This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

                బేట్ రాయి సామి దేవుడా పాట గురించి 

కదిరి పట్టణం అనంతపురం జిల్లాలోనిది. ఇక్కడ కదిరి నరసింహ స్వామి దేవాలయంలో ప్రముఖంగా వినిపించే పాటను రీ మిక్స్ చేసి 'అత్తారింటికి దారేది' చిత్రంలో పెట్టారు. 
ఖాద్రీ అనే పేరు కాల క్రమంలో కదిరిగా మారిందని స్థలపురాణం. 
ఖాద్రి, ఖధిర (మడుగు దామర/ చండ్ర చెట్టు ) అనేది ఒక చెట్టు.  ఆ చెట్టుక్రింద వున్న చీమల పుట్టలో నరసింహస్వామి స్వయంభూవై వెలిశాడని చెపుతారు. వేదారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతంలో ఖదిర చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి 'కదిరి' అని పేరు వచ్చిందని కూడా చెపుతారు.
'ఖ' అంటే విష్ణుపాదము. 'అద్రి' అనగా కొండ. అందుకే ఈ పట్టణానికి 'ఖద్రి' అనే పేరు వచ్చి కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని కూడా చెబుతారు. కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణుపాదాలుగా విశ్వసిస్తారు. ప్రహ్లాదుని మొర ఆలకించి హిరణ్యకశిపుడిని వధించేందుకు ఎనిమిది చేతులతో ఉగ్రరూపం తో ఇక్కడే వెలిశాడని కథ. 
ఈ దేవాలయం 13 శతాభ్దం నుంచే వున్నదని అక్కడి ఆధారాలతో చెపుతున్నారు. ఈ ఆలయంలోని రంగమండపంలోని వర్ణ చిత్రాలు కొంత వెలిసినట్లు వున్నా ఇప్పటికీ ఆకర్షణీయంగా వుంటాయి. పునాదిలో కాకుండా కేవలం బండపైనే నిలబెట్టిన ద్వజస్థంభం ఇక్కడి మరో ఆకర్షణ.  ఆరొందల సంవత్సరాల పైచిలుకు వయసు -పదకొండువందలకు పైగా ఊడలతో - ప్రపంచ ప్రసిద్ధి గాంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన 'తిమ్మమ్మ మర్రిమాను' ఈ దేవాలయానికి సమారు 25 కి.మీ దూరంలోనే వుంటుంది.  కదిరికి 12 పన్నెండు కిలోమీటర్ల దూరంలో 'కటారు పల్లె' లో యోగి వేమన సమాధి కూడ వుంది. ఎక్కడా లేని విధంగా ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.- ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడ పెద్ద సంఖ్యలో పాల్గొని 
ఈ స్వామి ని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడ వస్తుంటారు. ఖాద్రీ అనే పేరు ముస్లింల పేర్లలో వినిపిస్తుంది. ఇక పాటలోకొస్తే 
"బేట్రాయి సామి దేవుడా, నన్నేలినోడ…"
ఇందులో బేట్రాయి – బేట రాయడు అంటే వేటకు రాజు – నరసింహ స్వామి. తెలుగులో "వ "కన్నడలో
 "బ",  తెలుగు "ప", కన్నడ "హ" గా పలకటం మనకు తెలిసిందే. వేట రాయుడు కాస్తా కన్నడ పలుకు బడిలో బేట రాయుడు బేట్రాయుడు గా మారి బేట్రాయి స్వామి గా కొలుపులందుకున్నాడు. దీన్నే పాటలో బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడా అని స్తుతిస్తున్నాడు. 
బెట్ట  అంటే కన్నడంలో కొండ, పర్వతము (తమిళంలో విట్ట/వెట్ట, తెలుగులో మెట్ట దీని సజాతి పదాలు కావచ్చు). బెట్టహళ్ళి, బెట్టదహళ్ళి, బెట్టదపుర, బెట్టదతుంగ, బెట్టగెరె, బెట్టకోటె వంటి ఊర్ల పేర్లు కర్ణాటక లో కోకొల్లలు. తమిళనాడులో 'డెంకణికోట' అన్న గ్రామంలోని దేవాలయంలో ప్రధాన దేవుడు వెట్టరాయన్ స్వామి లేదా బెట్టరాయ స్వామి. ఈ ఊరు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది కాబట్టి ఈ ' బేట్రాయ సామి దేవుడా' పాటలోని మూలవిరాట్టు ఈ స్వామిగురించేనని కూడా ఒక విశ్లేషణ వుంది. కానీ వేటతో కూడా ఇక్కడ సంబంధం వుండటంతో వేట పదాన్ని సులభంగా తీసేయలేక తిరిగి పరిశోధనలు జరిపారు. . ఇంతకీ ఈ వేట రాయుడు అంటే ఏంటి ఏంటి వేటాడుతాడు. అని ప్రశ్నించుకోగా దానికీ కొంత ఆధారం దొరికింది.
ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు 'పారువేట' కు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనగా మృగాలు పరుగెత్తుతుండగా వాటిని వెంబడించి వేటాడటం. అడవిలో విచ్చల విడిగా తిరుగుతూ భీభత్సాన్ని కలిగిస్తున్న క్రూర మృగాలను వేటాడి చంపి ప్రశాంతతను చేకూర్చే ప్రధాన లక్ష్యంతో పూర్వం రాజులు వేటకు వెళ్ళేవారు. అది ఆనందం కోసమే కాకుండా ప్రజలకు మృగాలనుంచి రక్షణ కల్పించేదుకు ప్రధాన విధిగా కూడా వుండేది. అయితే ఇప్పుడు దానిని ఆధ్యాత్మికంగా మనసుపై అదుపుకు చేయాల్సిన వేటగా చెపుతూ అరిషడ్వర్గాల ప్రభావానికి లోనైన ఇంద్రియాల ప్రేరణతో నిలకడలేక పోరాడుతూ, ఉండే చంచలమైన మనస్సే ఒక మృగం. అలాంటి స్థిరత్వం లేని భక్తుని మనస్సును పంచాయుధాలతో స్వామి వేటాడి పట్టుకొని ఏకాగ్రతను ప్రసాదించడమే ఈ పారువేట ఉత్సవ నిర్వహణలోని అంతరార్ధంగా కూడా చెపుతారు. నిఘంటువులలో ఈ  
పారువేటకు అర్ధం ఏముందా అని చూస్తే మరికొంత సమాచారం అదనంగా లభించింది.
తిరునాళ్ల చివరనాడు - దేవుడు గుఱ్ఱపు వాహనము మీద, ఊరిమంద బయటికి పోయి, వేటాడినట్లు ఆడుట. ఇది మనం పైన చెప్పుకున్న అర్ధంలాగ  నెల్లూరు; కర్నూలు; అనంతపురం లోని పల్లె ప్రాంతాలలో వయసులో వున్న మగపిల్లలు బయటకువెళ్ళేప్పుడు వ్యంగ్యంగా "అయ్య పారువేట (పార్వేట)కు బయలుదేరినాడే" అంటుంటారు. అంటే వ్యభిచరించేదుకు తిరగటం అనే అర్ధం కూడా దీనికి వుంది.
పందెపు వేట అని మరొక అర్ధంలో కూడా వాడతారు దేవుని ఉత్సవ సమయంలో ఒక గూటానికి పొట్టేలుని కట్టి దూరం నుండి తుపాకులతో గురిచూసి కాల్చటం వుంటుంది. సరిగా గురి చూసి కాల్చిన వాడికి పొట్టేలు స్వంతం అవుతుంది. దీన్ని కూడా 'పారువేట' అనే పిలుస్తారు.
దసరా పండుగ చివరలో జమ్మి కొట్టుటకు వెళ్ళటాన్ని కూడా పార్వేట అనే పిలుస్తారు.
సరే పాట స్క్రిప్టు లో చేప కడుపు చీల్చుకుని పుట్టిన వాడా అని , రాకాసిని కొట్టి చంపాడనీ, కోటిమన్ను నీళ్ళలో వెలిసాడని , బ్రాహ్మణుల చదువులను బ్రహ్మదేవునికి ఇచ్చాడనీ కూడా వుంది. 
సోమకాసురుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను సముద్రం లో దాచేస్తే బ్రహ్మదేవుడు విష్ణువుని ఆశ్రయిస్తాడు. అపుడు విష్ణువు మత్స్య అవతారం ఎత్తి సముద్రం నుంచి ఆ వేదాలను తెచ్చి బ్రహ్మ కి ఇస్తాడు. బాపనోళ్ళ చదువులు అంటే నలుగు వేదాలు.
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి బుట్టితి రాకాసిగాని  కోపాన తీసి కొట్టితీ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
కొటిమన్ను నీళ్ళలోన యెలసి యేగమై తిరిగి.. కొటిమన్ను నీళ్ళలోన...
హొయ్… హొయ్… హొయ్…
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
ఈ పాట జానపద గీతం గానే కాకుండా భజన గీతంగా కూడా రాయల సీమలో ప్రసిద్ధి పొందింది.

