This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వారెవరికైనా సరే ఒకే ఒక టాలెంట్ వుండదు. కచ్చితంగా మరో రెండు మూడు వుండి తీరుతాయి. కాకపోతే ఒక రంగంలోనే పేరొచ్చే అవకాశాలెక్కువ. అలా కాకుండా రెండు, మూడు రంగాలలో ప్రతిభ వుండి వాటన్నిటికీ గుర్తింపు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అటువంటి అరుదైన కళాకారుల్లో విశ్వ ఒకరు. ఓ చిన్న ఇంటర్ వ్యూ ద్వారా - ఆ 'విశ్వ' రూపాన్ని చూపించే ప్రయత్నం ఇది :

 

"రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు ఈ మూడిట్లో ఏ విభాగం ద్వారా మీ కెరీర్  మొదలు పెట్టారు ... ?"

"ఈ మూడిటి ద్వారా అనే చెప్పాలి"

"బిగినింగే ఎలా సాధ్యపడింది ?"

"మస్తీ అనే అల్బమ్ దీనిక్కారణం. ఈ మూడు విభాగాలూ నేనే చూసుకున్నాను. శబ్దాలయా లో రికార్డ్ చేస్తుండగా - మణిశర్మ గారి దగ్గిర గిటార్, కీ-బోర్డ్ వాయించే శివరామ్ వచ్చారు. విని బాగా ఇంప్రెస్ అయ్యారు. మణిశర్మ గారిని పరిచయం చేస్తానన్నారు. నిజం గా అప్పటికి ఆ మాట నేను నమ్మలేదు. 'రావోయి చందమామ' సినిమాలో ఓ పాటకి వెస్ట్రన్ ఆలాప్ కావల్సి వచ్చింది. అప్పుడు శివరామ్ నా పేరు చెప్పడంతో నన్ను పిలిపించారు.  నా వెస్ట్రన్ స్టైల్ సింగింగ్ చూసి ఆ ఆలాప్ నాతో పాడించారు. అప్పుడే నా గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఈ మస్తీ ఆల్బమ్ లో మూడు పాటలు విని 'ఇది నేను ప్రొడ్యూస్ చేస్తాను. మిగిలినవి పూర్తి చెయ్యి' అని ఫైనాన్స్ చేశారు మణిశర్మ గారు."

" ఎంత పడింది ? "

" ఆ రోజుల్లో లక్షన్నర "

" ఆ అల్బమ్ ఏవైనా హెల్ప్ చేసిందా ? "

" అది విని ఆర్పీ పట్నాయిక్' సంతోషం' సినిమా కోసం 'మెహబూబా మెహబూబా' పాట రాయించి పాడించాడు. ఆ  తర్వాత ఈ మస్తీ ఆల్బమ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రావడానికి కారకుల్లో ఒకరైన సత్యదేవ్ దర్శకుడు శేఖర్ సూరికి నా గురించి చెప్పడం వల్ల ఆయన తీసిన అదృష్టం సినిమాలో రెండు పాటలు రాసే అవకాశం కలిగింది. "

" సరే ముందు రచయిత కోణం నుండే వెళదాం  ... మీరు రాసిన కొన్ని పాటలు హీరో పరంగా క్లాసిఫై చేసి చూసుకుందామా ? "

" మహేష్ బాబు కి  పోకిరి ( డోలె డొలె జర) , అతడు ( ఎవరని ఎదురని నిలిస్తే ... తొలి నిప్పు కణం అతడే),

   అతిథి   (కిలాడి కూనా), దూకుడు ( నీ దూకుడూ) ;

  నాగార్జున కి శివమణి ( ఏలో ఏలో), డాన్ ( ఏదో వుందిలే), మాస్   ( లల్ల లాహిరే), సూపర్ (గిచ్చి గిచ్చి  చంపమాకు హొయ్య, చంద్రముఖి) ;

అల్లు అర్జున్ కి ఆర్య ( యు రాక్ మై వరల్డ్) బన్నీ ( వా వా వారెవా), హ్యాపీ ( చల్ చల్ చల్ చల్ మెరి సాథీ), ఇద్దరమ్మాయిలతో (వయొలిన్ సాంగ్) ;

రవితేజ కి   భద్ర ( ఏ ఊరే చినదానా), నిప్పు ( ఏ దోస్ తీ గమ్మత్తుదీ) ;

