దాదాపు పది పదకొండు నెలల క్రితం ...
ఆలిండియా రేడియోలో ఆడిషన్లు జరుగుతున్నాయి.
ప్యానల్ జడ్జి గా పాడుతున్న వారి పాటల్ని వింటున్నాను.
ఇలా ఆడిషన్లు జరుగుతున్నప్పుడు జడ్జెస్ ఎవరో, పాడేవాళ్ళు ఎవరో - ఎవరూ ఎవరికీ తెలియకుండా ఏర్పాట్లు వుంటాయి . ఆ పద్ధతిలో వింటున్న నన్ను ఓ కంఠం విపరీతంగా ఆకర్షించింది. జడ్జిమెంట్ రిపోర్ట్ ఇచ్చేశాక "ఈ అమ్మాయి డిటైల్స్ నాకివ్వగలరా ?" అని అడిగాను.
రూల్స్ ప్రకారం వివరాలు అడగకూడదు. అయినా సినీ సంగీతం మీద నాకున్న అనురాగం నన్ను ఉండనివ్వలేదు. "ఇది సినిమాకి పనికొచ్చే వాయిస్. ఇంతమంచి వాయిస్ ని ఇండస్ట్రీ మిస్సవడం నాకిష్టంలేదు. ఎలాగూ మార్కులు వేసేశాను కనుక మీకభ్యంతరం వుండదనుకుంటున్నాను " అన్నాను బ్రతిమాలుతున్నట్టుగా. ఆక్కడి అధికారి "గీతామాధురండీ" అని జవాబిచ్చారు పెద్దగా నవ్వుతూ... నిజంగా అది నాకొక ప్లెజెంట్ షాక్.
రెండు మూడు రోజుల దాకా మనసు ఉగ్గపట్టుకొని , రిజల్ట్ రిపోర్ట్ లు డిస్పాచ్ అయిపోయాయి అని తెలిశాక గీతామాధురికి ఫోన్ చేశాను " మొన్న ఓ మంచి వాయిస్ విన్నానమ్మా ... ఇండస్ట్రీ కి పనికొచ్చే వాయిస్. ఆ అమ్మాయి ఫలానా పాట పాడింది" అంటూ ఆ పల్లవి చెప్పాను.
" బాబాయ్ .. మీరు జడ్జిగా వచ్చారా బాబాయ్ !?" అంటూ ఆల్మోస్ట్ అరుస్తున్న లెవెల్ లో అడిగింది గీత (తను నన్ను 'బాబాయ్' అని పిలుస్తుంది. ఒక్క గీత మాత్రమే కాదు ఈ తరం సింగర్లు, యాంకర్ సుమ వీళ్ళందరూ నన్నలాగే పిలుస్తారు)
" అవునమ్మా ... చాలా బాగా పాడేవు. లలిత సంగీతం కూడా నీ గొంతులో చక్కగా పలికింది "
" నేను పాసయ్యానా బాబాయ్ ?" అడిగిందామె చిన్నపిల్లలా
" నువ్వు పాసవకపోతే ఇంకెవరు పాసవుతారు తల్లీ ... ఒక్కటడుగుతాను చెప్పు ... సినిమాల్లో ఇంత పేరు తెచ్చుకున్నావు ... బాగా సంపాదించావు ... టీవీ షోల్లో నువ్వే ... విదేశాల్లో షోలివ్వాలన్నా నువ్వే ... ఎక్కడ చూసినా నువ్వే ... నీకింక ఆలిండియా రేడియోలో ఆడిషన్ అవసరమా ? " అన్నాను.
"దేని విలువ దానిదే బాబాయ్ ... "
దిమ్మ తిరిగిపోయింది ఆమె ఇచ్చిన సమాధానానికి.
