This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 

"చాలా మంది కన్ ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇది చెప్పండి.  మీరు అనంత్ శ్రీరామా లేక అనంత శ్రీరామా ? "
"అనంత శ్రీరామే " 
" అనంత్ లో మోడ్రన్ టచ్ వుంది కదా ... అలా చెలామణి కావొచ్చు గా  ?"
"వొచ్చు ... నాకు  అనంత శ్రీరామ్ అని పేరు పెట్టిన పర్పస్ వేరు. మా నానమ్మ గారి పేరు అనంతమణి. తాతగారి పేరు రామ్ దాస్ నాయుడు. ఈ రెండు పేర్లలో ఫస్ట్ హాఫ్ లు తీసుకుని 'శ్రీ' చేర్చి అనంత శ్రీరామ్ చేశారు పెద్దవాళ్ళు"  
" ఇంజనీరింగ్ చదువుతూ కోపంతో ప్రతిజ్ఞ చేసి బైటకొచ్చేశారన్న స్టోరీని మళ్ళీ మరోసారి గోతెలుగు పాఠకుల  కోసం చెబుతారా ?  "
" కల్చరల్ యాక్టివిటీస్ బావుంటాయని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ లో చేరాను. తీరా చేరాక తెలిసింది - అక్కడ ఎడ్యుకేషన్ అంతా స్పూన్ ఫీడింగేనని. పైగా కల్చరల్ యాక్టివిటీస్ కి మానేజ్ మెంట్ సహకారం లేదు. ఇదిలా వుండగా ఓ మాష్టారు ... పేరు చెప్పొద్దనుకుంటున్నాను ... దయచేసి అడక్కండి ... 'పాటలు కడుపు నింపవు' అంటూ తక్కువ చేసి మాట్లాడారు. దాంతో కోపం వచ్చి 'ఎలా నింపవో నిరూపించి చూపిస్తాను' మూడవ సంవత్సరం మధ్యలోనే కాలేజి మానేసి  బైటికొచ్చేశాను. " 
 
" ఆ తర్వాత ఏది ముందు .. సినిమాలా లేక పార్టీ పాటలా ?"
" సినిమాలే ... 'కాదంటే అవుననిలే ' ఫస్ట్ ఫిల్మ్ "
" అందులో ఎన్ని పాటలు ? "
" ఆరు పాటలు ... సింగిల్ కార్డ్ "
" ఆ తర్వాత ? "
" ఒక ఊరిలో , ఏవండోయ్ శ్రీవారు ... వీటిక్కూడా సింగిల్ కార్డే "
" ఎంటరవడమే హ్యాట్రిక్ సింగిల్ కార్డ్ ... ఇది నిజంగా  రికార్డుల్లోకి ఎక్కవలసిన విషయం.
అన్నట్టు 'కాదంటే అవుననిలే'  సంగీత దర్శకుడి పేరు మీద కొన్ని కన్ ఫ్యూజన్లు వున్నాయి కదా ?"
" ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు విశ్వనాథ సత్యనారాయణ. న్యూమరాలజీ కోసం 'సత్యం' అని మార్చుకున్నాడు. దాంతో పాత సినిమాల మ్యూజుక్ డైరెక్టర్ సత్యం గారని అనుకున్నారు. ఇప్పటికీ ఆ కన్ ఫ్యూజన్ కొందరిలో వుంది" 
  
