మంచిమనిషి, సహృదయుడు, అతి వేగంగా పాట రాసిస్తాడు లాంటి ప్రశంసా వాక్యాలే తప్ప వేరొకరు వేలెత్తి చూపే కాంట్రవర్సీ లేని జీవితం భువనచంద్రది. 26 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో వుంటూ ఇంత ప్రశాంతంగా, తృప్తి గా వుండడానికి ఎంతో పరిపక్వత కావాలి. ఎంతో సాధన కావాలి. వాటిని సాధించిన భువనచంద్ర పుట్టిన రోజు ఆగస్ట్ 17. ఆయనకు శుభాకాంక్షలనందిస్తూ, పాఠకులకు సమర్పిస్తున్న స్పెషల్ ఇంటర్ వ్యూ ఇది :
" ఆర్మీ నుంచి సినీ జీవితానికొచ్చారు కదా ... అసలటు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ?"
" దిక్కు లేక ... ఇది సెటైర్ కాదు ... నిజం ... రికమండేషన్ అనే 'ఉత్తర' దిక్కు, లంచం అనే
'దక్షిణ' దిక్కు నాకు లేకపోవటం మొదటిది. రెండోది నేను లైబ్రరీలకెళ్ళి చాలా పుస్తకాలు చదువుతూ వుండేవాణ్ణి. అందులో యాత్రికుడు, విస్తృత యాత్రికుడు నన్నెక్కువగా ఆకర్షించాయి. మొత్తం దేశం అంతా చూడాలన్న కోరిక పుట్టింది. ఈలోగా నా కళ్ళెదురుగా నా స్నేహితుడు లారీ కింద పడి చనిపోవటం. ఇది మూడవది. ఇక నాలుగవది... గన్నవరం దగ్గర ఓ పెళ్ళిపందిట్లో పెట్రొమాక్స్ లైట్ అంటుకుని పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తప్ప మిగిలిన అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు, స్నేహితులు మొత్తం 400 మంది స్పాట్ లో సజీవదహనం అయిపోవటం. దాంతో ఏముంది లైఫ్ అనిపించింది. కన్ను మూసి తెరిచే లోగా మరుక్షణం నీది కాదు అనిపించింది. వైరాగ్యం ఆవహించింది.
అప్పటికే టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఎవ్వరిమీదా ఆధారపడకుండా ట్యూషన్లు చెప్పుకుంటూ వుండేవాణ్ణి. మా పక్కింట్లో శంకర్రెడ్డి అని ఒకాయన నాకంటే 2 ఏళ్ళు పెద్ద "ఆర్మీ లో సెలక్షన్స్ కి వెళుతున్నాను" అని చెప్పాడు. "నేనూ వస్తాను" అన్నాను ". "ఇంత బక్కగా వున్నావు నువ్వేం సెలెక్టవుతావ్ ?" అన్నాడు. అయినా సెలెక్ట్ అయ్యాను. అది నాకొక అద్భుతమైన మలుపు.
ఏప్పుడైతే ఆర్మీ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చామో డెత్ వారంట్ మీద సంతకం పెట్టినట్టే లెక్క. అంటే మొట్టమొదట చావంటే భయం పోతుంది. లైఫ్ ఫిలాసఫీ వంటబడుతుంది. ఫిలాసఫర్ అయితే జీవితం బావుంటుంది. ఆ చింతన మనిషిని మానవత్వం గల మనిషిగా మారుస్తుంది. సంకుచితత్వం పోతుంది. ఒక రకంగా అది భారతీయ ఆత్మ ని తెలుసుకునేలా చేస్తుంది. విభిన్న సంస్కృతులు, అభిరుచులు, భాషలు, మతాలు, వాటి సారాంశం - వీటన్నిటి మీద అవగాహన పెరుగుతుంది.
నా ఫస్ట్ పోస్టింగ్ - ఢిల్లీ ... అంటే హస్తినాపురం ... ఏదైనా ఓ ప్రదేశం గురించి క్షుణ్ణంగా తెలియాలంటే - వారం పది రోజులో, నెలా రెణ్ణెల్లో వుండి వచ్చెయ్యడం కాదు. కనీసం 3-4 సంవత్సరాలుండి మమేకమై పోవాలి.
