This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 ఆయన జీవితం తెరిచిన పుస్తకం అంటారంతా . అందులో ప్రతి పేజీ అందరికీ తెలుసనుకుంటారు కొంతమంది. తమకు మాత్రమే తెలుసనుకుంటారు మరికొంతమంది. నిజానికి ఆయన జీవితం ఓ అనుభవాల అక్షయ పాత్ర. అందులో ఎన్నున్నాయో ఎవరికీ తెలియదు. ఊరిస్తున్న కొద్దీ ఊరుతూ వస్తుంటాయి. వాటిలో పరిస్థితులకు అనుగుణంగా అదను చూసి అంచనాలను పదును పెట్టుకునే కాలిక్యులేటివ్ నేచరూ వుంటుంది. కృతజ్ఞతా పూర్వకంగా చలించిపోయే స్వభావమూ వుంటుంది. తన కెరీర్ కి ఏది మంచో ఏది పనికిరాదో బేరీజు వేసుకో గలిగే యుక్తాయుక్త విచక్షణ వుంటుంది. వాటిని కఠినం గా అమలు చేయగల, చేసుకోగల క్రమశిక్షణ వుంటుంది. అక్కినేని జీవితంలో ఎదురైన అటువంటి అనుభావాల కదంబం ... ఆయన 89 వ పుట్టినరోజు సందర్భంగా ....

ఏయన్నార్ లో ఓ గొప్ప సుగుణం వుంది. అంతవరకూ చనువుగా పేరు పెట్టి పిలిచే ఏ దర్శకుడినైనా  సరే ఒకసారి షెడ్యూల్ గనక ఫిక్స్ అయిందంటే చాలు 'సర్' అంటూ సంబోధిస్తారతన్ని. అతడు ఎంత చిన్న డైరెక్టర్ అయినా సరే ... టీవీలో ఓ సింగిల్ ఎపిసోడ్ తియ్యడానికి వచ్చిన ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయినా సరే... ప్యాక్ అప్ అయ్యేవరకూ అంతే .. !  అంతే కాదు ఆ  డైరెక్టర్ రాగానే లేచి నిలబడతారు. "అయ్యో పెద్దవారు ... మీరేంటి సార్ ఇలా !?" అని ఆంటే " నేను మిమ్మల్ని గౌరవిస్తేనే యూనిట్ మిమ్మల్ని గౌరవిస్తుంది" అని జవాబిస్తారు. అందువల్ల వేరే ప్రయోజనాలు కూడా వుంటాయంటూ ఉదాహరణ గా ఓ సంఘటనని చెబుతారాయన. 
ఆదుర్తి సుబ్బారావు ఎంత తెలివైన దర్శకుడో , ఎంత గొప్ప దర్శకుడో అందరికీ తెలుసు. కానీ సెట్ మీద ఆయన భాష కొంచెం ఇబ్బందిగా వుండేది. ఇది గమనించిన నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు  - "మనం ఏమైనా తప్పు చేశామా నాగేశ్వర్రావ్ ఇతన్ని పెట్టుకుని ? " అని బాధ పడ్డారు కూడా.  "ఆ విషయం నాకొదిలెయ్యండి ... నేను చూసుకుంటాను" అన్నారు అక్కినేని.  మర్నాడు ఆదుర్తి సెట్ లోకి రాగానే "నమస్కారం డైరెక్టర్ గారూ ... రండి " అంటూ లేచి నిల్చున్నారాయన. అక్కినేని అలా చెయ్యగానే పక్కనే వున్న సావిత్రి , ఆ పక్కనే వున్నసూర్యకాంతం , రేలంగి, ఎస్వీ రంగారావు వరసగా లేచి నిల్చుని నమస్కారం పెట్టారు. ఇలా అందరూ వరసగా చేసేసరికి ఆదుర్తి గాభరా పడిపోయారు. అందరితోనూ మర్యాదగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ సినిమా పూర్తయ్యే సరికి ఆయన భాష పూర్తిగా మారిపోయింది. కంట్రోల్ లోకి వచ్చేసింది. 

