This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 ఇటీవల 'టాక్ ఆఫ్ ది టౌన్' లా ఎక్కువమంది పాజిటివ్ గా మాట్లాడుకుంటున్న సినిమా ఇది.  ఇందులో వున్న అన్ని పాటలూ మెలొడి ఓరియెంటెడ్ గా వున్నాయని అందరూ ఒప్పుకోవడం మరో ప్లస్ పాయింట్. సంగీత దర్శకుడు కళ్యాణి కోడూరి  ఈ చిత్రంలో ముగ్గురు కొత్త సింగర్లతో పాడించారు. కొత్తవాళ్ళని పరిచయం చెయ్యడం ఆయనకి కొత్త కాకపోవచ్చు కానీ అలా ఎందుకు పరిచయం చేస్తున్నారో, అలా పరిచయం అయిన వాళ్ళు ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం వుండడం సహజం. అందుకే ముందు కళ్యాణి కోడూరి గార్ని ప్రశ్నించడం జరిగింది.

"లోకల్ గా చాలా మంది అందుబాటులో వుండగా మళ్ళీ ఈ కొత్త సింగర్ల వేట, ఎంపిక, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు ?"
" అష్టా చెమ్మా లో పాడించే టైమ్ కి శ్రీరామచంద్ర ఇండియన్ ఐడిల్ గా ప్రసిద్ధుడు కాలేదు. అప్పటికతను కొత్తే.  అలాగే శ్రీకృష్ణ ... అష్టా చెమ్మా యే తనకి లైఫ్ నిచ్చిందని ఇప్పటికీ ఎంతో వినయంగా చెప్పుకుంటూ వుంటాడు. పరిశ్రమకి కొత్త నీరు వస్తూ వుండాలండీ ... అప్పుడే ఫ్రెష్ వాయిస్ లు వినగలం. ట్యూన్ లు కూడా ఫ్రెష్ గా వుంటాయి. "
" మీరు ఈ సినిమాలో పరిచయం చేసిన ముగ్గురు సింగర్లలో ఇద్దరమ్మాయిలకి (దీప్తి, ప్రశాంతి)చెరో పాటా ఇచ్చి, ఇంకో అమ్మాయి(స్రవంతి) కి మాత్రం రెండు పాటలిచ్చారు. ఏమిటి ఆ అమ్మాయి ప్రత్యేకత ?"
" ఆ రెండు పాటలకి ఆ అమ్మాయి వాయిస్ సూటవుతోందనుకోవడమే ... "
 
ఇక తమకు లభించిన అవకాశం గురించి , తమ కుటుంబ సంగీత నేపధ్యాల గురించి ఆ ముగ్గురు కొత్త సింగర్లు చెప్పిన వివరాలూ, విశేషాలూ ఇవి :
 
స్రవంతి
అంతకు ముందు ఆ తరువాత లో పాడిన పాటలు :
(1) తేనె ముల్లులా
(2) హే ... కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా
 
" ఈ పాటలు పాడే అవకాశం ఎలా వచ్చింది ?"
" కళ్యాణి కోడూరి గారు ఫేస్ బుక్ ద్వారా ఇచ్చిన ప్రకటన చూసి మా అక్క  మానసవీణ పట్టుబట్టి నేను పాటల్ని పంపేలా చేసింది. "
" ఇది వరకు మీ అక్క కూడా కళ్యాణి గారి మ్యూజిక్ లో పాడింది కదా ?"
" అష్టా చెమ్మా లో 'నమ్మాలో లేదో .... అయ్ బాబోయ్ నువ్వా ' పాటను పాడింది"
" ఇందులో మిగిలిన కొత్త సింగర్లిద్దరికీ ఒక్కొక్క పాటే దక్కితే - నీకు మాత్రమే రెండు పాటలు పాడే అవకాశం వచ్చింది. ఎందుకని ?"
"అది మీరు కళ్యాణి గారినే అడగాలి. తేనె ముల్లులా పాట రికార్డ్ అయి చాలా నెలలయింది. కనిపెట్టెయ్ కొత్త ఫార్ములా పాట ఆడియో రిలీజ్ కి కొద్ది రోజుల ముందు రికార్డ్ అయింది"
" సినిమా టైటిల్ లాగ సినిమా రిలీజ్ కి ముందు ఆ తరువాత నీకు ఎటువంటి స్పందన లభిస్తోంది? "చిన్నప్పటి క్లాస్ మేట్స్, స్కూల్ మేట్స్ దగ్గర్నుంచి మా డాక్టర్లు, ప్రొఫెసర్లు అందరూ పాటలు ఎంతో బావున్నాయని, బాగా పాడానని ఎప్రిషియేట్ చేస్తున్నారు. పైగా ఆడియో ఫంక్షన్ లో కూడా నేనే పాడాను కాబట్టి గుర్తుపట్టి మరీ అభినందిస్తున్నారు"
 " అది సరే ... మా డాక్టర్లు, ప్రొఫెసర్లు అంటున్నావేమిటి ?"
" నేను ఎమ్. బి.బియస్. పూర్తి చేసి హౌస్ సర్జన్ చేస్తున్నానంకుల్ "
" ఎందులోనైనా స్పెషలైజేషన్ చేసే ఉద్దేశం వుందా ? "
" అది పీ.జీ. కౌన్సిలింగ్ ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సివుంటుంది. నాకైతే సర్జరీ తీసుకోవాలని వుంది"
" నువ్వు, మీ అక్క కాక మీ  అమ్మా నాన్న కూడా పాడతారా ?"
" నాన్నగారు చింతలపాటి సురేష్ గారు పాడతారు. ఆయన మాధవపెద్ది సత్యం గారి పాటల్లో స్పెషలిస్ట్"
" ఈ సందర్భంగా నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ?"
" అవకాశం ఇచ్చిన కళ్యాణి గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో పాటు - పట్టుబట్టి నేను పాటలు పంపేలా చేసిన మా అక్కకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి తీరాలి "
 
