This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 " హైదరాబాద్ కి మొట్టమొదట ఎప్పుడు ఎక్కడ్నించి వచ్చారు ?"

"బాలూ గారి 'పాడుతా తీయగా' ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి వచ్చాను. అప్పుడు తిరుపతి పద్మావతి యూనివర్శిటీ లో ఎమ్.ఏ. మ్యూజిక్ చేస్తున్నాను."
"అంతకుముందు ? "
"గుంటూరు లో ... డిగ్రీ వరకూ అక్కడే ఉన్నాం. అంతకు ముందు నాగార్జున సాగర్ లో .. టెన్త్ వరకూ అక్కడే వుండేవాళ్ళం ...   "
" సినిమాల్లో పాడాలని ఎప్పుడనిపించింది ?"
"చిన్నప్పట్నించే వుండేది. తిరుపతి మ్యూజిక్ కాలేజ్ లో ఇంటర్ వ్యూ లో కూడా అదే చెప్పాను. అది  కూడా ఎవరితోనో తెలుసా ... ప్రపంచం సీతారామ్ గారని ... తిరువయ్యూర్ లో త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పెర్ఫార్మ్ చేసిన స్థాయి ఆయనది ... ఆయన అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ... ఆయనతోనే  అలా అనేశాను. అయినా ఆయన నా వాయిస్  చూసి,  పాడే పద్ధతి చూసి సీట్ ఇచ్చారు. "
" అప్పుడంటే ఓకే ... కానీ ఒకసారి శాస్త్రీయ సంగీతంలో ఎమ్.ఏ. చేసిన తర్వాత కూడా సినిమాల వైపు రావాలనుకునే కోరిక ఇంకా వుండేదా ? తరిగిందా ? పెరిగిందా ?"
" మీరన్నది నిజమే ... కర్ణాటక సంగీతం లోనే సెటిల్ అయిపోదాం అనుకున్నాను. తిరుపతిలో ఆ వాతావరణం వుండేది. ఆ యాక్టివిటీస్ కూడా  వుండేవి. హైదరాబాద్ లో ఆ వాతావరణమే లేదు. అదే టైమ్ కి పాడుతా తీయగా లో వచ్చిన ఉష సక్సెస్ చూసి ఆ ప్రోగ్రామ్ నెక్స్ ట్ సీరీస్ లో పార్టిసిపేట్ చేశాను. ఫైనల్స్ వైజాగ్ లో ... వైజాగ్ లో వైజాగ్ అమ్మాయి (అవసరాల సునీత) తో పోటీ పడి గెలిచాను. "
"మరి సినిమాల్లోకి రావడం ఎలా జరిగింది ? "
" ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ లోప్యాడ్స్ వాయించే  కృష్ణ గారు, మొదలైన వారు హైదరబాద్ లోనే వుంటే అవకాశాలు బాగా వస్తాయని చెప్పారు. అలాగే నా చేత జింగిల్స్ అవీ పాడించారు. అదే టైమ్ లో ఆర్పీ పట్నాయిక్ గారు పరిచయమయ్యారు. ఆర్పీ గారు, నీహాల్, రవివర్మ కలిసి మెలిసి వుండేవారు. ఆప్పుడే అన్నారు ఆర్పీ గారు - "తొందర్లోనే నీతో ఓ సినిమాలో పాడిస్తాను ... ఓ చాన్స్ రాబోతోంది" అని. అన్నమాట ప్రకారం అలాగే  'నీ కోసం' సినిమా టైటిల్ సాంగ్ లో హమ్మింగ్స్ పాడించారు"
" మీకే కాకుండా అది చాలా మందికి మొదటి సినిమా అయింది కదా ?"
"అవును ... శ్రీను వైట్ల గారికి, ఆర్పీ గారికి, నీహాల్ కి , వేణుకి కూడా అదే మొదటి సినిమా "       
 " ఆ తర్వాత ఒక్క చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మాత్రమే పాడారా ?"
" బాచి సినిమాతో ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో పాడడం మొదలైంది. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో ఎక్కువ పాటలు పాడిన మాట నిజమే గానీ - మణిశర్మ గారు చెన్న కేశవరెడ్డి లోనూ, కీరవాణి గారు గంగోత్రి లోనూ పాడించారు.  ఇంకా చెప్పాలంటే చెన్నై లో వుంటున్న సంగీత దర్శకుల దగ్గర తప్ప తక్కిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గరా పాడేను."
" మీ పాటల కెరీర్ పట్ల మీ ఫీలింగ్ ఏమిటి ?"
" బాచీ తర్వాత వరసగా అవకాశాలు రావడంతో కమర్షియల్ పాపులారిటీ పెరిగింది. రా రమ్మని (ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు) పాటతో బాలు గారు, హరిహరన్ గారు వంటి వారితో పాడే స్టేటస్ వచ్చింది. నువ్వక్కడుంటే నేనిక్కడుంటా (గోపి గోపిక గోదావరి) పాటకి నాలుగు అవార్డులు వచ్చాయి. "
 "ప్రస్థుతం సింగర్ గా మీ కెరీర్ ఎలా వుంది ?"
" ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం ఎక్కువైంది. ఆ రేషియోలో సీనియర్స్ కి అవకాశాల శాతం తగ్గింది.
సంవత్సరానికి రెండు మూడు పాటలు వస్తున్నా మంచి పాటలే వస్తున్నాయి. ఈమధ్యనే
'కిస్' సినిమాలో 'పరుగులే తీస్తూ వుంటే' అనే పాట పాడాను. (పెద్ద) వంశీ గారి సినిమా 'తను మొన్నే వెళ్ళిపోయింది' సినిమాలో నావి 4 పాటలున్నాయి"
" ఇప్పటి వరకూ ఎన్ని పాటలు పాడి వుంటారు ?"
" 350 ... అందులో కన్నడం 10, తమిళం 1 కూడా వున్నాయి"
"  ఒక సింగర్ గా విదేశీ పర్యటనలేవైనా చేశారా ?"
" 2008 లోనే మణిశర్మ గారి షోల్లో అమెరికా నెలరోజుల పాటు పార్టిసిపేట్ చేశాను. తర్వాత ఇప్పటివరకూ 7 సార్లు  విదేశాలకు వెళ్ళడం జరిగింది. అందులో అమెరికా తో పాటు దుబాయ్, సింగపూర్, కువైట్ కూడా వున్నాయి"
 "మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు గా  .. దాని సంగతి చెప్పండి "
" మొట్టమొదట ఈ టీవీ వారి 'సై సింగర్స్ చాలెంజ్' సీరీస్ కి టైటిల్ సాంగ్ కంపోజ్ చేశాను. నేనొక వెర్షన్, నీహాల్ ఒక వెర్షను పాడాం.  ఈటీవీ వారిదే 'ఆడది ఆధారం' సీరియల్ కి కూడా కంపోజ్ చేసి ఒక పాట పాడాను. ఆ పాటకి నందీ అవార్డ్ వచ్చింది. 2011 లో జరిగిన తానా సభల్లో  ఒక బ్యాలేని
క్లాసికల్, వెస్ట్రన్, ఫోక్ మ్యూజిక్స్ లో కంపోజ్ చేశాను. వడ్డేపల్లి కృష్ణ గారు రాశారు. అది విన్న కె. విశ్వనాథ్  గారయితే ' ఇన్ని వేరియేషన్స్ ఎలా ఇచ్చావు ? ' ఎంతగానో ప్రశంసించారు.  అన్నమయ్య కీర్తనలు 4 కొత్తవి 4 పాతవి తీసుకుని ' శ్రీ అన్నమయ్య సంకీర్తన సుధ' అనే ఆల్బమ్ రిలీజ్ చేశాను.  ఓ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసే చాన్స్ కూడా వుంది. త్వరలోనే ఆ న్యూస్ కూడా మీకు చెబ్తా ..."  
 
