ఇవాళ తెలుగు సినీ ప్రేక్షకులకీ, శ్రోతలకీ పరిచయం అవసరం లేని పేరు - రామజోగయ్య శాస్త్రి. అందుకే మొదటి సినిమా ఏంటి, ఎన్ని పాటలు రాశారు లాంటి ప్రశ్నలు కాకుండా తన మనసుని ఆవిష్కరించే అవకాశం వచ్చేలా ప్రయత్నం చెయ్యమన్నారాయన. ఉపోద్ఘాతాలు, విద్యుద్ఘాతాలు భరించే స్థితిలో ఎవ్వరూ లేరు కాబట్టి డైరెక్ట్ గా ఇంటర్ వ్యూ పేరుతో చేసిన ఆయన ఇన్నర్ వ్యూ లోకే వెళిపోదాం :
"రాయడం లో మిమ్మల్ని ఇబ్బంది పాటలేవైనా వున్నాయా ? "
" నీ చూపులే నా ఊపిరి (ఎందుకంటే ప్రేమంట), పంజా టైటిల్ సాంగ్, తప్పెట్లోయ్ తాళాలోయ్ ( శుభప్రదం) , జులాయ్ టైటిల్ సాంగ్ ... ఇవీ అని పర్టిక్యులర్ గా చెప్పలేం గాని సడన్ గా తట్టినవి మాత్రం ఇవే ..."
" మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పాయింట్లు ఏవున్నాయి ఈ పాటల్లో ?"
"ఎందుకంటే ప్రేమంట సినిమాలో నాలుగు పాటలు రాశాను. ఆఖర్న రాసిన పాటఇదే. ఎందుకంటే ..."
" ప్రేమంట .. రవికిశోర్ గారంటే ... మీకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత కదా!?"
"ఆ గౌరవం ఎప్పుడూ వుంటుంది. ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే - పాటలో ఒక డివినిటీ వుండాలన్నారు. పైగా డైరెక్టర్ కరుణాకర్ తను ఆ పాటని ఎలా తీయాలనుకుంటున్నాడో విజువల్ గా ఓ పిక్చర్ నా మైండ్ లో క్రియేట్ చేసేశాడు. అంచేత రెగ్యులర్ డ్యూయెట్ లా కాకుండా - ఆ పరంగా అలోచిస్తున్నాను. ఈ సినిమా ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీశారు కాబట్టి తమిళ రైటర్ 'నాముత్తుకుమార్' వచ్చి రెండు రోజుల్లో మొత్తం పాటలన్నీ రాసేసి వెళ్ళిపోయాడని తెలిసింది. దాంతో నేను లేట్ చేస్తున్నానన్న ఫీలింగ్ తో ఇబ్బంది పడిపోయాను.
ఇక 'పంజా ' టైటిల్ సాంగ్ ... పంజా అనే పదాన్ని రకరకాల పద్ధతుల్లో వాడుతూ రాయాలి. పవన్ కళ్యాణ్ రేంజ్ లో వుండాలి. మనం చెప్పాలనుకున్నది ఎలా చెప్పినా, ఏం చెప్పినా అది తిరిగి పంజాలోకి రావాలి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపోవాలి. అందుకే
ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తు పల్లం లేనేలేని రాదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైన తుదివరకు ఎదురీత సాగాలిగా
అంటూ ఓ రచయితగా చెప్పినా - ఆ తర్వాత ముందు చెప్పిన స్కీమ్ ప్రకారం - అవకాశం ఇచ్చిన వారికి ఏది కావాలో తెలుసుకుని ఇలా రాశాను.
అడుగడుగూ అలజడిగా
నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే
ఎదిరించే గుణమేగా పంజా...
అలాగే 'శుభప్రదం' లో 'తప్పెట్లోయ్ తాళాలోయ్' పాట. విశ్వనాథ్ గారితో మొదటి అవకాశం. కృష్ణాష్టమి కి అందరూ కలిసి పాడుకునే పాట అన్నారు. కృష్ణుడి మీద ఎన్నో పాటలు వచ్చాయి. కొత్తగా చెప్పాలి. విశ్వనాథ్ గారికి శివుడంటే ఇష్టం. శివకేశవుల పరంగా అటు శివుణ్ణి, ఇటు కృష్ణుణ్ణి కలిపి చెబుదామనిపించింది. ఆయనకు మూడో కన్ను . ఈయనకు నెమలి కన్ను. ఆయనకు ప్రమథ గణాలు. ఈయనకు గోపకాంతలు. ఆయనది ఓం కారం. ఈయనది మురళీ గానం. ఆయనది శివతాండవం. ఈయన తాండవ కృష్ణుడు.