చాలా మందిలో లేనిది,  అక్కినేనిలో ఎక్కువగా వున్నది - నిబ్బరం . ఏ విషయాన్ని ఎప్పుడు ఎంతవరకూ తీసుకోవాలో అంతవరకే తీసుకోగల విచక్షణ , దానిని ఆచరించి చూపించగలిగే కఠోర క్రమశిక్షణ.  ఆయన పెద్ద కుమార్తె చనిపోయినప్పుడు ముందర కొంత సేపు బాధ పడ్డారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని "మర్నాడు అందరూ వస్తారు వారిని చూసుకోవాలి " అంటూ లోపలి వెళ్ళిపోయి కాసేపు పడుకుని, శక్తి పుంజుకుని పరామర్శించడానికి వచ్చిన వారిని రిసీవ్ చేసుకునే బాధ్యతను తీసుకున్నారు. అలాగే ఇటీవల తన భార్య అన్నపూర్ణమ్మ చనిపోతే - వచ్చిన వాళ్ళందరూ కన్నీరు పెట్టుకుంటూ వుంటే - ఆవిడ ఎంత బాధ పడేవారో - ఈ మరణం ఆవిడకెంత రిలీఫో - మెడికల్ గా , సైంటిఫిక్ గా అందరికీ చెప్పి ప్రతీ ఒక్కరూ కాఫీ టీ ఏదైనా తాగారా , వారికేమైనా కావాలా అడిగి మరీ తెలుసుకున్నారు. కర్మ కాండలన్నీ ముగిసి అందరూ వెళ్ళిపోయిన రెండు రోజులకి ఒంటరిగా లాన్ లో కూచొని కన్నీరు పెట్టుకున్నారాయన . అంతవరకూ బరస్ట్ కాలేదు. 

అలాగే చాలా తక్కువమందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే  ... ఆయన సోదరుణ్ణి గ్రామం లో కొందరు  కొన్ని కక్షల కారణంగా ముఖం పగలగొట్టి చంపేసి బావిలో పడేశారు. ఈ వార్త తెలిసే సరికి అక్కినేని 'శ్రీమంతుడు' షూటింగ్ లో వున్నారు. అదీ మాంచి రొమాంటిక్ సీన్ లో ... చుట్టూ అమ్మాయిలూ ... మధ్యలో మద్యం మత్తులో పాడుతూ హీరో ... అదీ సీన్... ఒక్క క్షణం పాటు షాక్ తిన్నారు అక్కినేని .. కళ్ళు మూసుకుని ఆలోచించారు. ఎలాగూ వెళ్ళేది కారులోనే ... ఎంత త్వరగా వెళ్ళినా చేరే సరికి చీకటి పడిపోతుంది. జరపవలిసిన తంతులన్నీ మర్నాడే ...! ఈలోగా ఇక్కడ ఓ రెండు గంటలు కష్టపడితే వర్క్ పూర్తయిపోతుంది. నిర్మాతకి ఏ నష్టమూ వుండదు. "షూటింగ్ చేద్దాం" అన్నారు అక్కినేని. సంకోచంగా చూశారంతా ... "పర్వాలేదు పదండి" అన్నారు సెట్ లోకి వెళుతూ. అలా అనటమే కాదు సీన్ రక్తి కట్టించి మరీ బైటికి వచ్చారాయన. " ఇదే ఏ ఏడుపు సీనో అయితే ఒకే ... కానీ గుండెల్లో బాధని అణుచుకుంటూ స్టెప్పులేస్తూ ఎలా రొమాన్స్ ని అభినయించారు ?" అని ఎవరైనా అడిగితే "మరి నటనంటే అంతేగా ... నటుడుండేది అందుకేగా " ఆనంటారాయన. (ఆరోజు అక్కడ అక్కినేనికి స్టెప్పులు ఇలా వెయ్యాలి అని చేసి చూపించిన డాన్స్ అసిస్టెంట్ - కమల్ హసన్ ... ఇది వేరే విషయం అనుకోండి)

