This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 ఈ 2013 సెప్టెంబర్ 20 కి అక్కినేని నాగేశ్వర రావు గారికి తొంభయి ఏళ్ళు పూర్తవుతాయి. వచ్చేవారం నుంచి 'మనం' సినిమా షూటింగ్ లో పాల్గొన బోతున్నారాయన. తొంభయి ఏళ్ళ వయసులో కూడా వెన్ను వంగకుండా ఠీవీగా నడవగలగడం, నటించగలగడం ఒక్క అక్కినేనికే చెల్లింది. తన సినీ జీవితంలో పాటలకు అగ్రస్థానాన్ని ఇచ్చే అక్కినేని పాత్ర - చాలా పాటల రూపకల్పనలో, చిత్రీకరణలో, మధురమైన జ్ఞాపకాల రూపంలో - వుంది. వాటిలో కొన్నిటి గురించి - ఆయన తొంభయ్యవ పుట్టిన రోజు సందర్భంగా .... శుభాకాంక్షలతో ...

 
ఈ నాటి ఈ బంధమేనాటిదో
 
ఇది 'మూగమనసులు' సినిమాలోని పాట పల్లవి మాత్రమే కాదు. కొన్ని సంఘటనలు తెలుసుకుంటే అక్కినేని, సావిత్రి కి సంబంధించినంత వరకూ ఇదెంత అక్షర సత్యమో అని అనిపించి తీరుతుంది. ఏ హీరోని చూడడానికి వెళ్ళి జనం తోపులాటలో పక్కనే వున్న కాలవలో పడిందో- హీరోయిన్ గా  అదే హీరోకి సరైన జోడీగా ప్రేక్షకుల చేత ప్రశంసలందుకుందంటే ఆ బంధం ఏ నాటిదో అనిపించదూ !? తొలి ప్రయత్నంలో ఏ హీరో పక్కన డైలాగ్ చెప్పడానికి పనికి రాదనిపించుకుందో, తర్వాత్తర్వాత 'డైలాగ్ ఇలా చెప్పు' ఏ హీరో చేత మొట్టికాయలు తిన్నదో - తర్వాతి రోజుల్లో అదే హీరోకి 'ఇలా చెప్పి చూడండి గురువు గారూ' అని సలహా ఇచ్చి ఆ హీరో చేతే 'గట్టి పిండానివే' అంటూ ఆ హీరోయిన్ మార్కులు కొట్టేసిందంటే ఆ బంధం ఈ నాటిది కాదు అనిపించదూ !? ఇవన్నీ ఒక ఎత్తు ...  ఇప్పుడు చెప్పబోయేది మరొక ఎత్తు.
' మూగమనసులు' సినిమా బిగినింగ్ లో వచ్చే 'ఈనాటి ఈ బంధమేనాటిదో' పాట చివరి చరణాన్ని గోదావరి నది పై చిత్రీకరిస్తున్నారు. 'చెలికాని సరసలో సరికొత్త వధువులో'  అనే లైన్ దగ్గరకొచ్చే సరికి అప్పటికే బోట్ చివరికి వచ్చేశారేమో - పట్టు జారి సావిత్రి గోదావరిలో పడిపోయింది. ఒరిజినల్ గా సావిత్రి మంచి స్విమ్మర్. కానీ బోట్ కి ముందుండే ప్రొఫెల్లర్ వలన చీర చుట్టుకుపోవడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని మొట్ట మొదట గమనించిందీ, జరగబోయే ప్రమాదాన్ని ఊహించించిందీ అక్కినేని. అంతే ... క్షణం ఆలస్యం చెయ్యలేదాయన. వెంటనే తను కూడా దూకేశారు. పైగా ఈత కూడా బాగా వచ్చు కనుక సావిత్రిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ పాట గురించి అడిగితే అక్కినేని జ్ఞాపకాలలో మొదట మెదిలేది ఈ సంఘటన ఆ తరువాత తన కళ్ళ ముందే సావిత్రి ఎదిగిన తీరు.
 
