This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

                                             గాయకుడు, యాంకర్, రచయిత సాగర్

 
మొదట్లో అతడ్ని 'దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు' అనేవారు. ఆ తర్వాత 'ఇతను పాడతాట్ట' అని కొందరు గుసగుసలాడేరు. 'నందీ అవార్డ్ కూడా వచ్చిందంటే ఏదో విషయం వుందితనిలో' అని అందరూ మెచ్చుకోవడం మొదలు పెట్టారు. ఇక సూపర్ సింగర్ కి వరసగా యాంకరింగ్ చెయ్యడం - తద్వారా అతనిక్కూడా ప్రత్యేకంగా ఫాలోయింగ్ రావడం వల్ల 'అసాధ్యుడే  ... దేవిశ్రీ తమ్ముడా మజాకానా ' అని దేవిశ్రీ తోనే ముడిపెడుతూ ప్రశంసించ సాగారు. దీనిక్కారణం లేకపోలేదు. రాముడికి లక్ష్మణుడిలా అనుక్షణం వెన్నంటి వుండడమే... ఈ ప్రస్థానం మొత్తాన్ని ప్రస్తావిస్తూ సాగర్ ప్రత్యేకంగా   ఇచ్చిన  ఇంటర్ వ్యూ ఇది :  
 
 " మీ పూర్తి పేరు సాగరేనా ? ఇంకా వుందా ?"
" అసలు పేరు విద్యాసాగర్. బైట అందరూ 'విద్యా' అని పిలిచేవారు. అన్నయ్యని 'దేవీ' అనేవారు.
ఇప్పటికీ కొంతమంది అన్నయ్యని అలాగే అంటారు."
" మరి సాగర్ అని ఎందుకు మార్చుకోవలసి వచ్చింది ?"
"మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారి పేరు బాగా ఫేమస్. నేనూ అదే పేరుతో వుంటే కన్ ఫ్యూజన్ . 
అందుకే మార్చుకున్నాను. పైగా ఇంట్లో నన్ను 'సాగర్' అనే పిలుస్తారు"
" మీ తలిదండ్రులకి మీరిద్దరేనా ? మీ ఇద్దరి మధ్యా ఎంత ఏజ్ గ్యాప్ వుంది ? "
" మధ్యలో నాకు అక్క వుంది. నాకు అన్నయ్యకి మధ్య 4 ఏళ్ళు డిఫరెన్స్" 
" మీ నాన్నగారు సత్యమూర్తి పెద్ద రైటరని చిన్నప్పట్నించీ తెలుసా ? "
"తెలుసండీ ... చిరంజీవి గారి దగ్గర్నుంచి అందరు పెద్ద హీరోలకీ వర్క్ చేశారని,  చాలెంజ్, జ్వాల, ఖైదీ నం.786, అభిలాష ఆయన హిట్స్ అనీ అన్నీ తెలుసు ... అదీకాక అరవింద్ గారింట్లో ఫ్యామిలీ గెట్ టు గెదర్ లకి అందరం కలవడం వల్ల చిన్నప్పుడే నాన్నగారంటే మాకొక అవగాహన ఏర్పడిపోయింది."
" మీరు, మీ అన్నయ్య చిన్నప్పుడు క్లోజ్ గా వుండేవాళ్ళా ?  "
" ఇద్దరం కలిసి మాండొలిన్ శ్రీనివాస్ గారి దగ్గిర మాండొలిన్ నేర్చుకునేవాళ్ళం ...."
" మీ అన్నయ్య సరే, మీరు ఇప్పుడు కూడా మాండొలిన్ వాయించగలరా ? "
"కచ్చితంగా ... ప్రాక్టీస్ తప్పిపోయింది కాబట్టి ఒక రోజు ముందు చెప్తే చాలు .. మర్నాటికి రెడీ"      
 