నిజమే ... ఒకప్పుడు ఆలిండియా రేడియో ఆడిషన్ లో పాసవడాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. కళాకారులు తాము ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ని గర్వంగా చెప్పుకునేవారు. వారికి లభించే గౌరవ మర్యాదలు కూడా ఎంతో ఉన్నతంగా , సంస్కారానికి గీటురాళ్ళలా వుండేవి. ఇప్పుడు ఆలిండియా రేడియో అంటే ఓ చిన్నచూపు. మనలో ఏ లోపమున్నా రికార్డింగ్ లో సవరించుకోగల సాంకేతిక పరిజ్టానం అనే షార్ట్ కట్ వచ్చేశాక నిజమైన ప్రతిభకు సరైన పరీక్ష పెట్టే వేదికలంటే భయం. దాన్ని కవర్ చేసుకోవడానికి చూపించే అతి తెలివితేటలే ఈ 'హ్రస్వదృష్టి' . బాలమురళి వంటి వారు ఇవాళ్టికీ రేడియోలో పాడడాన్ని తమ ప్రతిభకు లభించిన ఓ గౌరవంగా భావిస్తారు.
ఇంత చిన్న వయసులోనే దేని విలువ ఎంతో తెలుకున్న ఆ అమ్మాయి పరిపక్వతకి ముచ్చటేసింది.
అప్పుడనిపించింది - విలువలు తెలిసిన చోట వినయం వుంటుంది. వినయం వున్న దగ్గర విద్య రాణిస్తుంది. ఇప్పుడు గీతా మాధురి విషయంలో ఋజువవుతున్నది ఇదే ...
ఈ వారం ఇంటర్ వ్యూ కి గీతా మాధురి అని అనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఓవైపు తను యుఎస్ లో ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్ట్ కి వెళుతోంది. అయినా "కారులోనే మాట్లాడితే ఫరవాలేదా ... ఏవనుకోరుగా " ఎంతో మర్యాదగా అడిగి మరీ సమాధానాలిచ్చింది.
" రికార్డింగ్ లో ఓ పాట పాడడానికి ఎంత టైమ్ పడుతుంది నీకు ? "
" మినిమమ్ వన్ అవర్ నుంచి మాగ్జిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ "
" మరి నేర్చుకోడానికి ? "
" అరగంట .."
" ఏ పాట పాడడానికైనా ఇబ్బందిగా ఫీలయ్యావా ? "
" దేవుడి దయవల్ల ఇప్పటి దాకా ఏ పాటకీ కష్టపడలేదు."
" మగాళ్ళు వట్టి మాయగాళ్ళు పాటక్కూడానా ?"
" దానిక్కూడా "
" మరి ఆ తాగుడు వాయిస్ ని , ఆ స్టైల్ ని ఎక్కడ చూసి అబ్జర్వ్ చేశావ్ ? "
" పూరి జగన్నాథ్ గారు ఇలా కావాలి ఎక్స్ ప్లెయిన్ చేశారు. ఇన్ స్పిరేషన్ కోసం ఓ స్పానిష్ సాంగ్ వినిపించారు. దాంతో ఈజీ అయిపోయింది"
" అసలిలాటి పాట నీతో పాడించాలన్న ఆలోచన వాళ్ళకెలా వచ్చింది ?"
" ఒక్కడున్నాడు సినిమాలో ' అబ్బో వాడేంటో వాడి గొడవేంటో ' పాటని కీరవాణి గారు నాతో పాడించారు. అలాగే 'కృష్ణార్జున' సినిమాలో కూడా 'ఆజా మెహబూబా ' పాటని పాడించారాయన. ఇది అరబిక్ స్టయిల్ లో వుంటుంది. ఈ రెండు పాటలూ విన్నాక 'మగాళ్ళు వట్టి మాయగాళ్ళు' పాట నేను పాడితే బాగుండుననుకున్నారు"
''నువ్వు పాడిన పాటల్లో ఏ పాటకి నందీ అవార్డ్ వచ్చింది ?"
