ఎంత ఎంత ఎంత చూడనూ - ఝమ్మంది నాదం (2010)
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను
రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ
అరెరెరెరే .. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా
అరెరెరెరే .. ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను
చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం .. నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం
అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం .. మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం
అరెరెరెరే .. చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ
అరెరెరెరే .. ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను
పైన పైన కాదూ లోన తొంగి చూడూ .. మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం
కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం
అరెరెరెరే .. చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా
అరెరెరెరే .. రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా
చిత్రం : ఝమ్మంది నాదం (2010)
రచన : చంద్రబోస్
సంగీతం: ఎం.ఎం. కీవరాణి
గానం: కృష్ణ చైతన్య, సునీత
రాగం : మాండ్ (ఆధారంగా)
మాండ్ రాగానికి దీటైన హిందూస్థానీ రాగం : కంభావతి
మాండ్ రాగంలో గల కొన్ని ప్రసిద్ధ సినీగీతాలు:
రావే ప్రేమలతా (పెళ్ళి సందడి - ఏయన్నార్)
సాధించనౌనా జగానా (రహస్యం)
వినీవినగానే ట్యూను, లిరిక్కూ ఈ రెండూ చాలా సింపుల్గా వున్నాయనిపిస్తుంది ఈ పాటకి. నిజానికి వినడానికి, పాడుకోవడానికి హాయిగా వుండే చాలా పాటలు అలానే అనిపిస్తాయి. ఓ నాలుగైదు సార్లు విన్న తర్వాతే ఆ పాట సంగీత సాహిత్యాల్లోని అందాలు అవగాహనకొస్తాయి. సరిగ్గా ఆ కోవలోకి వస్తుందీ పాట.
మొత్తం పాటంతా 'చూపు' చుట్టూ తిరుగుతూ వుండడం ఆ పాటలోని ముఖ్య సాహిత్య విశేషం. లోగడ ఇలాంటి ప్రయోగాన్నే ఆచార్య అత్రేయ చేశారు. 1972లో విడుదలైన 'అబ్బాయిగారు - అమ్మాయిగారు' సినిమాలో 'తొలి చూపు చూసింది ప్రణయాన్ని' అంటూ మొదలయ్యే ఆ పాటలో ఆత్రేయ 'చూపు'లో చూపిన వైవిధ్యాలకి అప్పటి యువత పరవశించిపోయింది.
అలాగే ఇప్పటి యువతకి పట్టేలా చంద్రబోస్ కూడా ఈ పాటలో మంచి వేరియేషన్స్ చూపించారు. ఓ విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆత్రేయ పాట ప్రస్తావన కేవలం సినీ సంగీత సాహిత్య చరిత్రకి సంబంధించినంత వరకు మాత్రమే.
ఈ పాటలో - చెంప గారు. పెదవి గారు, నుడుము గారు అంటూ బాడీ పార్ట్లని గౌరవ వాచకంలో సంబోధించడం ఓ తమాషా ఆలోన. ''ఈ ఐడియా మీకెలా వచ్చింది'' అని అడిగితే - ''నిజానికి అక్కడ ఆ చరణానికి నేను మొదట రాసిన వెర్షన్ వేరు. అదెలా వుంటుందంటే
చేతికేసి చూస్తే చెంపకేమొ కోపం
పెదవి వైపు చూడగానె ఎదకు ఆగ్రహం
అడుగుకేసి చూస్తె జడలు చేసె జగడం
మెడను చూస్తె నడుము మడత పేచీ ఖాయం
ఇది చూడగానే డైరెక్టరు (కె.రాఘవేంద్రరావు) గారు 'కోపం, ఆగ్రహం, ఇవి నెగిటివ్గా వున్నాయి వాటిని పాజిటివ్గా రాయగలిగితే బావుంటుంది' అని సూచించారు. అప్పుడు నేను
చేతి కేసి చూస్తే చెంప గారు (తనని చూడమంటూ) సిద్ధం
నుదురు చూస్తె పెదవి గారు పలికె స్వాగతం
అడుగు కేసి చూస్తె (తనవైపు తిరగమంటూ) జడలు చేసె జగడం
మెడను చూస్తె నడుము గారు నలిగె తక్షణం
అని రాశాను. ఈ వెర్షన్ చూసి 'గారు' లాంటి తమాషా ప్రయోగం పడినందుకు డైరెక్టర్ గారు చిరున్వు నవ్వారు.'' అని వివరించారు చంద్రబోస్.
