This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Film Reviews
'గోవిందుడు అందరి వాడేలే' మ్యూజిక్ రివ్యూ

'గోవిందుడు అందరి వాడేలే' మ్యూజిక్ రివ్యూ

  

కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ, కాజోల్ హీరోహీరోయిన్లు గా - శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, ప్రకాశ్ రాజ్, జయసుధ వంటి భారీ తారాగణంతో, మరిన్ని భారీ అంచనాలతో తయారైన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవలే విడుదలయింది.
 
'బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే' పాట ప్రేరణగా ఈ టైటిల్ పుట్టడానికి కారకులైన విజయా వారి 'మిస్సమ్మ' బృందాన్ని మనస్ఫూర్తిగా తలచుకుంటూ ఆడియో రివ్యూలోకి అడుగు పెడితే ....
 
పల్లవి : నీలిరంగు చీరలోన
రచన : సుద్దాల అశోక్ తేజ
గానం : హరిహరన్
 
ఈ పాటలో  సాహిత్యానిదే ప్రథమ స్థానం. జీవితాన్ని రకరకాల కోణాల్లో స్పృశించడం ఇందులోని ప్రత్యేకత. మొట్టమొదట - పవితమైన కన్యతోనో, పతివ్రత తోనో కాకుండా -జాణ తో పోల్చారు. ఎందుకంటే అది చాలా చంచలంగా వుంటుంది, ఆమెతో సయ్యాట అంటే ఏటికి ఎదురీదడమే కనుక.
జీవితంలోని కష్టసుఖాల గురించి చెపుతూ  - సుఖాలు చిన్నది ఇచ్చే  కౌగిలింతలాంటివనీ, కష్టాలు పువ్వులాగ ఎదురై వచ్చి ముల్లు లాగ ఎదను గుచ్చే లాంటివని సరిపోల్చుతూ - తర్వాతి చరణాల్లో పండగల్ని ఉదాహరణలుగా ఎన్నుకున్నారు.
వీటన్నిటినీ తట్టుకోవాలంటే జీవితంలో సాహసం వుండాలి. సాహసం అనే పొలంలో పంట తియ్యగల బలమే వుంటే ప్రతి రోజు  సంక్రాంతి అవుతుందన్నారు - పంటకి, సంక్రాంతికి సంబంధం వుంది కనుక. 
బ్రతుకు పోరు బరిలో నిలిచి నీకు నువ్వె ఆయుధమైతే ప్రతి పూటా విజయదశమి అవుతుందన్నారు. పోరులో ఆయుధం వుండాలి. అది ప్రత్యేకంగా మన దగ్గిరకి రాదు. మనకి మనమే ఆయుధమవ్వాలి. అయుధ  పూజకి, విజయదశమికి లింకు కనుక ఆ పోలిక. ఆ తర్వాత వచ్చే పండగ, నిప్పులకి ప్రాదాన్యాత గల పండగ -  దీపావళి. అందుకే విధి విసిరే నిప్పులతో ఆడుకుంటే అదే దీపావళి అన్నారు ముగింపుగా. 
ఈ పాటని రాయడానికి అశోక్ తేజ కి 28 రోజులు పట్టింది. నిజానికి సాహిత్యం సమకూరిన తరువాత ట్యూన్ చేసి వుంటే మరింత బలమైన ట్యూన్ జతపడేదేమో. ఇక పాడే పద్ధతి కొస్తే - 'నిన్ను ఎట్టా అదుముకోనే' అనే వాక్యం 'నిన్ను ఎట్టా దుమ్ముకోనే'  అనీ, 'పున్నమంటి చిన్నది' అనే వాక్యం 'పొన్నమంటి చిన్నది' అనీ , 'వెయ్ రా' అనే పదం 'వయ్ రా' అనీ  వినిపించడం - సాహిత్యాన్ని పట్టించుకునే వారికి కాస్త ఇబ్బందిగా వుంటుంది.
 
