This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 శ్రీమణి - అతి తక్కువ సమయంలో, అత్యంత వేగంగా ఓ బుల్లెట్ లా దూసుకొచ్చి, ఓ రాకెట్ లా సినీ వినీలాకాశం లో పాటల రవ్వల్ని వెదజల్లిన నవ యువ కవి. ఇటీవల ఈయన రాసిన ' వీడు ఆరడుగుల బుల్లెట్టు ' పాట ఆడియో రిలీజైన రోజు నుండి అదరగొట్టేస్తోంది. పవర్ స్టార్ అభిమానుల్లో ఈ పాట రింగ్ టోన్ గా లేనివాళ్ళు లేరేమో !? లిరిక్ రైటర్స్ లో తాజా సంచలనం ఐన శ్రీమణి తో జరిపిన ఇష్టాగోష్టి - సినీ వైకుంఠపాళిలో ఎన్ని నిచ్చెనలు ఎక్కాలో తెలియజేస్తుందనే మా నమ్మకం :

 
" ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసుంటారు ? "
" రాసినవి 70 దాకా ... బైటికొచ్చినవి 45 దాకా "
" రెండేళ్ళలో 70 అంటే మంచి ప్రోగ్రెస్సే కదా ? "
" నిజమేనండి.  "
" ఇంత ఫాస్ట్ గ్రోత్ వెనక కృషి తో పాటు కసి కూడా వుందా ?"
" కసెందుకండీ ? "
" ఫైనాన్షియల్ ప్రొబ్లెమ్స్ వున్నా కసి వచ్చేస్తుంది "
" కొన్ని ఇంటర్ వ్యూలు చూసి మీరడుగుతున్నారని   అర్ధమయింది.  నేను పుట్టింది విజయవాడే అయినా మాది ప్రకాశం జిల్లా చీరాల. నా ఎనిమిదో ఏట మా నాన్నగారు (పాగోలు వెంకటాచలం), పన్నెండవ ఏట మా అమ్మగారు  (నాగమణి)  పోవడంతో నన్ను, మా తమ్ముణ్ణి  మా అమ్మమ్మ  ( రమణమ్మ)  , తాతయ్య (కొణికి దత్తాత్రేయులు)  పెంచారు. 8th క్లాస్ వరకూ అక్కడే వున్నాను. 9th , 10th క్లాసులు నందిగాంలో వుండే. మా పిన్ని ( రాజేశ్వరి) ,  బాబాయి  (చుండూరు శ్రీకృష్ణ)  దగ్గరుండి చదువుకున్నాను. మళ్ళీ ఇంటర్మీడియట్ కి అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేశాను.  నాన్న తరఫువాళ్ళు ఎవ్వరూ  ఇవాళ్టికీ తెలీదు . 
ఇవన్నీ విని భీభత్సమైన దరిద్రం అనుభవించానని కొందరనుకున్నారు.  నిజానికి అటు మా అమ్మమ్మ వాళ్ళు గాని, ఇటు మా పిన్ని వాళ్ళు గానీ మాకు చదువు కూడా చెప్పించలేనంత స్థితిలో లేరు. "
" సరే ... మరి ఏ నేపధ్యం  పాటలు రాయడానికి ఉపయోగ పడింది ? "
" 9th క్లాస్ లో వున్నప్పుడు పోయెట్రీ  మీద మనసు పోయింది. దాంతో చిన్న చిన్న పద్యాలు , వాటితో పాటు ప్యారడీలు, కొటేషన్లు లాంటివి రాసేవాణ్ణి. ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి పాటలు రాయాలనిపించింది. అందుక్కారణం మా ఇంటికి దగ్గర్లో చర్చ్ వుండేది. అందులోంచి అర్కెష్ట్రాతో
పాటలు వినిపించేవి.  ఆ ప్రేరణతో కాలేజ్ ప్రోగ్రామ్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో స్వంతంగా రాసుకున్న
పాటలు స్టేజ్ మీద పాడడం, విన్నవాళ్ళు ఇది ఏ సినిమాలోది అని అడగడంతో సినిమాల్లో ఎందుకు రాయకూడదు అనే ఆలోచన వచ్చింది. స్వయంగా సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకుని పాటలు రాసేవాణ్ణి. "
" స్వయంగా సిట్యుయేషన్స్ అంటే ఎలా ? "
" ప్రేమ గీతాలు, విప్లవ గీతాలు, ఇంట్రడక్షన్ సాంగ్స్ .. ఇలా .."
