This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

ఒక ప్రముఖుడి గురించి ఆర్టికల్ రాయడం వేరు, ఇంటర్ వ్యూ చేసి జబాబులు రాబట్టడం వేరు. ఈ రెండిటికన్నా భిన్నమైనది ఆ ప్రముఖుడి పై అభిప్రాయాలను మరికొంత మంది  నుండి

సేకరించి పొందుపరచడం. సరిగ్గా అటువంటి ప్రయత్నమే ఈసారి చెయ్యడం జరిగింది. 
ఆగస్ట్ 2 దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనతో పనిచేసిననలుగురు రచయితలు తమ అనుభవాలను, అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు : 
 
సంస్కార సంగీత తరంగం
 
సంగీతం, సాహిత్యం - మనిషిలోని పశు ప్రవృత్తిని నశింపజేసి , మనిషిలో దాగున్న మనిషిని, మనిషిలో దాగున్న మానవత్వాన్ని వెలికితీసే సాధనాలు. వాటి ద్వారా మనిషిలో స్ఫూర్తిని, చైతన్యాన్ని, ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించవచ్చు, పెంపొందించవచ్చు అని ప్రతి పాట ద్వారా నిరూపిస్తున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారు. అందుకే ఆయన్ని 'సంస్కార సంగీత తరంగం' గా అభివర్ణించవచ్చు.
ప్రతి కళాకారుడిలోనూ దాగున్న అత్యుత్తమ ప్రతిభను గుర్తించి బైటికి రాబట్టే సమర్ధత ఆయనకుంది.   ఆయనతో పని చేసే ప్రతి రచయితకీ , గాయనీ గాయకులకీ, సాంకేతిక నిపుణులకీ ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆయన్ని అందరూ అభిమానిస్తారు, ప్రేమిస్తారు. అదేవిధంగా ఆయన కూడా అందరిని సమానంగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు.
ఈరోజు - దేవిశ్రీ ప్రసాద్ గారి పుట్టినరోజుని - 'సంస్కార సంగీత జన్మదినం' గా భావిస్తున్నాను.
 
చంద్రబోస్
( అమెరికా వెళుతూ ఫ్లయిట్ నుంచి వాయిస్ మెయిల్ ద్వారా పంపిన మెసేజ్ ఇది)
 
 
 
సక్సెస్ ని, సంస్కారాన్ని సమపాళ్ళలో పెంచుకుంటున్న వ్యక్తి
 
'స్వాతి ముత్యం'సినిమాలో కమల్ హసన్ డాన్స్ ఏమీ రానివాడిలా స్టెప్పులు వేస్తాడు. కమల్ హసన్ కి డాన్స్ చాలా బాగా వచ్చు. అంత బాగా వచ్చి అదేమీ మైండ్ మీద పడకుండా అలా స్టెప్స్ వెయ్యడం ఎంత గొప్ప విషయమో - 
మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర క్లాసికల్ నేర్చుకుని - ఆ ప్రభావానికి పూర్తిగా విరుద్ధమైన - ఆ అంటే అమలాపురం, కెవ్వు కేక వంటి ఫుల్ మాస్ సాంగ్స్ ఇవ్వగలగడం, ఒకే సినిమాలో అటు దేవదేవం వంటి క్లాసికల్ సాంగ్ , ఇటు కిర్రాకు వంటి మాస్ సాంగ్ ఇవ్వగలగడం కూడా దేవిశ్రీని గురించి గొప్పగా ఫీలవాల్సిన విషయాలు. 
తనకి రాయడం తెలుసు. తను రాసిన పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇంత తెలిసి కూడా రచయితలతో సౌకర్యంగా రాయించుకోగలగడం దేవి కి ఇంకా బాగా తెలుసు. ఆడియో ఫంక్షన్స్ లో తనతో పని చేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదికి పిలిచి పరిచయం చేసి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి అందరికీ తెలిసేలా చేయడం దేవి కి ఉన్న సంస్కారం. అంతేకాదు సక్సెస్ ని, సంస్కారాన్ని సమపాళ్ళలో పెంచుకుంటూ వస్తున్న అతన్ని చూస్తే ముచ్చటేస్తుంది. సంస్కారం లేని చోట సక్సెస్ ఎక్కువ కాలం నిలబడదు. దేవి కి పని మీద ధ్యాస తప్ప మరొకటి తెలియదు. నిరంతరం పని పని పని... అందుకే పని లో పని గా - పుట్టిన రోజు పూట - నా శుభాకాంక్షలను కూడా అందుకోవాలని కోరుకుంటున్నాను.
 