ఒక మూర్ఖుడు ఒక మహాత్ముణ్ణి ఒక చెంప మీద కొడితేనే - రవి అస్తమించని సామ్రాజ్యంగా విస్తరించుకున్న వారి దేశం - ప్రపంచపటంలో చిన్న చుక్కగా మారిపోయిందే - అటువంటిది రెండో చెంప మీద కూడా కొట్టి వుంటే ఏమయివుండేది ? ఒక చెంప మీద కొడితే రెండో చూపించగలగడమే మహాత్ముల శక్తి. అదే భారతీయ ఆత్మ. ఇటువంటివి తల్చుకుంటూ - హస్తినాపురం, కురుక్షేత్రం చూస్తూ ఇక్కడే కదా కృష్ణుడు భగవద్గీతను బోధించాడు అని మురిసిపోతూ దేశం అంతా తిరిగాను. ఏ జన్మలోని ఋణమో మిగలకపోతే అటువంటి ప్రదేశాలు చూసే అదృష్టం దక్కుతుందా ? ఒక విధంగా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లోని వుద్యోగం నా జన్మ జన్మల పుణ్యం "
" ఎన్నాళ్ళున్నారు ఆర్మీ లో ?"
" 18 ఏళ్ళు "
" మామూలుగా రిటైర్ అయ్యారా వలంటరీ రిటైర్మెంటా ? "
" వలంటరీ రిటైర్మెంటే "
"మరి జన్మజన్మల అదృష్టాన్ని 18 ఏళ్ళకే ఎందుకు వదిలేసుకున్నారు ?"
"ఆర్మీ ఉద్యోగంలో 15 ఏళ్ళు వుంటాననే సంతకం పెట్టాను. అయినా 18 ఏళ్ళున్నాను. అక్కణ్ణించి ఎప్పటికైనా బైటికి రావల్సిందే. జీవితంలో అతి ముఖ్యమైన యవ్వన దశని అక్కడే గడిపాను. ఒంట్లో కాస్త శక్తి వుండగా వస్తే మిగిలిన జీవితాన్ని కూడా సార్ధకం చేసుకోవచ్చనిపించింది."
" ఆ తర్వాత ?"
" ఓ ఎన్ జీ సీ లో ఉద్యోగం వచ్చింది గానీ చేరలేదు. "
" ఎంచేత ? "
"డెస్టినీ ఇటు నడిపిస్తుంటే అటు ఎలా వెళ్ళగలను ?"
" కేవలం డెస్టినీయేనా ... మీకు ఇంట్రస్ట్ లేదా ? "
"ఎందుకు లేదు ... నాలుగో క్లాస్ చదువుతున్నప్పటి నుంచీ వుంది. వాల్ పోస్టర్స్ మీద శ్రీ శ్రీ అని రాసి బ్రాకెట్స్ లో రామభక్త హనుమాన్ ఫేమ్ అని చూసి అంతటి మహాకవిని కూడా ఫలానా సినిమా ఫేమ్ అని రాస్తే జనం గుర్తు పట్టే పద్ధతిలో తేడా వుంటుందనిపించింది. అందుకే రెటైర్మెంట్ తీసుకున్నాక సినీ పరిశ్రమకే వెళ్ళాను."