పల్లవి : గులాబీ కళ్ళు
రచన : శ్రీమణి
గానం : జవేద్ ఆలీ
ఇటీవల అతి తక్కువ వ్యవధిలో 'ఆరడుగుల బుల్లెట్టు' లా దూసుకొచ్చిన శ్రీమణి రాసిన పాట ఇది. అదృష్టవశాత్తూ మంచి స్వింగ్ వున్న ట్యూన్ కూడా సమకూరింది. ఇక ఈ పాటను పాడిన జవేద్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని అసలు పేరు జవేద్ హుస్సేన్. తన గురువు గారైన గులాం ఆలీ పేరులోని 'ఆలీ' ని గురు నామం గా స్వీకరించి తన పేరుతో కలుపుకుని 'జవేద్ ఆలీ' అయ్యాడు. ఎంతో సిన్సియర్ గా పాడిన ఈ పాట ద్వారా అతనికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
పల్లవి : రా రా రాకుమారా
రచన : సిరివెన్నెల
గానం : చిన్మయి
 
దర్శకుడు అనుకున్న సన్నివేశాల్లోని సాంద్రతకి - ముఖ్యంగా కృష్ణవంశీ లాంటి దర్శకుడి చిత్రీకరణ లోని ఇంటెన్సిటీకి - అక్షర రూపం ఇవ్వాలంటే ఎంత మమేకమైపోయి రాయాలో లాంటి విద్యా రహస్యం తెలిసిన అనుభూతి కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అంతటి అనుభూతిని హృదయాంతర్భాగాల నుండి ఆసాంతం అనుభవించగల రసజీవి కనుకనే దాన్ని అంత హృద్యంగా అందించగలడాయన. లేకపోతే - కలలే నిజమయ్యేలా కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం,  నిజమే కల అయ్యేలా 'ఒళ్ళు మరిచిన అయోమయం' మరింత ఇష్టం, బ్రతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ - లాంటి భావాలూ, పదాలూ పుట్టవు. 'నువ్వు నువ్వు' (ఖడ్గం)  లాంటి పాట రాశాక ఆ స్టాండర్డ్ లో కృష్ణవంశీకి మరో పాట రాయడం మానసిక ఘర్షణే.  ఈ ' రా రా రాకుమారా' ఆ పాటకు బొరుసు లాంటిది. 
ఈ పాటకు ధర్మవతి రాగం ఆధారం. ఈ రాగాన్ని విరివిగా కన్నాఅరుదుగా ఉపయోగించిన సందర్భాలే ఎక్కువ. వెన్నెల్లో గోదారి అందం (సితార), అందెల రవమిది పదములదా (స్వర్ణకమలం), డోన్ట్ మిస్ సోదరా (జయం మనదేరా), చీకటి వెలుగుల కౌగిటిలో అనే పాటలో తేట నీటిని ఏటి ఒడ్డున చరణం (చీకటి వెలుగులు) పాటల్ని, ఇప్పుడు ఈ పాటని ఆ రాగానికి ఉదాహణలుగా చెప్పుకోవచ్చు. హిందుస్తానీ సంప్రదాయంలో ఈ రాగాన్ని మధువంతి అని అంటారు.సాహిత్యాన్ని ఎదురుగా పెట్టుకుని ఈ పాటని వింటుంటే కృష్ణవంశీ తరహా చిత్రీకరణ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఆ కోణంలో యువన్ శంకర్ రాజా సక్సెస్ అయినట్టే లెక్క. ఎన్నో డైలాగులకు ప్రాణం పోసి, మరెన్నో  పాటలకు ఎంతో చక్కగా పాడిన చిన్మయి ఈ పాటను మరికొంత స్పష్టంగా పాడి వుంటే బాగుండేది అని అనిపించడం సహజం.
 
పల్లవి : ప్రతి చోటా నాకే స్వాగతం
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : రంజిత్
 