తలపైన కన్నున్న ముక్కంటి తానేగా
శివమూర్తి శిఖిపింఛ మౌళి
ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా
తన మోవి మురళీ స్వరాళి
భవుని మేని ధూళి తలపించదా వన మధూళి
ప్రమథగణ విరాగి యదు కాంతలకు ప్రియ విరాళి
ఝణన ఝణన పదయుగళమై జతపడే
శివకేశవాభేదకేళి
అంటూ ఇవన్నీ ఇలా పాటలో పెట్టేసరికి కొత్తదనం వచ్చేసి, విశ్వనాథ్ గారి అమోద ముద్ర పడింది.
ఇక 'జులాయి' టైటిల్ సాంగ్ ... పైకి కనిపించే విషయాన్ని బట్టి లెక్క
లేసేసుకోకూడదు అన్నదే పాట కాన్సెప్ట్. ఒకమ్మాయి సాయంత్రం బైటికెళుతుంది. తెల్లవారు జామున నిద్ర కళ్ళతో కారు దిగుతుంది. ఇప్పుడంటే అలవాటుపడిపోయారు గాని ఒక్కప్పుడు ఇరుగు పొరుగు చెవులు కొరుక్కునేవారు. కుటుంబాన్ని పోషించడం కోసం ఆ అమ్మాయి రాత్రంతా నిద్ర మేలుకుని అమెరికన్ బేస్డ్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్నట్టు ఎంతమందికి తెలుస్తుంది ? అందుకే ....
పై లుక్కు చూసి లెక్కలేస్తె తప్పన్నాయ్
నన్ను ఆరా తియ్యడాలు మానెయ్యన్నాయ్
అని రాశాను. అలాగే భవిష్యత్తులో ఎవరు ఏమౌతారో ఎవరికి తెలుస్తుంది అని చెప్పడానికి
టెంత్ ఫెయిల్ టెండూల్కర్ క్రికెట్ మాస్టరయిపోలేదా
పేపర్ బాయ్ టు ప్రెసిడెంటు అబ్దుల్ కలాము కథ వినలేదా
ఎవడి ఫేటు ఏటవుద్దొ జాంతానై
అది తేల్చాలంటే నువు సరిపోవన్నాయ్
ఇలా రాయడానికి కాన్సెప్ట్ పరంగా మైండ్ లో వున్న పాయింట్లకి ఎటువంటి భాష వాడాలి ... అది కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవాలంటే పాత్రకి ఎటువంటి యాటిట్యూడ్ వుండాలి . దీనికోసం మధన పడుతుండగా నేనెప్పుడో విన్న 'యావనికి గొత్తు' (ఎవరికి తెలుసు) అనే కన్నడ పాట గుర్తొచ్చింది. వెంటనే యాటిట్యూడ్ ఫిక్స్ అయిపోయింది . ఆ యావనికి గొత్తు లోంచి 'నేనేడ పుడితె నీకేటన్నాయ్ ?' పుట్టేసింది. ఆ యాటిట్యూడ్ ప్రకారం ఆ శైలికి తగ్గ భాషలో మొత్తం పాట వచ్చేసింది.
మీరు ఇబ్బంది అనగానే ఇప్పటికిప్పుడు మనసులో జరిగిన తర్జన భర్జన తో కూడిన మధనాల్ని కొన్నిటిని చెప్పానే గాని - నిజానికి ఇవసలు ఇబ్బందులే కావు. తీయని సవాళ్ళు. వీటిని అధిగమించడంలోనే ఆనందం వుంది."
" సరే ... ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ డిస్కషన్ లోకి వచ్చేద్దాం . కాయితం మీద పెన్ను పెట్టగానే అతి సులువుగా వచ్చేసిన పాట ?"
"నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా (గోపి గోపిక గోదావరి)"
" ప్రస్తుత పరిస్థితుల్లో పాటలు రాయడానికి కొత్త రచయితలొస్తే వారికి భవిష్యత్తు వుంటుందా ?"
" పని పట్ల శ్రద్ధ, భక్తి, ఆసక్తి - పాటకి పెట్టగలిగినంత శక్తి వుంటే - కలిసి రావడంలో ఓ నాలుగు రోజులు అటూ ఇటూ అయినా - నమ్ముకున్నది ఎప్పుడూ కూడు పెడుతుంది "
" ఇన్ని వున్నా అర్హత వుండాల్సిన అవసరం లేదంటారా ? "
" మనకున్న ఆసక్తే అసలైన అర్హత. అది బలంగా వున్నప్పుడు అనుగ్రహం కలిగి తీరుతుంది. కాకపోతే దాన్ని గుర్తుపట్టగలగాలి "
( చదివే వారికి ఈ విషయం మరింత వివరంగా అర్ధమవడానికి రామజోగయ్య గారి జీవితాన్నే ఉదాహరణ గా చెప్పుకోవాలి. పాటలు పాడడానికి ఇండస్ట్రీ కి రావాలనుకున్నారు. కాకపోతే సరస్వతీ దేవి అనుగ్రహం పాట పట్ల ఆయనకున్న ఆసక్తినే రచయితగా రూపొందేట్టు చేసింది . అది సకాలంలో గుర్తుపట్టారు కనుక రచయితగా మారి విజయాన్ని సాధించారు)
" అది సరే .. మీ పాటల రచయితల మధ్య పాలిటిక్స్ వున్నాయా ?"
