సెట్కి అవలత జూనియర్ వేణుమాధవ్ స్క్రిప్ట్ చదువుతూ ఉంటాడు.
యమ్మెస్. నారాయణ : (డైరెక్టర్స్ హ్యాట్తో వచ్చి జూనియర్ వేణుమాధవ్ భుజం తడుతూ) వేణూ... వేణూ...
వేణుమాధవ్ సీరియస్గా స్ర్కిప్ట్లో రాసినవన్నీ వచ్చాయో లేదో లెక్క చూసుకుంటూ, భుజం మీది చేతిని విదిలించుకుంటూ, పట్టనట్టుగా పొయ్యిలో బొగ్గులు రాజేస్తూ, గొట్టంతో ఊదుతూ, విసనకర్రతో విసుర్తూ ఉంటాడు.
యమ్మెస్ : (వ్యంగ్యంగా) సార్...సార్
వేణు : ఏస్
యమ్మెస్ : ఓసారిటు చూస్తారా సార్....
వేణు : సారీ... పనిలో ఉన్నాను.... తర్వాత కనబడండి....
యమ్మెస్ : అది కాద్సార్... ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరండీ?
వేణు : ఉన్నాడ్లే.... యమ్మెస్ నారాయణ అని... ఒకప్పుడు కమేడియన్....! డైరెక్టర్ అయితే ఇంకా బాగుపడతావురా ... కృషి చెయ్యరా పైకొస్తావు అని నేనే ఎంకరేజ్ చేశాను. ఇదే తన ఫస్ట్ ఫిల్మ్! పాపం స్ర్కిప్ట్ కూడా తనే రాసుకున్నాడు పిచ్చాడు.
యమ్మెస్ : ఇంతకీ మీరు....
వేణు : అసిస్టెంట్ డైరెక్టర్ .... (అంటూ ఇటు తిరుగుతాడు.)
(వేణుమాధవ్కి ముఖం కనబడకుండా టోపీ అడ్డం పెట్టుకుంటాడు యమ్మెస్)
వేణు : (మళ్ళీ పొయ్యి ఊదుతూ) పేరుకి అసిస్టెంట్నే గాని డైరెక్షన్ అంతా మన్దే!
యమ్మెస్ : అయితే చాలా బిజీ అన్నమాట
వేణు : యా...! యమా బిజీ, పిచ్చ బిజీ, బిజీ బిజీ....
యమ్మెస్ : గజి గజి కూడానా అండీ?
వేణు : యా...! (ఉలికిపడి) ఏయ్ ఎవరయ్యా నువ్వు....?
యమ్మెస్ : (టోపీ తీసి) నన్నే వెక్కిరిస్తావు రా...!?
వేణు : మీరా సార్.... ఎక్స్యూజ్ మి....
యమ్మెస్ : ఇప్పుడర్థం అయింది నాకు - డైరెక్టర్లు టోపీ ఎందుకు పెట్టుకుంటారో
వేణు : ఎందుకు సార్!
యమ్మెస్ : నీలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు టోపీ పెట్టకుండా... అర్థం అయిందా...!?
వేణు : సారీ సార్
యమ్మెస్ : ఏదో... అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవం ఉందన్నావని, ఇదినా ఫస్ట్ ఫిల్మ్ అని నిన్ను పెట్టుకుంటే ... నా గొంతును గుర్తు పట్టకపోతే పోయావు. ఇలా తక్కువ చేసి మాట్లాడతావా... అదీ పరోక్షంగా...!
వేణు : సారీ సార్.... ఇక నుంచి ఏదైనా సరే.... ఎదురుగానే అంటాను.
యమ్మెస్ : ఏయ్.... తమాషాగా ఉందా... పిచ్చి పిచ్చి వేషాలేసేవంటే హైదరాబాద్ ఆటో ఎక్కించీగల్ను జాగ్రత్త
వేణు : అమ్మో అంత శిక్షొద్దు సార్... మీరు చెప్పినట్టే చేస్తాను
యమ్మెస్ : అలారా దారికి... అంతా రెడీయా....
వేణు : ఎవ్రీ థింగ్ రెడీ సార్....
యమ్మెస్ : మరీ బొగ్గులు, పొయ్యి ఏంటీ?
వేణు : అదేంట్సార్ అలా అంటారు. మీరే కదండీ స్క్కిప్ట్లో రాశారు.
యమ్మెస్ : నేను రాశానా... ఏదీ?
వేణు : ఇదిగో... ఇక్కడ.... ఈ డైలాగు ఎదురుగా... 'కోపంతో నిప్పులు తొక్కుతూ' అని రాయలేదూ మీరు?
యమ్మెస్ : ఆహా!? పాపం హీరో...
