This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 జాతీయ గీతం కాదిది ...  అయినా  ...

శిరసు వంచి నమస్కరించ వలసిన జాతి గీతమిది.
కొత్తవి ఏం వచ్చాయని నెట్ లో వెతుకుతుంటే ఆర్. నారాయణ మూర్తి 'నిర్భయ భారతం' లో పాటలు కనిపించాయి. విప్లవ గీతాలే అయివుంటాయని పల్లవులు ఏమిటి, సింగర్లు ఎవరు అని చెక్ చేస్తుంటే నా అభిమాన గాయకుల్లో ఒకడైన మధు బాలకృష్ణన్ పేరు కనిపించింది. వినే దాకా మనసాగ లేదు. విన్న తర్వాత ఉద్వేగం ఆగలేదు. విపరీతమైన స్పందన...   భారతీయ వివాహ వ్యవస్థ, భారతీయ సంప్రదాయం, మన భాష, సంస్కృతి, వాటి పరమార్ధం అన్నీ కంటి ముందు సాక్షాత్కరించి ఆనంద తాండవం చేస్తున్నట్టు అనిపించింది.   రాసిన జొన్నవిత్తుల సత్కవి, విద్వత్కవి,  సకారణ జన్ముడు అనిపించింది. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెప లాడుతున్న మన సంప్రదాయ సంగీతజ్యోతిని ఓ కాపు కాయడానికి తన రెండు చేతులూ అడ్డుపెట్టిన ఆ మహామనీషికి ....అనే 'శంకరాభరణం' డైలాగు గుర్తొచ్చింది. 'శుభము సుఖము' అనే పల్లవితో మొదలయ్యే ఆ 'కావ్యగీతం' లో కొన్ని పదాలు గమనించండి :
 
శుభము సుఖము
సృష్టికి మూలము
శృంగారమే మోక్షము
ధర్మ శృంగారమే మోక్షము
 
పాలవట్టమున లింగం
(పానవట్టమున లింగం)
సృష్టికిదే తొలి రంగం
ఆనంద రస తారంగమిది
కాకూడదు బహిరంగం
ధర్మ సాధనం శరీరం
అంగాంగం అతి పవిత్రం
ఆత్మలు రెండు అంకితమైతే
అపుడు కావాలి పరస్పరం
(అపుడు కలవాలి పరస్పరం)
వేద మంత్రముల వేల దీవెనల
మధుర బంధమే వివాహం
తరతరాలుగా విశ్వసించి ఇది
సాగుతోంది జన సమూహం
శుభము సుఖము
సృష్టికి మూలము
శృంగారమే మోక్షము
ధర్మ శృంగారమే మోక్షము
 
.........  ........ .........
 
ఈ వాక్యాలలో దేనికదే అమృతతుల్యం ...
 
' శీలం చెడిపోయిన అహల్య' అని రాయాల్సిన చోట 'మౌని భార్య మర్యాద చెడి' అని రాశారు దేవులపల్లి 'ఏమి రామ కథ శబరీ శబరీ' (భక్త శబరి) పాటలో... మళ్ళీ అంత గొప్ప సంస్కారం కనిపించింది - జొన్నవిత్తుల వాడిన 'ధర్మ శృంగారం' అనే మాటలో ...
ఇవి కాక  ....
మన సంప్రదాయంలో చెప్పుకునే - క్షేత్రబీజ న్యాయానికి - సమర్ధింపుగా - 'రాజయోగం లో సాగే ప్రేమే మన సంస్కృతి' - అనే వాక్యాన్ని జత చెయ్యడం ఎంత గొప్పగా వుందో చెప్పలేను.
 
అలాగే
ఆ జీవులలో నరజీవి -  విజ్ఞానానికి సంజీవి /  మంచి చెడులను ఎంచి చూసి - నిర్మించెను వివాహ సంస్కృతి / తప్పు ఒప్పులకు తానొక  హద్దయి -  నిలిచెను వివాహ రీతి / ఆ వివాహ బంధమె పూలపానుపై - జరగాలి ఈ శోభనం / సుఖశాంతులతో సూర్యకాంతి వలె - ప్రభవించాలి భావి తరం.
 
ఇవీ ఈ పాటలో - మన మెదళ్ళ మొదళ్ళను దుక్కిలా దున్నుతూ - జొన్నవిత్తుల నాటిన విత్తనాలు.
 
