బాలూ జన్మ రహస్యం కథ
శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే సత్యలోకే బ్రహ్మా సరస్వతీ ఏకాంత మందిరే ...
"నాథా! జీవరాశిని మీరెంత సృష్టించినా పలుకు, చదువు, సంగీతం ఇవన్నీ నా ప్రసాదమే కదా ...కానీ వాటిని మరిపించే ఆశ్చర్యానుభూతిని నాకు కలిగించగలరా?"అంది సరస్వతి
“చాలా విచిత్రంగా ఉంది దేవీ నీ పందెం... సరే - ఈ ముచ్చట కూడా నన్ను తీర్చనీ"
అంటూ ఓ జీవిని సృష్టించాడు బ్రహ్మ
"ఇతడికి నేను నంబర్ వన్ నేపథ్య గాయకుడిగా రాణించగల గళాన్ని ప్రసాదిస్తున్నాను" అంది సరస్వతి
"సరే .. ఆ గళాన్ని ఎవరికైనా సరిపోయే విధంగా మార్చుకోగల తెలివితేటల్ని, శక్తిని ఇతడికి నేనిస్తున్నాను" అన్నాడు బ్రహ్మ
'ఆహా ... అయితే ఇతన్ని ఆ నటరాజ అనుగ్రహంతో నటుడిగా కూడా మారుస్తున్నాను"
"మధ్యలో శివుణ్ణి కూడా ఇరికించావు కాబట్టి నేను కొంచెం తగ్గాను. కానీ నీ కోరిక ప్రకారం కొసమెరుపు ఇవ్వాలిగా,.. అంచేత ఇతడు నటుడైనా ఎక్కువ చిత్రాల్లో
నటించడు. ఎంతోమంది నటులకు డబ్బింగ్ చెపూ వాళ్ళ భావప్రకటనలకు మరింత పేరు తీసుకొస్తాడు".
"అలా వచ్చేరా..అయితే తెలుగు సినిమాలలో ఇతనో పాట రాస్తాడంతే... చూశారా రచయితగా కూడా మార్చాను "
"పిచ్చి సరస్వతీ..నేనింకో రూట్లో వస్తా చూడు - ఇతను తెలుగు సినిమాకి రాసే ఆ పాట ఇంగ్లీషు పాట అయిపోతుందంతే! "
"నాథా... ఇదన్యాయం"
"పోనీ ... మధ్య మధ్య ఓ నాలుగైదు తెలుగు ముక్కలు కూడా పెడతాడ్లే ! అంతేనా ఇంకేవన్నా ప్రసాదిస్తావా వరాలు?'
"ఇతణ్ణి సంగీత దర్శకుడిగా చేస్తున్నాను"
"ఆయితే హోరు సంగీతం రాజ్యమేలే కాలంలో ఇతణ్ణి పడేస్తున్నాను"
"నాధా.నేను కోరింది నా మెరుగులను మరిపించే ఆశ్చర్యానుభూతిని.అంతేగాని, శాపాన్నికాదు" అంది సరస్వతి.
నాలిక్కరుచుకున్నాడు బ్రహ్మ.
"పారపాటయిపోయింది దేవీ.మగతనం మగతలో కాస్త మాట తూలేను. అయినా నా వాక్కు కూడా తిరుగులేనిదే కదా! సరే ఆ హోరు సంగీత కాలంలో కూడా మధుర రమ్య గీతాలను స్వరపరచగలిగే నిబ్బరాన్ని ఇతడిలో” నిలుపుతున్నాను".
"చక్కటి సంభాషణా చాతుర్యాన్నిస్తున్నాను నేను" ".
"అది అతని బంధు మిత్రులకే పరిమితం కాకుండా అందర్నీ అలరించగలిగే విఖ్యాత వ్యాఖ్యాతగా మలుస్తున్నాను"
తర్వాత ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడింది సరస్వతి.
"సరే..నేనిప్పుడు కొన్ని ఇతనికిస్తున్నాను, వాటిని మించినవి ఇవ్వగలవా ?”
ఆసక్తిగా చూసిందామె బ్రహ్మవైపు,
"ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా గర్వపు గాలి నింపుకో(లే)ని అంతరంగం, అందులో అన్ని వేళలా ప్రవహించే సంస్కారం ఉంచుతున్నాను. అంతే కాదు.
మీ అత్తగారు లక్ష్మీదేవి తననెంత కరుణించినా - తానెప్పుడూ నీ పక్షమే వహిస్తూనీ పుత్రులనే గౌరవిస్తూ, వారు రచించిన ఎన్నో పుస్తకాలకు ఆర్థిక సహాయం చేసూ ఉంటాడు. నీ మానస పుత్రుడి పేరిట శిలా విగ్రహాన్ని పెట్టిస్తాడు. తనకు గుర్తింపుని ఇచ్చిన గురువు పేరిట మరో పది మందికి ఉపాధిని కల్పించే ఓ స్వరసాధనాలయాన్ని నిర్మిస్తాడు. 'డబ్బు పాపిష్టిది అని అంటారు కానీ నీ ఇంట కాలు పెట్టినందుకు నన్నా నిందల బారినుండి ఎంత గొప్పగా తప్పించావయ్యా’ అని మీ అత్తగారు కూడా ప్రశంసించేలా తన జన్మను చరితార్థం చేసుకుంటాడు. ఇప్పుడు చెప్పు దేవీ..ఇంతకు మించి ఇవ్వగలవా నువ్వు?"
తల దించుకుంది సరస్వతి అశక్తురాలై . .
"అందుకే అంత గీర్వాణం పనికిరాదు గీర్వాణీ " అంటూ ఓ జీవిని సృష్టించాడు బ్రహ్మ
"నాధా ! నేనోడిపోయానని ఒప్పకుంటున్నాను. ఇంతకీ ఇతడికి ఏ ఇంట్లో జన్మను ఇస్తున్నారు?"
" సద్బ్రాహ్మణుల వంశంలో"
"మరి వేద మంత్రాలనే వల్లె వేస్తాడేమో!?”
"లేదు దేవీ.ఇతడు ఉచ్చరించడు. ఆచరిస్తాడు. కనుక అవి వేద మంత్రాలు కావు. స్వేద మంత్రాలు"
"స్వేద మంత్రాలా?"
“అవును.మనం పోటీపడుతూ ఇచ్చిన వరాలతో ఇతడు రోజుకు పద్దెనిమిది గంటలకు పైగా శ్రమిస్తాడు"
"ఈ ప్రత్యేక సృష్టి ఎన్ని విచిత్రాలు చేస్తుందో నాకు చూడాలని ఉంది. త్వరగా భూలోకానికి పంపండతన్ని" అంది సరస్వతి ఆత్రుతగా,
'అలాగే' అంటూ ఆశీర్వదించాడు బ్రహ్మ చిరునవ్వుతో
ఆనాటి ఆ పురాణ దంపతుల సంవాద ఫలితమే
ఈనాటి
మన
యస్.పి. బాలసుబ్రహ్మణ్యం
(రచన : రాజా - మ్యూజికాలజిస్ట్)