" సింగర్ కాకముందు అన్నయ్యకి రికార్డింగ్స్ లో హెల్ప్ చేశావారు కదా ... ఆ అనుభవం
ఎలా వచ్చింది మీకు ?"
" మొదట్నించీ అన్నయ్యంటే నాకొక ఎడ్మిరేషన్. తను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు ప్రయివేట్ ఆల్బమ్స్ చేసేవాడు. వాటికి సంబంధించి అన్నయ్య, నేను, మరో ఫ్రెండు బాబు బాగా తిరిగే వాళ్ళం. ఏ ఇన్ స్ట్రుమెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు బాగా వాయిస్తారు, ఎంత పే చెయ్యాల్సి వుంటుంది ఇలా ఒక్కక్కటే తెలుసుకుంటూ అన్నిటికీ అన్నయ్య పక్కనే వుండేవాణ్ణి.   అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక వచ్చిన సింగర్లకి సాంగ్ నేర్పించడం, తర్వాత వాయిస్ మిక్సింగ్ ...  ఇలా  అన్నీ ఇన్వాల్వ్ అవడం వల్ల నేర్చుకున్నవే ..."
" వాయిస్ మిక్సింగ్ చిన్న బాధ్యత కాదే ... "
"అవును ... అన్నయ్య కూడా  డైరెక్ట్ గా నాకది అప్పచెప్పలేదు. చూస్తూ నేర్చుకోమని 2002 లో ఆ పనిలో పెట్టాడు. వన్ ఇయర్ తర్వాత నమ్మకం కుదిరాక 2003 నుంచి నన్ను స్వంతంగా చూడమని చెప్పాడు." 
" సాంగ్ నేర్పించేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి నేర్పించే అవకాశం, అదృష్టం కలిగుండాలే ... !?"
 
"మీరన్నది కరెక్ట్ ... ఆ అవకాశాలన్నీ అదృష్టాలే ... బాలు గారు, చిత్ర గారు అయితే అంతగా నేర్పించక్కర్లేదు. ఆయినా 'రాఖీ' సినిమా కోసం దుర్గ మీద బాలూ గారు పాడిన పాట మాత్రం గ్రేట్ ఎక్స్ పీరియెన్స్. జీవితంలో మరిచిపోలేను. అలాగే శంకర్ మహదేవన్, కె కె,  శ్రేయాగోషల్, ఉదిత్ నారాయణ్ వీళ్ళందరికీ పాట నేర్పించే అవకాశం నిజంగా అదృష్టమే "
" ఇంతమంది గొప్పవాళ్ళను చూసి ఏం నేర్చుకున్నారు ? "
"ఎదిగిన కొద్దీ ఒదిగుండాలని తెలుసుకున్నాను. వీళ్ళలో సంగీతం నేర్చుకున్నవాళ్ళు వున్నారు. వాళ్ళు తమ రూట్స్  మరింత బలపడేలా పొద్దున్నే సాధన చేసి గాని రారు. మాండొలిన్ శ్రీనివాస్ గారు కచేరీ వున్నా లేకపోయినా ఇవాళ్టికీ తెల్లవారు జామున 4 గంటలకు లేచి సాధన చేస్తారు. అది కూడా బేసిక్ రూట్స్ అయిన సరళీ స్వరాలతో మొదలు పెడతారు. ఈ మహానుభావులందరి తోనూ నాకున్న ఎక్స్ పీరియన్స్ లన్నీ పూర్వజన్మ సుకృతాలే .. " 
 