" సడన్ గా మీ డ్రెస్ సెన్స్ లోనూ, మేకప్ లోను మోడర్న్ లుక్ వచ్చేసింది. ఈ అకస్మాత్ మార్పుకి కారణం ఏమిటంటారు ? "
" ఈ మోడర్న్ లుక్ సెన్స్ నాలో ఎప్పట్నించో వుంది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ నేను మొదట్నించీ
పెట్టుకునేదాన్ని. మొన్న అమెరికా నుంచి వచ్చిన ఉష లేటెస్ట్ ట్రెండ్ అని తన ఇయర్ రింగ్స్ చూపించింది. 'ఇలాటివి నేను మొదట్లోనే పెట్టుకునే దాన్ని కదా ?' అని అంటే 'కదా ?' అంటూ నవ్వేసింది. కాకపోతే చానల్స్ వచ్చాక ఈ  రకమైన అబ్జర్వేషన్స్ పెరిగాయి. ఏ సీజన్ లో ఏ కలర్ వాడాలి, బైట ఏం వాడాలి, తెర మీద కనిపించేటప్పుడు ఏం వాడాలి ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకోవడానికి, ఆ సెన్స్ ని అలవర్చుకోవడానికి కొంతకాలం పట్టింది.  ఇప్పుడు పిల్లలు కూడా ఈ రకం ఫ్యాషన్స్ ని లైక్ చేస్తున్నారు. మొన్న తానా సభల్లో ఒకమ్మాయి 10-11 ఏళ్ళుంటాయేమో .. 'ఐ లవ్ యువర్ ఇయర్ రింగ్స్' అంది. ఇంకొకమ్మాయి అయితే  నా  దగ్గరున్న బ్రేస్ లెట్ తనకు గిఫ్ట్ చెయ్యమని అడిగింది "
" అమెరికాలో మీరు మీ పాక శాస్త్ర ప్రావీణ్యం చూపించేవారటగా ... మీరు  అంత బాగా వండుతారా "
"బ్రహ్మాండం గా వండుతాను"
"ఏమిటి ఈ స్పెషల్స్ ? "
" పులిహోర, కందిపచ్చడి, మజ్జిగ పులుసు, పెరుగు పచ్చళ్ళు, మామిడికాయ పప్పు,  అన్నం కందిపప్పు కిచిడీ,  క్యారెట్ రాయితా, కొత్తిమీర పచ్చడి, అన్నిటికన్నా అతి ముఖ్యం నూనె వంకాయ ... ప్రస్థుతానికివే గుర్తొస్తున్నాయి"
"చాల్చాలు .ఇప్పటికే ఈ పేజీ నిండిపోయింది. చదివే వాళ్ళ నోట్లో నీళ్ళూరుతున్నాయేమో కూడా ... అంచేత ఆపేద్దాం ప్రస్థుతానికి".
 
రాజా (మ్యూజికాలజిస్ట్)