ఇటువంటి నిబ్బరాన్నే ప్రదర్శించిన ఘట్టం మరొకటుంది అక్కినేని జీవితంలో . 1974 అక్టోబర్ 18  న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. అప్పట్నుంచి 1975 లో ఆరోగ్య పరంగా పుంజుకునే వరకు ఏ చిత్రాన్నీ ఒప్పుకోలేదాయన. ఈలోగా అంజలీదేవి మహాకవి క్షేత్రయ్య తియ్యాలనుకుని సంప్రదించారు. ఫైట్లు, డాన్సులు లేవు కనుక ఆపరేషన్ తర్వాత చెయ్యదగ్గ సినిమాయే అనుకుని ఒకే చెప్పేశారు అక్కినేని. సరిగ్గా అదే టైం కి "అక్కినేని సినిమాలకు స్టూడియో ఇవ్వం" అంటూ బాంబు పేల్చారు సారథీ స్టూడియో వారు. అప్పటికి మరో స్టూడియో లేదు. ఇటువైపు అంజలీదేవి ఏర్పాట్లన్నీ చేసుకుని రెడీ గా వున్నారు. చేస్తే మద్రాసు కి వెళ్లి చెయ్యాలి. అక్కడ చేసినా , ఇక్కడ చెయ్యకుండా కూచున్నా రెండూ ఓటమి కిందే లెక్క. ఏ ఒత్తిడైతే కూడదని డాక్టర్లు చెప్పారో అదే ఇప్పుడు ఎదురుగా నిల్చుంది. తలవంచితే అది గుండెల్లో తిష్ట వేసుకుని కూచుంటుంది. అటు ఆరోగ్యాన్నీ చూసుకోవాలి. ఇటు ఒత్తిడినీ జయించాలి. వన్ ఇయర్ గ్యాప్  తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో తనేమిటో చూపించాలి. అక్కినేని విల్ పవర్ ఎంత గట్టిదో ప్రపంచానికి ఋజువు చెయ్యబోయే క్షణాలవి. అందుకే క్షణాల్లోనే ఆలోచనలు ఓ రూపు దిద్దుకున్నాయి. వెంటనే కన్నడ సార్వభౌమ రాజ్ కుమార్ కి ఫోన్ చేసి మైసూర్ లోని కంఠీరవ స్టూడియో లో షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ సంపాదించారు. ప్రొసీడ్ అయిపోవచ్చని అంజలీదేవి కి చెప్పారు. ఇప్పుడు తన సినిమాల కోసం హైదరాబాద్ లో మరో స్టూడియో తనే కట్టుకోవాలి. అందులో తియ్యబోయే సినిమా - క్షేత్రయ్య సినిమా తరువాత - వీలైంత వెంటనే -రిలీజవ్వాలి. రామానాయుడు ని సంప్రదిస్తే 'సెక్రటరీ' సబ్జెక్ట్ రెడీగా ఉందన్నారు. 

ఈ లోగా అక్కినేనికి మరోషాక్ ... ఎవరినైతే ఎంతో తెలివైన దర్శకుడని నమ్మారో, భవిష్యత్తులో గొప్ప దర్శకుడై తీరుతాడని నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు కి చెప్పి రెండో సినిమా నుంచే అన్నపూర్ణ సంస్థలో ఎవరికైతే పర్మనెంట్ స్థానాన్ని ఇప్పించారో - ఆ ఆదుర్తి సుబ్బారావుని  విచిత్రమైన స్థితిలో చూడాల్సి వచ్చింది.  'క్షేత్రయ్య' షూటింగ్ చేస్తూ వుండగా ఆయన ఫ్యాంట్ జారిపోయింది.  తెలుసుకునే స్థితిలో లేడాయన.అక్కినేని చూసారు. మిగిలిన వారంతా  గమనించే  లోగా ఫ్యాంట్ తో సహా ఆయన్ని లేపి అవతలకు తీసుకుపోయారు. అప్పుడే అర్ధమైపోయింది అక్కినేనికి - 'ఇక ఈయన ఎక్కువ రోజులు బ్రతకడని'. అల్లాగే జరిగింది కూడా. బాధని పళ్ళ బిగువున భరించారు అక్కినేని. మరొక మంచి దర్శకుడు సి.యస్. రావు ని ఒప్పించారు. 

