This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

అలకలు, కోపాలు, పంతాలు, పట్టింపులు మామూలు మనుషులకే కాదు సెలబ్రిటీలక్కూడా ఉంటాయి. అట్టే మాటాడితే కొంచెం తీవ్రంగా కూడా ఉంటుంటాయి. కాకపోతే అవి బైటికి తెలియకుందా చాలామంది జాగ్రత్త పడుతూ ఉంటారంతే. అలా బైటికి తెలిసిన కొన్నింటిలో  కొన్ని :

దాసరి నారాయణ రావు సినిమాల్లో నాగభూషణం ఎందుకు లేరు ?
 
దర్శకుడిగా దాసరి తొలిచిత్రం ’ తాత-మనవడు’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో గుమ్మడి చేసిన పాత్రకి మొదట నాగభూషణం గార్నే అనుకుని స్క్రిప్ట్
రాసుకున్నారు దాసరి నారాయణరావు. అందుక్కారణం లేకపోలేదు. నాగభూషణం ప్రధాన పాత్ర ధరించిన ’మహమ్మద్ బిన్ తుగ్లక్’ కి దాసరి మాటల రచయిత.
అందులో నాగభూషణం గారికి దాసరి రాసిన డైలాగులు బ్రహ్మాండంగా పేలాయి. అప్పట్నించీ దాసరి అంటే ప్రత్యేకమైన అభిమానం చూపించేవారు నాగభూషణం.
ఆ తర్వాత ఆయన నిర్మించిన ’ఒకే కుటుంబం’ సినిమాకి దర్శకుడు భీమ్ సింగ్ అయినా హిందీ సినిమా ఛాన్స్ లతో ఆయన బిజీ అయిపోతే - ఆ సినిమాకు అసిస్టెంట్ గా వ్యవహరించిన దాసరి మొత్తం దర్శకత్వ బాధ్యతలను నెత్తిన వేసుకుని సినిమాను పూర్తి చేశారు. దాంతో నాగభూషణం గారికి, దాసరి గారికి మధ్య
సత్సంబంధాలు మరింత గట్టిపడ్డాయి.
ఆ బంధంతోనే ఆయన్నే ఆ పాత్రకు అనుకుని స్క్రిప్ట్ రాసుకోవడమే కాకుండా ’నేను నాగభూషణం గారిని అనుకుంటున్నాను’ అని నిర్మాత రాఘవకి ముందే చెప్పేశారు. ’సరే అలాగే ... మాట్లాడి రా ... ఆయన రెమ్యూనరేషన్ మనం ఇవ్వగలమో లేదో ... మన బడ్జెట్ కూడా చెప్పు’ అన్నారు రాఘవ. ఆనందంతో
నాగభూషణం గారిని కలిసి తనకిలా డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని చెప్తూ, తియ్యబోతున్న కథని అందులో ఆయన కోసం అనుకున్న పాత్రని వివరించారు దాసరి. అంతా విని బావుందంటూ తన రెమ్యూనరేషన్ గురించి ఒక ఫిగర్ చెప్పారు నాగభూషణం. ’కరక్టేనండీ .... మా నిర్మాత అంత ఇచ్చుకోలేరు. మీరు నా కోసం ఒప్పుకుంటారని వచ్చాను’ అన్నారు దాసరి. ’అదేం కుదరదు గాక కుదరదు’ అంటూ తను చెప్పిన అమౌంట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు నాగభూషణం. చేసేది లేక నిర్మాత రాఘవ దగ్గరికి వచ్చి జరిగింది బాధగా వివరించారు దాసరి. ’సరే ... నువ్వంత బాధ పడుతున్నావు కాబట్టి నేనొక ప్రపోజల్ చెప్తాను. ముందు నా బడ్జెట్ ప్రకారం ఇద్దాం. ఈ సినిమా కచ్చితంగా వంద రోజులాడుతుంది. ఆ  నూరవ రోజు నాడు నాకొచ్చే ప్రాఫిట్స్ లోంచి ఆయన చెప్పిన ఫిగర్ లోని బ్యాలెన్స్ ఇచ్చేద్దాం. ఇలా చెప్పి చూడు’ అన్నారు రాఘవ.
ప్రాణం లేచొచ్చినట్టయింది దాసరి గారికి. ఆనందంతో వెళ్ళి నాగభూషణం గారికి చెప్పారు - ’వందో రోజున మీ ఫిగర్ బ్యాలెన్స్ ఇచ్చేస్తామన్నారండీ ఆయన’ అని.
’వంద రోజులాడక పోతే ? ’ అన్నారు నాగభూషణం. దాసరికి షాక్. నోట మాటరాలేదు. మొదటి సారి దర్శకుడిగా ఛాన్స్ వస్తే ఆశీర్వదించి ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా అపశకునం పలుకుతారేమేటి అని నొచ్చుకున్నారు. తలవంచుకుని వెళ్ళిపోయారు. రాఘవ గారికి జరిగిన విషయం చెప్పడం, మరేం ఫర్వాలేదని
ఆయన వెన్ను తట్టడం, ఆ తర్వాత ఆ వేషానికి గుమ్మడి గారిని ఫిక్స్ చెయ్యడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. 
కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు కదా... దర్శకుడిగా దాసరి అంచెలంచెలుగా పెరిగి, పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని అందుకోవడం,  నాగభూషణం గారికి
క్రమక్రమం గా వేషాలు తగ్గిపోవడం జరిగిపోయింది. ఈ సంగతి కూడా గమనించారు దాసరి. చాలా సార్లు ఈ సినిమాకి ఆయన్ని పిలుద్దాం అని నోటి దాకా రావడం, ఆ రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చి మళ్ళీ మనసు చివుక్కు మనడం, అక్కడితో ఆగిపోవడం ... ఇలా గడిచిపోతూ వచ్చింది. అదెంత వరకూ వెళ్ళిందంటే - దాసరి కొత్త సినిమా ఓపెనింగ్ అయిందంటే ’అందులో మనకి వేషం ఉండదు లెండి’ అని నాగభూషణం గారే తన సన్నిహితులతో బైటపెట్టుకునే దాకా ... ! అది విని ’ఏదో పెద్దవాడు ...’ అనుకుని సర్దుకుపోయి పిలుద్దామని దాసరి అనుకోవడం, పిలిచే లోగా ఆ రోజు జరిగింది గుర్తుకు రావడం, మళ్ళీ మనస్సు చివుక్కుమనడం ఇలా ఇది నాగభూషణం గారి జీవితాంతం కొనసాగింది. నాగభూషణం మరణించారు. ఆయన అంతిమయాత్రలో దాసరి పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అన్నీ ఓ పద్ధతి ప్రకారమే జరిగేట్టు చూశారు. కానీ దాసరి సినిమాల్లో నాగభూషణం గారు వేషం వెయ్యకపోవడం మాత్రం చరిత్రలో ఓ చెప్పుకోదగ్గ విషయంగా మిగిలిపోయింది.
********************************************************************************************************