1940లో వచ్చిన సుమంగళి చిత్రం (ఈ పేరుతోనే 1965, 1989లో కూడా సినిమాలు వున్నాయి) లో కూడా ఈ పాటను వాడారు.  ఆ చిత్రానికి  ప్రొడక్షన్ మేనేజర్ మనకు కె.వి. రెడ్డి గా తెలిసిన కదిరి వెంకట రెడ్డి (1912 - 1972). కదిరి పై వారికి గల అభిమానంతో  ఆ పాటను ఈ చిత్రం కోసం అందజేసినట్లున్నారు. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి లో జన్మించారు.  సుమంగళి (1940) చిత్రంలోని ఈ పాటను గౌరీపతి శాస్త్రి పాడేరు. కొన్ని వెబ్ సైట్స్ లో నాగయ్య గారు పాడేరని ప్రచారం జరుగుతోంది. అది సరియైన సమాచారం కాదు. నాగయ్య గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేశారంతే..  ఈ లింక్ క్లిక్ చేస్తే ఆ పాటను చూడొచ్చు

'అత్తారింటికి దారేది' చిత్రంలో ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడడం వల్ల విశేషమైన ప్రచారం లభించింది.  ఈ పాట పుట్టు పూర్వోత్తరాలను వెలికితీసే ప్రయత్నం జరిగి - సినీ గీత పరిశోధకులకు ఒక విధంగా లాభించింది.  ఈ లింక్ క్లిక్ చేస్తే ఆ పాటను చూడొచ్చు .  youtu.be/jbFPxFs0jI4

ఆ పాట జానపద రూపం ఇలా వుంటుంది :
బేట్రాయి సామి దేవుడా -                                                                     
నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా                                                                                 
కాటేమి రాయుడా - కదిరినరసిమ్మడా                                                                         
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                                                                              
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                                                                         
బేట్రాయి...                                                                                                                                  
శాప కడుపు సేరి పుట్టగా -                                                                 
రాకాసిగాని కోపామునేసి కొట్టగా                                                                                
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి                                                                    
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ                                                        
బేట్రాయి...                                                                                                                           
తాబేలై తాను పుట్టగా                                                                                    
ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా                                                                           
దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు                                                       
సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ                                                                    
బేట్రాయి...                                                                                             
అందగాడనవుదులేవయా -                                                                     
గోపాల గో విందా రచ్చించా బేగరావయా                                                                  
పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి                                                             
భూమి కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద                                      
బేట్రాయి...                                                                                                                      
నారసిమ్మ నిన్నె నమ్మితి -                                                               
నానాటికైన కోరితి నీ పాదమే గతీ                                                                                          
ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి                                                                           
కోరమీస వైరిగాని గుండె దొర్లసేసినోడ                                                                      
బేట్రాయి...                                                                                                                             
బుడుత బాపనయ్యవైతివి                                                                                                         
ఆ శక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివీ                                                              
నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తిపైన బెట్టి                                                                     
తడవు లేక లోకమెల్ల మెడిమతోటి తొక్కినోడ                                                      
బేట్రాయి...                                                                                                              
రెండుపదులు ఒక్కమారుతో                                                                           
ఆ దొరలనెల్ల సెండాడినావు                                                                    
పరశుతో సెండకోల బట్టి కోదండరామసామికాడ (సెండకోల = గండ్రగొడ్దలి)         
బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ (బెండు కోల = శక్తి తగ్గించుకుని,       
సముద్రం దగ్గర గొడ్డలి విసిరేసి అంత మేరా సముద్రాన్ని వెనక్కి జరిపిన ఘట్టం) 
బేట్రాయి...                                                                                                                        
రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి                                                        
శ్యామసుందర నిన్ను మెచ్చగా సామి                                                   
తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి                                                                              
ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ                                                                   
బేట్రాయి...                                                                                                                      
దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన                                                                            
దేవుడై నిలిచినావురా ఆవూల మేపుకొనీ                                   
ఆడోళ్ళాగూడుకొనీ తావుబాగ సేసుకొనీ                                                      
తక్కిడి బిక్కిడి సేసినోడ (తక్కిడి బిక్కిడి = మోసం)                                           
బేట్రాయి...                                                                                           
ఏదాలూ నమ్మరాదనీ                                                                                     
ఆ శాస్త్రాలా వాదాలూ బాగ లేవనీ                                                                                  
బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ                                                  
నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద                                                                     
బేట్రాయి...    
కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన పలికినావు  
బాలశిశువుడా చిల్లకట్టు పురములోన
సిన్నీ గోపాలుడౌర పిల్లంగోవి సేతబట్టి పేట పేట తిరిగినోడ..