" ఎంట్రీ ఎలా దొరికింది ? "
"రచయిత్రి తెన్నేటి హేమలత గారు నాకు బాగా తెలుసు. ఆవిడ నన్ను చంద్రమోహన్ గారి దగ్గరికి పంపించారు. అయన నన్ను జంధ్యాల గారికి, రేలంగి నరసింహారావు గారికి పరిచయం చేశారు. జంధ్యాల గారు 'నేనిప్పుడు పడమటి సంధ్యారాగం షూటింగ్ కోసం అమెరికా వెళుతున్నాను. వచ్చిన తర్వాత కలవండి ' అన్నారు. రేలంగి నరసింహారావు గారు కూడా 'తర్వాత చూద్దాం' అన్నారు. అలా ప్రయత్నిస్తూనే పేజీకి 15 రూపాయల చొప్పున ట్రాన్స్ లేషన్స్ చేసేవాణ్ణి. ఈలోగా గుత్తా రామ్ సురేష్ గారు కనిపించారు. ఆయనకి గద్వాల్ లో ఆయిల్ ఇండస్ట్రీ వుంది. ఆయనతో నాకు పరిచయం వుంది. ఆయన విజయ బాపినీడు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఇవన్నీ నేను మద్రాస్ కి వెళ్ళిన 15-20 రోజుల్లోనే జరిగిపోయాయి. అప్పుడు విజయ బాపినీడు గారు ''ఆన్ పావమ్ అనే ఓ హిట్ సినిమా ఆడుతోంది. అందులో టైటిల్స్ వస్తున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది. అది విని ఓ సాంగ్ రాసుకు రండి. బావుంటే చాన్స్ ఇస్తాను. లేకపోతే ఇంకెక్కడా ప్రయత్నించకుండా మద్రాస్ వదలి వెళ్ళిపోతానని మాట ఇవ్వండి" అన్నారు . ఇదో కొత్త రకం చాలెంజ్ ... సరేనని ఆ సినిమాకి వెళ్ళి టైటిల్స్ వరకూ చూసి 3 పల్లవులు, 4 చరణాలు రాసుకుని ఒక గంటలోనే తీసుకెళ్ళి చూపించాను. చూసి బాగా ఇంప్రెస్ అయ్యారాయన. 'ఒక గంటలోనే ఇంత బాగా ఇన్ని వెర్షన్స్ రాశారు కాబట్టి మీరు మద్రాసు వదలి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను' అని 'నాకూ పెళ్ళాం కావాలి' లో ఓ పాట రాయించారు. ఆ తర్వాత ఆయన దగ్గర నా రెండో సినిమా 'మా ఇంటి మహారాజు' కి సింగిల్ కార్డ్. ఆ తర్వాత ఆయన తీసిన 'ఖైదీ నం.786' లో మూడు పాటలు రాయించారు. అందులో 'గువ్వా గోరింకతో' పాట పెద్ద హిట్. చిరంజీవి గారి సినిమా కూడా కావడంతో ఆ పాట ద్వారా అందరికీ తెలిసి ఇండస్ట్రీ లో పూర్తిగా నిలదొక్కుకోవడం జరిగింది. ఆ తర్వాత 'గ్యాంగ్ లీడర్' వంటి వరస హిట్లు ... ఇదీ సినీ ప్రస్థానం"
" ఫస్ట్ సాంగ్ ఏమిటి ? ఎంత టైమ్ పట్టింది రాయడానికి ? "
" నాకూ పెళ్ళాం కావాలి లోనే ' వినోదాల విందురా ' పాట ఫస్ట్ ఫిల్మ్ సాంగ్. వాసూరావు మ్యూజిక్ డైరెక్టర్ ... కరక్ట్ గా అయిదే అయిదు నిముషాల్లో రాశాను ."
" అంత త్వరగా ఎలా రాయగలిగారు ? పైగా మొదటి పాట ... టెన్షన్ అదీ ఫీలవలేదా ?"