రామ్ చరణ్ కి చిరుత (చమ్కా చమ్కీరే) ;

  ప్రభాస్ కి మున్నా (కదులు కదులు , చమ్మకురో చెల్ల) ,

 వెంకటేశ్ కి లక్ష్మి ( ధగధ మెరుపుల రాణి) షాడో ( గోలా గోలా నా దిల్ డోలా)

 ఎన్.టి.ఆర్. కి బాద్ షా ( టైటిల్ సాంగ్ కలహిస్తె ఖతమ్ వినుకో ) ఇలా ... "

" బాద్ షా టైటిల్ సాంగ్ లో సమురాయ్ శరం పదునే పగవాడి నరం తెగునే అని రాశారు మీరు.  హీరో పదును గురించి  ఆ ఉదాహరణే ఎందుకు ? "

" ఆ సినిమాలో హీరో జపాన్ యోధులతో తలపడతాడు. జపనీస్ యోధులని సమురాయ్ లని అంటారు అంచేత ఆ  ఉపమానం. పాట రాసేటప్పుడు సందర్భం, ప్రదేశం, చరిత్ర , ఔచిత్యం పాటిస్తే ఇలాంటి ఉదాహరణలు పుట్టుకొస్తాయి "

" మీరు రాసిన పాటల్లో కొన్ని లైన్లు చెబ్తాను.

                           గీత విను దొరకదు గుణగణమే

                          చేవగల చతురత కణకణమే

                          చీడలను చెడమడ దునమడమే

                          నేటి మన అభినవ అభిమతమే

                          ఓటమిని ఎరుగని పెను పటిమే

                          పాదరస ఉరవడి నరనరమే

                          సమరమే సై ఇక చలగిక చక చక

                          ఎడ తెగ చెయ్ ఇక విలయపు తైతక

                           ( నీ దూకుడు -  దూకుడు)

                           జత వస నస పిసినారైనా

                           ( అలీబాబా - నిప్పు)

 ఇవే కాకుండా ఇలాంటి టంగ్ ట్విస్టింగ్ పదాలు మీ పాటల్లో చాలా కనిపిస్తూ వుంటాయి. ప్రత్యేకమైన కారణం వుందా ? "

 " భాష మీద మమకారం మొదటి కారణం. మన తర్వాతి తరం వారికి మన భాష ఎంత గొప్పదో తెలియాలి. అందువల్ల ఇటువంటి కష్టమైన 'త త' కారాలతో ట్యూన్ వచ్చినప్పుడు అప్రయత్నంగా వచ్చే చిన్ని ప్రయత్నం ఇది."

 " అలాగే ఈ మధ్యే వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలోని వయొలిన్ సాంగ్ లోని సంస్కృత పదాల గురించి  అందరూ బాగా చెప్పుకున్నారు.  "

" అవును ... అందులో కాంతా మనః వశీకరా , ప్రేమాతురామోదఃకరా మనోహరా, చతురా విదురా శూరా   పటుతరా ఇవీ ఆ పదాలు. ఇవన్నీ ఉభయ భాషల్లోనూ వున్నవే. అందువల్ల జనం బాగా రిసీవ్ చేసుకున్నారు "

" పటుతర శూరా అనకుండా శూరా పటుతరా అన్నారు కదా ... "

" సంస్కృతం లో వుండే సౌలభ్యం అది. ఆ పదాన్ని అటు కూడా వేసుకోవచ్చు"

" భాష గురించి ఇంత చెప్తున్నారు .. మీకున్న బ్యాగ్రౌండ్ ఏమిటి ? "

" బ్యాగ్రౌండూ లేదు .. బ్యాక్ డ్రాపూ లేదు. ఈ అభిరుచి అంతా అమ్మానాన్నల దగ్గర్నుంచి వచ్చినదే... అమ్మగారు సంగీతంలో ఎమ్.ఏ. చేశారు. నాన్నగారు మంచి మంచి పుస్తకాలు తెప్పించి చదివేవారు. రాత్రి భోజనాలయ్యాక కూచోబెట్టుకుని పద్యాలూ అవీ వినిపించడం వల్ల భాష పట్ల అబిరుచి, గౌరవం ఏర్పడ్డాయి. ఇవి కాక దివాకర్ల  వెంకటావధాని, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వంటి గొప్పవారి సాంగత్యం, ప్రస్తుతం చాగంటి కోటేశ్వర రావు గారి  ప్రసంగాలు వీటన్నిటి ప్రభావం నా భాష మీద వుంది "

"ఇప్పటికెన్ని పాటలు రాసుంటారు ?"