" రాసి ఏం చేశారు ? "
" గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ కాగానే రాసుకున్న పాటల ఫైల్ తీసుకుని  హైదరాబాద్ రైలెక్కేశా ... ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే 2006 జూన్ నుండి డిసెంబర్ వరకూ వనస్థలిపురంలో వున్న క్రాంతి ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పార్ట్ టైమ్ జాబ్ చేశా ... "
" జాబ్ అంటే ఏం చేసేవారు ? "
" క్లర్క్ గా ... కానీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ కదా ... లోడింగ్ అన్ లోడింగ్ చూసుకోవడం, ఎల్.ఆర్.లు
  రాయడం, లెడ్జర్లలో పోస్ట్ చెయ్యడం ... అన్నీ వుండేవి. మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది వరకూ అది ...  
  పొద్దున్నేమో ఫీల్డ్ లో రైటర్ గా చాన్స్ ల కోసం ప్రయత్నించడం ... "
" పిజ్జా డెలివరీ బాయ్ గా కూడా చేశారని విన్నాను ... "
"నిజమే ... సురేష్ అని ఓ ఫ్రెండ్ .. తను కూడా సినిమాల్లో చాన్స్ ల కోసం ప్రయత్నించేవాడు. అతను
 యూసఫ్ గూడా లో ఓ చిన్న రూమ్ లో వుండేవాడు.  ' ఫిలిం నగర్ ఇక్కడికి దగ్గిర కాబట్టి ఇక్కడికి వచ్చి
చూడు' అని సలహా ఇచ్చాడు. 2007 జనవరిలో వనస్థలిపురం లోని జాబ్ మానేసి యూసఫ్ గూడా కి వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టాను. ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో సంపాదించి దాచుకున్నది మూడు నెలల్లో అయిపోయింది. అప్పుడు దామీస్ పిజ్జా హట్ లో డెలివరీ బాయ్ గా చేరాను. సాయంత్రం 5 నుండి 11 దాకా పిజ్జాలు డెలివెరీలు  చెయ్యడం , డెలివరీలు లేకపోతే క్యాష్ కౌంటర్ లో గాని, రిసెప్షన్ లో గాని కూచొని మ్యానేజ్ చెయ్యడం, మళ్ళీ పొద్దున్నుంచి సాయంత్రం అయిదు వరకూ ప్రయత్నాలు ... "
" ఎంతిచ్చేవారు పిజ్జా హట్ లో ?"
" నెలకి మూడు వేలు ప్లస్ ఇన్సెంటివ్స్ మరో అయిదు వందలు " 
" ఇన్నాళ్ళుగా ప్రయత్నించినా ఒక్క చాన్స్ కూడా రాలేదా ? "
" వచ్చింది. ముహూర్తం అనే సినిమాలో ఓ పాట రాసే అవకాశం వచ్చింది. అందులో 'నిన్ను నన్ను కన్నతల్లి దేశం రా ' అనే పాట రాశాను.  ఆల్రెడీ ఓ పాటని రికార్డ్ చేసి పెట్టుకున్నారు. కానీ ఏదో ఓ 
అసంతృప్తి వుండిపోయింది వాళ్ళకి. అంచేత నాతో రాయించారు. తీరా చూస్తే సీడీ టైటిల్స్ లో నా పేరు లేదు .  పాట వుంది. ఆ తర్వాత కొన్ని ఘోస్ట్ రైటింగ్స్ చేశాను. ఇలా అయితే పేరు రాదు. పేమెంట్ కలక్షన్ కి కూడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆలోచించి మా బాబాయ్ తో డిస్కస్ చేశాను. ఆయన రిఫరెన్స్ తో అపోలో హాస్పిటల్ వారు పెట్టబోయే 'బీ పాజిటివ్' అనే మ్యాగజిన్ కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయ్యాను. ఆ జాబ్ లో 2008 ఆగస్ట్ నుంచి 2010 ఆగస్ట్ వరకూ వర్క్ చేశాను. చిరంజీవి గారి కోడలు, రామ్ చరణ్ తేజ భార్య అయిన ఉపాసన గారు ఆ మ్యాగజిన్ కి పబ్లిషర్ ."