వేణు : యస్సర్
యమ్మెస్ : ఇక్కడొచ్చి....
వేణు : యస్సర్
యమ్మెస్ : ఈ నిప్పులు తొక్కుతూ యాక్ట్ చెయ్యాలి....
వేణు : ఫెర్ఫెక్ట్ సార్
యమ్మెస్ : ఓహో.... ఎంత గొప్పవాడివి తండ్రీ.... ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు!? నీకు తెలుగు నేర్పిన మాష్టరు ధన్యుడు.... పరమానందయ్య శిష్యుడి ప్రతిరూపానివిరా నువ్వు
వేణు : అర్థంకాక పోయినా థాంక్యూ సార్... అయినా నన్ను మరీ అంత తీసెయ్యకండి సార్
యమ్మెస్ : మరెంత తీసెయ్యాలో చెప్పు.... ఇప్పుడే తీసేస్తాను (పాజ్ ఇచ్చి) నీ కాలు
వేణు : అలా తీసివేతలు, కూడికలు, భాగాహారాలు, గుణకారాలు, మిరియాలు, ధనియాలు, ఏలకులు, జీలకర్ర, లవంగాలు, జాజికాయ , జాపత్రి...
యమ్మెస్ : ఏయ్... ఏయ్.... ఏంటా పిచ్చివాగుడు
వేణు : సారీ సార్... చమత్కారం చెప్పకుండా తన్నుకొచ్చేసింది.
యమ్మెస్ : ఓహో... (బుగ్గ నొక్కుతూ) చమత్కారం కూడా ... చిలిపి...!?
వేణు : (ఆనందంతో మెలికలు తిరిగిపోతూ) థాంక్యూ సార్
యమ్మెస్ : ఛప్... రాసింది సరిగ్గా అర్థం చేసుకోవడం చేతకాదుగాని చమత్కారంట చమత్కారం
వేణు : అదికాద్సార్... నన్నర్థం చేసుకోండి.... తెలుగు భాషంటే నాకు ఇష్టమే!
యమ్మెస్ : ఆహా! (వ్యంగ్యంగా)
వేణు : నిజం సార్... మా అంకులొకాయన ఉన్నాడు....
యమ్మెస్ : చిన్నాన్నా.... మావయ్యా?
వేణు : రెండిటికీ అనుకూలంగా ఉంటుందనే అంకుల్ అనేశాను షార్ట్ కట్లో
యమ్మెస్ : సింగిల్ ఎపిసోడ్ పాయింట్ని డెయిలీ సీరియల్లా - లాగొద్దు.... త్వరగా తెముల్సు- ఏమయింది ఆ అంకుల్కి
వేణు : అతనికేమీ కాదు సార్.... అతనికి ఎదురుపడ్డ వాళ్ళకే కాలుతుంది.... ఖర్మ....!
యమ్మెస్ : అంటే....!?
వేణు : అతను తెలుగు భాష మీద మమకారంతో ప్రతీదీ అర్థంకాని లెవెల్లో మాటాడేవాడు. రైల్వే టికెట్ కౌంటర్ అనడానికి ధూమ శకట అనుమతి పత్ర విక్రయశాల అనేవాడు. అతనికి భయపడి అందరు దూరంగా పారిపోయేవారు. అలా అయిపోతానేమోనన్న భయంతో, ఉద్యోగం పోగొట్టుకుంటానేమోనన్న బెంగతో తెలుగు భాషకి కాస్త దూరంగా ఉంటున్నాన్సార్....
యమ్మెస్ : ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.... తెలుగు సినిమా దర్శకత్వ శాఖ ఉంటూ తెలుగు తెలియకపోతే ఉద్యోగం పోగొట్టుకుంటావ్ తెలుసా ?
వేణు : ఇప్పటిదాకా తెలీదు సార్... కానీ తెలుగు ఎక్కువగా తెలియటం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న మా కజిన్ కథ మాత్రం తెలుసు
యమ్మెస్ : కజినా....? చిన్నాన్న కొడుకా... మావయ్య కొడుకా....
వేణు : ఆ కన్ఫ్యూజన్ ఈసారి లేకుండా ఉండడానికే కజిన్ అన్నా కట్ షార్ట్ చేసేసి
యమ్మెస్ : ఆహా.... అంకుల్ అంటే చిన్నాన్నయినా కావచ్చు, మావయ్యైనా కావచ్చు ... కజిన్ అంటే వాడి కొడుకైనా కావచ్చు, వీడి కొడుకైనా కావచ్చు. భయంకరమైన లారీలా డాష్ ఇచ్చేసి సారీ అనొచ్చు ఎంత హెల్ప్ అయినా తీసేసుకొని థాంక్స్ అని కట్ చేసెయ్యొచ్చు. హు ... తప్పించుకోడానికి తెల్లవాడి తంత్రం తర్వాతే ఏదైనా? హీరోగారు రావటానికి చాలా టైమున్నట్టుంది ఈలోగా సందేహం వచ్చినప్పుడల్లా అడుగు.