''నడుము (వద్ద) 'మడత పేచీ' ఖాయం లాంటి మంచి కాయినింగ్ పోయిందన్న బాధ లేదా?'' అని అడిగితే ''అది పోయింది కన్నా డైరెక్టర్ గారు చెప్పిన పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పడం ఆనందం కలిగింది. అంతే కాదు మార్చిన ఈ చరణంలో ఒకటి, రెండు, నాలుగు లైన్లలో వచ్చిన పాజిటివ్ సెన్స్కి మూడో లైన్లో వున్న 'జగడం' కూడా పాజిటివ్ సౌండ్ ఇచ్చింది.'' అన్నారు చంద్రబోస్ తృప్తిగా. (ఇక్కడో విషయం చెప్పాలి. చంద్రబోస్ ఎంతో గొప్పగా కట్టుకున్న తన ఇంట్లో - తన స్టడీ రూమ్లో పెన్సిల్ డ్రాయింగ్తో వేసిన రాఘవేంద్రరావు గారి ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నారు. తనకి కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన రాఘవేంద్రరావుగారంటే అంత గౌరవం చంద్రబోస్కి.)
''వలపు వాస్తవం పదప్రయోగం ఏమిటి?'' అని అడిగితే ''కళ్ళతో కాకుండా కౌగిళ్ళతో చూస్తే వలపు లోని వాస్తవాన్ని వయసే తెలుపుతుంది అనడానికి అలా రాశాను'' అన్నరాయన.
ఇక సంగీతంలోకొస్తే - 'అరెరెరెరెరే' అనే హుక్ వర్డ్కి అమరిన ట్యూన్ ఈ పాటకి ప్రాణం. అలాగే 'మనసు మూల దొరుకుతంది ప్రణయ పుస్తకం' దగ్గర జత పడిన ట్యూన్ కూడా. ఆ ఒక్కలైనే మాటిమాటికీ పాడుకోదగ్గంత మధురంగా వుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్నట్లు - పాట మొత్తానికి వెన్నుదన్నుగా నిలిచింది ఆర్కెష్ట్రయిజేషనే అని చెప్పక తప్పదు.
గానం విషయానికొస్తే - 'టెన్త్ క్లాస్' చిత్రం ద్వారా పరిచయమై, 'హ్యాపీడేస్'లోని 'జిల్ జిల్జిగా' పాటతోనూ, 'కొత్త బంగారు లోకం' లోని 'కళాశాలలో', 'కన్ఫ్యూజ్షన్' పాటలతోనూ పాపులరైన కృష్ణ చైతన్య ఈ పాటని ఎంతో హాయిగా పాడాడు. కొన్ని కొన్ని చోట్ల కీరవాణి గారి సింగింగ్ స్టయిల్ని అనుకరించాడా లేక అందుకున్నాడా అనే సందేహంలో పడేస్తాడు కూడా! ఆ స్టయిల్ని ఓ పక్కని పెట్టేసి చూస్తే - ఎంతో మందికి సూటయ్యేలా వుండడం ఇతని వాయిస్లోని ప్రత్యేకత. ఆ ప్రత్యేకతని నిలబెట్టుకుంటూ మరింత పదునెక్కితే మంచి భవిష్యత్తు వుందీ గాయకుడికి.
డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాటకి, సింగర్గా పాటకి సమతూకంలో ప్రాణం పోయగల కళాకరులలో బాబూగారి తర్వాతి స్థానం నిస్సందేహంగా సునీతదే అని మరోసారి ఋజువు చేస్తుందీ పాట. ముఖ్యంగా 'ఊ హూ హూ హూ' అని అనడంలో గాని, 'మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం' దగ్గర కీరవాణి పొందుపరిచిన జీవస్వరాల్ని తన స్వరంతో మరింత సజీవంగా సాక్షాత్కరింపజేయడంలో గాని సునీత చూపిన ప్రతభి అసామాన్యం. గాడ్ బ్లెస్ హెర్. ఏ మాటకా మాటగా చెప్పుకోవలసివస్తే - కలకాలం గుర్తుండిపోయే పాట కాకపోయినా - గుర్తుంచుకోదగ్గ పాటల్లో ఈ పాట కూడా ఒకటి .
రాజా (మ్యూజికాలజిస్ట్)