" ఆవిడ ద్వారా '100% లవ్' లో ఎంట్రీ దొరికిందా ? "
" కాదు కాదు ఆవిడకి నేనెవరో అస్సలు తెలీదు. కాశీ అని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తో ఈ ప్రయత్నాల్లో నాకు పరిచయం  అయింది. ఆయన సుకుమార్ చేరాలని ప్రయత్నించే వారు. ఆయనకి ' ఆర్య-2 ' లో చాన్స్ దొరికింది. సుకుమార్ గారి దగ్గర సాహిత్యానికి సంబంధించి ఓ డిపార్ట్ మెంట్ వుంది. దాన్ని తోట శ్రీనివాస్
 గారు చూస్తూ వుంటారు. కాశీ నన్ను ఆయనకి పరిచయం చేశాడు. తోట శ్రీనివాస్ గారు  కొన్ని సిట్యుయేషన్స్ ఇచ్చి పాటలు రాసుకు రమ్మన్నారు. నేను రాసిన వెర్షన్లు ఆయనకి నచ్చడంతో సుకుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన 100% లవ్ లో 'అహో బాలు'  పాట రాయించారు. దాంతో సినీ గీత రచయిత గా నా కెరీర్ ఫుల్ పికప్ తో పరుగెత్తడం మెదలుపెట్టింది. "
" సాధారణంగా హుక్ లైన్ లు దేవిశ్రీ గారే ఇస్తుంటారు కదా ... " 
" అవును. 'అహో బాలు' అనే హుక్ లైన్ దేవి గారిదే ... నేను రాసిన పార్ట్ 'ఓ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావ్' తో మొదలవుతుంది. దానికి దేవి గారు 'అహో బాలు' హుక్ లైన్ గా చేర్చారు. ముందు మేం పాట రాసుకోకుండా ఓ  కాన్సెప్ట్ అనుకుని వెళ్ళాం. దానికి దేవి గారి హుక్ లైన్ చేర్చి నా పల్లవిని కలిపి మొత్తం పాటని దేవి గారి స్టూడియో లోనే రాయడం జరిగింది. పాట బాగా రావడం తో సుకుమార్ గారు, దేవి గారు నాతో మరో రెండు పాటలు 'దటీజ్ మహా లక్ష్మీ' , ' ఏ స్క్వేర్ బీ స్క్వేర్' పాటలు రాయించారు. మూడూ హిట్టయ్యాయి "
" మెమొరీ కార్డ్ , ఏ గ్రేడ్ బీ గ్రేడ్ డిగ్రేడ్  (అహో బాలు) ; సిల్కు చీర కట్టుకున్న సాప్ట్ వేర్, పోనీ టెయిల్ వేసుకున్న ఫస్ట్  ర్యాంక్, ఎక్స్ టెన్షన్ హై టెన్షన్ (దటీజ్ మహాలక్ష్మీ) ; టామ్ అండ్ జెర్రీ వార్, థీరమ్స్ సొల్యూషన్స్ ( ఏ స్క్వేర్ బీ స్క్వేర్)   ఇలా ఈ మూడు పాటల్లోనూ సాహిత్యం కొత్త రకం పోకడలు పోవడానికి కారణం ? "
"యూత్ , కాలేజ్ స్టూడెంట్స్ 18 - 25 ఏళ్ళ లోపు వాళ్ళు వాడే టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్, సాప్ట్ వేర్ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ట్రెండీ గా వుండడానికి చేసిన ప్రయత్నం అది. జనం కి కూడా బాగా పట్టింది. ఆదరించారు "   
" ఈ పాటలకీ - డబ్బింగ్ సినిమాయే అయినా 'సెగ '  లో 'వర్షం ముందుగా' పాటకీ - సాహిత్యం లో విపరీతమైన వైవిధ్యం చూపించారుగా ... ఈ మధ్య బాలూ గారు కూడా 'పాడుతా తీయగా' ప్రోగ్రామ్ లో ఈ పాట సాహిత్యం గురించి చెబుతూ   'చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరించాలి' అన్నారు కదా ? "
