లౌక్యం' మ్యూజిక్ రివ్యూ
ప్రస్తుతం వస్తున్న సినిమా పాటల్ని - కాల పరీక్షకు నిలబడిపోయే పాటలు, కాలక్షేపం పాటలు అంటూ రెండు రకాలు గా విభజిస్తే ఎక్కువ శాతం రెండో కేటగిరీకి చెందిన పాటలే వుంటాయి. లౌక్యం సినిమాలోని పాటల్ని నిస్సందేహంగా ఈ రెండో కేటగిరీలో వేసేసుకోవచ్చు. మంచి భోజనం దొరకనప్పుడు - ఏమీ తినకుండా ఉండలేం కనుక - దొరికినదే తింటూ ఆ రుచిని, అందులోని అరుచిని నెమరు వేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ .
రామజోగయ్య శాస్త్రి రాసిన - సూడు సూడు సూడు సూడు - ఆడియో సీడీలో మొదటి పాటగా వస్తుంది. ధనుంజయ్, రమ్యబెహరా పాడేరు. ఆడియో మొత్తం మీదే ఈ పాటకే కాస్త ఆరోగ్యకరమైన ఊపు, రూపు కుదిరాయి. మొదటి చరణంలో 'కంటి సైగను కానా' దగ్గర, రెండో చరణంలో 'పల్లకీ తెమ్మంటా' దగ్గర ట్యూన్ పరంగా తీసుకున్న మలుపు చక్కగా వుంది.
రెండో పాట 'తెరె బ్యూటిఫుల్ ఆంఖె దేఖ్ కే' ని ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్ - స్వీకార్ తో కలిసి రాయగా రాజహసన్ పాడేరు. ఈయన పాడే పద్ధతి చూస్తుంటే అద్నన్ శామీ స్టయిల్ గుర్తొస్తుంది. ఇక పాట సాహిత్యపు పోకడల గురించి ఏదైనా ఓ మాట అనుకునే ముందు దిగువన ఉదహరించిన కొన్ని వాక్యాల్ని కాస్త పరిశీలించండి.
--------------------------------------------------------------------------------------
పల్లవి :
తెరె బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కె నా గుండె జారిపోయిందే
తెరె కలర్ ఫుల్ లిప్స్ దేఖ్ కే నా పల్సే డబలై పోయిందే
తెరె మిట్టీ మిట్టీ బాతే ( మీఠీ మీఠీ బాతే కి వచ్చిన పాట్లు)
వింటే మనసే జిల్ జిల్ అంటుందే
ఒ పిలా పిల్లా ఇక హలాగుల్లా
నా బ్రతుకే చెయ్యకు రసగుల్లా
(చేస్తే ఏమవుతుందిటా ... తియ్యగానే వుంటుందిగా)
ఓ వయ్యారీ ఓ వయ్యారీ నా దిలంత (దిల్ అంతా అని అర్ధం చేసుకోవాలి)
నువ్వే వయ్యారీ
చరణం :
చోరి చోరీ కళ్ళే కదిపి
చుప్ కె చుప్ కె మనసుని కుదిపి
తోడ తోడా తయారు అయిపోవే
జబ్ దిల్ మె దిల్ మె ఆకలి
తబ్ తూ హి మేరీ స్ట్రాబెరీ
------------------------------------------------------------------------------------------------
ఈ పద్ధతిని ఏం అందాం !? సరదాకి అని సరిబెట్టుకుందామా, ఏదో కుర్రకారు హుషారు అని చూసీ చూడనట్టు ఒదిలేద్దామా, ఏ భాషలోని పదాల్నైనా కలుపుకునే విశాల హృదయం మనకుందని గర్విద్దామా, భాష కన్నా భావం ముఖ్యం అని సంస్కారాన్ని ప్రకటిద్దామా , 'బైటేమో తెలుగు చచ్చెనని కామెంట్లు - మన బిడ్డలకేమో కాన్వెంట్లు' అంటూ చలోక్తి రూపంలో సినారె చేసిన విమర్శను గుర్తుచేసుకుందామా ... ఏం చేద్దాం చెప్పండి. బాపు గారు భరణికి రాసిన ఓ ఉత్తరంలో 'సంపూర్ణమైన (తెలుగులో పెర్ఫెక్ట్)' అంటూ బహు చమత్కారంగా మనవాళ్ళని ఎత్తిపొడుపుల జలపాతంలో ఎత్తికుదేశారు. భాషని భ్రష్టు పట్టించే ఓ 'సంకరా భాషణం' కార్యక్రమంలో ఒకతను ' ఐ సా ఎ చచ్చిన పాము ఇన్ ది బజార్ - బట్ ఐ కొడతానంటే నో లకడీ ఇన్ మై హ్యాండ్' అన్నాడు. అతనికే మొదటి బహుమతి వచ్చింది. ఇంతకన్నా ఈ పాట గురించి చర్చించడం అనవసరం.