వేణు : థ్యాంక్యూ సర్... థ్యాంక్యూ.... ఇప్పుడొచ్చేసింది ధైర్యం... నిజం చెప్పేస్తున్నా... మీరు స్క్కిప్ట్లో రాసినవన్నీ పట్టుకొచ్చేను... ఒక్కటి మాత్రం అర్థంకాక ఎక్కడ దొరుకుతుందో తెలీక తీసుకురాలేదు.
యమ్మెస్ : అంత దొరకని వస్తువులేవీ నేను స్ర్కిప్ట్లో రాయలేదే... ఏంటదీ...!?
వేణు : 'తటపటా' అండి
యమ్మెస్ : తటపటానా... అదెక్కడ రాశాను?
వేణు : అదిగో అదే....! ఇందాక్కూడా అలాగే అన్నారు, చూడండి... ఇక్కడ మీరు రాశారో లేదో... హీరోయిన్తో హీరో చెప్పే ఈ డైలాగుకి ముందు 'తటపటాయిస్తూ' అని రాయలేదూ మీరు.... ఆ తటపటాని హీరోయిన్కి హీరో ఇవ్వాలంటే నేను పట్రావాలా వొద్దా...!? ఇంతకీ ఏంట్సార్ అది... గులాబీ పువ్వు... చేమంతి పువ్వు... !?
యమ్మెస్ : అవున్రా ... అదో కొత్తరకం పువ్వు... చెవిలో పువ్వు...! ఖర్మరా బాబూ ఖర్మ... తటపటాయిస్తూ - అంటే జంకుతూ, సంకోచంతో, కొట్టుమిట్టాడుతూ అని అర్థం! అర్థం అయిందా?
వేణు : అయింది సార్... కొట్టుమిట్టాడుతూలో - కొట్టు- అంటే షాపు అని అర్థం కదూ సార్
యమ్మెస్ : కాదురా నా బుర్ర బద్దలు కొట్టూ అని అర్థం.
వేణు : అబ్బా... మీనింగులో అంత డిఫెన్సు ఉందా
యమ్మెస్ : డిఫెన్సా.... డిఫెరెన్స్ బాబూ డిఫెరెన్స్
వేణు : అదేంట్సార్... రెండూ షేమ్ కాదా
యమ్మెస్ : షేమా... ఓరి దేవుడా...! ఎందుకురా... ఎందుకురా నన్నిలా చిప్స్ నమిలినట్టు నమిలేస్తున్నావు
వేణు : అలా ఇరిగేట్ అయిపోతారేంటి సార్
యమ్మెస్ : ఇరిగేటా...!? ఇరిటేట్రా... ఇరిటేట్...! కూర్చో... ఇక హీరో వచ్చినా సరే కాల్షీట్ వేష్ట్ అయినా సరే... ఓ మాటకి ఇంకో మాట వాడితే ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకు తీరాల్సిందే అర్థం అయిందా?
వేణు : అయింది సార్...
యమ్మెస్ : హమ్మయ్యా... ఇంకేవైనా ఉంటే ఇప్పుడే అడిగెయ్
వేణు : ఒక్క చిన్న డౌటుండి పోయింది సార్
యమ్మెస్ : అడుగు
వేణు : ఇక్కడ స్క్రిప్ట్లో హీరో ఆ ఇంటికి రాగానే 'తలుపులకు వేసి ఉన్న తాళం వెక్కిరిస్తూ కనిపించింది' అని రాశారు మీరు... కదూ సార్
యమ్మెస్ : కరెక్ట్ కరెక్ట్
వేణు : అదెలా తీద్దాం అనుకుంటున్నార్సార్.... తాళం క్లోజప్లో షూట్ చేస్తే వెనకనుంచి 'వెవ్వెవ్వే' అంటూ వాయిస్ వచ్చినట్టుగా మిక్స్ చేద్దామా లేకపోతే ఓ నాలిక తాళం లోంచి 'ళ్' అని బైటికి వచ్చినట్టుగా గ్రాఫిక్స్ చేద్దామా?
యమ్మెస్ : రామచంద్ర ప్రభో! ఒరేయ్.... పూర్వజన్మలో నేనేం పాపం చేసుంటానంటావ్?