 
ప్రశాంతి తిపిర్నేని
 
అంతకు ముందు ఆ తరువాత లో పాడిన పాట :
నా అనురాగం
 
"మీరు కళ్యాణి కోడూరి గారికి 7-8 ఇయర్స్ గా పరిచయం అని విన్నాను. ఎలా పరిచయం అయ్యారు ?"
"డైరెక్టర్ నందినీ రెడ్డి నాకు సీనియర్, మా అక్కకి ఫ్రెండ్. ఆ పరిచయం వల్ల  'అలా మొదలైంది' లో కాస్ ట్యూమ్స్ వర్క్ చూశాను. నేను బేసికల్ గా స్టయిలిస్ట్ ని. అక్కడ కళ్యాణి గారితో పరిచయం. ఆ తర్వాత 'గోల్కొండ హై స్కూల్' కి వర్క్ చేసాను. ఎక్కువగా రమా రాజమౌళి గారితో వర్క్ చేస్తుంటాను. ప్రస్థుతానికి 'బాహుబలి' కి కూడా వర్క్ చేస్తున్నాను. "
" మరి మ్యూజిక్ నేర్చుకున్నారా?"
"ప్రొఫెషనల్ గా నేర్చుకోలేదు. ఇంట్లో మా అమ్మకి, అమ్మమ్మ కి మ్యూజిక్ అంటే ఇష్టం. పిల్లలకి 
నేర్పుతూ నేర్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయికి 9 ఏళ్ళు. తను నేర్చుకుంటోంది. తనతో పాటు కూచొని కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను. "
"ఇదే మీ ఫస్ట్ సాంగా ?"
" అవునండి ... ఇదే ఫస్ట్ ... "
" ఇదెలా జరిగింది ? "
"నా చేత పాడించొచ్చు కదా అని 'అలా మొదలైంది'  షూటింగ్ టైమ్ లో కళ్యాణి గారిని అడిగేదాన్ని. అలాగే ఈ సినిమా టైమ్ లో కూడా అడిగాను. పాటలన్నీ అయిపోయాయి అన్నారు. తర్వాత -  ఓ రోజు వచ్చి -  సిట్యుయేషన్ డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు. ఆ సీన్ లో వచ్చే పాట పాడాలంటూ - ముందు ట్యూన్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత లిరిక్ ఇచ్చి మర్నాడే రికార్డింగ్ అన్నారు. రెండు గంటల్లో అయిపోయింది రికార్డింగ్. అందరూ బాగా వచ్చిందన్నారు"
" ఈ సినిమాలో పాడడానికి ముందు, పాడిన తర్వాత మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ? "
" నాకు పాడడంలో ఇంటరెస్ట్ వుందని అందరికీ తెలుసు. సినిమాలో పాట విన్నాక  నా క్లోజ్ ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ అందరూ ఫోన్లు చేసి వాయిస్ బావుందంటూ మెచ్చుకుంటున్నారు. "
" పాడడం, స్టయిలిస్ట్ గా వర్క్ చెయ్యడం కాకుండా ఇంకేమైనా ఇంటరెస్ట్ లు వున్నాయా ?"
" ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటాను"
 
 
 
