ఇప్పటికీ ఈ స్టిల్స్ చూడగానే చెప్పేసే వారున్నారు - 'వెలుగు నీడలు' సినిమాలోని 'చల్లని వెన్నెల సోనలు' పాటల్లోనివి అని. అలాగే వీటిల్లో వున్నది సావిత్రి, గిరిజ అని ఈ తరంలో కూడా పోల్చుకునే వాళ్ళున్నారు. కానీ ఎవరూ విప్పి చెప్పలేని ఓ తమాషా రహస్యం ఒకటుంది ఈ పాటలో. అదేమిటంటే ... ఈ పాటలో నెలల పిల్లవాడు గా కనిపిస్తున్నది ... అక్కినేని నాగార్జున. నిజం... ఈ సంగతి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏయన్నార్ గారికి కూడా తెలీదు. అదెలా జరిగిందంటే ...
'వెలుగు నీడలు' సినిమాలోని ఈ పాటలో - మొదట ఓ చిన్నబాబు, ఆ తర్వాత కొంచెం పెరిగిన ఓ అబ్బాయి - ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. సమయానికి నెలల పిల్లవాడు దొరకలేదు. "అదేంటర్రా ... మన పాప రెండో కొడుకున్నాడుగా .. తీసుకురండి " అన్నారు చిత్ర నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు.
పాప అంటే అక్కినేని నాగేశ్వర రావు గారి సతీమణి అన్నపూర్ణ. ఆమెను ఇంట్లో అలాగే పిలిచేవారు. ఏయన్నార్ ఎదుగుదలకు సంబంధించి ఆయన చలన చిత్ర జీవితం లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ దుక్కిపాటి మధుసూదన రావు గారి పాత్ర ఎంతుందో అందరికీ తెలుసు. "నేనెవ్వరితోనైనా వాదించగలనేమో గాని ఆయన దగ్గిర నోరెత్తే ప్రసక్తే లేదు. చాలాసార్లు పాత్రకి సంబంధించి ఇలావుంటే బాగుండుననిపిస్తే సావిత్రి తో అడిగించే వాణ్ణి" అంటారు అక్కినేని - దుక్కిపాటి వారి గురించి .
అటువంటి దుక్కిపాటి వారు ఆర్డరేస్తే తిరుగేముంది ? ఎయన్నార్ గారింటికి వెళ్లి నాగార్జున ని తీసుకువచ్చారు. షూటింగ్ చేసి పంపించేశారు. ఈ సంగతి తర్వాతెప్పుడో కొన్నాళ్ళకి తెలిసింది అక్కినేనికి. అలా అఖిల్ కన్నా చిన్న వయసులో నటించి తనకు తెలియకుండానే అతని రికార్డ్ బ్రేక్ చేశారు నాగార్జున.
"నాగార్జున మొదటి చిత్రం ఏది .. ?" , "నాగార్జున నటించిన తొలి గీతం ఏది ...?" , " నాగార్జున తో మొదట నటించిన హీరోయిన్ ఎవరు...?" , "ఏయన్నార్ కి తెలియకుండా నాగార్జున నటించిన చిత్రం ఏది... ? " లాంటి ప్రశ్నలు ఓ ఫిలిం క్విజ్ లాగ మీ ఫ్రెండ్స్ మధ్య అడిగిచూడండి. సమాధానంగా ఈ పాట వీడియో చూపించండి (యూ ట్యూబ్ లో దొరుకుతుంది). మార్కులు వాళ్ళకు రాకుండా మొత్తం మీరే కొట్టెయ్యొచ్చు.