వీణలు మ్రోగే'  పాటల్ని ఇంటలూడ్స్ గా ఉపయోగించుకున్నారు.  యస్. రాజేశ్వరరావు గారి సంగీతం పై వేటూరి గారికి ఎంతటి
అనురాగం, అభిమానం, గౌరవం వున్నాయో అణువణువునా తెలిసిపోయే పాట ఇది. మొదటి చరణం లో 'మల్లీశ్వరికి, మేఘమాలకు నువు నేర్పిన భీమప్లాసులు ' (మల్లీశ్వరి సినిమాలో 'ఆకాశవీధిలో ... రాగాల ఓ మేఘమాలా' పాట భీంప్లాస్ రాగంతోనే మొదలవుతుంది) అనే వాక్యం ఆ అనురాగానికి ఉదాహరణ గా నిలిస్తే - 'మిస్సమ్మ' సినిమాలోని 'బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ' పాటను దృష్టిలో పెట్టుకుని ' నీ బృందావనమది మా అందరిదీ మా రాజేశ్వరుడందరి వాడేలే'  ఆ అభిమానానికి సాక్ష్యంగా నిలిచిపోతుంది. అలాగే  'వెన్నెల పాళితో వెండితెర పై నువు రాసిన చంద్రలేఖలు' (చంద్రలేఖ సినిమా కి రాజేశ్వరరావు గారు ఇచ్చిన డ్రమ్స్ డ్యాన్స్ మ్యూజిక్ ఆ రోజుల్లో పెద్ద సంచలనం),  'ఎక్కడ ఎక్కడ ఆ మోహనాల మొలకలు' (రాజేశ్వరరావు గారి సంగీతంలో మోహన రాగం కి ఉన్న స్థానం అపారం),  'ఎప్పుడు మాస్టారు మళ్ళీ ఆ స్వర యుగం - ఉందో లేదో ఈ జన్మ కా యోగం'  వంటి వాక్యాలు  ఆయన పట్ల వేటూరి గారికి ఉన్న గౌరవానికి అక్షరాభిషేకంలా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ  వాక్యాలు వింటుంటే రాజేశ్వరరావు గారి అభిమానులకు గుండె చెమ్మగిల్లక మానదు. అందుకేనేమో ఈ ఆడియో ఆవిష్కరణ సభలో స్పీకర్ లో ఈ పాట వస్తున్నంత సేపూ శ్రీమతి పి. సుశీల కళ్ళు వొత్తుకుంటూనే వున్నారు.  ఇక ఈ పాటకు సింగీతం గారు సమకూర్చిన ట్యూను, దాన్ని శ్రీ బాలు గారు తనదైన స్పష్టమైన వాచకంతో , గళమాధుర్యం తో, భావస్ఫోరకంగా ఆవిష్కరించిన తీరు,   మధ్య మధ్య రాజేశ్వరరావు గారు సంగీతాన్నిచ్చి పాడిన   అలనాటి "చల్లగాలిలో యమునా తటి పై' లలిత గీతన్ని ఇమిడ్చిన పద్ధతి - ఇవన్నీ ఈ పాటని పదే పదే వినేలా చేస్తాయి.    
 
మాధుర్యంతో, భావస్పోరకంగా ఆవిష్కరించిన విధానం ఇవన్నీ పాటను పదే పదే వినేలా చేస్తాయి.
(2) పల్లవి: పాడమను తుమ్మెదా
రచన: వెన్నెలకంటి
గానం: రావు బాల సరస్వతీ దేవి
ఇంటర్లూడ్స్ గా ఉపయోగించుకున్న పాట: బృందావనమిది అందరిది, నడిరేయి ఏ ఝాములో, తెరతీయరా
 
