This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
 à°œà±à°žà°¾à°ªà°•à°¾à°²à± .. సంతకాలు .. మధ్య ..

  

మొన్నామధ్య అన్నిటికీ తానే అయిన రమణ గారు
నిన్నీమధ్య తనలో సగమైన తన భార్య
ఇప్పటికిప్పుడు మన మధ్య నుంచి ఏకంగా తనే .... !!!
అందుకే అన్నారొకాయన -
బాపు వెంట్ టు మీట్ హిజ్ బెటర్ హాఫ్
అండ్ బెస్ట్ హాఫ్ - అని
మరొకాయన
బాపు మరణించలేదు ... రమణించారు
అని.
బాపు - రమణ ఓ ద్వంద్వ సమాసం ..
కాదు
నిర్ద్వంద్వ సమాసం,
ఇంకా లోతుగా చెప్పాలంటే
ఓ ద్వ్యర్ధి కావ్యం ...
మన సాహిత్యంలో
రాఘవ పాండవీయం ద్వ్యర్ధి కావ్యం
దాన్ని ఓ వైపు నుంచి చదివితే రామాయణం
మరో వైపు నుంచి చదివితే భారతం
అలా
తెలుగుదనాన్ని, తెలుగు ధనాన్ని
బొమ్మల్లో చూస్తే బాపు
అక్షరాలుగా చదివితే రమణ
నిజానికి బాపు అసలు పేరు
సత్తిరాజు లక్ష్మీనారాయణ కాదు...
ముళ్ళపూడి వెంకట రమణ ...
భగవంతుని దయవల్ల, à°Šà°¹ ( సినిమా హీరో శ్రీకాంత్ భార్య కాదు) తెలిసినప్పట్నించీ ఆరాధించి అభిమానించే బాపు రమణల గారితో పరిచయం, ఫోన్ చేసి మాట్లాడగల చనువు, కలిసి కాస్సేపు ముచ్చటించుకోగల అదృష్టం, ఏదైనా  à°…à°¡à°— గలిగే సాహసం కలిగాయి. à°“ సారి ఆయనకిష్టం లేని ఓప్రపోజల్ తీసుకొస్తే 'నన్ను మీ ఫ్రెండ్ అనుకుంటే దయచేసి బలవంతం చెయ్యకండి' అన్నారు బాపు. ఆయన తిరస్కరించారన్న బాధ కన్నా ఫ్రెండ్ అన్నందుకు జన్మ తరించిపోయింది అనుకున్నాను. ఇంకోసారి బాపు గారు మరో విషయంలో కోపంగా వున్నారని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితిలో రమణ గారికి ఫోన్ చేశాను. 'హీ ఈజ్ బైటింగ్ హిజ్ ఓన్ టీత్ ( వాడి పళ్ళు వాడే కొరుక్కుంటున్నాడు) . కాస్సేపాగితే మామూలై పోతాడు. మీరు ఫోన్ చేశారని చెప్తాలెండి' అన్నారు రమణ గారు చిన్నగా నవ్వుతూ.
మరోసారి - à°ˆ టీవీలో బాపు రమణల అపూర్వ సృష్టి ' భాగవతం' మొదలైంది. ఫస్ట్ ఎపిసోడ్ కే పులకించిపోయాను. ఉండబట్టలేక ఫోన్ చేశాను. ఆయన సంగతి అందరికీ తెలిసినదేగా ...  'థాంక్సండీ ...వుంటానండీ ... అబ్బే అంతలేదండీ... అంతా à°† దేవుడే చేయించుకుంటున్నాడండీ.. మన్దేముందండీ' అంటూ వీలైనంత త్వరగా పొగడ్తలనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారాయన. 'సార్సార్ ... ఒక్క నిముషం.. ప్లీజ్' అంటూ ఆయన్ని ఆపి ' టైటిల్స్ వస్తుంటే జనం సాష్టాంగ నమస్కారాలు చేసేశారండీ' అన్నాను. 'అయ్యో .. అదేంటండీ' అన్నారు బాపు. 'దర్శకత్వం బాపు అని వచ్చాక - దర్శక పర్యవేక్షణ సుమన్ - అని రాకుండా దేవుడికి మొక్కేసుకున్నారటండీ' అని అన్నాను (అప్పట్లో à°Žà°‚à°¤ గొప్ప వ్యక్తి దర్శకత్వం వహించినా à°† తర్వాత దర్శకత్వ పర్యవేక్షణ సుమన్ అనే టైటిల్ కార్డ్ వచ్చేది à°ˆ టీవీలో). వెంటనే చాలా పెద్దగా à°“ నవ్వు వినిపించింది. నా అనుభవంలో బాపు గారు à°…à°‚à°¤ బిగ్గరగా నవ్వినట్టు దాఖలాలు లేవు. 'ఎవ్వరికీ చెప్పుకోలేని జోక్ వేశారండీ' అన్నారు బాపు నవ్వి నవ్వి అలసిపోయి. అందర్నీ తన కార్టూన్ లతో నవ్వించే బాపు గార్ని నవ్వించిన భాగ్యం నాకు దక్కిందని తెగ మురిసిపోయానారోజు.
 'బాపు-రమణ వారిద్దరూ ఒకరికొకరు. అలా ఇద్దరూ ఏకాంతంగా ఎన్నాళ్ళయినా ఉండిపోగలరు. థర్డ్ పర్సన్ ఈజ్ క్రౌడ్ ఫర్ దెమ్' అని అన్నానొకసారి. 'ఏవన్నారూ ?'  అని మరోసారి చెప్పించుకుని 'అదేం లేదు లెండి' అంటూ మనస్ఫూర్తిగా నవ్వేశారు బాపు. నిజానికి అందరూ అలా అనుకుంటారు గానీ మనసుకి నచ్చితే ఫోన్ చేసి మరీ మాట్లాడతారాయన. అలాగే ఓసారి ఫోన్ చేసి 'నేను బాపునండీ' అన్నారు. ఇటీజ్ à°Ž ప్లెజెంట్ సర్ ప్రైజ్. 'చిన్న  అవసరం పడిందండీ ... తెలుగు సినిమాలో ఇప్పటి వరకూ నారదుడు పాడిన పాటల లిస్ట్ ఇవ్వగలరా ?' అని అడిగారు. ' తప్పకుండా ఇస్తానండీ' అన్నాను తేరుకుంటూ. మర్నాడు నేను పంపిన లిస్ట్ చూసి మళ్ళీ ఫోన్ చేశారు 'చాలా వర్క్ చేశారండీ' అంటూ.