చాలా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ వుంటాయి. వాటిని చాలా మంది రాశారు కూడా. కానీ, రామ జోగయ్య శాస్త్రి మాత్రం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎక్కువ రాశారు. ఉదాహరణ కి 'జులాయ్' లో 'నేనేడ పుడితె నీకేటన్నాయ్' పాటలో హీరో క్యారెక్టరే ఎక్కువ కనబడుతుంది. అలాగే ఈ సినిమాలో హీరోది అందర్నీ ఒక్కటి చేసే తత్వం. అలా అందర్నీ ఒక్కటిగా చెయ్యాలంటే  -  దూకే సుడిగాలి హగ్ చేసుకుని శ్వాసతో కలిపేసుకోగలగాలి. కురిసే వడగళ్ళని ప్రేమతో కరిగించేసి జడివాన తో జల్సా చెయ్యగలగాలి. మనిషికి ఆకలి, నిద్దుర, ఊపిరి లాగే సంతోషం కూడా ఓ 'అత్యవసర అసంకల్పిత అంగీకార' చర్యగా మారిపోగలగాలి. అప్పుడే భూగోళం బుజ్జిగా చిన్నదైపోయి పువ్వులా నవ్వుతుందని తనదైన ముద్రతో చెప్పారు రామజోగయ్య శాస్త్రి ఈ పాటలో.  'బుజ్జి భూగోళం' ఎంతో పెర్ స్పెక్టివ్ థింకింగ్ వున్న ముచ్చటైన ప్రయోగం.   
ఇక 'అమృతం' అనే మాటని 'ఆమ్ రుతమ్' అని రంజిత్ పలకడం వినేవాళ్ళకి బాధగా వుంటుంది. హరిహరనే గాని, రంజితే గాని వారు ప్రతిభ వున్న గాయకులైతే అవొచ్చు గాక తెలుగు భాషని ఇష్టమొచ్చేసినట్టు విరిచేసి పాడే హక్కు వీళ్ళకెవరిచ్చారు ? వీళ్ళకన్నా తక్కువ రెమ్యూనరేషన్ కి , ఎంతో అందంగా పాడగలిగే గాయకులెంతోమంది వుండగా - ఇంకెన్నాళ్ళీ వ్యామోహం  ? ఆ రోజుల్లో లతామంగేష్కర్ (సంతానం), తలత్ మహ్మద్ (మనోరమ), మధ్యలో ఆశాభోంస్లే (పాలు-నీళ్ళు), ఇప్పుడు శ్రేయాగోషల్ వీళ్ళంతా తెలుగు భాషని ఎంత అందంగా పలికారు ? 'భలే తమ్ముడు'  లో రఫీ 'నేడే ఈనాండే' అని పాడినప్పుడు అందరూ వెక్కిరిస్తే తర్వాత వచ్చిన (ఎన్.టి.ఆర్) 'ఆరాధన' టైమ్ కి తన ఉచ్చారణని సవరించుకోలేదూ ? మన బాలు గారు ఏ భాషలో పాడినా ఆ భాష ఆయన మాతృభాష అనుకునేలా పాడతారే ... అలాటిది మనకే ఎందుకు ఈ దౌర్భాగ్యం ? తెలుగు భాషంటే ఎందుకంత చిన్నచూపు ? దీనికి రూట్ కాజ్ ఎక్కడుంది ? 
 
పల్లవి : బావగారి చూపే
రచన : చంద్రబోస్
గానం : రంజిత్, విజయ్ ఏసుదాస్, సుర్ ముఖి, శ్రీవర్ధిని
 
ఈ పాటలో కూడా హీరో క్యారెక్టర్ కున్న లక్ష్యాన్ని పాట ద్వారా, పాటల రచయిత ద్వారా చెప్పించారు దర్శకుడు. బంధు మిత్ర సపరివార సమేతంగా సంతోషాన్ని పంచుకునే కృష్ణవంశీ తరహా పండుగ వాతావరణం పాటంతా పరుచుకుని నిండుగా కనిపిస్తుంది.  
ఈ పాటని రెండు భాగాలుగా చేస్తే - మొదటి సగంలో - ఏవేవి బంధాలో వాటిని ముడిపెట్టేవి ఏమిటో పేర్కొంటూ పెదాలకి నవ్వుల బంధం వేసేద్దాం అనడంలోను - ఏవేవి జంటలో ఉదహరిస్తూ నా వెంట నువ్వుంటే  కురిపిస్తా 'రంగుల చినుకులే' అనడంలోనూ - శ్రుతి మీరిన శృంగారంతో కాకుండా సుతి మెత్తని శృంగారం ద్వారా - పాత్రల పరిధి, ప్రయోజనం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి.
ఇక మిగిలిన సగం లో కొంచెం డెప్త్ కి వెళ్ళారు - నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది, బాధల్లోన బంధం బలం తెలుస్తుంది లాంటి వాక్యాలు అందుకు సాక్ష్యంగా నిలబడతాయి.  అలా చెబుతూ ఆ ఇంటి మనవడే,  మనవాడయి వుంటున్నాడని తెలుస్తుంది. దర్శకుడి మేథస్సులో రూపు దిద్దుకున్న సృజనాత్మక ప్రక్రియకు చంద్రబోస్ తన సంతకం సుస్పష్టంగా కనిపించేలా అనుసృజనం చేస్తూ ఓ వారధిలా నిలిచారు. పాడిన గాయకుడు 'మనవడినై  - మనవాడినై ' అనే పదాల్ని పలికేటప్పుడు మరి కాస్త ఒత్తి పలికి వుంటే కవి హృదయానికి మరిన్ని మంచి మార్కులు పడేవి.
 
