దర్శకుడిగా దాసరి విజృంభణ తీవ్రస్థాయిలో వున్న రోజులవి. ఆయన దర్శకత్వంలో నటించడానికి సన్నిహిత వర్గాల ద్వారా అగ్రనటులిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అక్కినేని తన అభిమాన నటుడు కావడంతో ఆయనతో ఓ సినిమా ప్లాన్ చేశారు దాసరి. అదే - దేవదాసు మళ్ళీ పుట్టాడు.
పాత దేవదాసు లో పార్వతి పాత్ర చనిపోయిందో బ్రతికుందో క్లియర్ గా చూపించక పోవడం అనే పాయింట్ ని తెలివిగా పట్టుకున్నారు దాసరి. సావిత్రి తరువాత అంతటి నటిగా వాణిశ్రీ కి పేరు రావడం, ఆమె చంద్రముఖి పాత్రకి సరిపోతుందనుకోవడం, అలనాటి పార్వతి- సావిత్రి ఇంకా ఇండస్ట్రీలోనే వుండడం వీటన్నిటినీ కలుపుకుని ఓ కథగా తయారుచేసి అక్కినేనిని కలిశారు. ఈ పాయింట్లన్నీ నచ్చాయి ఏయన్నార్ కి. వెంటనే ఓకే చెప్పేశారు. సినిమాగా ఆ ప్రయోగాన్ని సామాన్య జనం ఆదరించకపోయినా విజ్ఞులందరూ హర్షించారు. అక్కినేని కూడా ఆ అపజయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత అక్కినేని-దాసరి కాంబినేషన్ లో మంచి మంచి సినిమాలు వచ్చాయి. అందులో మేఘసందేశం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే , ప్రేమాభిషేకం కలెక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ ని సృష్టించింది.
డైలాగులతో సహా పూర్తి బౌండ్ స్క్రిప్ట్ వుంటేనే గానీ సినిమాకి ఓకే చెప్పని అక్కినేని- సెట్స్ పై షూటింగ్ కి ముందు అప్పటికప్పుడు డైలాగులు రాసే దాసరి పద్ధతిని అంగీకరించేవారు. అంతేకాదు అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై కొన్ని సినిమాలకు దాసరినే దర్శకుడిగా పెట్టుకున్నారు కూడా. అలాగే దాసరి తన స్వంత సినిమాలను అన్నపూర్ణా స్టూడియోస్ లోనే తీసేవారు.
ఈలోగా అన్నపూర్ణా స్టూడియోస్ పతాకం పై దాసరి దర్శకత్వంలో వచ్చిన 'యువరాజు' చిత్రం ఘొరంగా ఫెయిల్ అయింది. అక్కినేని మనసు చివుక్కుమంది. తరువాత దాసరి దర్శకత్వంలో ఆయన నటించినా అవి వేరే నిర్మాతల చిత్రాలు. అన్నపూర్ణా స్టూడియోస్ వారివి కావు. ఇదిలా వుండగా అన్నపూర్ణా స్టూడియోస్ లో దాసరి నిర్మించిన ఇతర చిత్రాల పేమెంట్ కొంత బకాయి వుండిపోయింది. అది చెల్లించమంటూ వారు లెటర్ పంపారు. ఆ విషయంపై దాసరి మనసు చివుక్కుమంది. 'అన్నపూర్ణా స్టూడియోస్ ఎన్నో హిట్స్ ఇచ్చాను. వారి సినిమాలకు ఖర్చు తగ్గించడానికి హోటల్ కి కూడా పోకుండా స్టూడియో బైటే మంచం వేసుకుని పడుకున్నాను. అటువంటిది నాకే లెటర్ పంపుతారా ?' అని బాధ పడ్దారు.
ఆ టైమ్ లోనే ఓ సినిమా ఫంక్షన్ లో అక్కినేని, దాసరి కలవాల్సి వచ్చింది. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మర్యాద పూర్వకంగా చేయి చాచారు అక్కినేని. మనసులో బాధ వుండడం వల్ల ఆ చేయి అందుకోకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయారు దాసరి. దీన్ని చాలా అవమానంగా తీసుకున్నారు అక్కినేని.