" ఎంతో ఎత్తుకి ఎదిగి కూడా నా లాంటి అప్ కమింగ్ రైటర్ గురించి అంత గొప్ప మాట అన్నందుకు ఆయనకే   పాదాభివందనం చెయ్యాలి నేను "
" అంత త్వరగా డబ్బింగ్ సినిమాలో రాసే చాన్స్ ఎలా వచ్చింది ? "
" అహో బాలు రాసిన తర్వాత , 100% లవ్  లో మిగిలిన రెండు పాటలు రాయడానికి ముందు 'వారెవా' అనే  సినిమాలో పాటలు రాసే చాన్స్ వచ్చింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ , డైరెక్టర్ ఉమా మహేశ్వర రావు గారికి నా ప్రెండ్  నాగిరెడ్డి పరిచయం చేశాడు. అందులో 'సోనా సోనారె' పాట, 'మామిడిపళ్ళు బత్తాయి పళ్ళు' అనే ఐటమ్ సాంగ్  రాశాను.  బ్రహ్మానందం గారబ్బాయ్ గౌతమ్ అందులో హీరో . ఆ ఉమా మాహేశ్వర రావు గారే - 'వెప్పమ్' అనే  తమిళ సినిమా రైట్స్ తీసుకున్నాం. 'సెగ' పేరుతో డబ్ చేస్తున్నాం. అందులో కూడా రాయాలి - అన్నారు. '100%  లవ్ పాటలు అయ్యేవరకూ రాలేను' అన్నాను. అలాగే ఆ తర్వాతే ఆ సినిమాలో - వర్షం ముందుగా, ఒక దేవత,  పాదం విడిచి, రాణి నే మహరాణి పాటలు రాశాను. ఈ నాలుగు ఒక వారం రోజుల్లో రాశాను. 100% లవ్ ఆడియో   రిలీజ్ అయిన 15  రోజులకి 'సెగ' ఆడియో రిలీజ్ అయింది.  " 
 " ఆ తర్వాత 'బాడీ గార్డ్' లో 'ఎవ్వరో ' పాటేనా ? "
 " లేదు ... మధ్యలో ' పిల్ల జమీందార్' లో 'అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే' పాట ట్యూన్ కి ప్యారడీ పాట రాశాను. ఇదో ప్రత్యేకమైన అనుభవం. ఇలా తీస్తాం అని మాంటేజ్ షాట్స్ చెప్పారు. వాటిని విజులైజ్ చేసుకుంటూ  రాయాలి. 2 అవర్స్ లో రాశాను."  
" లవ్ ఫెయిల్యూర్ సినిమాకి కూడా 100% లవ్ కి రాసినంత ట్రెండీ గా రాయటానికి కారణం ?"
"హీరో సిద్దార్థ...  '100% లవ్' లో పాటలు నచ్చి పిలిపించాడు. అంత ట్రెండీ గా కావాలన్నాడు.  ఈ సినిమాకి తమన్ మ్యూజిక్. ఆల్రెడీ తను నాతో ' బాడీ గార్డ్' కి రాయించడం వల్ల నా గురించి మంచి రిపోర్ట్ ఇచ్చాడు. అలా 'లవ్ ఫెయిల్యూర్' కి సింగిల్ కార్డ్ రైటర్ గా ఫిక్స్ అయ్యాను"
" అందులో 'ఇంతజారే' సాంగ్ మీకు, తమన్ కి మంచి క్లాసిక్ & ట్రెండీ హిట్ ... ఆని వర్గాల వారూ అమోదించే పాట... ఇదిలా వుండగా -  జులాయ్ లో - మీ ఇంటికి ముందో గేటు, ఒసే ఒసే నన్ను ఉరేసి వెళ్ళిపోకే, హే చక్కని బైకుంది  - పాటలు, సారొచ్చారు సినిమాలో - రచ్చ రంబోలో - డ్యూయెట్టు ఇవన్నీ మీ కమర్షియల్ హిట్లు. ఇప్పటి వరకూ రాసిన పాటలకొచ్చిన రెస్పాన్స్ ఒక ఎత్తు ... 'అత్తారింటికి దారేది'  లో ' వీడు ఆరడుగుల బుల్లెట్టు' పాటకి వచ్చిన రెస్పాన్స్ ఒక ఎత్తు.  కదా !?"
