ఏయన్నార్ షీల్డ్ ని సముద్రంలో విసిరేశారాయన
నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇచ్చింది ఏయన్నార్ అని తెలిసి కూడా ఆ షీల్డ్ ని సముద్రంలో విసిరేసిన వ్యక్తి వేరెవరో కాదు. ప్రముఖ నిర్మాత డి.ఎల్. నారాయణ.
ఏయన్నార్ తో ’దేవదాసు’ తీసిన డి.ఎల్. నారాయణ. ఏయన్నార్ ని అప్యాయంగా ’చిరంజీవీ’ అని పిలిచే ఏకైక నిర్మాత ... డి.ఎల్. నారాయణ. డబ్బులు తక్కువైనప్పుడల్లా ’చిరంజీవీ నీ దగ్గరెంతుంది ?’ అని ఏయన్నార్ జేబులో్ చెయ్యి పెట్టి వెయ్యో, రెండు వేలో, అయిదు వేలో, పది వేలో ఎంతుంటే అంత తీసేసుకోగల చనువున్న నిర్మాత డి.ఎల్.నారాయణ.
అటువంటి డి.ఎల్., ఏయన్నార్ ఇచ్చిన షీల్డ్ ని మద్రాస్ సముద్రంలో విసిరెయ్యడానికి కారణం ఏమిటి ?
కారణం వెనుకనున్న కథ కన్నా వ్యధ పెద్దది. ’దేవదాసు’ విజయం తర్వాత డి.ఎల్. ’చిరంజీవులు’ సినిమాని ప్లాన్ చేసి ఏయన్నార్ ని అప్రోచ్ అయ్యారు. ’దేవదాసు ద్వారా నాగేశ్వరరావుకి బ్రేక్ ఇచ్చాను. తిరుగులేని లైఫ్ ని ఇచ్చాను. నేనేది అడిగినా కాదనడు’ అనే నమ్మకం ఆయనది. కానీ ఏయన్నార్ ఆలోచనలు అందుకు భిన్నంగా వున్నాయి.
’చిరంజీవులు’ పాత్రలు ’దేవదాసు’ పాత్రలను పోలి వున్నాయి. హీరో హీరోయిన్లు చిన్నప్పట్నించీ ప్రేమించుకుంటారు. పెళ్ళి చేసుకోలేక పోతారు. హీరోయిన్ తన కన్నా వయసులో చాలా పెద్ద అయిన మరొకణ్ణి చేసుకుంటుంది. దేవదాసు లో హీరో తాగుడికి బానిస అవుతాడు. చిరంజీవులు లో హీరోకి కళ్ళు పోతాయి. చివరికి హీరో హీరోయిన్ల కథ విషాందాంతమే అవుతుంది. అదీ కాక ఒకే సంస్థ నుంచి తక్కువ వ్యవధి తో వచ్చిన రెండు సినిమాల్నీ ప్రేక్షకులు కంపేర్ చేసుకుంటారు. పై కారణాల వల్ల నిరాకరిస్తారు.
అదీ కాక, నటుడికి కొంత గుర్తింపు వచ్చాక పాత్రల ఎంపిక పట్ల రెస్పాన్సిబుల్ గా వుండాలి. తన పట్ల తన నటన పట్ల ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఏర్పడతాయి కాబట్టి ఆ అంచనాలు దెబ్బతినకుండా బాధ్యతాయుతంగా వుండాలి. అదే సమయంలో లైఫ్ నిచ్చిన నిర్మాత పట్ల కృతజ్నతతో కూడా
వుండాలి. అది ఎంతవరకూ ? ఆయనకు ఎంత వరకైనా తోడ్పడవచ్చు ... ధనరూపంలో కూడా ... కానీ కెరీర్ నే ఫణంగా పెడితే పూర్తిగా నామరూపాల్లేకుండా పోవచ్చు. అప్పుడు మనకి మనం ద్రోహం చేసుకున్నవాళ్ళం అవడమే కాకుండా ఎవరికీ సహాయం చేసే పరిస్థితి కూడా వుండదు’ ఇదీ ఏయన్నార్ విశ్లేషణ.
అంచేత డి.ఎల్. ఇచ్చిన ప్రపోజల్ ని కాదన్నారాయన. డి.ఎల్. కి అదొక షాక్. జీవితంలో ఏయన్నార్ తన మాట కాదనరని, ఆయన తన ప్రాపర్టీ అని అనుకున్నారాయన. కానీ ఏయన్నార్ కి కూడా వ్యక్తిత్వం వుంటుందని, ఆయనకి కూడా తన జీవితం పట్ల కొన్ని ప్లాన్స్, అవగాహన వుంటాయని ఊహించలేకపోయారు. దాంతో ఆయన అహం దెబ్బ తిన్నది.
