ఏ చీకటి చేరని
ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో
ఓ రేపని వుందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తు పడతావా ... గుర్తు పడతావా
కల్లలా నిజాలా కనులు చెప్పే కథలు
మరలా .. మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనె ఊహెవరిదో
తెలుసుకోగలమా తెలుసుకోగలమా
ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో
చిత్రం : వేదం (2010)
రచన, సంగీతం, గానం : ఎం.ఎం.కీరవాణి
కోరస్ : పృధ్వి, సారధి, కాలభైరవ (కీరవాణి కుమారుడు), చైత్ర, సుధ, జీవన్, (శ్రావణ) భార్గవి
వయొలిన్ సోలో : ఎం.ఎం. కీరవాణి
రాగం : భాగేశ్వరి (ఆధారంగా) (హిందుస్తానీ రాగమిది)
కర్ణాటక సంప్రదాయంలో భాగేశ్వరికి సమమైన రాగం : శ్రీరంజని
భాగేశ్వరి రాగంలో గల కొన్ని ప్రసిద్ధ సినీగీతాలు :
నీ కోసమె నే జీవించునది (మాయాబజార్)
రారా కనరారా కరుణమానిరా (జగదేకవీరుని కథ)
మంటలు రేపే నెలరాజా (రాము)
పగడాల జాబిలి చూడు (మూగనోము)
జీవితాన మరువలేము ఒకేరోజు (పెళ్ళిరోజు)
రావే చెలీ నా జాబిలి (భామా విజయం)
ప్రణయ రాగ వాహిని (మాయా మశ్చీంద్ర)
జాగ్ దర్ద్ ఇష్క్ జాగ్ (అనార్కలి) (హిందీ)
పట్టుమని పది లైన్లు కూడా లేని సాహిత్యంతో ఐదు నిముషాల ఇరవై సెకెండ్ల పాట చెయ్యాలంటే క్రియేటివిటీలో ఎంత డెప్త్ వుండాలి? ముప్పయి పేజీల స్ర్కిప్ట్తో రెండున్నర గంటల 'శంకరాభరణం' తయారయినట్లు....సరిగ్గా అదే జరిగింది 'వేదం' సినిమాలోని పైన ఉదహరించిన పాటతో.... అలాగని తక్కువ సాహిత్యంతో వచ్చిన పెద్ద పాటలు లోగడలేకపోలేదు. మది శారదా దేవి మందిరమే, రసికరాజు తగువారము కామా, శివశంకరీ వంటి పాటలున్నాయి. కానీ ఈ వేదం పాట రూటే వేరు. ఆ పాటల్లో వున్న సంగీత పాండిత్య ప్రదర్శన ఈ పాటలో వుండదు. కేవలం వేదన మాత్రమే వుంటుంది. ఆ వేదనలో కొంత ఆవేదన, కొంత నివేదన. అంచేత పోలిక కేవలం సంగీత సాహిత్యాల లెంగ్త్కి సంబంధించినంత వరకే....!
ఇది మొత్తం కీరవాణి పాట.... సంగీతం, సాహిత్యం, గానం, మొదటి చరణం తర్వాత వినిపించే సోలో వయొలిన్ బిట్టూ అంతా కీరవాణే....ఐతే అది కేవలం పైకి అనిపించేది, వినిపించేదీ మాత్రమే....కానీ మనసు పెట్టి చూడగలిగితే కీరవాణిలోని అంతర్మధనం కనిపిస్తుంది. అదే గనక లేకపోతే 'కల్లలా...నిజాలా.... కనులు చెప్పే కథలు, మరలా... మనుషులా... ఉన్న కొన్నాళ్ళు' లాంటి వాక్యాలు రాయడానికి తగిన కసి పుట్టదు.
సాహిత్యానికి సంబంధించినంత వరకూ అభిరుచి, అభినివేశం కాస్తా కూస్తా కాదు కొంచెం ఎక్కువే వుంది కీరవాణిలో. ఒక్కోసారి డమ్మీ లిరిక్స్ కాకుండా మంచి మంచి పల్లవుల్ని అందించడం, మరోసారి చరణాల్ని సర్దేయడం లాంటి సంఘటనలెన్నో వున్నాయి ఆయన సిగీ సంగీత జీవితంలో. వీటన్నిటినీ మించి పూర్వకవుల ప్రయోగాలంటే గౌరవం ఉంది. వేటూరి వంటి పుంభావ సరస్వతితో సాంగత్య వైభవం వుంది. ఇన్ని వున్న కీరవాణి నుండి 'ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనే ఊహెవరిదో తెలుసుకోగలమా... తెలుసుకోగలమా...' వంటి ఎక్స్ప్రెషన్ వెలువడడంలో వింతేం లేదు.