లలిత గీతాల రాజ్యమేలుతున్న రోజుల్లో రాజేశ్వరరావు - రావు బాల సరస్వతి దేవి కలిసి పాడిన పాటలకు విపరీతమైన ఆదరణ ఉండేది. 1942లో ప్రైవేట్ రికార్డ్ గా రిలీజైన 'తుమ్మెదా ఒక్కసారి మోమెత్తి చూడమని' పాటను అదే పనిగా పాడుకునేవారు సంగీతాభిమానులు. 'డాక్టర్ చక్రవర్తి' సినిమాలో ఆ లలిత గీతాన్ని కాసేపు ఆలపించి ఆ పాటపై తనకు గల మక్కువను హాస్యనటుడు పద్మనాభం చాటుకున్నాడు కూడా! ఈ 'చల్లగాలిలో' ఆల్బమ్ లోని రావు బాలసరస్వతి దేవి పాడిన 'పాడమను తుమ్మెదా' పాటను వింటున్నపుడు, మధ్య మధ్య రాజేశ్వరరావుగారి 'తుమ్మెదా ఒకసారి' పాట ఆ యుగళ గళంలోనే కలిసినప్పుడు, వీరిద్దరి యుగళ గీతాలకు ఆనాడు అంతటి క్రేజ్ ఎందుకు ఉండేదో అర్థం అవుతుంది. పాడడం ప్రాక్టీసు తప్పినా, ఇంత వయసు వచ్చినా - రావు బాల సరస్వతి దేవి - ఒకే ఒక టేక్ లో పాడగలగటం ఓ ప్రత్యేకమయిన విశేషం. ముఖ్యంగా మొదటి చరణంలో - సవరించు గళంలో సరిగమే పాటగా - దగ్గర వేరొకరెవరైనా అయితే తారాస్థాయికి వెళ్ళిపోయి తమ ధాటిని చూపించేవారు. అలా చేయకుండా - మంద్రంలోనే ఆ తారాస్థాయిని తలపింపచేయటం బాల సరస్వతి దేవి ప్రత్యేకత.
 
(3) పల్లవి: మరువలేనిది మరులు గొలిపే మధురగానమిది
రచన : సాయికృష్ణ యాచేంద్ర
గానం: శ్రీమతి పి.సుశీల
ఇంటర్లూడ్స్ గా ఉపయోగించుకున్న పాటలు: పాడమని నన్నడగవలెనా, పాడవేల రాధికా, ఔనా నిజమేనా
 
రాజేశ్వరరావు గారు స్వరపరచి పాడిన 'కలగంటి కలగంటి కనుల రేకుల వంటి' లలిత గీతం కూడా ఆ రోజుల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఉదాహరణకు 'రాము' సినిమాలో జమున ఈ పాటను కాస్సేపు ఆలపించినట్లు చిత్రీకరించారు కూడా! 'చల్లగాలిలో' ఆల్బం ఆవిష్కరణకు విచ్చేసిన అతిథుల్లో ఒకరైన జమున గారికి అవన్నీ గుర్తుకొచ్చాయేమో మౌనంగా ఆ పాటను పాడేసుకుంటూ కనిపించారందరికీ. అటువంటి 'కలగంటి' పాటను కలగలుపుకుంటూ సింగీతం వారు స్వరపరచిన 'మరువలేనిది మరులు గొలిపే మధురగానమిది' పాటను పాడిన శ్రీమతి పి.సుశీల కూడా అంతటి తాదాత్మ్యతను అనుభవించి పాడారనిపిస్తుంది. ముఖ్యంగా రెండవ చరణంలో 'అమరులతో కూడి అలా...పన' అంటూ ట్యూన్ కి తనదైన ఎక్స్ ప్రెషన్ తో జీవం పోశారామో.
 
