This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 

 
అన్నపూర్ణా పిక్చర్స్ వారు ’చదువుకున్న అమ్మాయిలు’ సినిమా ప్లాన్ చేసుకుంటున్న రోజులవి. అంతవరకూ వారి సినిమాలన్నీ విజయ వారి స్టూడియోలోనే నిర్మించేవారు. సరిగ్గా అదే సమయానికి ఆ స్టూడియో లో కార్మికుల సమ్మె మొదలయింది. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు గారు హైదరాబాద్ వచ్చి సారథీ స్టూడియో ఎలా వుందో, తమకు అనువుగా వుంటుందో, ఉండదో ఇవన్నీ స్వయంగా వచ్చి చూసుకుని ఓకే చెప్పేశారు. ఇంతలో అక్కడ సమ్మె విరమణ జరిగింది. విజయా అధినేత నాగిరెడ్డి గారు స్వయంగా అడిగారు - స్ట్రయిక్ కాలాఫ్ అయింది కాబట్టి ... మీ సినిమా ఇక్కడే మొదలు పెట్టుకోవచ్చు కదా ?- అని.  కానీ మధుసూదన రావు గారు నిక్కచ్చి మనిషి.  ఒకసారి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరు. అంచేత సౌమ్యంగానే ’సారీ’ చెప్పేశారు. అలా అక్కినేని సినిమాల నిర్మాణం హైదరాబాద్ లో ఊపందుకుంది.  
 
తర్వాత్తర్వాత ఏయన్నార్ నిర్మాతలందరూ హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లోనే తమ సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. ఒకవిధంగా అక్కినేనికి, సారథీ స్టూడియోస్ కి మధ్య బంధం రోజు రోజుకీ మరింత బలపడసాగింది. ఈలోగా హార్ట్ ఆపరేషన్ కోసం అక్కినేని అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. 
 
అంతకుముందు ’అందారాముడు’ షూటింగ్ లో ఒక అబ్బాయి గోదార్లో పడిపోతే రక్షించే సీన్ లో నటిస్తుండగా ఈదుతున్నప్పుడు చిన్న ఎగశ్వాస వచ్చిందాయనకి. ’ఇదేమిటి ... ఇలా ఎప్పూడూ జరగలేదే ?’ అనుకుంటూ షూటింగ్ నుంచి వచ్చాక ఫ్యామిలీ డాక్టర్ కి చూపించుకున్నారు. ’మీరు బుగ్గలు నున్నగా వుండాలని మీగడ తినేవారు. అది కలోష్ట్రల్ గా మారి ఉంటుంది. ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చెకప్ చేయించుకోండి’ అని సలహా ఇచ్చారాయన.
 
ఆ తర్వాత కొన్ని నెలలకి స్నేహితులతో ప్లెజర్ ట్రిప్ లా విదేశాలకు వెళ్ళినప్పుడు అమెరికాలో చెకప్ చేయించుకున్నారు అక్కినేని. ’ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చెయ్యాలి. అసలిప్పటి వరకూ మీరు బ్రతికుండడమే గ్రేట్’ అని అన్నారక్కడి డాక్టర్లు. ’ఇప్పటికిప్పుడంటే ఎలా ? నా భార్య నా పక్కన వుండాలి. నా పిల్లలు చిన్నవాళ్ళు.  నాకున్న ఫైనాన్షియల్ కమిట్ మెంట్స్, ఎక్కడినుంచి ఎంత రావాలి, ఎవరెవరికెంతంత ఇవ్వాలి అన్నీ నేను నా భార్యకి చెప్పాలి. ఎలాగోలా జస్ట్ ఓ రెండు మూడు రోజులు పోస్ట్ పోన్ చెయ్యండి’ అని అక్కడి డాక్టర్లని ఒప్పించి ఇండియా నుంచి అన్నపూర్ణ గారిని రప్పించుకుని, అప్పుడు ఉన్న మినిస్టర్స్ ని కన్విన్స్ చేసి , ఆపరేషన్ కి అవసరమయ్యే ఫారిన్ ఎక్స్ చేంజ్ ని సమకూర్చుకుని - ఆపరేషన్ కి సిద్దపడ్డారు అక్కినేని. అప్పట్లో ఒపెన్ హార్ట్ సర్జరీ ఇప్పుడున్నంతగా డెవలెప్ కాలేదు. చాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ.
 