" సెంట్ పర్సెంట్ కరెక్ట్ సార్ ... అద్భుతంగా వుందంటూ  ఒక్క రోజులో 200 ఎస్సెమ్మెస్ లు అందుకున్నాను ఆ పాటకి ... నేను రాసిన పాటల్లో ఏ పాటకీ ఒక్క రోజులో  ఇన్ని ఎప్రిసియేషన్స్ అందుకోలేదు"
" ఈ పాట ఎత్తుగడ - గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం - తరలింది తనకు తానే ఆకాశం పరదేశం - వింటుంటే సీతారామ శాస్త్రి గారి - తరలి రాద తనే వసంతం , తన దరికి రాని వనాల కోసం - గుర్తొస్తోంది. "
" శాస్త్రి గారి పాటతో నా పాటని పోల్చటం గొప్ప విషయమే అయినా మీరు చెప్పిన ఆయన పాటలో లోనివి నిత్య సత్యాలు. నేను రాసినవి అసంభవాలు."
" వీడు ఆరడుగుల బుల్లెట్టు - ధైర్యం విసిరిన రాకెట్టు లాంటి కమర్షియల్ ఫోర్స్ వున్న వర్డ్ లు ఎలా పడ్డాయి ?" 
" వాటికి త్రివిక్రమ్ గారు, దేవిశ్రీ గారే కారణం . కథ చెపుతూ త్రివిక్రమ్ గారు ఇచ్చిన రిఫరెన్స్ లు, దేవిశ్రీ గారు ఇచ్చిన రిఫరెన్స్ లు , ట్యూన్ - అలాంటి పదాలు పలికించాయి." 
"ఎంతో చదువుకుంటేనే గాని రాయలేడు కదా ... మీ వరకు మీరు ఎటువంటి పుస్తకాలు చదువుతారు ?"
"చాలా చదివానండీ ...  శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనల దగ్గర్నుండి, చేమకూర వెంకటకవి విజయవిలాసం, ఆరుద్ర గారి త్వమేవాహమ్ ఇలా నా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏది దొరికితే అది చదువుతాను. ప్రస్థుతం భైరప్ప గారి కన్నడ అనువాదం 'ఫర్వా' చదువుతున్నాను."
" మళ్ళీ - ఈ 'ఆరడుగుల బుల్లెట్టు' జోలికొస్తే - 'వీడు ఆరడుగుల బుల్లెట్టూ , ధైర్యం విసిరిన రాకెట్టూ' అనే రెండు లైన్లే కమర్షియల్ లైన్స్. మిగిలిదంతా పోయెటిచ్ టచ్ వున్న లైన్సే ... దీనికి మీరు స్టడీ చేస్తున్న పుస్తకాలు ఎంతవరకూ ఉపయోగ పడ్డాయి ?"
" ఇవనే కాదండీ ... ఉన్న లిటరరీ నాలెడ్జ్ అంతా ఉపయోగ పడింది. లేకపోతే - భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో మరి రక్కసుడో - రక్షకుడో, తక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో - హాలాహలం భరించిన దగ్ధహృదయుడో, శంఖం లో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడో - లాంటి పదాలు పడవు. "
" మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్స్ కొద్దాం ... మీరు సెటిల్ అయ్యాక మీ తమ్ముడి సంగతేం చేశారు ?"
" ఎం.బి.ఏ. దాకా చదివించాను. ప్రస్థుతం జాబ్ ట్రయల్స్ లో వున్నాడు"
" మరి మీ పెళ్ళి సంగతేంటి ?"
 " ఇంకా బాగా సెటిల్ అవాలండీ ... మరో రెండేళ్ళు పట్టొచ్చేమో ...."
" ఫైనల్ గా ఇదొక్కటి చెప్పండి ... మీ అసలు పేరు శ్రీమణేనా ?"
" కాదండీ ... అసలు పేరు పాగోలు గిరీష్ ... "
" మరి శ్రీ మణి అనే పేరు ఎలా వచ్చింది ? "
" శ్రీ అనే అక్షరం , పదం నాకెంతో ఇష్టం. మా అమ్మగారి పేరు నాగమణి లో మణి తో కలుపుకుని 'శ్రీమణి' గా చేసేసుకున్నాను."
 
రాజా (మ్యూజికాలజిస్ట్)