రామజోగయ్య శాస్త్రి
 
 
బాణీ అనే స్థలాన్ని మాత్రమే కాదు భావాలనే స్థంభాలని కూడా ఇస్తాడు
 
సంగీతం శరీరంగా, గీతం ఆత్మ గా పుట్టిన మనిషి - దేవిశ్రీ ప్రసాద్. అతని ఫిలాసఫీ ఏమిటంటే - పనిలోనే పరమాత్మని దర్శించగలగడం. పాటలని స్వరపరిచే ప్రయత్నంలో అలసిపోతే - మరో పాటని స్వరపరచడమే అతనికి తెలిసిన విశ్రాంతి. యాంత్రిక జీవితంలో యువతకు కావలసిన లయ విన్యాసాన్ని, సాహితీ పరులకు కావలసిన పదవిన్యాసాన్ని సమతూకంలో చూపించగల ఏకైక సంగీత దర్శకుడు. అతని పాటల్లో సాహిత్యం స్పష్టంగా వినబడుతుంది. అలాగని లయ పేలవంగా వుండదు. 
రచయితలకి - పాట అనే కోటని నిర్మించమని ఆజ్ఞాపించినప్పుడు - కేవలం బాణీ అనే స్థలాన్ని మాత్రమే ఇవ్వడు. భావాలనే స్థంభాలని కూడా ఇస్తాడు. కోట అంతా పూర్తయ్యాక వచ్చి చూస్తానంటాడు. అలా నిర్మాణం పూర్తయిన ఆ కోట సింహద్వారం మీద పాట పల్లవినే నామకరణం గా చేస్తాడు తప్పితే తన ఘనతగా చెక్కించుకోడు. 
 
దేవిశ్రీ తో నా తొలి పరిచయం - నా రెండో సినిమా 'ఒక ఊరిలో' తోనే.  ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా ఆయన ట్యూన్ కి పాట రాసి కలిశాను. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 'ఇది ఒక ప్రయత్నం మాత్రమే .. పెద్దగా ఆశ పెట్టుకోవద్దు' అంటూ తీసుకెళ్ళాడు. రెండో చరణంలో - 'సాగాలిలే ఈ అల్లరి,  ఈ తీపి జ్ఞాపకాలే మన ఊపిరి' అంటూ రాశాను. అది చూసి దేవి 'మన సినిమా మొత్తం సారాంశం ఇదే కదా !?' అని ఆ పాటని యాక్సెప్ట్ చేశాడు. ఎదుటి మనిషిలోని ప్రజ్ఞని కేవలం 3-4 నిమిషాల్లో పట్టుకోగల సునిశిత సామర్ధ్యం అతనిది. అలా  6 పాటలు రాసి ఆ సినిమాకి కూడా సింగిల్ కార్డ్ రైటర్ని అయ్యాను. అప్పుడు అలా ఆయనతో  మొదలైన ఆ అనుబంధం ఇప్పటికి 34 పాటల దాకా సాగింది. 
 
 ఆనాటి నుంచి నా ఊపిరిలో ఊపిరిగా వున్న ఈ తీపి జ్ఞాపకాలని అతని పుట్టిన రోజు నాడు మీతో పంచుకుంటూ అతనికి శుభాకాంక్షల్ని మీ ద్వారా అందజేస్తున్నాను.
 