(4) పల్లవి: నీ పెదవి కదిలేను తీయని స్వరములుగా
రచన: మల్లాది సచ్చిదానంద మూర్తి
గానం : సింగీతం శ్రీనివాసరావు
ఇంటర్లూడ్స్ గా ఉపయోగించుకున్న పాటలు: పాలకడలిపై, నీ చెలిమీ నేడె కోరితిని, పిలిచిన బిగువటరా
 
ఆల్బమ్ లో నాల్గవ పాటగా వినిపించే 'నీ పెదవీ కదిలేను' పాట వినీ వినగానే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే బావుందనిపించడానికి కారణం - ఆ పాట కళ్యాణి రాగంపై ఆధారపడి ఉండడమా లేక స్వరకర్త సింగీతం వారే పాడడమా అన్నది ఓ పట్టాన తేలని విషయం. ఓ మంచి భావగీతం ఇది అని అనిపించేట్టుగా కుదిరిన ఇంత మంచి ట్యూన్ ని తనకోసం సింగీతం వారు అట్టే పెట్టేసుకున్నారేమోనని కూడా అనిపిస్తుంది - దుర్భద్దితో ఆలోచిస్తే! ఈ పాటలో రాజేశ్వరరావుగారి అలనాటి ప్రసిద్ధ గీతం - 'గాలివానలో ఎటకీ ఒంటిగ' పాటను మధ్యలో కలుసుకోవడం ఒక ఎత్తేతే - ఈ  పాటను మల్లాది సచ్చిదానంద మూర్తిగే స్వయంగా రాసి తనలోని సాహితీ పిపాసను ఆవిష్కరించడం మరొక ఎత్తు.
 
(5) పల్లవి: స్వరములా శరములా
రచన: సింగీతం శ్రీనివాసరావు
గానం : యస్.జానకి
ఇంటర్లూడ్స్ గా ఎంచుకున్న పాటలు: రావోయి చందమామ, కిల కిల నవ్వులు చిలికిన
 
శ్రీమతి యస్. జానకి పాడగా ఈ ఆల్బమ్ లో వినిపించే 'స్వరములా శరములా' పాట మన పంచ ప్రాణాలనూ కైవసం చేసేసుకుంటుంది. రెండవ చరణంలో రచయితగా సింగీతం వెలిబుచ్చిన భావాలు - విదేశీ బాణీలకు కొత్తందాలు సమకూర్చిన రాజేశ్వరరావుగారి ప్రతిభావ్యుత్పత్తులకు - అద్దం పడతాయి. ఈ పాటలో రాజేశ్వరరావు గారు అలనాడు పాడిన 'హాయిగా పాడుదునా' పాటను మధ్య మధ్య కలుపుకున్నారు. ఆ 'కలయిక' ఎంత గొప్పగా కుదిరిందంటే - ఇటువంటి కాంబినేషన్ భవిష్యత్ లో 'ఇక -కలే' అనిపించేటంత స్థాయిలో కుదిరింది. నిజం చెప్పాలంటే - రాజేశ్వరరావుగారి ఆనాటి పాట, జానకి గారి ఈనాటి పాట వేర్వేరు కావు, వారిద్దరూ ఆనాడే ఈ పాటను కలిసి పాడేసి ఉంటారు - అనే భ్రమలో కాస్సేపు మునిగిపోతాం కూడా ! దానికి తోడు జానకి గారి మార్కు నవ్వులు, 'తీయగా' అనే పదాన్ని చక్కర పాకాన్ని చెవికి అందించినంత తియ్యగా పాడడం ఇవన్నీ 'స్వరములా శరములా' పాటను ఎక్కడికో తీసుకు వెళ్ళిపోయాయి.
 
(6)  పల్లవి : హృదయాన తావి చివురించు మోవి
రచన: గొల్లపూడి మారుతీరావు
గానం : ఎం.ఎం. కీరవాణి
ఇంటర్లూడ్స్ గా ఉపయోగించుకున్న పాటలు : నా హృదయంలో నిదురించే చెలీ, ఈ నల్లని రాళ్లలో, ఎచటనుండీ వీచెనో 
 
