’జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగేతల ' అంటూ విన్యాసాలు చేసినా
’అచ్చెరువున అచ్చెరువున" అంటూ ముక్కున వేలేయించినా
’నడుం మీద జడకుప్పెల టెన్నీసు, గుచ్చుతోంది ప్రేమ పిన్నీసు, ఓ సీతా నా కవితా నేనేలే నీ మాతకు జామాతా’ అంటూ చమత్కరించినా
’నిన్నటి రైకల మబ్బుల్లో చిక్కిన చంద్రుళ్ళు' అంటూ శృంగారం రంగరించినా
’నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించెను పట్టపరుగుజన్మ’ అంటూ నవ్యంగా వర్ణించినా
’పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లనమోవికి తాకితే గేయాలూ’అంటూ గుండెను జలదరింపజేసినా
’మా జనని ప్రేమధమని” అంటూ కళ్ళను చెమరింపచేసినా
’ప్రతి భారత సతి మానం చంద్రమతీ మాంగల్యం' అంటూ మనసు పునాదుల్ని కుదిపేసినా
'గుజ్జు రూపమున కుమిలిన కుబ్జను బుజ్జగించి లాలించి సొగసిడి, మజ్జగాలకు ముద్దబంతిలా’ అంటూ జకార ప్రాసలతో పరవశింపచేసినా
’హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు' అంటూ స్పందింపజేసినా
’యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హార్ట్స్ వుయ్ హ్యావ్ లైక్ ఇండియన్ నమస్తే’ ఆంటూ ఎల్లలకు వెల్లవేసి ఎల్లరకూ వెల్లడించినా
’త్యాగరాజకృతిలో సీతాకృతి దాల్చిన నీ సొగసు చూడతరమా' అంటూ దివ్యంగా వర్ణించినా
'గోపాలా మసజసతతగా శార్దూలా’ అంటూ నవ్యాతినవ్యంగా ఛాందసించినా
'మాగాయే మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అడ్డవిస్తరి, మానిన్యాం మహాసుందరి’ లాంటి,
’మధ్యే మధ్యే మద్యపానీయం సమర్పయామి’ లాంటి
తమాషా ప్రయోగాలు అలవోకగా చేసినా
ఆ కలానికే చెల్లింది.
అందుకే ఆంతకుముందు పాటరాసే పద్దతులెన్నిటికో కాలం చెల్లింది.
ఆయన మాటే పాటై, జనంనోట పరిపాటై చెల్లింది
జీవం ఆయువుపట్టు తెలుసుకున్నది ధన్వంతరి అయితే శబ్దం వాయువు పట్టు తెలిసిన అంతర్వేది ఆయన.
ఆరోహణలే తప్ప అవరోహణలు లేని వైకుంఠపాళి - ఆయన పాళి,
అందుకే పెన్నులో పెన్నానదిని నింపుకుని 'పాట' లీపుత్ర రాజ్యాన్ని తన ప్రతిభా’పాట’వాలతో ’పాళిం'చగలుగుతున్నారు
వాగ్గేవి ఆయన మదిలో వసిస్తోంది. ఆయన అంగుళీయార్చనతో పరవశిస్తోంది.
రాతిని నాతిగా చేసింది ఆనాటి రాముడు. రీతిని గీతిగా చేసింది ఈనాటి సుందరరాముడు.
అది పాదం ఇది నాదం.
ఆనాటి అందాలరామునికి ఒకేమాట ఒకే బాణం.
ఈనాటి సుందర రామునికి ఎన్నో పాటలు ఎన్నో బాణీలు.
వేవేల భావాలకు సుందరమూర్తిని కల్పించిన నిర్విరాముడాయన.
ప్రణవ స్వరూపాన్ని ఆవహింప చేసుకుంటాడు ఋషి.
ఆకళింపు చేసుకుంటాడు కవి.
ఋషి పొందేది సిద్ధి. కవి పొందేది ప్రసిద్ధి.
ఋషి ధన్యజీవి. కవి చిరంజీవి.
మన వేటూరిసుందరరామ్మూర్తిగారు ఋషికన్నా గొప్ప కవి.
అక్షరం లక్షణంగా భాషించి భాసించిన వేటూరి నిజంగా ఋషికన్నా గొప్పకవి.
జయంతితే సుకృతినో రస సిద్దా కవీశ్వరాః
నాస్తితేషాం యశః కాయే
జరా మరణజం భయం
నాస్తి జరామరణజం భయం
- రాజా
(మ్యూజికాలజిస్ట్)