ఇప్పుడంటే పత్రికలలో, చానల్స్ లో వచ్చే ఇంటర్వ్యూల వల్ల , సినిమా ప్రమోషన్స్ లో అదొక భాగంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి - తెర వెనుక కళాకారుల్ని వెంటనే గుర్తుపట్టేస్తున్నారు గానీ - ఆ రోజుల్లో ఇంత ప్రాదాన్యత, ప్రాముఖ్యత వుండేవి కావు. అన్నీ ఫ్రెండ్లీ గానే వుండేవి . అలా జరిగినవే దిగువన ఇస్తున్న కొన్ని సంఘటనలు.
'వెలుగునీడలు' లో 'కలకానిది విలువైనది' పాట ఇవాళ్టికీ ఎటువంటి సాహితీ మర్యాదలను అందుకుంటోందో అందరికీ తెలుసు. అక్కినేని రేడియో స్టేషన్ లో పాడుతున్నట్టుగా అభినయించిన ఆ పాటలో ఆర్కెష్ట్రాకు సూచనలిస్తున్నట్టుగా కనిపించేది ఆ చిత్ర సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు.
అలాగే .'పుట్టినిల్లు - మెట్టినిల్లు' చిత్రంలో 'ఇదే పాట ప్రతీ చోటా' పాటలో ఆర్కెష్ట్రాని కండక్ట్ చేసే వ్యక్తిగా నటించింది ఆ చిత్ర సంగీత దర్శకుడు సత్యం. గూడచారి 116 లో 'ఎర్రా బుగ్గల మీద మనసైతే' పాటకు ముందు దేశ విదేశాలలో సంగీత ప్రక్రియల గురించి చెప్పే వ్యక్తిగా ఆ చిత్ర సంగీత దర్శకుడు టి. చలపతి రావు నటించారు.
తమిళ చిత్రం 'సర్వర్ సుందరం' తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయి విజయవంతమైంది. ఆ చిత్రంలోని ' అవళ్ క్కెన్న' (తెలుగు డబ్బింగ్ లో 'నవయువతీ చక్కని ప్రియ నవయువతి') అనే పాటలో గాయకుడు సౌందర్రాజన్, సంగీత దర్శకుడుఎమ్మెస్ విశ్వనాథం కనిపిస్తారు. విచిత్రం ఏమిటంటే అది తమిళ ప్రింట్ కావడం తో తెరపై సౌందర్రాజన్ కనిపిస్తారు. తెలుగు డబ్బింగ్ కావడంతో ఆ పాట ఘంటసాల వాయిస్ తో వినిపిస్తుంది.
ఓ రకంగా సౌందర్రాజన్ కి ఘంటసాల ప్లేబ్యాక్ పాడినట్టు అన్నమాట. ఈ విషయాన్ని ఏదైనా క్విజ్ ప్రోగ్రామ్స్ లో వాడుకోవచ్చు.