మూడో పాట 'నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే' వినడానికి హాయిగా, పాడుకోడానికి తియ్యగా వుంది. సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్ కి సంపూర్ణ న్యాయం చేస్తూ విజయ్ ప్రకాశ్, మోహన పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ రచయిత కాబట్టి పదాలు ఎంత మృదువుగా ఉన్నాయో - భావాలు అంత మధురంగా వున్నాయి. ఉదాహరణకి మొదటి చరణంలో - చూపులో సూదున్నాదే , కళ్ళలో మందున్నాదే, సూది మందేదో ఇచ్చావే - అలాగే రెండో చరణం లో - చేతికందేలాగ నువ్వుండి వుంటే , ఎంత కందేవోనే ఆ చెంపలు ... ఇవి కేవలం మచ్చుకి, మెచ్చుకి మాత్రమే .
చక్కని చిత్రీకరణ తోడైతే ఈ చివరి రెండు లైన్ లలో గల భావుకత ప్రేక్షకులకు మరింత అందే అవకాశం వుంది.
నిజానికి ఈ పాటకి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. కానీ మొదటి పాటలో గల ఆకర్షణ కొంచెం ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది.
నాల్గవ పాట " పింక్ లిప్స్ అమ్మాయివే' పాటను శ్రీమణి రాయగా - జస్ ప్రీత్ జాజ్, సాహితి పాడేరు. రెండవ పాటకు రాసిన అభిప్రాయాన్నే కొంతవరకూ ఈ పాటకి కూడా అన్వయించుకోవచ్చు. ఇలాటివన్నీ ఆల్ టైమ్ సాంగ్స్ లా కాకుండా 'హాల్ టైమ్ సాంగ్స్' (థియేటర్ బైటికి రాగానే మర్చిపోదగ్గ పాటలు) అక్కౌంట్ లో వేసెయ్యాలి.
చివరగా వచ్చే అయిదవ పాట 'సుర్ర్ సూపరూ' పాటను చంద్రబోస్ రాయగా రెనీనా రెడ్డి, సింహా పాడేరు. 'కెవ్వ్ కేక' పాట తర్వాత ఆ పాటకి చెల్లి లాంటి పాటలు చాలా వచ్చాయి. అందులో ఇదొకటి. అంచేత పాట సాహిత్యంలో కొన్ని కొన్ని ఉదాహరణలు శృంగారపు పరిధిని అతిక్రమించినా కొంత నర్మగర్భంగా ఉండడం వల్ల ఆ తెలివితేటల 'పన్' చాటున దాక్కునే అవకాశం వుంది. కానీ - మిడ్డీలో నువ్ అడ్డొస్తే హెడ్డు లైట్ పగిలిందిలే - లాంటి ఉదాహరణ మాత్రం పెదవిని మించిన పన్నులా తయారయింది. ప్రస్థుతం మంచి సీనియారిటీ తో గౌరవప్రదమైన స్థానం లో వున్న చంద్రబోస్ స్థాయికి ఇది తగదు.
ఏది ఏమైనా ఈ 'లౌక్యం' పాటల్లో - వచ్చిన ఆవకాశాన్ని ఒదులుకో కూడదనే లౌక్యమే తప్ప, కొన్నాళ్ళ పాటు గుర్తుండిపోయే పాటలు చేద్దాం అనే లక్ష్యం కనబడదు.
రాజా (మ్యూజికాలజిస్ట్)