కాకపోతే ఆ వాక్యంలో - ఊహెవరిదో - కంటే - ఊహెందుకో అనేదే కరెక్టనిపిస్తుంది.... ఎందుకంటే ఊహ ఆ భగవంతుడిదే అన్నది అందరికీ తెలిసిన సృష్టి రహస్యం. ఎందుకన్నదే ఎవరికీ తెలియని సృష్టి రహస్యం. అది అర్థం కాకపోవడం వల్లనే కదా ఈ వేదనంతా.
సంగీత దర్శకుడే గాయకుడైతే కొన్ని సౌలభ్యాలున్నాయి. అందువల్ల అనుభూతి చెందిన జీవస్వరాల్ని యధాతథంగా పలికించడానికి వీలవుతుంది. ఉదాహరణకి ఈ పాటలో 'గుర్తపడతావా... గుర్తుపడతావా' అంటూ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కీరవాణి చూపించిన అప్స్ అండ్ డౌన్స్ని యాజిటీజ్గా పాడుకుని చూడండి - గుండె ఎంతగా ద్రవించి పోతుందో అనుభవంలోకి వస్తుంది. అలాగే 'తెలుసుకోగలమా... తెలుసుకోగలమా' దగ్గర కూడా.
ఈ పాటలో ఇంకో విశేషం కూడా ఉంది. చివరి వన్ అండ్ హాఫ్ మినిట్ దగ్గర మొదలవుతుంది రిథమ్ సెషన్. అంతవరకూ పాటంతా రిథమ్ లేకుండానే సాగుతుంది. ఇంతకు ముందు రిథమ్ లేని పాటలు లేవని కాదు. ఈ పాటలో ఆ ప్రయోగం చక్కగా కుదిరింది. అలాగే ఒకటే చరణం వుండటం, ఆ చరణం తర్వాత పల్లవి సింపుల్గా రావటం ఎంత బావుందో ఆ తర్వాత కీరవాణి వాయించిన వయొలిన్ అంత బావుంది. సాధారణంగా కీరవాణి తన పాటలకు వయొలిన్ని వాయించే అమల్ రాజ్తో కాకుండా తానే స్వయంగా వాయించారంటే ఆ బిట్పై ఆయన స్వరపరుస్తున్నప్పుడే మమకారం పెంచుకుని వాయిస్తున్నప్పుడు ఎంతో ఎన్జాయ్ చేసేరనిపిస్తుంది.
రచన, ఎన్నుకున్న రాగం, దాన్ని స్వర రచనలో వాడుకున్న విధానం, వయొలిన్ వాద్యం ఇచ్చిన ఎఫెక్ట్, మనసంతా పెట్టి పాడిన విధానం - ఈ అయిదూ ఈ పాటకు పంచప్రాణాలైతే - ఈ పాటకి అమరిన ఆరో ప్రాణం - కోరస్ కాంట్రిబ్యూషన్. దీని విలువ చాలామందికి వింటున్నప్పుడు తెలిసే అవకాశం లేదు. కానీ టీవీ కార్యక్రమాల్లో ఈ పాటని ఎవరైనా పాడుతున్నప్పుడు గమనిస్తే అవగాహనకొస్తుంది. వాళ్ళు ఆలపించిన ఆ రెండు కోరస్ బిట్లూ హమ్ చేసుకుని చూడండి అది ఆ రాగస్వభావమా లేక కీరవాణి స్వరరచనా ప్రభావమా లేక కోరస్ గొంతుల సామూహిక సమ్మోహనా వైభవమా ఏదీ ఓ పట్టాన తేల్చుకోలేం. అంతకన్నా ఆ రసస్పందనలో మునిగిపోవడం నయం.
నాలుగైదు సార్లు వింటేనే గాని ఆ పాట అందించే అనుభూతిని అందుకోలేం. అందుకున్నాక చక్కటి టీమ్ వర్క్తో పాడితే పదిమందిలో మెప్పు లభిస్తుంది. ఒంటరిగా వున్నప్పుడు ఆలపించుకుంటే మనం రసగంగలో తడిసి బరువెక్కి సేద తీరుతుంది.