ఇవాళ  వివాహం మీద శోభనం మీద రాయమంటే   చాలామంది  ఎలా రెచ్చిపోయి రాస్తారో మనం వేరే చెప్పక్కర్లేదు. (శృంగారం, బూతు ఎక్కువగా వుండాలని మ్యూజిక్ సిట్టింగ్స్ లో అడుగుతారే తప్ప 'ఇలా రాయండి' అని రచయితలకి సూచించరు.  ద్వంద్వార్ధాలు, కొన్ని చోట్ల ఏకార్ధాలు - ఈ తెలివితేటలు, మాటల సరఫరా అన్నీ రచయితల (నై) పుణ్యమే తప్ప ఒత్తిడి తెచ్చే వారి పాండిత్యం కాదని అనిపిస్తూ వుంటుంది. కిక్కు చాలకపోతే మందు డోసు పెంచినట్టు వారిని తృప్తి పరచడానికి ఘాటు పెంచుతూ వుంటారు. ఇవి నా అభిప్రాయాలు)
 
మరి 'నిర్భయ భారతం' అనే టైటిల్ తో వున్న సినిమాలో రాయాలంటే ఆ సినీ కవి కి ఎంత సామాజిక బాధ్యత వుండాలి ? మన సంస్కృతి, సంప్రదాయాల గురించి లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించాలంటే అతడి విజ్ఞానం స్థాయి ఎంత ఉన్నతంగా వుండాలి ? పురాణాలు, ఆచారాలు గురించి ఎంత విశేషంగా కృషి చేసి వుండాలి ? ఒకవేళ పాట గురించి చర్చించాల్సి వస్తే - వాదనా  పటిమకి వెన్నుదన్నుగా నిలిచే నిరంతర సాహిత్య విజ్ఞాన మధనం ఎంతగా జరిగుండాలి ?  పాట రాయడానికి వారం పది రోజుల ముందో, లేక ఓ నెల రోజుల ముందో పుస్తకాలు తిరగేస్తే పుట్టే పదాలతో పొదిగిన వాక్యాలలో  ఇంతటి ప్రాణశక్తి  వుంటుందా ?
 
వుండదు అని నిరూపించారు జొన్నవిత్తుల. భగవంతుడు మేలు చేసి అన్ని అవార్డుల కమీటీలలోనూ విలువల విలువను తెలిసున్నవారు వుండాలని కోరుకుందాం.
 
ఇక ఈ పాట వింటుంటే కొన్ని సందేహాలు కలిగాయి. పానవట్టం కి బదులు పాలవట్టం అనడం, సంప్రదాయంకి బదులు సాంప్రదాయం అనడం లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టాయి. "ఏంటి జొన్నవిత్తుల గారూ ... మీరు కూడా ఇలారాయడం ఏమిటి ?" అని అడగాలనుకుని ఫోన్ చేశాను.
 
ఈ పాట గురించి, నా స్పందన గురించి ఎంతో ఆనందిస్తూ, ఆ తరువాత - పాటలోని సాహిత్యం పై మాట్లాడుతూ నేనడగాలనుకున్న ప్రశ్నలకి అడగకుండానే సమాధానమిచ్చేశారాయన.
 
"ఇందులో 'అపుడు కలవాలి పరస్పరం' అని నేను రాస్తే - మార్పు ఎక్కడ ఎలా జరిగిందో 'అపుడు కావాలి పరస్పరం' అని పాడేరు. అలాగే 'పాన వట్టం' కి బదులు 'పాల వట్టం' అని, 'సంప్రదాయం' కి బదులు 'సాంప్రదాయం' అని పాడేరు. నేను ఇవి రికార్డ్ చేసిన ఇంజనీర్ రాధాకృష్ణ, ఆర్. నారాయణ మూర్తి వీరి దృష్టికి తీసుకువచ్చాను'' మళ్ళీ ఇపుడింత ఖర్చు ఎందుకు?" అనకుండా " అలాగే మార్పిద్దాం" అన్నాడు ఆర్. నారాయణ మూర్తి సహృదయంతో.
 
పాడిన మధు బాలకృష్ణన్ గురించి ఇంజనీర్ రాధాకృష్ణ ఎంక్వయిరీ చేస్తే లండన్ లో ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ లో వున్నట్టు తెలిసింది. అయినా ఎలాగోలా పట్టుకుని మూడు చోట్ల మళ్ళీ మార్చి పాడాలి అని, విషయం చెప్పారు. అతను అంతకన్నా సహృదయంతో తను ఇండియా రాగానే మళ్ళీ పాడి పంపిస్తానన్నాడు. అలాగే అతని స్వస్థలం ట్రివేండ్రం చేరుకోగానే అక్కడి స్టూడియోలో మళ్ళీ పాడి, రికార్డ్ చేసి పంపించాడు.
 
