This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

2013 ఏప్రిల్ 14 న కన్నుమూసిన మృదు మధుర గాయకుడు, సంగీత సాహిత్యాలలో అద్భుతమైన జ్ఞానం కలిగిన పి.బి. శ్రీనివాస్ గారంటే నాకెంతో గౌరవం. నేనంటే ఆయనకెంతో ఇష్టం. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలవకపొతే - పేరుకి రాజా, కానీ ఒట్టి దొంగవి - అని చిన్న సైజు అలక చూపేవారు. నేను ఏది అడిగినా కాదనేవారు కాదు. ఓ సారి బాలమురళి గారిని ఇంటర్ వ్యూ చేయడానికి మా టీవీ నన్ను చెన్నైకి పంపించింది. ఒరిజినల్ ప్లాన్ మూడు రోజులు. మధ్యలో అనుకోని బ్రేక్ వచ్చింది. బాలమురళి గారి ఇంటి పక్కన రిపేర్లు వుండడం రోజంతా కరెంట్ వుండదన్నారు. ఊరికే కూచోవడం కన్నా ఏదైనా ఓ ఎపిసోడ్ చేస్తే వర్కవుట్ అవుతుందనిపించింది. వెంటనే పీబీ శ్రీనివాస్ మనసులో మెదిలారు. తర్వాతి నెలలో ఆయనకు 80 ఎళ్ళు పూర్తవుతాయని గుర్తొచ్చింది. ఫోన్ చేసి స్పెషల్ ఇంటర్ వ్యూ కావాలి, షూటింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా కావాలి అని అడిగాను. "మా అబ్బాయి ఇంట్లో కార్పెంటరీ వర్క్ చేయిస్తున్నాడు. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను" అన్నారు పీబీ.


వెంటనే మరొక మిత్రుడు భువనచంద్ర గుర్తొచ్చాడు. అతనిది, నాది 'భయ్యా ' అంటే 'భయ్యా' అనుకునే స్నేహం. వాళ్ళావిడ నన్ను 'బాబాయ్ గారూ' అని పిలుస్తుంది. "ఇదీ ప్రోబ్లమ్.. షూటింగ్ కి నీ ఇల్లు కావాలి. ఎలాగూ సెలబ్రిటీవే కనుక నువ్వే ఇంటర్ వ్యూ చెయ్యాలి" అన్నాను. " మరి క్వశ్చన్లు ?" అని అడిగాడు తను. "అదంతా నేను అప్పటికప్పుడు నీతో చెప్పించి, ఎడిటింగ్ లో చూసుకుంటాను. " అని ఒప్పించి పీబీ శ్రీనివాస్ గారిని తీసుకుని భువనచంద్ర ఇంటికి వెళ్ళాను. ఇంట్లో తను లేడు. "ఇదేంటి" అని గాభరా పడుతుంటే "మీరేం వర్రీ కాకండి బాబాయ్ గారూ, లైటింగ్స్ అవీ చూసుకుంటూ వుండండి. అయన వచ్చేస్తారు" అని ధైర్యం చెప్పింది వాళ్ళావిడ. ఈలోగా భువనచంద్ర వచ్చేశాడు కొత్త బట్టలు కొనుక్కుని. ఆశ్చర్యపోతున్న నన్ను చూసి "ఒక మహా వ్యక్తిని మా ఇంటికి తీసుకువచ్చావు...మేం ఎంత పుణ్యం చేసుకుంటే ఆయన మా ఇంట్లో కాలుపెడతారు ?" అంటూ ఆ బట్టలు పీబీ శ్రీనివాస్ గారికి పెట్టి ఆయన కాళ్ళకు నమస్కరించారు  భువన చంద్ర దంపతులు. నా గుండె ద్రవించిపోయింది ఆ దృశ్యానికి. నిజానికి నేనే ఎక్కువ పుణ్యం చేసుంటాను అని అనిపించింది. ఆ రోజు అప్పుడు చేసిన ఇంటర్ వ్యూ లింక్ యూ ట్యూబ్ లో 'మెలొడీ @ 80+' పేరుతో దొరుకుతుంది.