అనంత శ్రీరామ్
 
ఏ వైపు నుంచి చూసినా సద్గుణాలే
 
దేవి చిన్నపిల్లాడిగా వున్నప్పటి నుంచి నాకు తెలుసు. వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు ఓ సారి దర్శకుడు సాగర్ గారిని తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆయనతో నేనున్నాను. సత్యమూర్తి గారు తన పిల్లల్ని పరిచయం చేస్తూ 'వీడు కీ బోర్డ్ బాగా వాయిస్తాడండీ .. అందుకని ఓ రూమ్ సెపరేట్ గా  ఇచ్చేశాను' అని దేవి ని చూపించి చెబుతుంటే భలే ముచ్చటేసింది. ఇంట్లో సంగీతభరితమైన వాతావరణం, సంస్కారవంతమైన వాతావరణం, పెద్దవాళ్ళని గౌరవించే లక్షణాన్నిచిన్నపటినుంచే అలవరిచే వాతావరణం - ఇవన్నీ ఆ పిల్లలకి సమకూరేలా వుండడం వారికి లభించిన వరాలు.
 
దేవి మైండ్ చాలా మెచ్యూర్డ్. తన వయసుకు 3 రెట్లు వయసున్న వారికుండే మెచ్యూరిటీ అతనికుంది. పాట రాయడానికి వచ్చిన రచయితలని మంచి మూడ్ లో వుంచడానికి నవ్విస్తూ, మెటీరియల్ తీసుకుంటూ , బాగున్న దగ్గిర ఎప్రిషియేట్ చేస్తూ, ఎవరి దగ్గర ఎంత వర్క్ ఎలా తీసుకోవాలి, ఎవరికి ఏ వర్క్ ఇస్తే ఎలాంటి అవుట్ పుట్ వస్తుంది - ఇలాంటి వన్నీ బాగా తెలిసినవాడు. పైగా రచయిత కొడుకు కావడం, తనకు కూడా బాగా రాసే సామర్ధ్యం వుండడం  వల్ల రచయిత ఎక్కడైనా ఇబ్బంది పడుతూ వుంటే ఏ రూట్లో వెళితే  తను అనుకున్న భావం టచ్ అవుతుందో కూడా చెప్పగలడు.  
 
చాలా చోట్ల చూస్తూ వుంటాం.  కొంతమంది తమకి పేమెంట్లు ఎక్కడి నుంచి ఎంత రావాలి, ఎన్నిటికి ఎలా  వెంటపడాలి ఇలాంట్ టెన్షన్ లన్నీ రైటర్స్ ముందే డిస్కస్ చేస్తూ వుంటారు. ఇవన్నీ రైటర్లకి ఇబ్బందిగా వుంటాయి. వాళ్ళ మూడ్స్ ని  డిస్టర్బ్ చేస్తూ వుంటాయి . దేవి ఇలాటివేవీ రైటర్స్ ముందు డిస్కస్ చెయ్యనే చెయ్యడు. వాళ్ళకి ఎలాంటి ఎట్మాస్ఫియర్ క్రియేట్ చెయ్యాలో తనకి  బాగా తెలుసు. తన టెన్షన్ లని అస్సలు బైట పడనివ్వడు.  ఇది ఒకరు చెబితేను, నేర్పితేను వచ్చేది కాదు .
ఇంకో విషయం చెబుతాను. 'ఫనా' సినిమాలో 'చాంద్ సిఫారిష్'  అనే పాట విన్నాను. సూఫీ స్టయిల్లో భలే సూతింగ్ గా వుంటుంది. 'ఇలాంటిదెవరైనా తెలుగు లో చేస్తే బాగుండును' అనుకున్నాను. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్' లో 'ఆకాశం అమ్మాయైతే ' పాట విని ఆశ్చర్యపోయాను. అంటే తను కూడా లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫాలో అవుతూ తనదైన స్టయిల్ లో తనని తాను అప్ డేట్ చేసుకుంటున్నాడన్నమాట.  ఇంత ప్రొఫెషనల్ టచ్, ఇన్ని మానవీయ విలువలు కలిగిన కాంబినేషన్ తో వున్న వ్యక్తులు అరుదుగా వుంటారు. ఏ వైపునుంచి చూసినా అన్నీ సద్గుణాలే గల వ్యక్తిని విజయం వరించకుండా దూరం గా వుంటుందా ?     
 
పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి దేవిశ్రీ ప్రసాద్ కి నా ఆశీసులు.
 
సాహితి  
 
 
(రాజా - మ్యూజికాలజిస్ట్)