కొసరాజు సినీగీతాలు డబుల్ ప్యాక్
తెలుగు సినీ సంగీత చరిత్రలో వున్న కవులందరూ హాస్య గీతాలను రాసినా కొసరాజు స్థానం మాత్రం ప్రత్యేకం. అలాగే కొసరాజు హాస్యగీతాలను ఎన్నిటినో రాసినా సన్నివేశ సందర్భానుసారంగా రాసిన హాస్యేతరగీతాలు ప్రత్యేకస్థానాన్ని ఆక్రమించుకోవటమే కాక "ఇవి రాసినది కొసరాజా!?" అనేటంత పేరుని సంపాదించుకున్నాయి. ఈ రెండు రకాల ప్రత్యేకతలను కలగలుపుకుంటూ హెచ్.ఎం.వి. వారు కొసరాజు సినీగీతాలు' పేరిట డబుల్ ప్యాక్ ను విడుదల చేశారు. మొత్తం ఇందులో 29 పాటలున్నాయి.
'అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయినే, సరదా సరదా సిగిరెట్టు, మావూళ్ళ ఒక పడుచుంది, భలే ఛాన్సులే.ఇల్లరికంలో ఉన్న మజా, రావే రావే బాలా' వంటి పక్కా హాస్యగీతాలూ -
'ఆడుతు పాడుతు పనిచేసుంటే అలుపు సొలుపేమున్నది, ముద్దబంతిపూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి' వంటి సభ్య శృంగార యుగళ గీతాలు -
'అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు, మామ మామా మామా, గౌరమ్మా మొగుడెవరమ్మా వంటి వ్యంగ్య శృంగార యుగళ గీతాలూ -
'ఎంత టక్కరి టక్కరి వాడు, ఏడనున్నాడో ఎక్కడున్నాడో' వంటి చిలిపి శృంగార గీతాలూ
'నిలువవే వాలు కనులదానా, బులిబులి ఎర్రని బుగ్గలదానా, ఏవమ్మా జగడాల ఒదినమ్మా, పగటి కలలు కంటున్న మావయ్య, ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే' వంటి కవ్వింపు పాటలూ ,
'కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం, ఏ నిమషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ' వంటి శోక గీతాలూ -
'కళ్ళు తెరిచి కనరా, జయమ్మునిశ్చయమ్మురా భయమ్ము లేదురా, టౌను పక్కకెళ్ళొద్దురా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, కళ్ళ తెరిచి కనరా, ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న, వినవయ్యా రామయ్యా వంటి ప్రబోధాత్మక గీతాలూ -
పదపదవె వయ్యారి గాలిపటమూ, దులపర బుల్లడా సరదా గీతాలూ - ఈ రెండు ఆడియోలలోనూ చోటుచేసుకున్నాయి. ఉన్న పాటలని పైన ఉదహరించిన విధంగా - కేటగిరిలు వేసుకుని చూస్తే కొసరాజు బహుముఖ ప్రజ్ఞపై సంపూర్ణ అవగాహన కలిగి తీరుతుంది. నిజానికి ఈ డబుల్ ప్యాక్ కొసరాజుకి ఒక నివాళి, ఒక నీరాజనం, ఒక సూవెనీర్ అని చెప్పితీరాలి.
పాటల ఎంపిక, వాటి సమీకరణ, అధునీకరణ - ఇవన్నీ ఎంతో శ్రమకు, వ్యయానికి సంబంధించినవి. వాటన్నిటినీ అధిగమించి ఇటువంటి ప్రయత్నాలను ఒక కొలిక్కితీసుకురావటానికి ఎంతో అభిరుచి, మరెంతో సహనం ఉండాలి. అదంతా ఈ డబుల్ ప్యాక్ రూపకల్పనలో కనిపిస్తుంది.
అయితే ఇటువంటి బృహత్ప్రయత్నాలలో మరి కాస్త శ్రద్ద అవసరం. అదికూడా ఈ డబుల్ ప్యాక్ లో తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి - కలవారి (స్వార్ధం) పాటకు ఇంగ్లీషులో 'కలవాని' అని ముద్రించటం అక్షరదోషం కావచ్చు. కానీ 'పగటి కలలు కంటున్న మావయ్య' పాటకి ఇన్ లే అవుట్ కవర్లో 'భలేరాముడు' అని వేసి అదే పాటకి ఇన్ లే లో 'భలేరంగడు'వెయ్యడం(భలేరంగడే కరెక్టు) కొంత సర్దుకోలేని లోపమే - అలాగే 'దులపరబుల్లోడా" పాటని భానుమతి, పిఠాపురం, మాధవపెద్ది పాడితే భానుమతి అండ్ కోరన్ అని వెయ్యటాన్ని 'పోనీలే' అని ఎంత సరిపెట్టుకున్నా కానీ - యస్.రాజేశ్వరరావు సంగీతాన్ని 'అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, రావేరావేబాలా' పాటలకు సంగీత దర్శకునిగా పెండ్యాల పేరుని వెయ్యటం చరిత్రపరంగా భరించలేని దోషం,ద్రోహం. అందుకే శ్రద్ద మరింత అవసరం అని పేర్కొనడం జరిగింది.
రాజా (మ్యూజికాలజిస్ట్)