సినిమాలో తప్పుల్లేని, ఈ మారిన వెర్షనే వుంటుంది. అంతేకాదు నేను ఆడియో కంపెనీ వాళ్ళని ఈ వెర్షన్ మరో వెయ్యి సీడీలు వెయ్యమని అడుగుదామనుకుంటున్నాను. దానికయ్యే ఖర్చులు కూడా నేను పెట్టుకోవడానికి సిద్ధం. ఆ సీడీలు తెలుగు భాష మీద ప్రేమ వున్నవాళ్ళకి పంచుతాను.  ఒక నటుడి ముఖం మీద లైటింగ్ సరిగా పడకపోతే మళ్ళీ తీస్తారు. చిన్న తేడా వచ్చినా రీ షూట్ చేస్తారు. పాట లోని అక్షరాలకి మాత్రం అంత విలువివ్వరు. ఒక పదం, ఒక అక్షరం - మన భాష మీద, సంస్కృతి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో అర్ధం చేసుకునే వాళ్ళు అరుదు. అదృష్టవశాత్తూ అటువంటి వాళ్ళందరూ జతపడ్డారు కనుకనే ఈ పాట అటువంటి దోషాల నుండి బైట పడగలిగింది." అని వివరించారు జొన్నవిత్తుల.
 
 
రాజా (మ్యూజికాలజిస్ట్)
 
 
Musicologist Raja
1000 CD la kharchu, Telugu bhaasha meeda prema vunna vaallaki panchaalanukovadam ivanni Jonnavitthula… See More
Sep 6, 2013
1 person
 
Ravi Kanth
నమస్తే సర్,
 
ప్రతి తరం తమ ముందు తరమే ఉత్తమం అనుకోవడంలో, ప్రస్తుతం తమ తరంలోనూ జరుగుతున్న కృషిని, దాగున్న విశిష్టతని గుర్తించడం మృగ్యమైపోతోంది. అలాంటి కలుగుల్లో ఉన్న వాళ్ళ దృష్టికి ఇలాంటి మెచ్చు తునకల్ని వెతికి చూపే సెర్చ్ లైట్ మీరు. సూర్యుడు ఏ క్షణంలోనైనా సగం భూ ప్రపంచానికే వెలుగు ప్రసరించగలడు. మీరు మాత్రం ఏక కాలంలో మొత్తం సినీ సంగీత ప్రపంచాన్ని చుట్టి సంగీతాభిమానుల ముందు పెట్టే దీక్ష కట్టుకున్నారు. 
 
ఇక మీరన్నట్టు జొన్నవిత్తుల వారు కొత్త తరం మెదళ్ళలో నాటుతున్న తెలుగు విత్తులు తెలుగు భాషకు తిరుగులేని కాపు కాయలని కోరుకుంటూ.... 
 
Ravikanth.
Sep 8, 2013
1 person
 
Voleti Srinivasa Bhanu
గొప్ప పాట రాసిన జొన్నవిత్తుల గారికీ, పాట వెనక కథను వెలుగులోకి తెచ్చిన మీకూ అభినందనలు రాజా గారూ.
Sep 7, 2013
1 person
 
Raghavendra Rao Dindigal
chakkani visleshana manchi paata
Sep 8, 2013 · Like
 
Gumma Ramalinga Swamy
OKA PAAATAGURINCHI INTA KUULANKASHAMGAA CACINCI, SARIDIDDI, II ROAJULALOA SINIIMAALU VASTUNNAYANTEA MII ANDARI KRUSHINI ABHINANDINCAALI SUBHAM BHUUYAAT.
Sep 6, 2013
1 person
 
KrishnaRao V Pulugurtha
మంచి పాట, మరో గొప్ప పాట వెనుక ప్రసవ వేదన, పడే పాట రచయిత కెరుక. అది వెలికి తీసిన అసమాన సంగీత పిపాసి రాజా గారికి అభినందన మందార మాల.
Sep 8, 2013
 
Naga Karthik Chintakunta
chala baga cheparu raja garu, and me karchu though 1000 CD'S ni panchutanu ana me samskaraniki vandanam, me artical chadivaka aa pata vinanu chala bagundi.
Sep 6, 2013
 
Sitarama Rao Kodali
nijamgaa yilamtivallu yimka vunnaaraa saarooo! varamdarikee digvijayee bhava!
Sep 6, 2013