అటు మైసూర్ లో క్షేత్రయ్య షూటింగ్... ఇటు హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం... అది కూడా  ఏ మాత్రం అనువుగా లేని కొండల్లాంటి బండ రాళ్ళ మధ్య. ఆరోగ్యం తగిన విశ్రాంతి తీసుకోమని డిమాండ్ చేస్తోంది. తనకు తానుగా విసురుకున్న చాలెంజ్ 'కమాన్ ... నీ శక్తి ఏమిటో చూపించు' అంటూఎదురుగా నిల్చొని కమాండ్ చేస్తోంది. తన మీద తనకు ఎంతో నమ్మకం వుంటే తప్ప తట్టుకుని నిలబడం కష్టం . అది తనకుందని నిరూపించారు అక్కినేని.  ఇది మొదటిసారి కాదాయనకి. ఇలాటి పరిస్తితులు చాలా సార్లు వచ్చాయి. ప్రతిసారీ నిలబెట్టింది నిబ్బరమే .

మొత్తానికి క్షేత్రయ్య పూర్తయి 1976 మార్చ్ 30 న రిలీజ్ అయింది. ఈ చిత్రం షూటింగ్ లో ఉంటుండగా రూపు దిద్దుకున్న అన్నపూర్ణ స్టూడియో ఆ చిత్రం - పూర్తి కాక ముందే - తుది మెరుగులు దిద్దుకుని 14 జనవరి 1976 ప్రారంభమైంది. ఆ స్టూడియో లో  నిర్మించబడిన మొదటి సినిమా సెక్రటరీ 28  ఏప్రిల్ 1976  న విడుదలైంది. 'సాధించిన దానితో సంతృప్తిని పొంది - అదే విజయమనుకుంటే పొరపాటోయి' అనే కవి వాక్కుల్ని అక్షరాలా నమ్మే అక్కినేని అక్కడితో ఆగిపోలేదు. తన కష్ట ఫలం, తన నమ్మకం బలం అయిన అన్నపూర్ణ స్టూడియో ని ప్రారంభించడానికి దేశం లో అత్యున్నత స్థానం లో వున్న ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ని ఆహ్వానించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక సినిమా స్టూడియో ప్రారంభం కావడం భారత దేశ చరిత్ర లో అంతకు ముందెన్నడూ జరగలేదు. ఈ రికార్డ్ ఒక్క అక్కినేనికే స్వంతం .  