వెంటనే ఎన్.టి.ఆర్., జమున కాంబినేషన్ తో ’చిరంజీవులు’ తీశారు. ఆ చిత్రం మేధావుల ప్రశంసలనందుకుంది. కానీ సామాన్యులకు చేరువ కాలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఏయన్నార్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయింది. డి.ఎల్. అహం మళ్ళీ దెబ్బ తిన్నది. కొన్నాళ్ళ తర్వాత ’కన్యాశుల్కం’ ప్లాన్ చేసి మళ్ళీ ఏయన్నార్ దగ్గరికి వెళ్ళారు. ’చూపులో శృంగారం, మాటల్లో లౌక్యం రెండూ ఏక కాలంలో నీలో పలుకుతాయి. గిరీశం పాత్రకి నువ్వే కరెక్ట్’ అన్నారు.
ఈ ఆర్గ్యుమెంట్ కి ఏయన్నార్ కన్విన్స్ అవుతారని అనుకున్నారు. కానీ గిరీశం పాత్ర పట్ల ఏయన్నార్ దృష్టికోణం వేరు. ’పాత్ర హీరోయే కావచ్చు. కానీ ఇందులో నెగిటివ్ టచ్ ఎక్కువగా వుంది. కుటిలత్వం పాళ్ళు కూడా ఎక్కువున్నాయి. తప్పు దారి పట్టిన వాడు మారిన పాత్ర వేరు. చివరి వరకు కుటిలత్వం వుండడం వేరు. నా కెరీర్ కి ఇది మంచిది కాదు’ అన్నారు. డి.ఎ.ల్. కి మళ్ళీ షాక్. తను కొడుకు అని అనుకున్న మనిషి తనకే బోధిస్తుంటే తట్టుకోలేని మానసిక స్థితి ..
కోపంతో వెళ్ళి మళ్ళీ ఎన్.టి.ఆర్. తోనే తీశారు. తిరిగి అదే పరిస్థితి. ప్రశంసలైతే లభించాయి. బాక్సాఫీస్ దగ్గిర మాత్రం లాభించలేదు.
డి.ఎల్. గారు బాగా ఫీలవుతున్నారని తెలిసి తర్వాత ఆయన తీసిన ’దొంగల్లో దొర’ సినిమాలో నటించారు ఏయన్నార్. అది ఓ మోస్తరుగా పోయింది. ఏ విధంగాను సంపూర్ణ సంతృప్తి ని ఎవ్వరికీ ఇవ్వలేకపోయింది. అందువల్ల డి.ఎల్. కోపం చల్లారలేదు.
’దొంగల్లో దొర’ సినిమా తన 60 వ సినిమా కావడంతొ తన సినీ జీవిత వ్రజ్రోత్సవాన్ని ప్లాన్ చేశారు ఏయన్నార్. ఆ వజ్రోత్సవంలో లో తనను ఇన్నాళ్ళూ ప్రొత్సహించిననిర్మాతలందర్నీ కృతజ్నతా పూర్వకంగా సన్మానించారు ఏయన్నార్. ఆ సన్మానంలో భాగంగా అందిరికీ షీల్డ్ లను ప్రతి నిర్మాతకీ ఇచ్చారు ఏయన్నార్. సభామర్యాద కోసం షీల్డ్ ని అందుకున్నారే గానీ ఏయన్నార్ పై కోపం చల్లారకపోవడంతో అదే రోజు రాత్రి ఆ షీల్డ్ ని తీసుకేళ్ళి సముద్రంలో విసిరేశారు డ్.ఎల్.
అంతేకాదు ఏయన్నార్ తను తీసిన ’దేవదాసు’ సినిమా హక్కులను డిస్ట్రిబ్యూటర్ల వద్ద కొన్నారని తెలిసి , తన దగ్గరున్న శరత్ ’దేవదాసు’ నవల హక్కులను సూపర్ స్టార్ కృష్ణ కి అమ్మేసి మళ్ళీ తియ్యమని ప్రోత్సహించారు కూడా. ఏయన్నార్ పై డి.ఎల్. పెట్టుకున్న ఆ కోపం అంతా ఆయన జీవితాంతం కొనసాగింది.