" నచ్చావులే సినిమాలోని 'నిన్నే నిన్నే' పాటకి"
" ఈ మధ్య యాక్టింగ్ కూడా చేసినట్టు వార్తలొచ్చాయి"
" అది 'అదితి' అనే షార్ట్ ఫిల్మ్ బాబాయ్ ... అందులో సింగర్ గీతామాధురి గానే కనిపిస్తాను"
"అంతకు ముందు 'చంద్రహాస్' సినిమాలో కనిపించావు గా"
" అవును ... భవానీ దేవి గా ... చాలా చిన్న రోల్"
"అవకాశం వస్తే ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తావా ?"
" అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ నా మెయిన్ రోల్ సింగింగే అని నా ఫీలింగ్"
"రెస్టారెంట్స్ లోనూ, ప్రోగ్రామ్స్ లోనూ, టూర్స్ లోనూ మీరంతా కలిపి బైట రెగ్యులర్ గా ఒక బ్యాచ్ లా కనిపిస్తూ వుంటారు. పాత తరం గాయనీ గాయకులు ఈ రకంగా ఇది వరకు కనిపించే వారు కాదు. ఏమిటి సంగతి ? గ్రూపిజమా?"
"అదేం లేదు బాబాయ్ ... మేం అంతా ఒకేసారి సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశాం. ఆ ఫీలింగ్ తో రెగ్యులర్ గా కలుస్తూ వుంటాం. లక్కీగా మా సీనియర్స్ మాతో కలిసి పోయారు. మా తర్వాత వచ్చిన వాళ్లు మాతో జాయిన్ అయిపోయారు. "
"దీని వల్ల లాభమా ... నష్టమా ... ?"
" ప్రోబ్లెమ్ అస్సలు లేదు. పైగా అందరి మధ్యా వాతావరణం కూల్ గా వుంటుంది"
" ఏంటీ ... వాతావరణం కూల్ గా వుంటుందా ? మరి శ్రీకృష్ణకి దెబ్బ తగిల్తే పక్కన కూచొని నవ్వుతావేంటి ... ఫస్ట్ ఎయిడ్ చేయించక !?"
" అదా ... తను స్కూటర్ మీద నుంచి పడ్డాడు. నేను వెళ్ళి చూస్తున్నాను. ఇంతలో కొంతమంది చూసి దగ్గరకి వచ్చి - " మీరు శ్రీకృష్ణ కదండీ ... మీరు ఫలానా పాట బాగా పాడేరండీ ... ఇప్పుడు ఏ సినిమాల్లో పాడుతున్నారండీ " - అని దెబ్బ సంగతి పట్టించుకోకుండా అడుగుతుంటే - తను లేచి కదలకుండా " ఆ ... హలో ... థాంక్యూ ... " అంటూ వివరాలు చెప్తుంటే ఆటోమాటిగ్గా నవ్వు వచ్చేసింది. పైగా తను పడడం పడడమే కామెడీ గా పడ్డాడు లెండి . ఈలోగా ఎవరో కెమెరా క్లిక్ మనిపించి ఫేస్ బుక్ లో పెట్టేశారు. అది పడక పడక మీ చేతిలో పడింది"
"అది సరే ... రకరకాల పాడుతున్నావు కదా .. నీ గోల్ ఏంటి ?"
" అందరి దగ్గిరా పాడాలి ... అన్ని రకాల పాటలూ పాడాలి "
"ఈ మధ్య ఇళయరాజా ఫారిన్ ప్రోగ్రామ్స్ లో కనిపించావు. అంత గొప్ప ఛాన్స్ ఎలా దొరికింది నీకు ? "
"ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో 'గాయం 2 ' , 'గుండెల్లో గోదారి' సినిమాల్లో పాడేను. బెంగుళూర్ లో వినాయక చవితి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అక్కడ వాళ్ళు ఇళయరాజా నైట్ పెట్టారు. ఆ ప్రైవేట్ షోలో పాడడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నా మీద ఒక ఇంప్రెషన్ ఆయనకి కలగడానికి ఆ షో హెల్ప్ చేసిందనుకుంటున్నాను. ఆ తర్వాత ఆయన ఫారిన్ షోస్ లో పాడడానికని కన్నడం నుంచి ఒకర్ని, తమిళం నుంచి ఒకర్ని ... అలా తెలుగు నుంచి నన్ను ... సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విషయం లో రియల్లీ ఐయామ్ సో లక్కీ ..."