ఘంటసాల తర్వాత స్థానం లో వుంటూ వచ్చిన పీ.బీ.శ్రీనివాస్ గారికి బాలూ వచ్చాక అవకాశాలు బాగా తగ్గాయి. సాధారణంగా పక్కన చేరి అనే వాళ్ళు ఎప్పుడూ వుంటూ వుంటారు కనక ఆ బాపతు గాళ్ళు "చూశారా సార్ ... మొత్తం చాన్సెస్ అన్నీ బాలూయే లాగేసుకుంటున్నాడు" అని చెవిలో గొణగటం మొదలుపెట్టారు . అలాంటి వాటికి లోబడి తిరిగి ఏదో ఒకటి అనేసే తత్వం కాదు పీ.బీ.ది. " మంచి పాటకి ఎస్పీబీ అయితేనేంటి ... పీబీయస్ అయితేనేంటయ్యా " అన్నారు వారితో. దాంతో అలా పుల్లలు పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అదీ పీబీ సంస్కారం.

కన్నడ సార్వభౌమ డా. రాజ్ కుమార్ కి చాలా సంవత్సరాల పాటు ఎన్నో పాటలు పాడారు పీ.బీ. శ్రీనివాస్ . ఆ తర్వాత ఓ ప్రయోగం లాగ ఓ సినిమాలో రాజ్ కుమార్ స్వంతంగా ఓ పాట పాడేసరికి అది హిట్టయి కూచుంది. విపరీతమైన క్రేజ్ వచ్చేసరికి రాజ్ కుమార్ తన పాటలు తానే పాడుకోసాగారు. దాంతో కన్నడలో కూడా అవకాశాలు తగ్గాయి పీబీ కి. అక్కడ కూడా ఆయన పక్కన చేరి "చూశారా సార్ ... ఇన్నాళ్ళు మీతో పాడించుకుని ఇప్పుడు పక్కన పెట్టేశారు"  అనడం మొదలు పెట్టారు ఓ చిన్న రాయేసి చూద్దామనుకునేవాళ్ళు.

"ఇంతకీ రాజ్ కుమార్ బాగానే పాడుతున్నాడా ?" అని అడిగారు పీబీ.

"బాగానే పాడుతున్నాడండి ? "

" మరంత బాగా పాడడం వచ్చి, ఇన్నాళ్ళు నా చేత పాడించినందుకు సంతోషించకుండా బాధ పడమంటారేంటయ్యా ! ? " అడిగారు పీబీ అమాయకంగా .

ఆ తర్వాత కర్ణాటకలో కూడా ఆ బాపతు మనుషులు ఆయన చుట్టూ చేరడం మానేశారు..

పి.బి. శ్రీనివాస్ వైష్ణవ కుటుంబానికి చెందిన వారు. వైష్ణవుల నామాలకి, వారి నైవేద్యాలకి ముడిపెడుతూ తమాషాగా ఇలా అనేవారు. " మన నైవేద్యాలు - పులిహోర, దద్ధోజనం, చక్రపొంగలి. అవి మనం పెట్టుకునే నామం లోనే వున్నాయి. నామం లో తెల్లగా కనిపించేది - దద్ధోజనం అన్నమాట. మధ్యలో వుండే ఎర్రటి పార్ట్ - శ్రీ చూర్ణం - చక్రపొంగలి ... ఎందుకంటే బెల్లం చిక్కగా వుంటే చక్రపొంగలి ఎర్రగా కనబడుతుంది. ఇక కొంతమంది నామం అడుగున గంధం పెడతారు. అది పసుపు పచ్చగా వుంటుంది. అంటే పులిహోర .... ఇదీ సంగతి "