తర్వాత ఎంక్వయిరీ చేస్తే లెటర్ సంగతి తెలిసింది అక్కినేనికి. 'స్టూడియో నడుపుకోమని అంతా పిల్లలకి ఇచ్చేశాక అన్నీ నాకు తెలిసే జరుగుతాయని ఎలా అనుకుంటారు ? వాళ్ళ డే టు డే ఎఫైర్స్ నేను చూడడటం లేదు. ఒకవేళ ఆ లెటర్ కే ఆయన ఫీలయివుంటే నాతో ఫోన్లోనైనా మాట్లాడి వుండొచ్చుగా !? పబ్లిక్ గా నన్ను అలా అవమానించాలా ? నా వయసేమిటి ... ఆయన వయసేమిటి ? ' అంటూ మరింత సీరియస్ అయ్యారు అక్కినేని.
ఇక్కడో విషయం చెప్పాలి. దాసరి భోళా శంకరుడు. కోపం ఎంత త్వరగా వస్తుందో ఎవరైనా పొగిడితే అంత త్వరగా ఉబ్బిపోయి ఎదుటి వారి తాహతుని మించిన సహాయాలు చేసేస్తూ వుంటారు. అక్కినేనికి మాత్రం కోపం వస్తే అంత త్వరగా మరిచిపోలేరు. 'ధర్మదాత' సినిమాలో 'ఎవ్వడికోసం ఎవడున్నాడు' పాటలో - మిన్ను విరిగి పైబడినా గాని అవమానాన్ని సహించనురా - అని రాసినట్టు పంతానికి పోతే ఇక అంతే ... ! వెనక్కి తిరిగి చూడరు. ఆ పంతం తోనే అన్నపూర్ణా స్టూడియోని కట్టారు. ఆ కథ మరోసారి చెప్పుకుందాం. ఇక ఈ కథ లోకి వస్తే - జీవితంలో దాసరి గారిని కలవకూడదని నిశ్చయించుకున్నారాయన. దాసరి ఉన్న ఫంక్షన్స్ కి తను రానని అందరికీ చెప్పేవారు. కొత్తవారెవరైనా అహ్వానిస్తే ఫంక్షన్ కి ఎవరెవరు వస్తున్నారో తెలుసుకునేవారు. దాసరి పేరు వినిపించినా, కనిపించినా ఆ ఫంక్షన్ కి వీలయినంత వరకూ అటెండ్ అయ్యేవారు కాదు.
హితులు, సన్నిహితులు, పరిశ్రమలో ఆ ఇద్దరినీ గౌరవించేవారు - ఎంతగానో ప్రయత్నించారు సయోధ్య కుదర్చడానికి. 'ఈ విషయం మీదే అయితే ... ఐయామ్ సారీ ... మీరు రానవసరం లేదు' అని మరోమాట లేకుండా ఖరాఖండిగా తేల్చి చెప్పేసేవారు అక్కినేని. జీవితంలో ఎన్నో మిట్ట పల్లాలను చూసి, ఇంకెన్నెన్నో చేదు అనుభవాలను చవి చూసి, ఎవరూ అధిరోహించనన్ని శిఖరాలను అందుకున్న అక్కినేనిని ఆనాటి ఆ సంఘటన మాత్రం ఎంతో తీవ్రంగా కలచివేసింది. ఎన్నో ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడ్డ ఆయన గుండె ఈ అవమానాన్ని తట్టుకోలేక పోయింది. పంతంతో ఇంత కఠినాతికఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటే తప్ప నిలబడలేక పోయింది. ఈ విషయాలను ఆయన - తనకు దగ్గర అనుకునే వాళ్ళతో - పంచుకునేటప్పుడు అతి తీవ్రంగా స్పందించేవారు. ఆ సమయంలో ఆయన్ని చూసినవాళ్ళకి భయం వేసేది - ఈ పెద్దాయనకి మళ్ళీ హార్ట్ ప్రోబ్లెమ్ వస్తుందేమోనని. కన్నీళ్ళు వచ్చేవి ఆయన పడిన మథనానికి. అంతగా కదిలిపోయేవారు ఆయనతో ఆ విషయాలను పంచుకునేవారు.
మొత్తానికి అక్కినేని తన జీవితాంతం దాసరిని కలవనేలేదు. అలాగే తనువు చాలించారు. అక్కినేని అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చిన దాసరి గారిని ' మీకు, ఏయన్నార్ గారికి పడదు కదా ... మరి మీరు ఎలా వచ్చారు? ' అని కొందరు అడిగారు. 'నాకు, నాగేశ్వరరావు గారికి అభిప్రాయ భేదాలున్న మాట నిజమే. గత తొమ్మిదేళ్ళుగా మేం మాట్లాడుకోలేదు. ఆయన మహా నటుడు. నేను ఆయన అభిమానిని. ఆ అభిమానం ఎక్కడికి పోతుంది ?' అని సమాధానమిచ్చారు దాసరి.