నేను ఎడిటర్ గా తీసుకువచ్చిన 'హాసం' పక్ష పత్రిక అంటే ఆయనకీ, రమణ గారికీ ఎంతో ఇష్టం. ఈటీవీ భాగవతం తర్వాత రమణ గారు చాలా కాలం ఏమీ రాయలేదు. కానీ నేను అడగ్గానే రెండు ఆర్టికిల్స్ రాసి సంపాదకుడిగా నన్నొక ఎత్తున నిలబెట్టారు . అలాగే బాపు గారు ... 'హాసం' ని మెచ్చుకుంటూ రామాయణంని 12 బొమ్మల రూపంలో రేఖా వర్ణ చిత్రాలు గా చిత్రీకరించి, కాఫీ మగ్ ల మీద ప్రింట్ చేయించి ఇంటికి పంపారు. ఇవాళ్టికీ వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను.
బాపు గారిలో ఒక భక్తుడూ ఉన్నాడు, ఒక అభ్యుదయవాదీ ఉన్నాడు. ముప్పాళ రంగనాయకమ్మ 'రామాయణ విష వృక్షం' పుస్తకాన్ని రాసి కవర్ పేజీ బాపు గారు వేస్తే బాగుంటుందని, పేమెంట్ కూడా ముందే ఇస్తే ఇంకా బాగుంటుందని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపారు. బాపు గారు ఆ డిమాండ్ డ్రాఫ్ట్ వెనక 'శ్రీరామ శ్రీరామ' అంటూ అస్సలు ఖాళీ లేకుండా రాసి వెనక్కి తిప్పి పంపించారు - 'ఈ పని నేను చెయ్యను' అని చెప్పీ చెప్పకుండా చెబుతూ.
ఇంకోసారి ఓ ఆలయం యొక్క గాలిగోపురం పునర్నిర్మాణ సమయంలో అక్కడకు వచ్చిన పీఠాధిపతి 'ఇందులో ఓ అంతస్థు భారం నువ్వు మోస్తున్నావు' అన్నారు ఇళయరాజాతో. 'ఇది నా భాగ్యం' అన్నారు ఇళయరాజా. ఆ భారం, భాగ్యం ఖరీదు ముప్ఫై అయిదు లక్షలు.
అలాగే ఆ పీఠాధిపతి మరొక పీఠాధిపతి ని - మన మధ్య నడయాడే దేవుడిగా - వర్ణిస్తూ రాసిన ఓ ఉద్గ్రంధం ముఖచిత్రం బాపు గార్ని వెయ్యమని కోరారు. బాపు గారు అంగీకరించారు.
ఇళయరాజా డబ్బు కూడదీసుకుని ఇవ్వడానికి వెళితే ఆయన్ని à°† గుడిలో అడ్డుకున్నారు - నువ్వు హరిజనుడవని ఎందుకు చెప్పలేదు - అంటూ. à°ˆ విషయం ఇళయరాజా ఎక్కడా చెప్పుకోలేదు. అయినా బాపు గారికి తెలిసింది. వెంటనే à°† పీఠాధిపతులకు ఉత్తరం రాశారు. 'వేదాలు, ఉపనిషత్తులు వెలసిన దేశం మనది. ఆదిశంకరాచార్యుల వారికి ఛండాలునితో తత్త్వబోధ చేయించిన పుణ్యభూమి మనది. అందరికీ అన్నీ చెందాలని గుడి గోపురం ఎక్కి మంత్రాలు ఘోషించిన సంస్కారం మనది. à°’à°• మహామనిషిని - నువ్వు ఫలానా కదా - అని వెలివేసిన - మీ నడయాడే దేవుణ్ణి - అంగీకరించడానికి నా మనసు అంగీకరించడం లేదు. నా రాతలు మీ మనసుని నొప్పించి వుంటే  మీ సంస్కారం నన్ను మన్నించగలదని ఆశిస్తున్నాను' అంటూ à°† ముఖచిత్రం వెయ్యనని మళ్ళీ చెప్పీ చెప్పకుండా చెప్పారు.
బాపు రమణలది ఎవ్వరినీ నొప్పించే తత్త్వం కాదు. బాపు గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు బాధపడని వారంటూ ఎవరూ లేరు. ఆయనకి ఫోన్ చేసి ' చాలా బాధగా వుందండీ ... మీకిప్పుడివ్వడమేంటండీ' అన్నాను. 'దాన్దేముందండీ ... వాళ్ళకెప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తారు' అన్నారాయన. 'అదికాద్సార్ ... రెఫ్యూజ్ చేస్తే మీ విలువేంటో తెలుస్తుంది  కదా వాళ్ళకి' అన్నాను గుండె మండిపోతుంటే. 'అలా చేస్తే బాధపడరూ ? పైగా అది ప్రభుత్వం కదా ... వాళ్ళకిప్పుడు ఇవ్వాలనిపించింది. ఇచ్చారు. వెళ్ళి తీసుకుంటేనే మనకి విలువ. ఎవరికెప్పుడు à°Žà°‚à°¤ ప్రాప్తమో అంతే' అన్నారు బాపు నెమ్మదిగా, మృదువుగా, అనునయంగా - à°“ తండ్రి తన కొడుక్కి నచ్చచెప్పినట్టు, à°“ గురువు తప్పుగా ఆలోచిస్తున్న శిష్యుడికి జ్ఞానోపదేశం చేస్తున్నట్టు. అదీ బాపు గారి సంస్కారం.