" మరి పార్టీ పాటలు ? "
" అవన్నీ అందరివాడు (పడుచు బంగారమా), బొమ్మరిల్లు ( అపుడో ఇపుడో ఎపుడో) తర్వాతే ...
ఇక్కడ ఇంకో రికార్డ్ కూడా వుంది. అదేటంటే - కాంగ్రెస్ మున్సిపల్ ఎలక్షన్స్ కి ప్రచార గీతాలు రాశాను. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీకి 10 పాటలు, అలాగే తెలుగుదేశం పార్టీకి ... ఇలా ఒకే టైమ్ లో 3 పార్టీలకి రాశాను. కొన్నాళ్ళ తర్వాత లోక్ సత్తాకి, ప్రస్తుతం కాంగ్రెస్ వారి పథకాలకి ... ఆల్మోస్ట్ టి.ఆర్.ఎస్. కి తప్ప అన్ని ప్రధాన పార్టీలకి ప్రచార గీతాలు రాశాను."
" యమదొంగ లాంటి పెద్ద సినిమాలో 5 పాటలు పడడం ఒక ఎత్తయితే 'యంగ్ యమా' లాంటి కాయినింగ్ క్లిక్ అవడం మరొక ఎత్తు కదా ?"
" యమదొంగ లో మోహన్ బాబు గారు పెద్ద యముడైతే జూనియర్ ఎన్టీఆర్ చిన్న యముడు. 'ఆయనకొక  విశేషణం వుండాలి - కుర్ర యముడిలా' అని రాజమౌళి హింట్ ఇచ్చారు. ఆలోచిస్తూ వుంటే 'యంగ్ యమా' అని తట్టింది. అందరూ హ్యాపీ ... ఆ కాయినింగే ఆ సినిమాలో 5 పాటలు రాసే అవకాశాన్నిచ్చింది. "
" సంగమం లాంటి సినిమాలో అద్భుతమైన పాటలు రాసినా రాని పేరు యమదొంగ పాటలకి రావడం పట్ల ఒక కవిగా ఎలా ఫీల్ అవుతున్నారు ? "
" పెద్ద సంస్థకి రాస్తే ప్రమోషన్ యాక్టివిటీస్ బాగా వుంటాయి కాబట్టి పాట కొన్నాళ్ళ పాటు ప్రజల మధ్య ప్రచారంలో వుంటుంది. పాటలో సత్తా వుంటే సినిమా తర్వాత కూడా నిలబడుతుంది. చిన్న సినిమాల్లో మంచి పాటలు పడ్డా వాటికా అదృష్టం లేకపోవడానికి గల కారణాల్లో ఇదొకటి."
" మీ సింగిల్ కార్డ్ సినిమాల్లో మొదటి హిట్ 'ఏ మాయ చేశావే' కదా ?"
" అవును. అంతే కాకుండా ఆ సినిమాలోని చాలా పాటలకి అన్నీ తెలుగు పదాలే రాసే  అవకాశం కలగడం మరో అదృష్టం"
" మీ పాటల ప్రయాణంలో దిల్ రాజు గారి సినిమాలే ఎక్కువున్నట్టున్నాయి ? "
" కరక్టే ... బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారులోకం, ఆకాశమంత, మున్నా, మిస్టర్ పెర్ఫెక్ట్, రామరామ కృష్ణ కృష్ణ, బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ... " 
 
" కొత్త  బంగారులోకం  లో 'నిజంగా నేనేనా' పాటని అప్పట్లో చాల మంది సీతారామ శాస్త్రి గారు రాసేరనుకునేవారు .."
"అవును ... పొగుడుతూ కొన్ని ఫోన్ కాల్స్ ఆయనకే డైరెక్ట్ గా వెళ్ళాయట. అది ఆయనే చెప్పారు"
" హిట్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి భావుకత్వాన్ని, సాహిత్యాన్ని అందించిన తృప్తి ఏ సినిమా పాటల్లో లభించింది మీకు ? "
" ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలోని పాటల్లో సాహిత్య శిఖరాలకి - భావుకత్వం లోతుల్లోకి వెళ్ళే అవకాశం దొరికింది. 'అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయసు సంఖ్యై వుంటా - సంఖ్యలన్ని బంధిస్తుంటా వంద ఏళ్ళుగా - లాంటి వాక్యం ఓ ఉదాహరణ."
" మీకు, ప్రజలకి కలిపి బాగా నచ్చిన పాట ? "
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైటిల్ సాంగ్"
" పెళ్ళయ్యాక పాటలు తగ్గాయా పెరిగాయా ?"
"పెరిగాయి "
"ఎలా ? "
" అంతకు ముందు నెలకి 3 లేక 4 రాసేవాణ్ణి. పెళ్ళయ్యాక నెలకి 8 లేక 9 రాస్తున్నాను"
" ఇంటికి తొందరగా వెళ్ళాలని టైమ్ ఎక్కువ తీసుకోకుండా రాసెయ్యడం ఓ కారణమేమో ?"
" కాదు. థాట్  క్లారిటీ నేర్పిన అనుభవంతో ఎక్కువ వెర్షన్ లు రాయాల్సిన అవసరం పడడం లేదు. దాంతో పాటల సంఖ్య పెరిగింది"
" మీ రైటింగ్ టైమింగ్స్ ? "
" పగలు మేలుకున్నది మొదలు లంచ్ వరకు రాసుకుంటాను"
" ఆ తర్వాత ?"
" రాసినవి  తీసుకెళ్ళి ఒకే చేయించుకోవడం, లేదా మార్పులు చేర్పులు వుంటే వాళ్ళకు కావలసిన విధంగా చేసి 8 - 8.30 కల్లా క్లోజ్ చెయ్యడం ..."
" మధ్యలో ఆడియో ఫంక్షన్ లకి అటెండ్ అవడం, టీవీ లకి పత్రికలకి ఇంటర్ వ్యూలివ్వడం లాంటివి కూడా వుంటాయిగా ? "
" వుంటాయి. వాటికి సంబంధించి కూడా - ఒక్క సినిమా ప్రమోషన్ కి తప్ప మిగిలిన వాటిలో కొన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాను.  "
"ఎందుకలా ?"
" పాటలు తక్కువ ఇంటర్ వ్యూలెక్కువ అయిపోతాయి"
" మరి ఈ ఇంటర్ వ్యూకి  మాత్రం ఎందుకు  ఒప్పుకున్నారు ? "
" కొన్నిటికి విలువ ఇవ్వాలిగా ... "