" పాలిటిక్సూ లేవు... ట్రిక్సూ లేవు. రచయిత అన్నవాడికి మెచ్యూరిటీ వుంటుంది. అది వేరే రకంగా ఆలోచించనివ్వదు. లేకపోతే మనసు డామేజి అవుతుందే తప్ప ఇంకే ప్రయోజనమూ లేదు. ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిది. ఎంతమంది వచ్చినా ఇంకొకడికి చోటు వుంటూనే వుంటుంది. అంచేత కాంపిటీషనూ లేదు. మరొక రకమైన పిటిషనూ లేదు. కేవలం పార్టిసిపేషనే ..."
" పాట రాసే ముందు 'సాయి ప్రసాదం' అని రాసి మొదలు పెడుతూంటారు మీరు. ఎప్పట్నించో అలవాటుగా వస్తున్నదా లేక అలా రాస్తే పాట హిట్టవుతుందన్న నమ్మకమా ?"
" నేను చేస్తున్న ప్రతీ పనీ ఆ సాయినాధుడే నా చేత చేయిస్తున్నాడని నా నమ్మకం. అందుకే నేను కట్టుకున్న ఇంటికి కూడా 'సాయి ప్రసాదం' అని పేరు పెట్టుకున్నాను."
" మీకిష్టమైన సంగీత దర్శకుడెవరు ?"
" మంచి పాట పుట్టాలంటే - బై డి ఫాల్ట్ - ప్రతి పాటనీ ప్రేమించాలి. అలా ప్రతి పాట మీదా అనురాగం పెంచుకునేవాడికి రాగద్వేషాలుండవు. తద్వారా ఒక సంగీత దర్శకుడంటే ఇష్టం, ఇంకొకరంటే అయిష్టం లాంటివి వుండవు. "
" పాడాలనుకుని వచ్చేరు కదా ... ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సాంగ్ అవకాశం వస్తే పాడతారా ? "
" తప్పకుండా పాడతాను "
" ఇంతకు ముందు ఏ పాటలోనైనా లైట్ గా గొంతు కలిపిన సందర్భాలు వున్నాయా?"
"దూకుడు లో ' అదర అదర' పాటలోని రెండు చరణాల బిగినింగ్స్ లోనూ వినిపించేది నా వాయిసే"
"డాన్ శీను టైటిల్ సాంగ్ లో కూడా మీ వాయిస్ వుంది కదా ?"
"ఉంది గానీ చాలా తక్కువ ... గుర్తుపట్టడం కష్టం"
" కింగ్ సినిమా లో నటించారు కూడా ?"
"శ్రీను వైట్ల తో నాకున్న రిలేషన్ తో అది తప్పలేదు. "
" అటు నువ్వే ఇటు నువ్వే ( కరెంట్) - పాతోస్,
నువ్వక్కడుంటే ( గో. గో. గో) - మెలొడీ,
సదా శివా సన్యాసీ ( ఖలేజా) - భక్తి,
పువ్వాయ్ పువ్వాయ్ (దూకుడు) - ఐటమ్,
అమ్మా లేదు నాన్నా లేడు (ఏక్ నిరంజన్) - ఫిలాసఫీ,
పాపారాయుడు (జల్సా) నాగాధినాగుని (బెండప్పారావు) - కామెడీ;
గబ్బర్ సింగ్ , బిల్లా , జులాయి టైటిల్ సాంగ్స్ - హీరో ఇంట్రడక్షన్ ...
ఇలా ఇన్ని రకాలు గా రాయడం వెనక 'ఆల్ రౌండర్' ని అనిపించుకోవాలన్న కోరిక బలంగా వున్నట్టుంది ?"
" ఇండస్ట్రీ కి కావలసిన అన్ని రకాల పాటల్నీ అందించగల పరిస్థితిలో నేను వుండాలనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగా అవకాశాలు కూడా వస్తున్నాయి. మీలాంటి వారు అది గుర్తుపట్టి అడిగినందుకు ఆనందంగా వుంది. కాకపోతే నేను టచ్ చెయ్యాల్సిన జానర్స్ ఇంకో రెండు మూడు వున్నాయని నా నమ్మకం. అందులో ఇటీవల నేను గమనించిన జానర్ - సంస్క్ర్ తం లో 'అగ్నిస్ఖలన సందిగ్ధరిపు ' లాంటిది రాయగలగడం. అందుకు నేను బాగా కృషి చెయ్యవలిసి వుంది. తప్పకుండా చేస్తాను. "
రాజా (మ్యూజికాలజిస్ట్)