 
(ఇందులో భజన చెయ్యడానికి వాడే చెక్కలు పొడవుగా ఉండే పలకలను పోలి ఉండడం వల్ల చెక్కభజననే 'పలకల భజన ' అని కూడా అంటారు. చేతుల్లో మూరెడు పొడవుండే తాళపు చెక్కలతో, కాళ్ళకు గజ్జెలతో వలయాకారంలో తిరుగుతూ తాళపు చెక్కలు వాయిస్తూ తాళానికి అనుగుణంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. ఒకే చేతిలో రెండు చెక్కలను ఆడిస్తూ వాయించడం చెక్కభజనలోని సొగసు. వలయాకారంలో తిరిగే కళాకారులు కొన్ని సార్లు ఉద్దులు - వెలుద్దులుగా (జతలు జతలుగా) మారి ఎదురెదురుగా అడుగుమార్చి అడుగువేస్తూ ఉద్ది మార్చి ఉద్ది (ఒక అడుగులో ఒకవైపు - ఇంకొక అడుగులో రెండవవైపు) తిరుగుతూ నృత్యం చేస్తారు. పెన్నుద్దికాడైన గురువు పాటలోని ఒక్కొక్క చరణం అందిస్తే మిగిలిన వాళ్ళు అందుకుని పాడుతూ నృత్యం చేస్తారు. పలకల భజనలో జడకోపు తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం చెక్కభజనలో భక్తి, పౌరాణిక, శృంగార, హాస్య సంబంధమైన పాటలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో తిత్తి, మద్దెల, కంజీర వాయిద్యాలుగా ఉండేవి. ఇప్పుడు హార్మోనియం, డోలు, కంజీర, తబలా వాడుతున్నారు.)
కాటమరాజు  శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది.
కాటమరాజు కథాచక్రాన్ని 'యాదవభారతం' అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని - సుద్దులగొల్లలు, కొమ్ములవారు - అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత 'యాదవభారతం - ఎద్దుమోత బరువు' అనే సామెత పుట్టింది.
----------------------------------------------------------------------------
( శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఐదవ అధ్యాయం) :
శ్రీ శుక  మహర్షి చే చెప్పబడిన ప్రద్యుమ్న జన్మ వృత్తాంతంలో అతను చేపకడుపు చీల్చుకుని పుట్టటం వుంటుంది. మరో రకంగా ఇతడు రుక్మిణీ కృష్ణుల కుమారుడు కూడా కావటంతో యాదవ రాజుల కాలంలో ఈ కథ ప్రాచుర్యంలోకి రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
రుక్మిణీ కృష్ణులకు ఒక కుమారుడు కలిగాడు. పూర్వకాలం తను బాణం వేసిన శంకరుని చేత దగ్ధమైన మన్మధుడు శరీరాన్ని కోల్పోయాడు. మన్మధుడు వాసుదేవుడి అంశ కాబట్టి వాసుదేవున్నే ఆశ్రయించాడు. ఆ మన్మధుడే  రుక్మిణీ కృష్ణులకు కొడుకుగా పుట్టాడు . అతని పేరు ప్రద్యుమ్నుడు.
 ద్వారకకు దగ్గరలో ఉన్న రాజ్యములో శంబరుడు అన్న ఒక రాక్షసుడు ఉన్నాడు. నారదుడు శంబరుని వద్దకు వెళ్ళి రుక్మిణీ కృష్ణులకు పుట్టబోయేవాడే నిన్ను చంపుతాడు అని చెప్పాడు . వీరికి ఎపుడు కొడుకు పుడతాడా అని ఎదురు చూస్తూ, పుట్టగానే తన మాయ చేత సముద్రములో పడేస్తే అందులో ఒక పెద్ద చేప మింగింది. మత్స్య కారులు ఆ చేపను పట్టుకున్నారు. అంత పెద్ద చేపను తిరిగి శంబరాసురునికే కానుకగా ఇచ్చారు
మన్మధుని భార్య ఐన రతి - మాయా దేవి అనే పేరుతో - నారదుని ఉపదేశం వల్ల అప్పటికే అక్కడ వంటామెగా
చేరింది. ఆ చేపను ఆమెకిచ్చి వండమన్నారు. ఆమె ఆ చేపను కోయగా పిల్లవాడు కనపడ్డాడు. 
(ఈ కథ ని కూడా కొన్ని కొన్ని వెబ్ సైట్ లలో  పెడుతున్నారు. ఈ కథకు - పాట పల్లవి లో వున్న సాహిత్యానికి 
పొంతన పొసగదు.)
----------------------------------------------------------------------------
ఇది దశావతారాలను గ్రామీణుడు వర్ణించిన ఒక జానపదం. స్వచ్చమైన రాయలసీమ వాసన. భజనల్లో పాడుకునే వాళ్ళు.   భజనల కాంపిటీషన్ లలో  ఈ పాట హోరుకు అంతేలేదు.
సేకరణ  & సమీకరణ :
రాజా (మ్యూజికాలజిస్ట్)