అందం గీసిన బొమ్మలా (ఏం పిల్లో ఏం పిల్లడో )
అందం గీసిన బొమ్మలా - నువ్వే నా నలువైపులా
నిన్నే చూస్తూ నేనిలా .... అయిపోయానో బొమ్మలా
పగలూ రేయీ నీ రూపే నా కనుపాపలా
జగమే మరచీ జత కదిలానే నీ నీడలా
అందం గీసిన బొమ్మలా - నువ్వే నా నలువైపులా
నిన్నే చూస్తూ నేనిలా... బొమ్మలా
నీ వొంటి విరుపందమే - కసిరే కంటి మెరుపందమే
అణువణువూ కవితామయమే
నీ చెంప నునుపందమే - అదిరే పెదవి ఎరుపందమే
అడుగడుగూ సమ్మోహనమే
నడుమందమే జడ అందమే తకధీం దరువులు అందమే
నడకందమే కులుకందమే ..... వరమే
పలుకందమే అలకందమే చీపో చిటపటలందమే
దుడుకందమే బెరుకందమే....నిజమే
విసుగూ విసురూ విసవిసలో మిసమిలసందమె
వగరూ పొగరూ కలబోసిన కసుబుసులందమే ''అందం గీసిన''
పాపాయిలా ఓ క్షణం - పడుచమ్మాయిలా ఓ క్షణం
ప్రతి కళకూ ఆహా అననా
కాస్సేపలా కలకలం - మరి కాస్సేపు హుందాతనం
నువు నడిచే నదివా లలనా
నీ సొగసులో దాగుందిలే ఎదనే ఎగరేసే గుణం
నను నిలువునా లాగింది నీ మహిమా
లేతళుకులో నాజూకులో కదిలిందో తేనెల మధువనం
ఆ వెలుగును వర్ణించ తరమా
కలయా నిజమా అనుకుంటూనే లోలోపల
మరలా మరలా నిను చూడాలనిపిస్తోందిలా ''అందం గీసిన''
చిత్రం : ఏం పిల్లో ఏం పిల్లడో....
రచన : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : దీపు
కోరస్ వాయిస్ కాంట్రిబ్యూషన్ : రీటా, సైంధవి, జనని
రాగం : మోహన (ఆధారంగా)
మోహన రాగానికి హిందుస్థానీలో దీటైన రాగం : భూపాలీ (భూప్)
మోహన రాగం ఆధారంగా వచ్చిన ప్రసిద్ధ సినీ గీతాలు :
సిరిమల్లె నీవె (పంతులమ్మ)
నిజంగా నేనేనా (కొత్త బంగారులోకం)
(అతి ఎక్కువ సినీ గీతాలు వచ్చిన రాగమిది. అంచేత మచ్చుకి ఓ రెండు మాత్రమే)
కొన్ని పాటలు గాయకుడికి లైఫ్ టైమ్ సాంగ్స్గా మిగిలిపోతాయి. మరికొన్ని రచయితకి సంతృప్తిని ఇచ్చేవిగా వుంటాయి. ఇంకొన్ని సంగీత దర్శకుడికి అంతకు ముందున్న పేరు ప్రతిష్టలను మరింత పటిష్టం చేసేవిగా వుంటాయి. ఈ మూడు గుణాలను కలబోసుకున్న పాట ఇది.
సంగీతం, సాహిత్యం, గానం సమాన తూకంలో పడినప్పుడు దేని గురించి ముందు చెప్పాలో కూడా తెలియని తీయని సమస్యని సృష్టించే ఈ పాటలో - సీనియర్ కాబట్టి, ఇక్కడ ముందుగా పుట్టింది ట్యూనే కాబట్టి మొదట మణిశర్మ పనితనం గురించి ప్రస్తావించడమే న్యాయం.
మాస్ మసాలా కమర్షియల్ ట్యూన్ ఇచ్చినా, కంప్లీట్ మెలొడీతో క్లాస్ ట్యూన్ ఇచ్చినా అందులో తనదైన ముద్రని నిలబెట్టుకోవడం మణిశర్మ ప్రత్యేకతల్లో ఒకటి. అటు కమర్సియల్గా హిట్ అయ్యే లక్షణాలు, ఇటు మెలొడీ సాంగ్కి వుండే లక్షణాలతో పాటు టోటల్గా మణిశర్మ మార్కు మొత్తం పాటంతా పూర్తిగా ప్రవహిస్తున్న జీవనదిలా కనిపిస్తూ వుంటుంది. అందుకేనేమో ఓసారి వినడంతో ఆగలేం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందీ పాట. అలా అనిపించకపోతే సమ్థింగ్ రాంగ్ విత్ అవర్ హార్ట్ అనుకోవాలి. పాడినవాళ్ళకి మంచి పేరుని, విన్నవాళ్ళకి హాయిని ఇచ్చే ఇంత చక్కటి ట్యూన్ని మిగిలిన డిమాండెడ్ ట్యూన్స్తో పాటు సినిమాకొక్కటి చొప్పున మణిశర్మ ఇచ్చుకుంటూ పోతే చాలు. కాల పరీక్షకు నిలబడే పాటల లిస్ట్లో ఎక్కువగా తన పాటలే మిగిలి వుండడాన్ని ఆయన కళ్ళారా చూసుకోవచ్చు.
