రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ’దేవత’ సినిమా విజయ దుందుభి మ్రోగిస్తున్న రోజులవి. ఆ సినిమా గురించి ఓ విమర్శకుడు తన సమీక్షలో ఆ పాటలోఅన్ని బిందెలు అక్కడికెలా వచ్చాయో దర్శకుడికే తెలియాలి’ అని రాశాడు - 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా' పాటని దృష్టిలో పెట్టుకుని.
తర్వాత జరిగిన ఓ ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ లనుద్దేశించి మీలో ఎంతమంది ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు? అని అడిగారు రాఘవేంద్రరావు. కొంతమంది చేతులెత్తారు ప్రేమించామంటూ.
మరి మీ భార్యతో పెళ్ళి కాక ముందు గాని, పెళ్ళయిన తర్వాత గాని డ్యూయెట్స్ ఎప్పుడైనా పాడుకున్నారా? అని అడిగారు రాఘవేంద్రరావు.
అబ్బే ...రియల్ లైఫ్ లో డ్యూయెట్స్ ఎక్కడుంటాయండీ? అన్నారు జర్నలిస్ట్ లు.
ఉండవని తెలిసి కూడా సినిమాల్లో డ్యూయెట్స్ ని యాక్సెప్ట్ చేసిన మీరు మరి బిందెలు అవీ కనబడితే ఎందుకు బాధ పడిపోతారయ్యా? పైగా నేను అక్కడ బిందెల్ని అకారణంగా పెట్టలేదే ... అంతకు ముందు సీన్లో శ్రీదేవి పట్టుకున్న బిందె జారి చెరువులో పడిపోతుంది. ఆ నీటి అలలకి బిందె అటూ ఇటూ ఊగుతుంటే దాన్ని లీడ్ గా కట్ చేసి ఆ అమ్మాయి నడుం అటూ ఇటూ ఊగుతున్నట్టుగా ఓపెన్ చేసి చూపించాను. అలా ఆ బిందెలకి అంత థాట్ ప్రాసెస్ వర్క్ అయింది. అన్ని బిందెలు ఎలా వచ్చాయో దర్శకుడికే తెలియాలి అని రాసే బదులు అసలు సినిమాల్లో డ్యూయెట్స్ ఏమిటి, నిజ జీవితంలో వుండవు కదా అని రాసి వుంటే బావుండేది కదా? అన్నారు రాఘవేంద్ర రావు.
దాంతో అక్కడున్న వారంతా గప్ చుప్...
అదీసంగతి.