" లేదు. ఆర్మీలో వున్నప్పుడు రకరకాల పాటలు సహోద్యోగులు పాడుతూ వుండగా వినేవాణ్ణి. హిందీ లోనే పంజాబీ, భోజ్ పూరీ, గుజరాతీ ఇన్ని రకాలుగా ప్రొనౌన్సియేషన్ దగ్గర్నుంచి వైవిధ్యం వుంది . అప్పట్లో టేప్ రికార్డర్లు మా దగ్గర లేవు. రేడియోలు కూడా కాస్ట్ లీ ఎఫైర్. కేవలం ట్యూన్ మాత్రం గుర్తుపెట్టుకుని నాకు తెలిసిన తెలుగు పదాలతో జత చేస్తూ పాడుకునే వాణ్ణి. ట్యూన్ గుర్తుపెట్టుకోవడం, ట్యూన్ కి పాట రాయడం అలా నాకు తెలియకుండానే ప్రాక్టీస్ అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. నా మొదటి సినిమా విడుదల కాకముందే రికార్డయిన పాట విని తన ప్రతి సినిమాలోనూ పాట రాయిస్తానని మాట ఇచ్చారు దర్శకులు వి. మధుసూదన రావు గారు. ఆ ప్రకారమే 'ఆత్మ' సినిమాలో రాయించారు. ఆ తర్వాత 'ప్రాణ స్నేహితులు' లో 'స్నేహాని కన్న మిన్న' పాట రాయించారు. ఇవాళ్టికీ ఫ్రెండ్ షిప్ డే నాడు ఆ పాట పాడుకుంటూ వుంటారు. "
" ఒక్క మాట చెప్పండి. మీ మాటల్లో చేతల్లో విపరీతమైన తాత్విక చింతన కనబడుతూ వుంటుంది. మరి పాటల దగ్గరికొచ్చే సరికి కొంచెం చిలిపి శృంగారం ( చిన్నారి ఈడు లోన చిక్కాయిలే చీనీ పళ్ళు - చిన్నదానా ఒసి చిన్న దానా - ప్రేమలేఖ), (ఈ తీపి వస్తువు ఏడ దాస్తివి - నిన్న కుట్టేసినాది - నరసింహనాయుడు), కొన్ని అల్లరి చిల్లరి పదాలు (టపు టపు టపోరా - గ్యాంగ్ లీడర్) కనబడుతూ వుంటాయి ...ఏంటీ కాంట్రాస్ట్ ? "
" దీనికి చాలా పెద్ద సమాధానం ఇవ్వాలి. ఆ క్షణాన్ని ఆ క్షణం గా జీవించగలడమే తాత్వికదృష్టి. దేన్ని దానిగా చూడగలగటం అన్నమాట. ఇక్కడ సాంగ్ ఈజ్ ఫర్ సాంగ్ సేక్. అంతకు మించి పరమార్ధం ఆ పాటకి లేదు. దాన్లో నే ఓ చిన్న చిరునవ్వుతో కూడిన చమత్కారాన్ని తీసుకురాగలిగితే ఆ పాట పరమార్ధం నెరవేరినట్టే. దీనికి ఓ కథ చెబుతాను.
ఓ అడవిలోకి ఓ 5గురు వెళ్ళారట. దట్టమైన ఆచెట్లను చూసి వీటన్నిటినీ కలప గా కొట్టేసి అమ్మితే ఏడాదికి ఎంత వస్తుంది ఒకడు లెక్కలు కట్టాడుట. ఈ చెట్ల మీద పక్షులు ఎంతందంగా, స్వేచ్చగా వచ్చి వాలి వెళుతున్నాయి అని ఇంకొకడు మురిసిపోయాడుట. ఈ చెట్ల మీదున్న ఆకులన్నిటినీ విస్తళ్ళు గా కుట్టి ఇస్తే ఎంతమంది పేద ప్రజలు హాయిగా భోజనం చేస్తారో కదా అని మరొకడు అనుకున్నాడట . వేరొకడు 'భగవంతుడా ... గడ్డి పరకనీ సృష్టించింది నువ్వే ఇటువంటి మహా వృక్షాలనీ సృష్టించింది నువ్వే ... ఎంత గొప్పవాడివి నువ్వు' అని భక్తి పారవశ్యంలో మునిగిపోయాడట. 'ఇలాటివి ఎన్నున్నా ఎప్పటికైనా మోడై రాలిపోవలసిందే కదా' అంటూ వైరాగ్య ధోరణిలో అనుకున్నాడట చివరాఖరి వాడు .
