ఒకే పాటకి గుండెల్లో తడి - రసోద్రేకం
రాజన్న సినిమాలో ఓ పాటుంది విన్నావా?
ఏంటది?
అమ్మా... అవనీ... నేలతల్లీ అని...
దేశభక్తి గీతమా... సర్లే...
అలా పెదవి విరిచెయ్యకు... తర్వాత నాలిక్కొరుక్కోవల్సి వస్తుంది...
అంత గొప్పగా ఉందా... పాడిందేవైనా శ్రేయాఘోషలా..?
కాదు... మాళవిక... స్వరాలతో సహా ఎంత బాగా పాడిందో చెప్పలేం.
స్వరాలా... అయితే చిత్ర అయి వుంటుంది. తప్పుగా వినుంటావ్. .
ఆడియో సీడీ రిలీజయిన రెండో రోజు నుండీ మ్యూజిక్ సర్కిల్స్‌లో స్ప్రెడ్ అవుతున్న టాక్, టాపిక్ ఇది. రాసిన శివదత్తా గురించి గానీ, ట్యూన్ చేసిన కీరవాణి గురించి గానీ మరో అభిప్రాయం లేదు. వాళ్లకది మామూలే అని ఓ డెసిషన్‌కి వచ్చేశారు చాలామంది. డిస్కషనంతా గాయని గురించే...
చిత్ర లెవల్‌కైతే ఓకే గానీ... మాళవికకి మాత్రం ఇది చాలా పెద్ద పాట...అన్నారు పాటలను రెండుసార్లు విన్న తర్వాత... ఎందుకంటే ఒకసారి విన్న తర్వాత రెండోసారి వినకుండా ఉండడం కష్టం కనుక.
నిజమే... స్వరాలు చాలా బాగా వేసింది... బ్రహ్మాండం...అనడం మొదలు పెట్టారు మెలమెల్లగా... మెల్లతో మూసేసుకున్న కళ్లు విప్పార్చి... అప్పటికే ఆ పాట ఆ నోటా ఆ నోటా నాని నోటబుల్ సాంగ్ అయిపోయింది.
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైన దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మా... ఎంత బాగున్నాయో కదా ఈ లైన్లు!? సాహిత్యం వైపు దృష్టి వెళుతోంది కొద్దికొద్దిగా...
రాసింది శివశక్తి ద త్తా... కీరవాణి ఫాదరు. ఛత్రపతి లో అగ్నిస్ఖలన సందగ్ధరిపు అంటూ పూర్తి సంస్కృతంలో పాట రాశారే ఆయన... ఈ పాటకి మాత్రం శివదత్తా అని పేరేశారు.
వింటుంటే నేనున్నాను లో ఏ శ్వాసలో చేరితే పాట రిపీట్ చేసినట్టు లేదూ?
రిపీట్ చేసినట్టుందా... గుర్తు చేస్తున్నట్టుందా? ఒక మంచి పాట వస్తే విని ఆనందించకుండా ఈ వంకలు పెట్టడం ఏమిటి... అందుకే అన్నాడు జంధ్యాల మనవాళ్లకి రసాస్వాదన కన్నా రంధ్రాన్వేషణ ఎక్కువని..
ఇప్పుడు చర్చ మ్యూజిక్ మీదికి మళ్లింది... అర్థమైపోయింది ఈ పాట హిట్టని...
ఇక కొన్నాళ్ల వరకూ రాబోయే ఏ పాటల పోటీలోనైనా ఈ పాటా తప్పదూ. బాగా పాడిన అమ్మాయిలకి ఫస్ట్ ప్రైజూ తప్పదు ...
అలా మ్యూజిక్కియరు ఉన్నవాళ్లూ, లేనివాళ్లూ ఈ ఇయర్లో ఫిమేల్ సింగర్స్‌కి మిగిలిన సోలో ఇదేనని తేల్చేశారు చివరాఖరికి.
వీటన్నిటినీ పక్కన బెట్టి ఓపెన్ మైండ్‌తో విని చూడండా పాటని. ఒంటరిగా పాడుకుంటే గుండెల్లో పుట్టే తడి, పదిమందిలో పాడితే కలిగే రసోద్రేకం కలిసి ఒకే పాటలో వున్నట్టు ఫీలవుతాం. ఒక మంచి పాటకుండే లక్షణం లక్షణంగా వున్నట్టునిపిస్తుంది. ఆకట్టుకోడానికింతకన్నా ఏం కావాలి పాటకి?
అన్నమయ్య సినిమాలో పురుషోత్తమా పాట విన్నాక అలాంటి పాటే కావాలని నిర్మాత శివప్రసాద్ రెడ్డి నేనున్నానులో ఏ శ్వాసలో చేరితే పాట చేయించుకున్నారట. ఆ స్టాండర్డ్స్‌లో అలా మోహనరాగంలో మరో పాట చేయమనుంటారు కీరవాణి గారిని. అందుకే ఈ పాట ఏ శ్వాసలో పాటని చాలా చోట్ల గుర్తు చేస్తూంటుంది. కాకపోతే ఏ శ్వాసలో పాట సీడీలో వింటుంటే కలిగే ఫీలింగ్ సినిమా చూస్తుంటే మారిపోతుంది (మధ్యలో ఉన్న డిష్యూం డిష్యూంల వల్ల). ఈ అమ్మా అవనీ పాటకి ఆ సమస్య లేదు. హాయిగా వినొచ్చు....చూడొచ్చు. సీడీలో లేదు గానీ సినిమాలో కీరవాణి వెర్షన్ కూడా ఉంది. ఈ సినిమాలో గిజిగాడు నా ఫేవరెట్ సాంగ్. కానీ వింటూ ఉంటే ఈ అమ్మా అవనీ పాట ఆల్బమ్‌లో నంబర్ వన్ ప్లేస్ ఆక్రమించేట్టుంది అన్నారు అక్కినేని నాగార్జున.