చిలకా గోరింకా కులికే పకా పకా
 
 
ఈ పాట 'చెంచులక్ష్మి' లోనిది. ఏయన్నార్, అంజలీదేవి హీరో హీరోయిన్ లు. తీసింది దర్శకుడు బి.ఏ.సుబ్బారావు. అతడే నిర్మాత కూడా. అంజలీదేవి, ఆదినారాయణ రావు దంపతులతో మంచి సాన్నిహిత్యం వుండేదాయనకి. అక్కినేనికి కూడా ఆయనంటే గౌరవం. ఆ రోజు'చిలకా గోరింకా కులికే పకా పకా' అనే పాట చిత్రీకరణ.  ఎంతసేపైనా మూమెంట్స్ చెప్పడానికి డ్యాన్స్ డైరెక్టర్ రాడు. ఎదురు చూసి ఎదురు చూసి ఎంక్వయిరీ చేశారు అక్కినేని. డ్యాన్స్ డైరెక్టర్ కి ఇవ్వడానికి బి.ఏ. సుబ్బారావు గారి దగ్గర డబ్బుల్లేవు. అందుకని ఆయన రాలేదు. అక్కినేనిని, అంజలీదేవిని ఫేస్ చెయ్యలేక సెట్లోనే తప్పించుకుని తిరుగుతున్నాడు సుబ్బారావు. "ఇంతవరకూ వచ్చి డబ్బుల్లేవని ఆపేస్తారా ఎవరైనా?" ఆయనకి చివాట్లేసి , అంజలీదేవిని పిలిచి "నువ్వూ డాన్సర్ వే కదా , నాకూ కొన్ని మూమెంట్స్ వచ్చు... నువ్వలా రా .. నేనిలా వస్తాను. నవ్వటు వెళ్ళు ... నేనిటునుంచి వస్తాను" అని తనకు తోచిన సలహాలు ఇచ్చారు అక్కినేని. అలా ఆయన తన సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు అనుకుని ఆ పాటని పూర్తి చేసి ఆ పాటని, ఆ సినిమాని గట్టెక్కించారు
 
 
వందనం అభివందనం
 
అక్కినేని కెరీర్ లో  ఈ జెనరేషన్ కి కూడా కనెక్ట్ అయే అతి పెద్ద హిట్ సాంగ్ ఇది. ఈ పాటకి ముందు 'రంగు రంగుల జీవితం' అంటూ ఓ పాటను రాసి, స్వరపరిచి, రికార్డ్ కూడా చేసి , షూటింగ్ కి రెడీ చేశారు. నటించడానికి వచ్చిన ఏయన్నార్ పాట విని నొసలు చిట్లించారు. " ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి ... హీరోకి క్యాన్సర్. అది హీరోయిన్ కి తెలియకూడదని, తన మీద అసహ్యం కలగాలని నైతికంగా దిగజారినట్టు ప్రవర్తిస్తూ వుంటాడు. లోలోపల అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా పైకి మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్టు వుండాలి. ఇదంతా ప్రేక్షకుడికి, హీరోకి ఈ నాటకంలో సహకరించిన మరో కీలక పాత్రకి మాత్రమే తెలుసు. హీరోయిన్ కి మాత్రం ఒక కోణంలోనే అర్ధమవాలి. రెండో కోణం తెలియకూడదు. ఇవన్నీ పాట సాహిత్యం ద్వారా ,  ట్యూన్  ద్వారా ప్రేక్షకుడికి అందాలి. అప్పుడే మా అందరి నటన పండుతుంది" అంటూ చిన్న సైజు క్లాస్ పీకారు అక్కినేని. వెంటనే 'రంగు రంగుల జీవితం' పాటను పక్కన పడేసి మరో పాటను సృష్టించే పనిలో పడ్డారు. అలా పుట్టిందే - వందనం అభి వందనం - పాట.
 
రాజా (మ్యూజికాలజిస్ట్)