ఈ పాటను గొల్లపూడి మారుతీరావు రాయడం, కీరవాణి పాడడం అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. కీరవాణిగారికి ఆ పేరుని వారి నాన్నగారు పెట్టడానికి కారణం - రాజేశ్వరరావుగారు 'విప్రనారాయణ' లో స్వరపరచిన 'ఎందుకోయీ తోటమాలీ' పాటకు ఆధారం కీరవాణి రాగం కావటమే! ' ఈ పాటను పాడి నేను ఋణం తీర్చుకున్నాను'' అన్నారు కీరవాణి. 'చల్లగాలిలో' ఆవిష్కరణ సభలో...! ఆయన అలా అన్నప్పుడు 'ఋషి మూలం' తెలిసిన వారందరూ పులకించిపోయారా పద ప్రయోగానికి. ఆ పులకింత కీరవాణి పాడిన విధానంలో కూడా కనిపిస్తుంది. ఇక మారుతీరావుగారు - మమతంపు విరులై, నీ స్వరాలే రాజేస్వరాలై, సంగీతమే సంగతియై (సంగతి అంటే స్నేహం) లాంటి పదప్రయోగాలతో గీత రచయితగా కూడా ఆకట్టుకున్నారు.
 
(7) పల్లవి : గాలి పరిమళించిందిలే
రచన: భువనచంద్ర
గానం : వాణీ జయరాం
ఇంటర్లూడ్స్ గా ఉపయోగించిన పాటలు : నీవు లేక వీణ, హలో హలో ఓ అమ్మాయి, అందాల బొమ్మతొఓ ఆటాడవా
 
రాజేశ్వరరావుగారు పాడిన 'నావను నడిపే నవయువకా' పాటను కలుపుకుంటూ వాణీ జయరాం గళ మాధుర్యంతో సాగిన ఈ పాట కూడా యస్.జానకి గారు ఈ ఆల్బమ్ లో పాడిన 'స్వరములా శరములా' పాటంత చక్కగా కుదిరిపోయింది.
 
(8) పల్లవి : మళ్లీ ఒకసారి మళ్ళీ ఒకసారి
రచన: 'సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఇంటర్లూడ్స్ గా  ఉపయోగించిన పాటలు : ఆకాశ వీధిలో హాయిగా, జగమే మారినది, నీవు రావు నిదుర రాదు
 
శ్రోతలకు రస నైవేద్యపు అనుభూతిని కలిగించడానికి కొన్ని కొన్ని పాటల్ని ఆడియోలో ఆఖర్న ఉంచుతారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రాణ ప్రతిష్ట చేసిన పాట ఆ అనుభూతిని సంపూర్ణంగా అందించడమే కాకుండా మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తుంది కూడా! చరణాల మధ్యలో వచ్చే 'వీస్తున్న చిరుగాలిలోనా' దగ్గర, 'నీ తీరు నీ దారిలోనా'  దగ్గర బాలూ రాగాలాపన చేసిన పద్ధతి రాజేశ్వరరావు గారి శైలిని తలపింప చేయడమే కాదు మనల్ని మైమరిచేట్టు చేస్తుంది కూడా! ఈ పాటలో రాజేశ్వరరావుగారు పాడిన 'పాట పాడుమా కృష్ణా' పాటను అత్యద్భుతంగా కలుపుకున్నారు. ఇక రచయితగా సీతారామశాస్త్రి - వేటూరి తర్వాత స్థానం నాదే - అని ఇక్కడ కూడా నిరూపించుకున్నారు. ' నా పుట్టుకే పాంచజన్యం - దాన్ని పూరించితే జన్మధన్యం' ' అనికో వనికో పయనం ఎటకో', 'మళ్ళించు పాదాలదారీ - గిరిధారీ' లాంటి ప్రయోగాలు అందుకు సాక్ష్యాలుగా నిలబడతాయి.
 
ఇలా అణువణువుగా రాజేశ్వరరావుగారు మనకు అందించిన 'ఆ పాత మధురాలను' మన చేత మళ్ళీ మరోసారి ఆస్వాదింపచేసేలా తయారైన 'చల్లగాలిలో' ఆడియో ఆల్బమ్ కొనియాడతగ్గది, కొని దాచుకోదగ్గదీ మాత్రమే కాదు, దొరకక పోతే దోచుకోతగ్గది కూడా! ఈ ఆల్బమ్ చెన్నైకి చెందిన కళాతపస్వి క్రియేషన్స్ (ఫోన్ 044-22491939) ద్వారా విడుదలైంది.