వైరాగ్యం రాంగ్ రూట్ లోకెళితే ఇలాగే వుంటుంది. అక్కడ వున్న వస్తువొక్కటే. ఒక్కొక్కళూ ఒక్కొక్కలా చూశారు. మీరు ఉదహరించిన పాటల్లోనే ఓ పాటకి భార్గవ్ ఆర్ట్ స్ నిర్మాత గోపాలరెడ్డి గారు ఫోన్ చేసి అరగంట పాటు తల్చుకుని తల్చుకుని మరీ నవ్వారు. ఆ మాత్రం చమత్కారం, ఓ రవ్వ రసికత్వం దాటి హద్దులు మీరలేదనే అనుకుంటున్నాను. మీరు ఆశిస్తున్న తాత్విక ధోరణి రావాలంటే నేను మానసిక సన్యాసం స్వీకరించాలి. అదే స్వీకరిస్తే నేనీ ప్రపంచంలో వుండలేను. "
" నిజానికి నేనడిగిన ప్రశ్నకి ఇంత చిన్న డిబేట్ సరిపోదు ... అయినా ఇదొక శాంపుల్ అండ్ ఎగ్జాంపుల్... సరే ఇది చెప్పండి ... మీ పాటల్లో అన్య భాషా పదాలు మిగిలిన వారికన్నా ఎక్కువగా వుంటుంటాయి ... దీని గురించి ఏం చెప్తారు ? "
" కులాసా రాదోయ్ రమ్మంటే - మజాకా కాదోయ్ వలపంటే - ఖలేజా అంటూ వుండాలోయ్ - అని రాశారు ఆరుద్ర 'అన్నపూర్ణ' సినిమాలో. కులాసా, మజాకా, ఖలేజా - ఈ మూడూ హిందీ పదాలే. 'కన్యాశుల్కం' నాటకం లో 'ఏమిటీ బేహద్బీ' అని రాశారు గురజాడ. రైట్ ప్లేస్ లో రైట్ వర్డ్ టెంపో కోసం వేస్తే గ్రిప్, ఫోర్స్ వుంటాయి. బంగారు కోడి పెట్ట పాటలో అప్ అప్ హ్యాండ్సప్ అన్నా, సలాము చేస్తే గులాము నేనై వుంటా ఖలేజా ఖరీదు కట్టే షరాబు నేనై వుంటా (మెరుపులా - అత్తకు యముడు అమ్మాయికి మొగుడు) అన్నా - ఆ ఫోర్స్, గ్రిప్పు కోసమే..... అప్ అప్ హ్యాండ్సప్ బదులు ' రా రా ఇటు రా' అనొచ్చు. గానీ అ ఫోర్సు, ఆ గ్రిప్పు వుంటాయా ?"
" మరి టపు టపు టపోరి లాంటి పద ప్రయోగాలు ? "
" అది అర్ధం పర్ధం లేని పదం కాదు. టపోరా అంటే పనీ పాటా లేక తిరిగే వేగబాండ్ లాంటి వాళ్ళు. అవారా (1951) సినిమా చూడండి . అందులో రాజ్ కపూర్ గురించి నర్గీస్ తో వాళ్ళ నాన్న అంటాడు - ఐసే టపోరా లోగోం సే - అని అంటాడు. మన పాటల్లో అన్య భాషా పదాల గురించి మీరడిగారు. ఇక్కడ మీకే కాదు మీ ద్వారా అందరికీ చెప్పాల్సింది ఒకటుంది.
అన్య భాషా చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ తెలుగు సాంగ్స్ రాసింది నేనే.
'షికార్' అనే మలయాళ సినిమాలో 'ప్రతిఘటించు' అనే పాట, ఎమ్.ఎఫ్. హుస్సేన్ హిందీలో తీసిన 'మీనాక్షి' సినిమాలో 'చిట్టెమ్మా చిలకమ్మా' (ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్) పాట, 'సత్య ఇన్ లవ్' కన్నడ సినిమాలో ' రామా శ్రీరామా రామా రఘురామా' పాట, ఇక అందరికీ తెలిసిన 'చంద్రముఖి' తమిళ వెర్షన్ లో 'రా రా సరసకు రా రా' పాట ఇవన్నీ నాకు వేరే రాష్ట్రంలో గౌరవాన్ని కలిగించిన ఫుల్ లెంగ్త్ తెలుగు సాంగ్స్."
" ఇవి కాక మన తెలుగు సినిమాలోనే భాషా పరంగా మరో విచిత్రమైన ప్రయోగం చేశారు మీరు ... దాని గురించి మీరే చెబితేనే బావుంటుంది ..."
" అదా ... 'ఆంధ్రుడు' సినిమాలో కళ్యాణి మాలిక్ మ్యూజిక్ లో 'పరి ఆయీ పర్ దేస్ కి బబువా' అనే పాటలో హిందీ, భోజ్ పూరీ పదాల్ని కలిపి రాశాను. మొత్తం అంతా హిందీ అనుకున్నారు. కానీ భోజ్ పూరీని కూడా మిక్స్ చేశాను. ఇలాంటివి మీలాంటి వాళ్ళు అడిగితేనే తప్ప మాకు మేం గా చెప్పుకోలేం. "
రాజా (మ్యూజికాలజిస్ట్)