" సరే ... సింగర్ గా టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ? "
" ఫస్ట్ 'స్వంతం' సినిమాలో టైటిల్ సాంగ్ కోరస్ తో పాడేను. అది చెన్నై లో కోటి గారి స్టూడియోలో రికార్డింగ్ అయింది. "
"మరి ఫస్ట్ సోలో ? "
" వర్షం లో 'నీటి ముల్లయ్ నన్నుగిల్లి వెళ్ళిపోకే వెండివానా' అనే వన్ అండ్ హాఫ్ మినిట్ బిట్ సాంగ్ నా తొలి సోలో సాంగ్. సీతారామశాస్త్రి గారు రాశారు "
" మరి మీ ఫోన్ లో రింగ్ టోన్ గా వినిపించే 'ఏదో ప్రియ రాగం వింటున్నా'  పాట  ?"
" వర్షం తర్వాత దిల్ రాజు గారికి నచ్చిన పాటది.  ముందర 'ఫీల్ మై లవ్' లాంటి పాట కావాలనుకున్నారు. కుదర్లేదు. మరో ట్యూన్ ఇచ్చాడు అన్నయ్య. అదే - ఏదో ప్రియ రాగం వింటున్నా - మర్నాడు షూటింగ్ ... రాత్రి ఒంటిగంటన్నర కి అన్నయ్య నిద్ర లేపి 'ఈ పాట పాడు' అన్నాడు. 'అబ్బా' అనుకుంటూనే స్టార్ట్ చేశాం.  3 గంటలకి అయిపోయింది. ఆరున్నరకి పంపేశారు. నా పని అయిపోయింద్ కనుక అయిదున్నర కి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి 8 గంటలకి కాలేజికి వెళ్ళిపోయాను. "
" ఏం చదివారు ? "
" ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేశాను. ఈ పాట పాడుతున్నప్పుడు బియస్సీ సెకెండియర్లో వున్నా ... "
" మరి అన్నయ్య ఏం చదివారు ? "
"బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ "
" షూటింగ్ లో ఆ పాట ఫీడ్ బ్యాక్ ఏమిటి ? "
" దిల్ రాజు గారికి తెగ నచ్చేసిందిట. వాయిస్ అమాయకంగా వుంది. ఇదే వుంచేద్దాం అన్నారట" 
" ఈ పాటకి ఉత్తమ గాయకుడిగా నందీ అవార్డ్ రావడం థ్రిల్లనిపించిందా ? "
"ఇలాంటి అలాంటి థ్రిల్లా ... ఆ రోజు మధ్యాహ్నం అన్నయ్య వచ్చి 'ఈసారి నందీ అవార్డ్ ల్లో బెస్ట్
సింగర్ ఎవరికి వచ్చిందో  చెప్పు' అన్నాడు. 'చిత్ర గారికా ?' అన్నాను. 'అది కరక్టేలే ... మేల్ సింగర్ అవార్డ్ ఎవరికి ? ' అన్నాడు. నేను ఆలోచిస్తుంటే 'నీకే'  అన్నాడు. నేను నమ్మలేదు. నా రూమ్ లోకి వెళ్ళిపోయాను. ' నిజంరా బాబూ' అంటూ అన్నయ్య నా గదిలోకి వచ్చాడు ... అప్పుడే దిల్ రాజు గారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది . ' చూడండి సార్ ... వీడు నమ్మడం లేదు'. మీరైనా చెప్పండి' అని అన్నయ్య అంటూనే వున్నాడు అంతలో బన్నీ దగ్గర్నుంచి 'కంగ్రాట్స్' అంటూ ఫోన్ ....   ' ఇదంతా నిజమేనా ? '  అని థ్రిల్లయిపోయాను"
 