ఇంత నిబ్బరం గా వుండే అక్కినేని చలించిపోయిన క్షణాలు లేక పోలేదు. నిర్మాత దర్శకుడు కడారు నాగభూషణం తన భార్య ప్రముఖ నటి కన్నాంబ మరణం తర్వాత బాగా కుంగిపోయారని, సినిమాలు మానేసి, అప్పుల్లో మునిగిపోయి ఒంటరిగా దయనీయమైన జీవితం గడుపుతున్నారని తెలిసినప్పుడు తట్టుకోలేకపోయారు. వెంటనే ఓ పెద్ద మొత్తం కార్పస్ ఫండ్ గా వేసి తద్వారా వచ్చే ఇంట్రస్ట్ ప్రతీ నెలా ఆయనకి చేరేట్టు చూడడమే కాకుండా ఆయన బ్రతికినన్నాళ్ళూ ప్రతీ పండక్కీ బట్టలు కూడా పంపించేవారు. " మీతో పెద్ద హిట్ సినిమాలు తీసిన నిర్మాత కూడా కాదాయన ... అలాటిది మీరు ఆయన పట్ల ఇలా వుండడం ఆశ్చర్యం గా వుంది !? " అని అంటే " ఇవన్నీ మీకెలా తెలిసాయి ... నేను చాలా రహస్యంగా వుంచానే " అంటూ ముందు ఆశ్చర్య పోయి తర్వాత అసలు విషయం చెప్పారిలా ...
" ధర్మపత్ని సినిమాతో నేను సినీ రంగానికొచ్చాననుకుంటారంతా. కానీ అంతకు ముందు తల్లిప్రేమ సినిమా కోసం నన్ను తీసుకు వచ్చారు. ఆ సినిమాలో హీరో మూడు వయస్సుల్లో కనిపిస్తాడు. చిన్నపిల్లాడు, 14 ఏళ్ళకుర్రాడు, పాతికేళ్ళ హీరో. ఆ 14  ఏళ్ళ కుర్రాడి పాత్రకి నన్నుఅనుకున్నారు. తీసుకెళ్ళారే గానీ నా పోర్షన్ చిత్రీకరించలేదు. అంతలో ఈ పోర్షన్ మొత్తం లేకపోతే ఏమవుతుంది అనుకున్నారు. అలా నా పాత్ర ఆ సినిమాలో తప్పిపోయింది. ఈలోగా అక్కడ వాతావరణం పడక జ్వరం వచ్చేసింది. దోమలూ అవి కుట్టి శరీరం మీద పుళ్ళు లేచాయి. కడారు నాగభూషణం గారు ఆ సినిమాకి ప్రొడక్షన్ మానేజర్. నన్ను తీసుకెళ్ళింది ఆయనే. తెగ గాభరా పడిపోయారు. స్వంత డబ్బుల్తో దోమతెర కొని , నన్ను అందులో పడుకోబెట్టి రాత్రింబవళ్ళు విసనకర్రతో విసురుతూ వుండేవారు. అంత జ్వరం లోనూ ఎప్పుడు తెలివొచ్చినా చుట్టూ దోమతెర, విసురుతూ కడారు నాగభూషణం గారు. ఆయన ఎప్పుడు గుర్తొచ్చినా - నా కళ్ళ ముందు కనిపించే సీన్ ఇదే. నేను ఆయనకి ఏమీ కాను. నన్ను హాస్పిటల్ లో పడేయొచ్చు. ఇంటికి పంపేయొచ్చు. తగ్గే వరకు నిస్వార్ధం గా సేవలు చేసిన ఆయన , అలా అయిపోయారని తెలిసాక నిజంగానే కదిలిపోయాను." అని వివరించారు అక్కినేని. 

ఇటువంటి కృతజ్ఞత కి సంబంధించిన సంఘటనే మరొకటుంది ఏయన్నార్ జీవితంలో.  'గుండమ్మ కథ' ఆయన 99 వ చిత్రం ఐతే ఆ సినిమా తమిళ వెర్షన్ 'మనిదన్ మారవి ల్లై' 100 వ చిత్రం. ఆ రెండు వెర్షన్లకూ ఒక్క పైసా కూడా తీసుకోలేదు అక్కినేని. " అరవై సినిమాలు పూర్తయిన సందర్భంగా నాకిన్ని అవకాశాలిచ్చిన నిర్మాతలందర్నీ వజ్రోత్సవం పేరిట సత్కరించాలనుకున్నాను. ఆ ఫంక్షన్ జరిపే ప్లేస్ కోసం చూస్తుండగా నాగిరెడ్డి గారు తమ స్టూడియో లో అరణ్యం లా వున్న పోర్షన్ ని నందనవనం లా అతి తక్కువ టైం లో మార్చేసి విజయా గార్డెన్స్ గా చేసేసి "ఇక్కడ చేసుకో నాగేశ్వరరావ్" అన్నారు. అంతే కాదు వచ్చిన ప్రతీ వారినీ ఆయన , ఆయన కుమారులు రిసీవ్ చేసుకోవడమే కాకుండా, భోజనాల దగ్గిర విస్తళ్ళు కూడా వేసిన వారి ఔదార్యం ముందు నా రెమ్యూనరేషన్ నథింగ్. అయినా ఊరుకోలేదు నాగిరెడ్డి గారు. నేను మద్రాస్ వదిలి హైదరాబాద్ వచ్చేస్తున్న టైం లో మళ్ళీ ఓ సభ పెట్టి చెక్కు ఇవ్వబోయారు. దాన్ని మద్రాస్ యూనివర్సిటీ కి వారి పేరున విరాళంగా ఇచ్చేశాను." అన్నారు అక్కినేని తృప్తి నిండిన కళ్ళతో.. ఇలాటివి ఆయన జీవితం లో ఎన్నో ...

