ఈ సంఘటన జరిగే సమయానికి దాసరి ఇంకా డైరెక్టర్ కాలేదు. రచయితగా మాత్రమే వున్నారు. ఓసారి ఓ ప్రొడక్షన్ ఆఫీస్ లో ఓ సాయంత్రం మందు పార్టీ జరుగుతోంది. ప్రముఖులు కూచొని సేవిస్తున్నారు. లోపల ఇంకో రూమ్ లో దాసరి రాసుకుంటున్నారు. బైట మందు తీసుకునే వారికి డోసు ఎక్కువయింది. అందులోని ఓ మాటల-పాటల రచయిత 'లోపల ఎవరో వున్నట్టుంది ... ఎవరది?' అని అడిగారు.
'దాసరి నారాయణ రావని కొత్తగా వచ్చాడండీ' అని చెప్పారు అక్కడున్నవారు.
'పిలవండి పిలవండి' అని ఆర్డరేశారు ఆ మాటల-పాటల రచయిత.
వెంటనే పిలిచారు. దాసరి వచ్చారు.
'ఇక్కడందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటమ్మా ఒక్కడివీ ఆ గదిలో... రా .. ఓ రెండు పెగ్గులు బిగించు.' అని గ్లాస్ లో మందు పోసి ముందుకు తోశారా మాటల-పాటల రచయిత.
'ఒద్దండీ .. నాకు అలవాటు లేదు' అన్నారు దాసరి.
'ఇప్పుడిలాగే అంటావులే... రేపు ఇది లేకుండా వుండలేవు'
' అలా జరగదండీ ... నేనసలు మందు ముట్టుకోను'
'ఎప్పుడైనా మందు తాగాల్సివస్తే!?'
'వచ్చినా తాగనండీ ... నేను జీవితంలో మందు ముట్టుకునే ప్రసక్తే లేదు'
ఇలా చాలాసేపు ఇద్దరి మధ్యా ఆర్గ్యుమెంట్ జరిగింది. మాటల-పాటల రచయిత గారికి కోపం వచ్చేసింది. గ్లాస్ తీసుకుని దాసరి నోట్లో బలవంతాన ఒంపబోయారు. దాసరి తోసేశారు. దాంతో ఆయన కోపం నసాళానికంటింది.
' చూస్తాను ... మందు కొట్టకుండా ఈ ఫీల్డ్ లో ఎలా పైకొస్తావో చూస్తాను. ఇదిగో ఈ జంధ్యం పట్టుకుని చెబుతున్నాను . ఏదో ఒక రోజు నువ్వు మందు కొడతావు. ఆ రోజు వస్తుంది ' అన్నారా మాటల-పాటల రచయిత తన జంధ్యం తీసి చేతిలో పట్టుకుని.
ఆ తర్వాత దాసరి నారాయణరావు ఎలా వృద్ధిలోకి వచ్చారో అందరికీ తెలిసినదే. ఆయనకి పనే లోకం అని మందు అస్సలు ముట్టుకోరని ఇండస్ట్రీ లో చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ఇది తెలుసుకున్న ఆ మాటల-పాటల రచయిత దాసరి దగ్గరికి వెళ్ళి ' సారీ నారాయణరావ్ ... నిన్ను తక్కువగా, తప్పుగా అంచనా వేశాను. ఐయామ్ రియల్లీ సారీ ... 'అని అన్నారు. 'మీరు పెద్దవారు... మీరు నాకు సారీ చెప్పకూడదు. మీకున్న అనుభవంతో ఆ రోజు అలా అన్నారంతే. అది అర్ధం చేసుకోగలను' అని చేతులు జోడించి నమస్కరించారు దాసరి. అంతేకాదు ఆ మాటల-పాటల రచయిత చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలన్నీ దాసరే దగ్గరుండి చూసుకున్నారు కూడా....