"  అప్పట్నించీ అన్నయ్య ప్రతి సినిమాలోనూ పాడుతున్నారు కదా ? "
" అదేం లేదండీ ... నేను పాడని సినిమాలు కూడా వున్నాయి .  తనక్కూడా ఈ పాట నేను పాడితే బావుంటుందనిపిస్తేనే నాతో పాడిస్తాడు."
"ఇప్పటి దాకా ఎన్ని పాటలు పాడుంటారు ? "
"తెలుగు, తమిళ, కన్నడ కలిపి మొత్తం 35-40 వుండొచ్చు"
" ఏదో ప్రియరాగం, జాబిలమ్మవో (ఆర్య),  నీ కళ్ళతోటి (తులసి), ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన (మిస్టర్ పెర్ఫెక్ట్),  టాపు లేచిపోద్ది (ఇద్దరమ్మాయిలతో) ఇలా ఇన్ని రకాల పాటలు పాడేరు కదా ... మరిచిపోలేని ఎప్రిసియేషన్ ఏ పాటకి వచ్చింది ?"
" శంకర్ దాదా జిందాబాద్ లో 'ఓ బాపూ నువ్వే రావాలి' పాటకి. ఓ ఎఫ్ఫెమ్ రేడియో కండక్ట్ చేసిన సర్వే లో ఎక్కువ ఇంపాక్ట్ కలిగించిన దేశభక్తి గీతం గా టాప్ పొజిషన్ లో వచ్చిందిట. నేను మరిచిపోలేని ఎప్రిసియేషన్ ఇది"   
" ఇవన్నీ ఇలా వుండగా మళ్ళీ మరో అవతారం ఎత్తారు మీరు ?"
" మీరంటున్నది నాకర్ధం అయింది. మా టీవీ సూపర్ సింగర్ గురించేగా ... నిజానికి నా మీద
నాకే నమ్మకం లేదు. అందుకే వారు అడిగినప్పుడు 'ముందు ఓ రెండు ఎపిసోడ్ లు షూట్  చేసి
చూడండ్. మీకు నచ్చకపొతే నన్ను డ్రాప్ చేసేసినా ఫరవాలేదు . హర్ట్ అవను' అని అన్నాను. కానీ వాళ్ళకు నా మీద వున్న నమ్మకమే గెలిచింది. నన్ను అందరూ ఆదరించారు. ఈ విషయంలో మా టీవీ  వారితో పాటు సింగర్స్ కి, జడ్జెస్ కి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక  యాంకర్ గా వాళ్ళ మీద ఎన్ని జోకులు, కౌంటర్లు వేసినా అందరూ స్పోర్టివ్ గా తీసుకుని ఎంకరేజ్ చేశారు. అవన్నీ గుర్తు పెట్టుకుని ఇప్పటికీ యూ.ఎస్. నుంచి ఫోన్ చేసే వాళ్ళున్నారు. "
 
( ఆ షోలో సాగర్ వేసిన జోకులు, కౌంటర్ లు గురించి మరోసారి వివరంగా రాయడం జరుగుతుంది) 
 
" ఇది చెప్పండి. 'మిస్టర్ పెర్ఫెక్ట్' సినిమాలో 'చలి చలిగా వుంటుంది' పాటలో మీకేదో ఎస్సెమ్మెస్ వస్తే చూపించి 'పాట సాయం' చేశారటగా ?"
" ఈ విషయం మీకెలా తెలిసింది ? "
" ఏమో ... నాకన్నీ అలా తెలిసిపోతూ వుంటాయంతే"  (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో అంజలి డైలాగ్ ని ఇక్కడ గుర్తుచేసుకోమని మనవి)
" ఆ పాట మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతున్నాయి . అప్పుడు నాకో ఎస్సెమ్మెస్ వచ్చింది. ఇదేదో బాగుందే అని అందరికీ చూపించాను. అందరూ ఇన్ స్పైర్ అయ్యారు.  అనంత శ్రీరామ్ గారు అవి తీసుకుని తన స్టైల్ లో అద్భుతంగా రాశారు "
" ఆ ఎస్సెమ్మెస్ ఏంటో అనంత్ గారు రాసిందేంటో డీటెయిల్డ్ గా చెప్తే బావుంటుంది"
 