నీకీ పాటకి నందీ అవార్డు రావొచ్చా అని అడిగితే కీరవాణిగారు ఈపాటకి నన్ను సెలక్ట్ చేసుకోవడం, పాడించడమే పెద్ద అవార్డు. అంది మాళవిక.
నిజమే... ఈపాట వింటుంటే ఎంత బావుందనిపిస్తుందో పాడడానికి అంత సామర్థ్యం కావాలనిపిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే గాయనిగా రాణించాలనుకున్న వారికి ఈ పాట ఓ లిట్మస్ టెస్ట్ లాంటిది. కేవలం స్వరాల్ని బై హార్ట్ చేసేస్తే సరిపోదు. వాటిని ఆయా స్వరస్థానాలలో పడేట్టు పాడగలగాలి. తేట తెలుగు జాణా అంటూ ఎంత సన్నగా లాగాలో
కోటి రతనాల వీణా అంటూ అంతే మృదువుగా మలుపు తిప్పగలగాలి. నరనరాలలో రక్తం దగ్గర పొంగి పొరలే ఉద్రేకాన్ని లాగి పట్టి వదలగలగాలి. నువు ధన్య చరితవమ్మా దగ్గర దేశభక్తి నాభి నుంచి గుండెల్లోకి తన్నుకు వచ్చేట్టుండాలి. తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా దేహమైన ప్రాణమైన కొంచమే గదమ్మా అది మించిన నాదన్నది నీకీగలదేదమ్మా అంటుంటే విన్నవాళ్లకి కళ్లు చెమరించాలి. పాడే వాళ్లకి హృదయంలో ఓ క్షణం నిశ్శబ్దం అయిపోవాలి. ఈ అనుభూతులన్నిటినీ తట్టుకుని చివర్న మళ్ళీ వచ్చే పల్లవిని సరియైన సమయానికి తాళంతో సహా ఎత్తుకోగల
ర సమయస్ఫూర్తి ఉండాలి. వీటన్నిటినీ మాళవిక చేత అద్భుతంగా ఆవిష్కరింప చేశారు కీరవాణి.
అందుకే ఈ పాట ఎన్నిసార్లు వినినా మరి తనివి తీరదెందుకని? అనుకోబుద్దేస్తుంది. ఈ మధ్య వస్తున్న పాటల్ని వినలేక పోతున్నాం బాబూ అని వాపోతున్నవారిని పిలిచి మరీ ఈ పాట విని మాట్లాడండి బాబూ అని బతిమాలు కోవాలనిపిస్తుంది. సంగీతంలోనూ, సాహిత్యంలోనూ, గానంలోనూ, వాద్య గోష్టిలోనూ, గాయని ఎంపిక లోనూ అణువణువునా తెలుగుతనాన్ని, తెలుగు ధనాన్ని నింపుకున్న ఈ పాట కాలపరీక్షకు నిలబడి నెగ్గే పాట. మన తర్వాతి తరాలకు మనం మిగిల్చిన మరో మంచి పాట.
అమ్మా ... అవనీ ..
అమ్మా .. అవనీ ... నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని
అమ్మా అవనీ నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని
//అమ్మా అవనీ //
కనిపెంచిన ఒడిలోనే కన్ను మూయనీ
మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ
// అమ్మా ... అవనీ //
తల్లీ నిను తాకితేనె తనువు పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనె మేను పరవశిస్తుంది
తేట తెలుగు జాణ - కోటి రతనాల వీణ
నీ పదములాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్న
అమ్మా ... అవనీ .. నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని
అమ్మా .. అవనీ ...
నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాథలు వింటే
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది
రి గ గ రి గ గ రి గ (3)
రి గ రి స ద ప ద స
రి గ గ రి ప ప
గ ద ద ద ప ద ద ద
స ద స ద ప గ ప ద
స ద స ద స ద స ద
(బిట్)
ప ద స ద (4)
సా స సా స సా స సా స - రీ రి
సా స సా స సా స సా స - గా గ
రి గ రి స రి గ రి స
(బిట్)
రి గ రి స రి గ రి స
(బిట్)
స రి స రి గా రి స గా రి స గా రిస
రి గ రి గ - పా
గ రి స ద పా
(బిట్)
గ ప ప ద ద స - స రి గ రి స ద
ప ద ద స స రి - రి గ ప గ రి స రీ గా - పా
రి స ద ప ద స రి గ - పా
స రి గ ప ద స రి గ - పా
గ ప గ రి స రి స ద
వీర మాతవమ్మా .. రణధీర చరితవమ్మా
పుణ్య భూమివమ్మా ... నువు ధన్య చరితవమ్మా
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదయినా
దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది నీకీగలదేదమ్మా
అమ్మా .. అవనీ .. నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా ... అవనీ
చిత్రం : రాజన్న (2011)
సంగీతం : ఎమ్. ఎమ్. కీరవాణి
రచన : కె. శివదత్తా
గానం : మాళవిక