'మీ బొమ్మలున్న పోష్టర్లు ఇంట్లోను, ఆఫీస్ లో నా క్యాబిన్ లోను పెట్టుకోవాలని వుందండీ' అంటూ సలహా కోసం ఫోన్ చేశానోసారి. ' ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గిరైతే బ్రహ్మ కడిగిన పాదము పోష్టర్ పెద్ద సైజ్ లో ఫ్రేమ్ తో అయితే బావుంటుంది. ఇక క్యాబిన్ అయితే మీరు ఫ్లూట్ వాయించేవాణ్ణి అని చెప్పారు కదూ ... '
( 'హాసం' నడిపే రోజుల్లో పాటలకు, రాగాలకు సంబంధించిన చిన్న చర్చ వచ్చినప్పుడు - కాలేజీ రోజుల్లో మిడి మిడి జ్ఞానంతో ఫ్లూట్ వాయించే వాణ్ణి - అని ఆయనతో చెప్పినట్టు జ్ఞాపకం. అది ఆయన గుర్తుపెట్టుకున్నందుకు గుండె ఝల్లుమంది ఒక్కసారిగా...)

               
                                                                                                    'ఫ్లూట్ వాయిస్తున్న వెంకటేశ్వరుడు, చుట్టూ వాగ్గేయకారులు ఉన్న పోష్టర్ అయితే బావుంటుంది . గంధం ప్రసాద్ à°•à°¿ నేను చెప్పానని చెప్పండి (ఈయన విజయవాడలో వుంటారు. బాపు బొమ్మల పోష్టర్లన్నీ రకరకాల సైజుల్లో ఈయన దగ్గరుంటాయి). చక్కగా పీవీసీ పైప్ లో పెట్టి పంపిస్తాడు' అన్నారు. నిలువెల్ల పరవశించిపోయానా ఆప్యాయతకి, à°† పర్సనల్ టచ్ à°•à°¿.
ఇలా ఎన్నో జ్ఞాపకాలు ...
తడియారని సంతకాలు ...
గుండె తడిని తడుముతునే ఉన్నాయి, ఉంటాయి కూడా ...
మచ్చుకి ఇవి కొన్ని మాత్రమే ...
 
బాపు రమణ ఉన్న కాలంలో పుట్టడం ఒక అదృష్టం అయితే - వారితో పరిచయం కలగడం, కొన్ని అనుభవాలు పంచుకోగలగడం జన్మ జన్మల పుణ్యఫలం. ఏ జన్మ పుణ్యమో ఈ జన్మకిది చాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే వారిద్దరూ అవతరించిన కాలంలో వుంటేనే దానికో విలువ, సార్థకత.
 
రాజా (మ్యూజికాలజిస్ట్)