" When we HATE someone -  we don't hesitate to express it, even if whole world is watching.  Where as when we LOVE someone - we find it difficult to express it, even to the person we love  ....   ఇదీ ఆ ఎస్సెమ్మెస్. దీన్ని అనంత్ గారు ఇలా రాశారు  .
   నీపై కోపాన్ని - ఎందరి ముందైనా - బెదురే లేకుండా - తెలిపే నేను
   నీపై ఇష్టాన్ని - నేరుగ నీకైనా - తెలపాలంటే తడబడుతున్నాను.
   ఎంత బాగా రాశారో  కదా  "
" అద్భుతహా ... అన్నట్టు ఈ మాటంటుంటే గుర్తొచ్చింది. ఇందాక మీరు పూర్వ జన్మ సుకృతం
  అన్నారు. ఇంత భాషా సంస్కారం మీ జనరేషన్ లో తక్కువగా కనిపిస్తూ వుంటుంది..
  తెలుగు, సంస్కృతం తో బాగా  టచ్ వుందా ?"
" ఇదే మాట మా అన్నయ్య ఇంకోలా అన్నాడు - 'నీకింత తెలుగు ఎప్పుడు వచ్చిందిరా' అని.
మళ్ళీ దానికో కథ వుంది. మీరు మళ్ళీ మరో అవతారం అంటారేమో ... అయినా చెప్పేస్తా ...
ఒకరిద్దరికి తప్ప ఇదెవరికీ తెలియదు. 'మిర్చి' సినిమా ఆర్.ఆర్. (రీ రికార్డింగ్) అవుతోంది. ఇంట్రవెల్ బ్యాంగ్ గుర్తుంది కదా ... ' మా ఫ్యామిలీ ఈజ్ సేఫ్' అని ప్రభాస్ అరుస్తాడు. థియేటర్లో వున్న ప్రేక్షకులంతా స్టన్ అయిపోతారు. గుర్తుంది కదా ... "
"ఆ సినిమా చూసిన వాడెవడూ మర్చిపోలేడు. అంత పవర్ ఫుల్ గా వచ్చిందా సీన్ ..."
"అక్కడ అన్నయ్య అద్భుతమైన అర్.ఆర్. ఇచ్చాడు. వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక్కడ 'ఏవైనా వర్ద్స్ వుంటే బావుంటుంది కదా' అని అనేవాణ్ణి. అన్నయ్య 'లాస్ట్ కి చూద్దాంలే ' అనేవాడు.   ఆర్.ఆర్. లాస్ట్ డేస్ లో ఓ రోజు  రాత్రి ఒంటి గంటయింది. నాకేవో లైన్స్ తట్టాయి. గబగబా రాసేసి  అన్నయ్యకి ఎదురుగా చెప్పే ధైర్యం లేక (పక్క గదిలోనే వున్నాడు) మెయిల్ చేశాను. వెంటనే ఫుల్ స్పీడ్ లో వచ్చేశాడు - ' నీకింత తెలుగు ఎప్పుడు వచ్చిందిరా' అంటూ... ' అదిరిపోయింది. వెంటనే రికార్డ్ చేసెయ్' అన్నాడు"
" ఆ వర్డ్స్ ఏంటో ఇప్పుడు యధాతధంగా చెప్పగలరా ?"
" మరణ అలని మింగేసే మృత్యుంజయుడు
   వీడు గరళ గడప దాటొచ్చిన మానవ ఘనుడు
   ఉరిని ఉరిమి వెంటాడే ఈ నర యముడు
   వీడు మెరుపు సడిని శాసించే శత సైనికుడు
   వీడు పుడమి ఒడిన జన్మించిన జన నాయకుడు"
" నిజంగా అద్భుతంగా వుంది. విన్నవాళ్ళు సీతారామ శాస్త్రి గారో, రామజోగయ్య శాస్త్రి గారో లేక విశ్వ వో రాశారనుకుంటారు. ఇది రాసినట్టు ఇంకెవరికి తెలుసు ? "
"బోస్ గారికి తెలుసు. ఆయన సినిమా చూసి వచ్చి ఫోన్ చేసి యాజిటీజ్ గ అప్పచెప్పాడీ వర్ద్స్ ని. అంతటి  జ్ఞాపక శక్తి ఆయనది"
" అన్నట్టు బోస్ గారికి బర్త్ డే నాడు మీరేదో ఎస్సెమ్మెస్ పంపించారని విన్నాను "
"ఇది కూడా విన్నారా ? అదేంటంటే - కొందరిది క్లాస్ పాట. మరి కొందరిది మాస్ పాట. క్లాస్ పాట, మాస్ పాట కలిస్తే బోస్ పాట...  ఇదీ ఆ ఎస్సెమ్మెస్"
" బావుంది ... మరి మీ బర్త్ డే ఎప్పుడు ?"
" ఆగష్టు 31"
 
రాజా(మ్యూజికాలజిస్ట్)