ఇదిలా వుండగా సరిగ్గా అదే సమయానికి కృష్ణ నటించిన ’దేవదాసు’ రిలీజ్ కి రెడీ అయింది. తనకు అజరామర కీర్తినిచ్చిన వినోదా వారి ’దేవదాసు’ హక్కులను అంతకు ముందెప్పుడో కొని తన దగ్గరే పెట్టుకున్నారు అక్కినేని. కాకపోతే ఆ హక్కులను అక్కినేని కొందరు భాగస్వాములతో కలిసి నెలకొల్పిన ’అన్నపూర్ణా పిక్చర్స్’ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా కొనడం వల్ల.  ఆ సంస్థలో మిగిలిన భాగ స్వాములంతా కలిపి ఏయన్నార్ ’దేవదాసు’ ని కూడా అప్పుడే విడుదల చెయ్యాలన్న నిర్ణయం తీసుకున్నారు. ’మనది బ్లాక్ అండ్ వైట్ సినిమా, పాత సినిమా. వాళ్ళది కొత్త సినిమా, కలర్ సినిమా , పైగా లేటెస్ట్ టెక్నాలజీ తో రిలీజవుతోంది. వాళ్ళది రెగ్యులర్ సినిమా. మనం మార్నింగ్ షోలు గానే రిలీజ్ చేస్తున్నాం.’ అని అమెరికాలో వున్న అక్కినేనితో ఫోన్ లో మాట్లాడి కన్విన్స్ చేశారు. అసలే ఓపెన్ హార్ట్ సర్జరీ, చాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ. మరో వైపు ఫారిన్ ఎక్స్ చేంజ్ కి పర్మిషన్లు. ఇన్ని టెన్షన్ల మధ్య ’సరే ... మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి’ ఫోన్ పెట్టేశారు అక్కినేని. 
 
అక్కడ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక్కడ మార్నింగ్ షోలు గా రిలీజ్ చేసినా అక్కినేని ’దేవదాసు’ హిట్ అయి నూరు రోజులు ఆడింది, ఇది తెలుగు సినీ చరిత్ర లోనే ఒక అద్భుతం. ఈ ప్రభంజనంలో కృష్ణ ’దేవదాసు’ నిరాశ పరిచింది.  సారథీ స్టూడియోస్ వారు కృష్ణ ’దేవదాసు’ కి పార్టనర్స్.  ఈ షాక్ ని సీరియస్ గా తీసుకున్నారు. తమ సినిమా పై పోటీగా తన సినిమాని ఏయన్నార్ కావాలనే రిలీజ్ చేయించారని భావించారు. ఇకపై అక్కినేని సినిమాలకు తమ స్టూడియోని ఇవ్వరాదని నిశ్చయించారు
 
మళ్ళీ అక్కడ - ఆపరేషన్ తర్వాత కొంత యాక్టివిటీ వుండడం మంచిది కాబట్టి కొన్నాళ్ళ వరకూ స్టెప్పులు, స్టంట్ లు లేని పాత్రలైతే చెయ్యొచ్చని పర్మిషన్ ఇచ్చారు డాక్టర్లు. అంజలీ ప్రొడక్షన్ వారు ఎప్పట్నుంచో ’క్షేత్రయ్య’ సినిమా చెయ్యమని అడుగుతున్నారు. ఆ పాత్ర అయితే స్టెప్పులు, స్టంట్ లు వుండవని ఓకే అన్నారు అక్కినేని. తీరా ఇండియా వచ్చాక సారథీ స్టూడియోస్ వారి నిర్ణయం  తెలిసింది . ఆవేశం తో గుండె రగిలిపోయింది. తిరిగి మద్రాసుకి వెళ్ళిపోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి. ఒక విధంగా అది ఓటమే. కాని ఓటమిని అంగీకరించడం అక్కినేనికి చేతకాని పని.
 