ఓ పని మీద చెన్నై వెళ్ళినప్పుడు పి.బి. శ్రీనివాస్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికో వెళుతూ కనిపించారు. నన్ను చూసి కారాపి "ఎక్కడికెళుతున్నావ్? బాలూ ఇంటికా ... రా .. నేను డ్రాప్ చేస్తాను " అన్నారు. సరేనని డోర్ ఓపెన్ చేసి చూస్తే - ముందు సీట్లో ఓ బండెడు పుస్తకాలు. వెనక రెండు సీట్లలోనూ ఓ రెండు బస్తాల పుస్తకాలు. "ఎక్కడ కూచోను ? " అనడిగాను బిక్కముఖం వేసుకుని.  " వుండు ... చెప్తాను " అంటూ అటు పుస్తకాలు ఇటు చేసి, ఇటు పుస్తకాలు అటు చేసి ఓ పావు గంట తర్వాత కొంత జాగాని కల్పించగలిగారు (ఈ టైమ్ లో నేను బాలూ ఇంటికి చేరిపోయేవాణ్ణి ... అది వేరే సంగతి) . " కారులో చదువుకున్నవాళ్ళని చూశాను గాని కారునే లైబ్రరీ చేసిన వాళ్ళని చూడడం ఇదే మొదలు" అన్నాను. అన్నట్టు ఆ కార్ సీట్ల మీదే స్టేప్లర్లు, పిన్నులు, పెన్నులు, రీఫిల్సు, తెల్ల కాగితాలు ... ఇలా ఓ మినీ స్టేషనరీ షాప్ లా మెయిన్ టెయిన్ చేశారాయన. నేనన్నదానికి నవ్వుతూ " నాదే మూల ... నేను కారునే లైబ్రరీ చేశాను. ఆరుద్ర కారుని బైట పడేసి షెడ్డునే లైబ్రరీ చేసేసుకున్నాడు " అన్నారు. అలా అంకితం అవగలిగారు కనుకే ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని, పిబి శ్రీనివాస్ వివిధ భాషల్లో రెండు లక్షలకు పైగా కవిత్వాన్ని రాయగలిగారు.

మద్రాస్ లో ఉడ్ ల్యాండ్స్,  హైదరాబాద్ లో మినర్వా , బెంగుళూర్ లో ( రేస్ కోర్స్ రోడ్ లో వుండే) మౌర్య ఇవీ పి.బి. శ్రీనివాస్ గారి రచనా స్థలాలు. ఈ మూడు హోటళ్ళ యజమానులూ పి.బి. గారి అభిమానులు, భక్తులూ కూడా.  వాళ్ళు తమ రెస్టారెంట్స్ లో పి.బి. గారి కోసం ప్రత్యేకంగా ఓ టేబులూ, రెండు మూడు కుర్చీలు వేసి వుంచుతారు. అక్కడ కూచొని ఈయన రాసుకుంటూ వుంటారు. మధ్య మధ్య కాఫీ ఎన్నిసార్లు అడిగినా ఇస్తారు. డబ్బులు తీసుకోరు. మౌర్యలో అయితే పి.బి. బెంగుళూరు వస్తున్నారంటే రూమ్ నంబర్ 101ఎవ్వరికీ ఇవ్వరు. ఆయన బెంగుళూర్ లో ఎన్నాళ్ళు వుంటే అది ఆయనదే. అంతే కాదు అక్కడ స్పెషల్ గా తయారు చేసే 'తత్తా' అనే ఇడ్లీ ఆయనకెంతో ఇష్టం అని ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా వుంచుతారు. ఈ మూడు ప్లేసుల్లో కూచొనే ఆయన ఇంచుమించు రెండు లక్షలకు పైగా రచనలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అనేవారు - చాలామంది రిటైర్ మెంట్ తీసుకోగానే అన్ని పనులూ మానేసుకుని,  తినడం టీవీ చూడడం పడుకోవడం మాత్రమే చేస్తారు. దాని వలన శరీరంలో చాలా కణాలకు పని వుండదు. క్రమక్రమంగా అవి చనిపోతాయి. అందుకే రిటైర్ అయిపోయినా శరీరానికి, మెదడుకి పని పెడుతూనే వుండాలి - అని.   ఈ వ్యాక్యాలని పి.బి. శ్రీనివాస్ వినకపోయినా అక్షరాలా ఆచరించారు. తన ఆలోచనలను నిరంతరం పరుగు తీయించారు. మెదడు ఎప్పుడూ సృజనాత్మక ప్రక్రియలో నిమగ్నమయ్యేది. అందుకే ఆయనకంత సునాయాస మరణం లభించింది.
 
రాజా