పల్లవి : కొక్కొక్కోడి మందెక్కేసి
రచన : లక్ష్మిభూపాల్
గానం : కార్తీక్, హరిచరణ్, మానిసి, రీటా
 
సంగీతం, సాహిత్యం సమతూకంలో పడి పండిన పాట ఇది. 'రిబ్బను జడ దెబ్బ, ఒంపుల వడదెబ్బ, ఊపిరి డబ్బా, రైకల జబ్బ, సుక్కల జుబ్బా' ల్లాంటి పదాలు బాగా కుదిరాయి. ముఖ్యంగా 'ఊపిరి డబ్బా' పదప్రయోగం బావుంది. 
ఈ పాటకి యువన్ శంకర్ రాజా ఇచ్చిన ట్యూన్ క్యాచీగానే కాకుండా కొంత క్లిష్టంగా కూడా వుంది. ఇక్కడ బ్రీతింగ్ స్పేస్ ఇలా వుంది కనుక తర్వాతి లైన్ లో కూడా అలాగే వుంటుందనుకుంటే అక్కడ పొడవైన వాక్యం కంటిన్యుయస్ గా వుంటుంది. ఒకరకంగా రచయితకి ఇదొక ఫీటే. 
కాకపోతే - మందెక్కేసిన కోడి రంకెయ్యడమే కొత్తగా వుంది. ఎద్దు రంకె వేస్తుంది గానీ కోడి ఎందుకు వేస్తుందో రచయితే చెప్పాలి. ఇక - రంకె వెయ్యడం - రంగెయ్యడంలా వినిపించడం ... ఈ పాటకు కూడా అంటుకున్న దౌర్భాగ్యం. కార్తీక్, హరిచరణ్ ఇద్దరూ తెలుగుని బాగా పలకగలరు - అయినా ఇలా వినిపిస్తోందంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం ఏ స్థాయిలో వున్నాయో ఊహించుకోవచ్చు. ఇద్దరు ఆర్టిస్ట్ లు అనుకున్న విధంగా పాత్రల్లో ఫిట్ కాకపోతే వారిని మార్చేసి ప్రకాశ్ రాజ్, జయసుధలతో ఖర్చుకు వెనకాడకుండా రీ షూట్ చేయించిన గట్స్ గల గణేష్ లాంటి నిర్మాతలు పాటల సాహిత్యం పట్ల కొన్నాళ్ళ పాటు అదే పనిగా పట్టించుకుంటూ వుంటేనే గాని ఇలాంటి దోషాలు తగ్గవు.
ఒక్కటి మాత్రం నిజం. టోటల్ గా చూసుకుంటే పాటల సాహిత్యం ముందు ట్యూన్ లు కొంత తేలిపోయాయనిపిస్తుంది. కాకపోతే - కృష్ణవంశీ సినిమాల్లో ఆడియో రిలీజ్ అయిన వెంటనే కలిగే అభిప్రాయం - సినిమాలో ఆయన చిత్రీకరణ చూశాక మరో పాతిక పర్సంట్ పెరిగి పాటలు నిలబడిపోయిన అనుభవాలు గతంలో చాలా వున్నాయి. ఈ సినిమా పాటలు కూడా అలా మైంత ప్రజాదరణ పొందితే సంతోషమే - ఎందుకంటే ఇయర్ డ్రమ్స్ పగిలిపోయే మ్యూజిక్ ఇందులో లేదు కనుక.
 
రాజా (మ్యూజికాలజిస్ట్)