" దూకుడు సినిమాలో 'నీ దూకుడూ' పాటతో వంద పూర్తయ్యాయి"

" ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా చెప్పండి  "

హైదరాబాద్ నవాబ్స్ నా మొదటి చిత్రం. కాకపోతే అది హిందీ, ఇంగ్లీష్ లలో వుంటుంది కాబట్టి శశాంక్ హీరోగా నటించిన ప్రేమ్ సినిమా నా మొదటి తెలుగు సినిమాగా చెప్పుకోవాలి. తర్వాత మంగళ,   పోలీస్ పోలీస్ (ఇది    తమిళంలో కుట్ర పిరవు గా విదుదలైంది), నేను నా రాక్షసి ఇప్పటి దాకా విడుదలైన  సినిమాలు. శ్రీకాంత్ హీరోగా రాబోయే క్షత్రియ ఇంకా విడుదల కావాల్సి వుంది "

" సరే  తీన్ మార్ లో చిగురు బోనియా, సంతోషం లో మెహబూబా, అతడు లో టైటిల్ సాంగ్, నేను నా రాక్షసి లో  పడితినమ్మో ఇలా కొన్ని పాటలు సింగర్ గా మీరేమిటో , మీ వేరియేషన్స్ ఏమిటో జనాలకు తెలిసేట్టు చేశాయి.   ఈ మూడు టాలెంట్స్ కాకుండా మరో టాలెంట్ కూడా ఉన్నట్టు కొంతమందికే తెలుసు .. కనిపించని ఆ నాలుగో  సింహం గురించి చెబ్తారా"

 " డబ్బింగ్ ఆర్టిస్ట్ గానా ? "

 " య్యస్ ... మరి ఎవరెవరికి వాయిస్ ఇచ్చారో జనంకి తెలియకపోతే ఎలా ? "

 " నేనున్నాను లో పశుపతికి, సింహాద్రి లో రాహుల్ దేవ్ కి, తమ్ముడు లో సెకెండ్ విలన్ కి, చత్రపతి లో సుప్రీత్ కి, (కాట్రాజు పాత్రధారి, రక్తచరిత్ర లో బుక్కారెడ్డి పాత్రకి, బెజవాడ లో ప్రభుకి, కంత్రీ లో మురళీ జోషికి, శక్తి లో జాకీష్రాఫ్ కి, తడాఖా లో సెకెండ్ విలన్ ముత్తుకుమార్ కి ,ఢమరుకం లో    (మంచి) అఘోరాకి ... ఇలా అడపా  దడపా చెప్పుకుంటూ పోతున్నాను"

 " మరి వాయిస్ ఓవర్ ఇచ్చినవి ... "

 " ఢమరుకం సినిమా మొదట్లో వచ్చే ఇంట్రో , మైక్రోసాప్ట్ వారి కార్పొరేట్ యాడ్స్ కిడెర్మికూల్ టాల్కమ్ పౌడర్ కి, డెట్టాల్ యాడ్ లకి వాయిస్ ఇచ్చాను"

 " ఇన్ని రకాలుగా బ్రతుకు సమరాన్ని సాగిస్తున్న మీరు ఏం సాధిద్దామనుకుంటున్నారు ? "

 " ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. స్టూడియో టెక్నిక్స్ నేర్చుకుని స్వంతంగా ఓ స్టూడియో కట్టుకున్నాను.  నా వర్క్స్ చేసుకోడానికి ఇది సరిపోతుంది. నా మనసులో ఉన్నది ఒక్కటే ... అది  సినిమా కావొచ్చు .. ఆల్బమ్ కావొచ్చు అందులోని సంగీతం, సాహిత్యం విజ్ఞులు, రసజ్ఞులు

మెచ్చుకునేట్టు వుండాలి. అది విని మన భాషని   కాపాడుకోవలసిన బాధ్యత మనదే అని తర్వాతి తరం  ప్రేరణ పొందాలి. అంతే ... "

రాజా (మ్యూజికాలజిస్ట్)