వేణు : పొండి సార్ మీరు మరీనూ... మీ సీక్రెట్ వ్యవహారాలు నాకెలా తెలుస్తాయి... అదీ పూర్వజన్మలోని... భలేవారు సార్...
యమ్మెస్ : ఓరేయ్ నిజంగా నన్ను మింగెయ్యడానికి వచ్చిన రాహువువో తిమింగలానివో రా నువ్వు...
వేణు : సార్ సార్ నన్ను మరీ అంత ద్రోహిగా అనుకోకండి సార్
యమ్మెస్ : మరి ఎంత ద్రోహిని అనుకోవాలో నువ్వే చెప్పు...
వేణు : నన్నర్థం చేసుకోడానికి ట్రై చెయ్యండి సార్... అప్పుడు తెలుస్తుంది నేను మీ పట్ల ఎంత సిన్సియర్గా ఫీలవుతున్నానో... నేను మీ వెల్ విషర్ని సార్... ప్లీజ్ సార్...
యమ్మెస్ : సరే... నీ డౌట్లన్నీ ఇప్పుడే తీర్చేసుకో హీరోగారి ముందు నా పరువు తీయకు
వేణు : అదిగో అక్కడ కలర్ డబ్బాలు బ్రాండ్ న్యూవి తెప్పించాను ఎప్పుడు ఓపెన్ చేసి కలిపి రెడీగా ఉంచమంటారో చెప్పండి చాలు...
యమ్మెస్ : కలర్ డబ్బాలా... ఎందుకవీ...?
వేణు : (ఏడుపుతో) అదిగో అదే సార్... అన్నీ మీరే రాస్తారు...తీరా అడిగేసరికి తిడతారు, ద్రోహి అంటారు... ఎలాసార్ మీతో? ఇదిగో ఇటు చూడండి సార్ మీర్రాసిన స్క్రిప్ట్.... ఇందులో ఏం రాశారు మీరు 'హీరోయిన్ ఆ మాట అనగానే హీరో ముఖంలో రంగులు మారతాయి' అని రాశారా లేదా.... చెప్పండి సార్....
యమ్మెస్ : రాశాను... అయితే..."!?
వేణు : మరి హీరోయిన్ ఆ మాట అనగానే ఎఫెక్టు కోసం హీరో గారి మొహం మీద రంగులు కొట్టాలా వద్దా సార్!? లేదా ఎడిటింగ్లో ఆ పని మీరే చేసుకుంటారా?
యమ్మెస్ : ఒరే వేణూ.... ఇంతసేపూ నేను చెప్పిందంతా నీకు అర్థం అయిందనుకున్నాన్రా... ఇలా వ్యర్థం అయిపోతుందనుకోలేదు.
వేణు : ఏవయింది సార్ ఇప్పుడు...!?
యమ్మెస్ : లేక లేక నాకు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ వస్తే, దొరక్క దొరక్క నంబర్ వన్ టాప్ స్టార్ నాకు కాల్షీట్ ఇస్తే... ఆయన ముఖం మీద రంగులు కొట్టాలా... అది నేను తియ్యాలా... ఒరేయ్.... నువ్వింక బాగుపడవు... నన్ను బాగుపడనియ్యవు...
వేణు : గురువు గారూ
యమ్మెస్ : నీకు చేటలాంటి చెవులున్నాయే గాని ఒక్క ముక్క కూడా ఎక్కలేదురా... నువ్వుంటుండగా ఇక ఈ సెట్లో అడుగుపెడితే చెప్పుచ్చుక్కొట్టు (కోపంగా వెళ్ళబోతాడు)
వేణు : ఆ స్ర్కిప్ట్ ఇలా ఇచ్చి వెళ్ళండి సార్...
యమ్మెస్ : ఆ ! అంటే... నువ్వు డైరెక్ట్ చేసేద్దామనే?
వేణు : ఏదో సార్ మీ దయ... మీ ఆశీర్వాదం...
యమ్మెస్ : ఇప్పుడర్థం అయిందిరా నీ ప్లాను.... వెల్ విషర్వి అన్నావు చూడు... దాని మీనింగు కూడా ఇప్పుడే అర్థం అయిందిరా! నా వెనక నుయ్యి తవ్వేసి నన్ను అందులో తోసెయ్యాలని విష్ చేసే వెల్ విషర్విరా నువ్వు... నిన్నింక ఒదలనొరేయ్... చంపేస్తా...!
(ఇద్దరూ పరిగెడుతూ ఉండగా)
................కట్.......
పాఠకులకు దృశ్యానుభూతిని కలిగించటం కోసం పాపులర్ ఆర్టిస్టుల పేర్లను వాడుకోవటం జరిగింది. అందుకు వారికి కృతజ్ఞతలు.
రాజా