అసలు ఏయన్నార్ సినిమా ఆంటే ... మంచి పాటలు గ్యారంటీ ... ఇది ఎప్పటికప్పుడు ఋజువవుతూనే వుంది. అందుకు ఆయన తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. 'ప్రేమ నగర్ ' లో 'మనసు గతి ఇంతే' పాటకు మహదేవన్ ఇచ్చిన ట్యూన్ వేరు. అది కొంచెం స్పీడు గా వుంటుంది. కానీ అక్కడ కథానాయకుడి ఆరోగ్య పరిస్థితి వేరు అని కన్విన్స్ చేసారు అక్కినేని. దాంతో మహదేవన్మరొక స్లో ట్యూన్ ఇచ్చారు. 
తర్వాత ఈ స్లో ట్యూనే ఎంత హిట్టయిందో చెప్పక్కర్లేదు. ఇంచుమించు ఇదే పరిస్థితి 'ప్రేమాభిషేకం' లో ... 'వందనం అభి వందనం' పాటకు  వచ్చింది. మొదట 'రంగు రంగుల జీవితం' అనే సాహిత్యం తో పాట తయారయింది. " నిజానికి కథానాయకుడు ఎంజాయ్ చేస్తున్నట్టు హీరోయిన్ కి అనిపించినా వాడు లోలోపల కుమిలిపోతున్నాడు. అది ప్రతిఫలించాలి" అని అన్నారు అక్కినేని. ఆ ప్రకారం సాహిత్యం మారి 'వందనం అభివందనం' గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇవిలా వుండగా 'దాంపత్యం' సినిమాలోని ఓ పాట విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది. మేకప్ వేసుకుని వచ్చేసరికి నటించాల్సిన పాట 'రారా నా మొగుడా రవ్వల బుల్లోడా ' అనే పల్లవి తో రెడీ గా వుంది. వినగానే అక్కినేని ముఖం లో ఫీలింగ్స్ మారిపోయాయి. చరణాలు వినేసరికి కోపం నసాళానికి అంటింది. అంత పచ్చిగా వుంది.  " ఇందులో హీరో డాక్టరు ... వాడింత నీచంగా పాడతాడా ?" అని అడిగారు. "ఏమ్మా నీకీ సాహిత్యం అర్ధమయ్యే ఒప్పుకున్నావా ?" అన్నారు పక్కనే వున్నహీరోయిన్ జయసుధని. "నాకంత తెలీదండి" అని అన్నారావిడ. " ఐయాం సారీ ...  నేను యాక్ట్ చేయలేను " అంటూ విగ్గు తీసేసి విసవిసా వెళ్లిపోయారాయన. మార్పిద్దామని ప్రయత్నిస్తే రాసిన రచయిత దొరకలేదు. ఆ తర్వాత మరొక రచయిత "డాక్టరు గారండీ ... నా బాధను చూడండీ" అనే పల్లవితో మొత్తం పాటను తిరగ రాస్తే అక్కినేని శాంతించి నటించడానికి ఒప్పుకున్నారు. ( దాంతో ఆ చిత్రం లోని మిగిలిన పాటలన్నీ ఈ రచయితే రాశారు. అలా మార్చి అక్కినేని చేత ఒకే చేయించుకున్న ఈ రచయిత ఎవరో తెలుసా ... నేటి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి , ఒకనాటి హిట్ కథా, సంభాషణల రచయిత - సత్యమూర్తి. ఇదింకో మరో విషయం లెండి ).

ముందే చెప్పుకున్నట్టు అక్కినేని జీవితం అనుభవాల అక్షయ పాత్ర. 'ఇప్పటికిది చాలు , మనసు నిండిపోయింది ' అని మనం అనుకుని ఆగిపోవాలే తప్ప ఆ పాత్ర మాత్రం నిండుకోదు. అందులోంచి తీసుకున్నవారికి తీసుకున్నంత... !

రాజా (మ్యూజికాలజిస్ట్)