కోగంటి దీప్తి
 
అంతకు ముందు ఆ తరువాత లో పాడిన పాట
గమ్మత్తుగా వున్నదీ
 
" సినిమాకి పాడడం ఇదే మొదలా ?"
" పెళ్ళిపుస్తకం అనే షార్ట్ ఫిల్మ్ కి పాడాను. యూ ట్యూబ్ లో దానికి లక్షకి పైగా హిట్స్ వచ్చాయి .  'కృష్ణా బెస్ట్ లవ్డ్ క్రితీస్' అనే  ఉన్ని కృష్ణన్ గారి డివోషనల్ ఆల్బమ్ లో కొన్ని హమ్మింగ్స్ పాడేను. "
" మరి ఈ సినిమాలో చాన్స్ ఎలా వచ్చింది"
" ఫేస్ బుక్ లో కళ్యాణి గారు కొత్త సింగర్లు కావాలని పెట్టారు. అది చూసి మూడు పాటలు పాడి పంపించాను. విన్న తర్వాత ఆడిషన్ కి రమ్మన్నారు"
" ఏ పాటలు పంపించావు ?"
" ఒరు నాళ్ ఒరు కణవు సినిమాలో ఇళయరాజా గారు ట్యూన్ చేసిన 'కాట్రివల్ వరుమ్ గీతమే' అనే పాట ,  ఓ  ప్రయివేట్ ఆల్బమ్  లోని రెండు పెళ్ళి పాటలు - పాడి పంపించాను. "
 
 (కొన్ని పాటలు సింగర్ల సమర్ధతకి నిదర్శనంగా నిలుస్తాయి. 'ఒరు నాళ్ కణవు' లోని ఈ 'కాట్రివల్ వరుమ్ గీతమే' పాటని సినిమాలో హరిహరన్, శ్రేయాగోషల్, సాధనా సర్గమ్, భవతారిణి తో పాటు ఇళయరాజా కూడా పాడారు. యూ ట్యూబ్ లో ఈ పాటని - చూస్తూ - వినండి. ఎంత గొప్ప కంపోజిషనో తెలుస్తుంది. ఇటువంటి పాటని పాడగలిగినవారు సెలెక్ట్ అయితీరుతారు అని తెలియ చెప్పడానికే ఈ ప్రశ్న)
 
" ఇలాంటి పాటలు పాడావంటే శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం వుండి తీరాలి. మ్యూజిక్ నేర్చుకున్నావా ?"
"కర్ణాటిక్ మ్యూజిక్ లో సర్టిఫికేట్ కోర్స్ చేశానండి. తొలి గురువులు మా అమ్మ రాధ, మా అమ్మమ్మ కె.వి.చెల్లమ్మ. తరువాత తిరుపతి త్యాగరాజు గారి దగ్గర, తిరుపతి శేషు బాబు గారి దగ్గిర, దంగేటి వీరభద్ర రావు గారి దగ్గిర నేర్చుకున్నాను. దంగేటి కమల్ కుమార్ గారి దగ్గిర వాయిస్ కల్చర్ ట్రెయినింగ్ అయ్యాను"
" మీ ఫ్యామిలీ గురించి చెప్పమ్మా .."
" మా నాన్నగారి పేరు పార్థసారధి. ఆంధ్రా బ్యాంక్ లో మేనేజర్. అమ్మ పేరు రాధ. గవర్నమెంట్ టీచర్. మేం ముగ్గురం అక్కచెల్లెళ్ళం. నేనే పెద్దదాన్ని. నేటివ్ ప్లేస్ ఒంగోలు. "
" పాటలు పంపగానే కళ్యాణి గారు ఏవన్నారు ?"
" ఆడిషన్ కి రమ్మన్నారు. ఆడిషన్ లో ఓకే అయ్యాక పాట ఇచ్చి నేర్చుకోమన్నారు. నేర్చుకుని వినిపించాను. పల్లవి బాగా వచ్చింది. చరణమే కొంచెం షౌట్ చేస్తున్నట్టు వస్తోంది. బాగా ప్రాక్టీస్ చెయ్యమన్నారు. వన్ వీక్ తర్వాత రికార్డింగ్ అన్నారు. గంటన్నరలో రికార్డింగ్ అయిపోయింది"
" ఈ సినిమాలో పాటలు పాడక ముందు, తరువాత ఎలా వుంది లైఫ్ ? "
" అంతకు ముందు నేను కొంతమందికే తెలుసు. ఇప్పుడు చాలా మందికి తెలుస్తున్నాను. పరిచయం అవుతున్నాను. నన్ను ఐడెంటిఫై చేసిన కళ్యాణి గారికి, మోహన కృష్ణ గారికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా ఋణం తీరదు"
" ఈ సినిమా తర్వాత ఏవైనా చాన్స్ లు వచ్చాయా ... వస్తున్నాయా ?"
" రెండు సినిమాల్లో పాడేనండీ ... అందులో ఒక సినిమా ఆడియో లాంచ్ అక్టోబర్ లో అవుతోంది."
 
రాజా (మ్యూజికాలజిస్ట్)