వెంటనే కన్నడ సార్వభౌమ డా. రాజ్ కుమార్ తో మాట్లాడి ఆయన స్వంత  స్టూడియో చాముండేశ్వరి స్టూడియోలో ’క్షేత్రయ్య’ షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటువైపు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  డాక్టర్లు ఏ ఒత్తిళ్ళకు దూరంగా వుండమన్నారో వాటన్నిటినీ ఎదుర్కొని, తట్టుకుని మొత్తానికిఅటు ’క్షేత్రయ్య’ సినిమాని, ఇటు అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణాన్ని పూర్తి చేశారు అక్కినేని. అప్పుడే ’జీవితంలో ఇక సారథీ స్టూడియోస్ లో ఆడుగు పెట్టను' అన్న కఠినాతి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారాయన.
 
దాదాపు 30-35సంవత్సరాలు గడిచిపోయాయి.
 
అక్కినేని హైదరాబాద్  వచ్చాక చాలా మంది జర్నలిస్ట్ లు ఆయనకు దగ్గరయ్యారు. అందులో ఒక జర్నలిస్ట్ తను పని చేస్తున్న చానల్ కోసం అక్కినేని సినీజీవితానికి్ సంబంధించి పరిశోధన చేసి 74 ఎపిసోడ్ లు గా రూపొందించాడు.  దాంతో అతనంటే అక్కినేని ప్రత్యేకమైన అభిమానం ఏర్పదింది. అతణ్ణి ఆల్మోస్ట్ తమ కుటుంబ సభ్యుడిలాగే చూసుకున్నారు. ఏ విషయమైనా అతనితోనే పంచుకునేవారు.
 
ఇంతలో ఆ చానల్ నిర్వహించే ఒ మ్యూజిక్ షో ఫైనల్స్ కి అక్కినేని చేత అవార్డ్ ఇప్పిస్తే గౌరవంగా వుంటుందని భావించి, ఆ బాధ్యతని ఆ జర్నలిస్ట్ కి అప్పజెప్పారు. అతడు అడిగిన వెంటనే ఓకే చేసేసి, ’ఇంతకీ వెన్యూ ఎక్కడ ?’ అని అడిగారు అక్కినేని. ’సారథీ స్టూడియో’ అని జవాబిచ్చాడా జర్నలిస్ట్. షాక్ తిన్నారు అక్కినేని. ’నేనా స్టూడియోలో అడుగుపెట్టనని మీకు తెలుసు కదా ? ’ అన్నారు. ’మీ మధ్య గొడవ గురించి తెలుసు గానీ మీ డెసిషన్ గురించి తెలియదు’ అన్నాడా జర్నలిస్ట్.  ఓ అయిదు నిముషాల పాటు ఏం మాట్లాడలేదాయన. ’రేపు ఫోన్ చెయ్యండి’ అనేసి లోపలికి వెళ్ళిపోయారు. ఆయన ఎంత ఆలోచించి వుంటారో మర్నాటికి గాని తెలియలేదు.
 
మర్నాడు ఆ జర్నలిస్ట్ కి ఇచ్చిన టైమ్ కి ముందే తనంతట తానే ఫోన్ చేసి ’ నేను వస్తున్నాను. ఇప్పటి దాకా నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే మార్చుకోనేలేదు.  మీ కోసమ్ ... కేవలం మీ కోసం ... నా నిర్ణయాన్ని సడలించుకుంటున్నాను’ అని అన్నారు అక్కినేని. కళ్ళంట నీళ్ళు తిరిగాయి ఆ జర్నలిస్ట్ కి. జీవితంలో ఎన్నో మిట్టపల్లాలు చూసిన వ్యక్తి, భారత దేశం గర్వించ దగ్గ నటుడు, ప్రతిష్టాత్మక మైన అవార్డు లన్నిటినీ పొందిన కళాకారుడు తన కోసం ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడమా ? ’ నిజంగా ఇది మీరు నాకు మాత్రమే ఇచ్చిన అవకాశం లాంటి వరం’ అన్నాడా జర్నలిస్ట్ ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.
 
అతని కన్నా ఎక్కువగా ఆశ్చర్యానికి గురయ్యింది సారథీ స్టూడియోస్ వారు. అన్నేళ్ళ తరువాత అక్కినేని తమ స్టూడియోలో కాలు పెట్టిన ఆ రోజున ఘనమైన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. అక్కడి స్టాఫ్ లో కొందరైతే ఆయనకి పాదాభివందనాలు చేశారు కూడా.