ఇక రచయితగా రామజోగయ్య శాస్త్రి ఈ పాటని ఎంతో అనుభూతి చెంది రాశారనిపిస్తుంది. లేకపోతే - 'పాపాయిలా ఓ క్షణం - పడుచమ్మాయిలా ఓ క్షణం ప్రతి కళకూ ఆహా అననా,' 'కలయా నిజమా అనుకుంటూనే లోలోపల - మరలా మరలా నిను చూడాలనిపిస్తోందిలా' లాంటి ఎక్స్ప్రెషన్లు, 'కాస్సేపలా కలకలం - మరి కాస్సేపు హుందాతనం - నువు నడిచే నదివా లలనా' లాంటి ఉపమానాలు, 'తకధీం దరువులు, అందమే, ఛీపో చిటపటలందమే, వినసవిసలో మిసమిసలందమె - వగరూ పొగరూ కలబోసిన కసుబుసులందమే - లేతళుకులో నాజూకులో కదిలిందో తేనెల మధువనం' లాంటి అద్భుతమైన తూగు వున్న వాక్య నిర్మాణాలు, 'దుడుకందమే బెరుకందమే' లాంటి కన్విన్సింగ్ కాంట్రాస్ట్లు ఓ పట్టాన ఓ ప్రవాహంలా పడవు 'అందం'ని మెయిన్ పాయింట్గా పట్టుకుని తనలోని కవితాత్మని, రసాత్మని ఆవిష్కరించుకోవడానికి ఈ పాటని ఓ వేదికగా, నివేదికగా ఉపయోగించుకుంటూనే - 'ఈ పాటకి అణువణువూ కవితామయమే' అని ప్రశంసించదగ్గ అభిరుచి గల సాహిత్యాన్ని అందించారు రామజోగయ్య శాస్త్రి. ఇందుకు పూర్తి ప్రేరణ మణిశర్మ ఇచ్చిన ట్యూనే అనే విషయం అండర్ కరెంట్గా తెలిసిపోతూనే వుంటుంది అందరికీ.
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ - గాయకుడు దీపు గురించి... 10 సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని - కోటి, కీరవాణి, మణిశర్మ, చక్రి, శ్రీలేఖ, మిక్కీ జె మేయర్ వంటి సంగీత దర్శకుల వద్ద 40 సినిమాల్లో పాడి, సత్యం ఏమిటో స్వప్నం ఏమటో (అతిథి), నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే (మగధీర), లవ్ యూ రా (చిరుత), నాచోరే నాచోరే (యమదొంగ) వంటి హిట్ సాంగ్స్తో యూత్లో తనకంటూ ఓ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న దీపు (పూర్తి పేరు ప్రదీప్) కెరీర్లో ల్యాండ్ మార్క్గా నిలిచిపోయే పాట ఇది. ఇంతవరకూ అతను పాడిన పాటలన్నీ ఒక ఎత్తు. ఈ పాటొక్కటీ ఒక ఎత్తు. మణిశర్మ ట్యూన్ లోని పదునూ, రామజోగయ్యశాస్త్రి గారి సాహిత్యంలోని ఒడుపూ రెండూ చక్కగా ఒదిగి పండాయి దీపు గొంతులో. పైగా ఈ పాటని డబల్ లేయర్లో మణిశర్మ రికార్డింగ్ చేయించడం దీపుకి మరింత అడ్వాంటేజ్ అవడమే కాకుండా అతనికో లైఫ్ టైమ్ సాంగ్ గా మిగిలిపోయింది.
ఈ రివ్యూని, లిరిక్తో సహా ఎదురుగా పెట్టుకుని పాటని విని చూడండి. దిసీజ్ ఎ సాంగ్ టు రిమెంబర్ అని కచ్చితంగా ఒప్పుకుంటారు.
రాజా (మ్యూజికాలజిస్ట్)