" ఇళయరాజా గారు పెర్ఫెక్షనిస్టు. స్టేజ్ ప్రోగ్రామ్ అయినా సరే, జేసుదాస్ అంతటి వాడితో కూడా కరెక్ట్ గా వచ్చే వరకూ మళ్ళీ మళ్ళీ పాడించేటంత పెర్ఫెక్షన్ ఆయనది. ( అలా జేసుదాస్ గారితో ఇళయరాజా పాడించిన స్టేజ్ ప్రోగ్రామ్ యూ ట్యూబ్ లో దొరుకుతుంది. చూడొచ్చు). నీకలాంటి అనుభవం ఎదురవలేదా ?"
" ఆయన యూఎస్ టూర్స్ లో ప్రతి ప్రోగ్రామ్ లోనూ మూడేసి పాటల చొప్పున పాడేను. దేవుడి దయవల్ల ఇప్పటి దాకా ఆయన నన్ను తిట్టలేదు. ఒకవేళ ఫ్యూచర్లో తిట్టినా కూడా అవి అంతటి మహానుభావుడి ఆశీసులు గానే భావిస్తాను గానీ మరోలా అనుకునే ఛాన్సే లేదు."
" ఒక పర్సనల్ క్వశ్చెన్ .. "
"అడగండి బాబాయ్ ... ఏం అనుకోను "
"ఆ మధ్య ఇన్ కమ్ టాక్స్ వాళ్ళ రైడింగ్స్ లిస్ట్ లో నీ పేరు కూడా వినిపించింది ?"
" అవును బాబాయ్ .. రైడింగ్ జరిగిన మాట నిజమే ... అప్పుడు నేను ఊళ్ళో లేను. అమ్మ నాన్న వున్నారు. వాళ్ళు అడిగినవన్నీ చూపించారు. వాళ్ళు 'ఒకే' అని వెళ్ళిపోయారు. తర్వాత మా సి.ఏ. వచ్చి 'ప్రోబ్లెమేదీ లేదు' అని చెప్పారు"
" ఏ మాయ చేశావే లో హీరో డైలాగ్ లా - ఇంతమంది వుంటుండగా నువ్వే ఎలా టార్గెట్ అయ్యావు?"
" ఇందాక మీరే అన్నారు కదా బాబాయ్ - ఎక్కడ చూసినా నువ్వే అని. అది ఒక రీజన్ అయి వుండొచ్చు."
" అంతేనా .. నిన్ను డిస్టర్బ్ చెయ్యడానికి ఎవరైనా రిపోర్ట్ లాగ ఇచ్చి వుండొచ్చా ? "
"అంత సీన్ లేదు బాబాయ్ ... అందరి కష్టసుఖాలూ అందరికీ తెలుసు. ఎవరికైనా ఏ ఆపదైనా వస్తే కన్నీళ్లు పెట్టుకుని సహాయం చేస్తారే గాని, పని గట్టుకుని ఎవ్వరూ అలా చెయ్యరిక్కడ. "
చాలా మంది వ్యక్తిత్వం, సంస్కారం వారిచ్చే సమాధానాల ద్వారానే తెలిసిపోతూ వుంటుంది. అలా ఈ ఇంటర్ వ్యూ అదర్ సైడ్ ఆఫ్ గీతామాధురి ని సంపూర్ణంగా ఆవిష్కరించిందనే నమ్మకం.
రాజా (మ్యూజికాలజిస్ట్)